పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
ప్రపంచ అడవులు... 9వ స్థానంలో భారత్ ఏటా పెరుగుదల కనిపిస్తున్న దేశాల్లో 3వ స్థానం
Posted On:
22 OCT 2025 10:42AM by PIB Hyderabad
ప్రపంచంలో పర్యావరణాన్ని పరిరక్షిస్తున్న దేశాల్లో భారత్ చెప్పుకోదగ్గ విజయాన్ని సాధించింది.. ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) బాలీలో విడుదల చేసిన ‘ప్రపంచ అటవీ వనరుల మూల్యాంకనం (జీఎఫ్ఆర్ఏ) - 2025’లో ఈ విషయాన్ని వెల్లడించారు. మొత్తం అటవీ క్షేత్ర పరంగా చూస్తే, భారత్ తన స్థితిని మెరుగుపరుచుకొని 9వ స్థానానికి చేరుకొంది.
కేంద్ర పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని పొందుపరుస్తూ... ఈ విషయాన్ని తెలియజేశారు.
ఇది వరకటి మూల్యాంకనంలో, భారత్ 10వ స్థానంలో ఉంది. ప్రపంచంలో ఏటా కొత్తగా వనాలను పెంచుతున్న దేశాలను గమనించినప్పుడు, భారత్ ఈ పర్యాయం కూడా 3వ స్థానంలో కొనసాగుతోంది. ఇది అటవీప్రాంతాల నిర్వహణతో పాటు పర్యావరణ సమతౌల్య పరిరక్షణలోనూ భారతదేశపు నిబద్ధతను పునరుద్ఘాటిస్తోంది.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, కార్యక్రమాల విజయాన్ని ఈ విశిష్ట పురోగతి స్పష్టం చేస్తోందని శ్రీ యాదవ్ అన్నారు. అడవుల పరిరక్షణకూ, అటవీప్రాంతాలను విస్తరించడానికీ, పర్యావరణ సంరక్షణ ప్రధాన కార్యక్రమాల నిర్వహణలో ప్రజలను భాగస్వాములను చేయడానికీ కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యాన్ని ఇస్తోందని ఆయన వివరించారు.
‘ఏక్ పేడ్ మా కే నామ్’ పేరుతో ప్రధానమంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. పర్యావరణం పట్ల సానుకూల చర్యలను చేపడుతూ ఉండాలని అనేక సందర్భాల్లో ప్రజలకు ఆయన చెప్పడం... దేశం నలుమూలలా మొక్కల పెంపకంతో పాటు వాటి సంరక్షణలో చురుకుగా పాలుపంచుకొనేటట్టు ప్రజల్లో స్ఫూర్తిని రగిలిస్తున్నాయని మంత్రి తెలిపారు.
ప్రజల భాగస్వామ్యం పెరగడంతో హరిత ప్రధానమైన, భూగ్రహానికి మన్నికైన భవిష్యత్తును ఏర్పరిచే దిశగా సమష్టి బాధ్యత తీసుకోవాలన్న చైతన్యం అందరిలో కలుగుతోందని మంత్రి అన్నారు. అటవీప్రాంతాల సంరక్షణతో పాటు వాటిని మరింతగా విస్తరించే దృష్టితో, మోదీ ప్రభుత్వం వివిధ ప్రణాళికలను రూపొందించడమే కాక రాష్ట్ర ప్రభుత్వాల మద్దతుతో పెద్ద ఎత్తున మొక్కల పెంపకం కార్యక్రమాలను అమలుచేస్తూ ఉండటం సత్ఫలితాలను ఇస్తుండడంతో ఈ విజయం దక్కిందని మంత్రి తెలిపారు.
***
(Release ID: 2181630)
Visitor Counter : 32