ప్రధాన మంత్రి కార్యాలయం
ఐఎన్ఎస్ విక్రాంత్ కేవలం యుద్ధనౌక కాదు... 21వ శతాబ్దంలో భారత కృషి, ప్రతిభ, ప్రభావం, నిబద్ధతలకు ఇది నిదర్శనం
ఆత్మనిర్భర్ భారత్... మేడ్ ఇన్ ఇండియా దార్శనికతల మహోన్నత చిహ్నంగా ఐఎన్ఎస్ విక్రాంత్
త్రివిధ దళాల మధ్య అసాధారణ సమన్వయంతోనే ఆపరేషన్ సిందూర్ సమయంలో లొంగిన పాకిస్తాన్
గత దశాబ్ద కాలంగా స్వయం-సమృద్ధి సాధన దిశగా పురోగమించిన మన భద్రతా దళాలు
దేశాన్ని ప్రపంచంలోని అగ్రశ్రేణి రక్షణ ఎగుమతిదారుల్లో ఒకటిగా మార్చడమే మా లక్ష్యం
హిందూ మహాసముద్ర సంరక్షణకు భరోసానిస్తున్న భారత నావికాదళం
మన భద్రతా దళాల పరాక్రమం, దృఢ సంకల్పం కారణంగానే
మావోయిస్టు తీవ్రవాదాన్ని నిర్మూలించే విషయంలో విజయం సాధిస్తున్న దేశం: ప్రధానమంత్రి
Posted On:
20 OCT 2025 12:53PM by PIB Hyderabad
ఈ రోజు ఐఎన్ఎస్ విక్రాంత్‌లో దీపావళి వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సాయుధ దళాల సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ రోజు ఒక అద్భుతమైన రోజు... ఒక అద్భుతమైన క్షణం... ఇది ఒక అద్భుతమైన దృశ్యం అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఒక వైపు విశాలమైన సముద్రం... మరోవైపు ధైర్యవంతులైన భరతమాత సైనికుల అపారమైన బలం ఇక్కడ ఉందన్నారు. ఒక దిశ అనంతమైన ఆలోచనా పరిధిని... హద్దులులేని ఆకాశాన్ని ప్రదర్శిస్తుండగా, మరొక దిశలో అనంతమైన శక్తి గల ఐఎన్ఎస్ విక్రాంత్ అపార శక్తి ప్రదర్శితమవుతోందని ఆయన పేర్కొన్నారు. సముద్రంపై నుంచి కనిపిస్తున్న సూర్యకాంతి మెరుపులు ధైర్యవంతులైన మన సైనికులు వెలిగించిన దీపాల మాదిరిగా ప్రకాశిస్తూ.. దివ్య దీప మాలను తలపిస్తున్నాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ధైర్యసాహసాలకు మారుపేరైన భారత నావికాదళ సిబ్బందితో కలిసి ఈ దీపావళిని జరుపుకోవడం తనకు దక్కిన గౌరవమని ఆయన ఉద్ఘాటించారు.
ఐఎన్ఎస్ విక్రాంత్‌లో తాను గడిపిన సమయాన్ని గుర్తుచేసుకుంటూ... ఆ అనుభవాన్ని మాటల్లో చెప్పడం కష్టమని ప్రధానమంత్రి అన్నారు. సముద్రంలో చీకటి, ప్రశాంతతలు కలగలిసిన రాత్రి సమయం... అద్భుతమైన సూర్యోదయం వంటి అనుభవాలు ఈ దీపావళిని అనేక విధాలుగా ప్రత్యేకంగా, చిరస్మరణీయంగా మార్చాయని ఆయన తెలిపారు. ఐఎన్ఎస్ విక్రాంత్ తరపున దేశంలోని 140 కోట్ల మంది పౌరులకు ప్రధానమంత్రి హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
ఐఎన్ఎస్ విక్రాంత్‌ను జాతికి అంకితం చేసిన సందర్భాన్ని గుర్తుచేసుకున్న శ్రీ మోదీ... విక్రాంత్ గొప్పది, అపారమైన శక్తి గలది, విశాలమైనది, ప్రత్యేకమైనది, అసాధారణమైనది అని తాను చెప్పిన మాటలను గుర్తు చేశారు. "విక్రాంత్ కేవలం యుద్ధనౌక కాదు... ఇది 21వ శతాబ్దంలో భారత్ కృషి, ప్రతిభ, ప్రభావం, నిబద్ధతలకు నిదర్శనం" అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. దేశీయంగా నిర్మించిన ఐఎన్ఎస్ విక్రాంత్‌ను అందుకున్న రోజే భారత నావికాదళం వలస వారసత్వాన్ని త్యజించిందని ఆయన గుర్తు చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తితో భారత నావికాదళం కొత్త జెండాను స్వీకరించిందని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు.
"ఈ రోజు ఐఎన్ఎస్ విక్రాంత్ ఆత్మనిర్భర్ భారత్, మేడ్ ఇన్ ఇండియా దార్శనికతలకు శక్తిమంతమైన చిహ్నంగా నిలుస్తోంది" అని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఐఎన్ఎస్ విక్రాంత్ సముద్రం గుండా దూసుకెళ్తూ భారత సైనిక పరాక్రమాన్ని ప్రతిబింబిస్తోందని స్పష్టం చేశారు. కొద్ది నెలల కిందట విక్రాంత్ అనే పేరు పాకిస్తాన్ నిద్రనూ చెడగొట్టిందని ఆయన గుర్తు చేశారు. ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌక పేరు మాత్రమే శత్రువుల దుష్టత్వాన్ని అంతం చేయడానికి సరిపోతుందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంలో భారత సాయుధ దళాలకు తాను సెల్యూట్ చేస్తున్నానని ప్రధానమంత్రి తెలిపారు. భారత నావికాదళం కలిగించిన భయం... భారత వైమానిక దళం ప్రదర్శించిన అసాధారణ నైపుణ్యం... భారత సైన్యంలోని ధైర్యం... త్రివిధ దళాల మధ్య అసాధారణ సమన్వయం కారణంగానే ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ త్వరగా లొంగిపోయిందని ఆయన స్పష్టం చేశారు. ఇందులో పాల్గొన్న వారందరూ నిజంగా అభినందనలకు అర్హులని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
శత్రువు ఎదురుగా ఉన్నప్పుడు... యుద్ధం ఆసన్నమైనప్పుడు... స్వతంత్రంగా పోరాడే శక్తి ఉన్న పక్షమే ఎల్లప్పుడూ ప్రయోజనాన్ని కలిగి ఉంటుందని శ్రీ మోదీ పేర్కొన్నారు. సాయుధ దళాలు బలంగా ఉండాలంటే దేశం స్వయం-సమృద్ధి సాధించడం అవసరమని ఆయన స్పష్టం చేశారు. గత దశాబ్ద కాలంలో భారత దళాలు క్రమంగా స్వయం-సమృద్ధి దిశగా పురోగమించడం గర్వకారణంగా ఉందని ప్రధానమంత్రి అన్నారు. ఇకమీదట దిగుమతి చేసుకునే అవసరం లేని వేలాది వస్తువులను సాయుధ దళాలు గుర్తించాయనీ... ఫలితంగా చాలా ముఖ్యమైన సైనిక పరికరాలు ఇప్పుడు దేశీయంగానే తయారవుతున్నాయని ఆయన తెలిపారు. గత 11 సంవత్సరాల్లో భారత రక్షణ ఉత్పత్తి మూడు రెట్లు పెరగడంతో పాటు గత సంవత్సరం రూ. 1.5 లక్షల కోట్లు దాటిందని ప్రధానమంత్రి తెలిపారు. మరొక ఉదాహరణను ఉటంకిస్తూ... 2014 నుంచి భారత షిప్‌యార్డులు 40కి పైగా స్వదేశీ యుద్ధనౌకలు, జలాంతర్గాములను నావికాదళానికి అందించాయని శ్రీ మోదీ పేర్కొన్నారు. ప్రస్తుతం సగటున ప్రతి 40 రోజులకు ఒక కొత్త స్వదేశీ యుద్ధనౌక లేదా జలాంతర్గామి నావికాదళంలో చేరుతున్నట్లు ఆయన తెలియజేశారు.
"ఆపరేషన్ సిందూర్ సమయంలో బ్రహ్మోస్, ఆకాశ్ వంటి దేశీయ క్షిపణులు తమ సామర్థ్యాలను నిరూపించుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఇప్పుడు ఈ క్షిపణుల కొనుగోలు పట్ల ఆసక్తి చూపుతున్నాయి" అని ప్రధానమంత్రి అన్నారు. భారత త్రివిధ దళాలకూ ఆయుధాలు, సామాగ్రిని ఎగుమతి చేసే సామర్థ్యాన్ని భారత్ పెంచుకుంటోందని స్పష్టం చేశారు. "ప్రపంచంలోని అగ్రశ్రేణి రక్షణ ఎగుమతిదారుల్లో ఒకటిగా నిలవడమే భారత్ లక్ష్యం" అని శ్రీ మోదీ ధ్రువీకరించారు. గత దశాబ్ద కాలంలో భారత రక్షణ ఎగుమతులు 30 రెట్లు పెరిగినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విజయానికి రక్షణ రంగ అంకురసంస్థలు, దేశీయ రక్షణ విభాగాల సహకారమే కారణమన్నారు.
భారత బలం, సామర్థ్యాల సంప్రదాయం ఎల్లప్పుడూ "జ్ఞానాయ దానాయ చ రక్షణాయ" అనే సూత్రంతో ముడిపడి ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అంటే మన శాస్త్రం, శ్రేయస్సు, శక్తి... మానవాళి సేవ, రక్షణకు అంకితమయ్యాయని ఆయన వివరించారు. దేశాల ఆర్థిక వ్యవస్థలు, పురోగతి సముద్ర మార్గాలపై ఎక్కువగా ఆధారపడిన నేటి పరస్పర అనుసంధానిత ప్రపంచంలో... ప్రపంచ స్థిరత్వాన్ని నిర్ధారించడంలో భారత నావికాదళం కీలక పాత్ర పోషిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ చమురు సరఫరాలో 66 శాతం, కార్గో రవాణా 50 శాతం హిందూ మహాసముద్రం గుండానే జరుగుతున్నట్లు శ్రీ మోదీ తెలియజేశారు. ఈ మార్గాల భద్రత కోసం భారత నావికాదళం హిందూ మహాసముద్ర సంరక్షణ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తోందని ఆయన పేర్కొన్నారు. మిషన్ ఆధారిత విస్తరణలు, యాంటీ-పైరసీ గస్తీ, మానవతా కార్యకలాపాల ద్వారానూ ఈ ప్రాంతం అంతటా భారత నావికాదళం ప్రపంచ భద్రతా భాగస్వామిగా పనిచేస్తోందని ప్రధానమంత్రి తెలిపారు.
"భారత దీవుల భద్రత, సమగ్రతను నిర్ధారించడంలో భారత నావికాదళం గణనీయమైన పాత్ర పోషిస్తుంది" అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. జనవరి 26న దేశంలోని ప్రతి ద్వీపంలో జాతీయ జెండాను ఎగురవేయాలని కొంతకాలం కిందట తీసుకున్న నిర్ణయాన్నీ ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ జాతీయ సంకల్పాన్ని నావికాదళం నెరవేర్చిందనీ... ఇప్పుడు ప్రతి భారతీయ ద్వీపంలో నావికాదళం సగర్వంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తోందని శ్రీ మోదీ తెలిపారు.
భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న కొద్దీ గ్లోబల్ సౌత్‌లోని అన్ని దేశాలు కలిసి ముందుకు సాగేలా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు. భారత్ 'మహాసాగర్ సముద్ర దార్శనికత'పై పనిచేస్తోందని.. అనేక దేశాలకు అభివృద్ధి విషయంలో భాగస్వామిగా మారుతోందన్నారు. ప్రపంచంలో అవసరం ఎక్కుడున్నా మానవతా సహాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధానంగా పేర్కొన్నారు. ఆఫ్రికా నుంచి ఆగ్నేయాసియా వరకు విపత్తు వేళల్లో ప్రపంచ మొత్తం భారత్‌ను సహచర దేశంగా చూస్తోందన్నారు. 2014లో పక్కనే ఉన్న మాల్దీవులు నీటి సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు భారతదేశం 'ఆపరేషన్ నీర్'ను చేపట్టిందని.. ఆ దేశానికి భారత నావికాదళం స్వచ్ఛమైన నీటిని అందించిందని ప్రధాని గుర్తు చేశారు. 2017లో భారీ వరదలతో శ్రీలంక అతలాకుతలమైనప్పుడు భారతే మొదట సహాయ హస్తాన్ని అందించిన విషయాన్ని కూడా ప్రధాని గుర్తుచేశారు. 2018లో ఇండోనేషియాలో సునామీ వచ్చినప్పుడు సహాయక, ఉపశమన చర్యలతో ఆ దేశ ప్రజలకు అండగా నిలబడిందన్నారు. అదే విధంగా మయన్మార్‌లో భూకంపం.. 2019లో మొజాంబిక్, 2020లో మడగాస్కర్‌లో తుఫాన్లు వచ్చినప్పుడు.. ఇలా అన్నిచోట్ల భారత్ సేవాస్ఫూర్తిని కొనసాగిస్తోందని పేర్కొన్నారు.
విదేశాల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా తరలించేందుకు భారత సాయుధ దళాలు ఎప్పటికప్పుడు వివిధ ఆపరేషన్లు నిర్వహించాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. యెమెన్ నుంచి సూడాన్ వరకు.. ఎప్పుడైనా ఎక్కడ అవసరం వచ్చినా సాయుధ దళాల శౌర్యం, ధీరత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల విశ్వాసాన్ని బలోపేతం చేశాయన్నారు. ఈ మిషన్ల ద్వారా భారత్.. వేలాది మంది విదేశీయుల ప్రాణాలను కూడా కాపాడిందని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.
"భారత సాయుధ దళాలు భూమి, సముద్రం, ఆకాశం వంటి అన్ని చోట్ల, అన్ని పరిస్థితిలోనూ దేశానికి సేవ చేశాయి" అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. సముద్రాల విషయంలో దేశ సరిహద్దులను, వాణిజ్య ప్రయోజనాలను కాపాడేందుకు నావికాదళం పని చేస్తోందన్న ఆయన.. వైమానిక దళం దేశీయ గగనతలాన్ని రక్షిస్తోందని అన్నారు. అత్యధిక ఉష్ణోగ్రతలతో మండుతున్న ఎడారుల నుంచి మంచుతో నిండిన హిమానీ నదాల వరకూ... బీఎస్ఎఫ్, ఐటీబీపీ, సైన్యం సేవల్ని అందిస్తున్నాయని అన్నారు. వివిధ విభాగాల్లో ఎస్ఎస్బీ, అస్సాం రైఫిల్స్, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, నిఘా సంస్థల సిబ్బంది భారతమాతకు సేవ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. జాతీయ భద్రతలో భారత తీర రక్షక దళం పోషిస్తోన్న కీలక పాత్రను ప్రధానమంత్రి ప్రశంసించారు. దేశ తీరప్రాంతాన్ని అన్ని వేళలా సురక్షితంగా ఉంచేందుకు నావికాదళంతో భారత తీర రక్షక దళం నిరంతరం సమన్వయంతో పనిచేస్తోందని తెలిపారు. జాతీయ భద్రత అనే గొప్ప లక్ష్యంలో భద్రతా బలగాల పాత్ర ఎంతో గొప్పదని పేర్కొన్నారు.
భారత భద్రతా దళాల పరాక్రమం, ధీరత్వం కారణంగా వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలించటమనే ప్రధాన లక్ష్యాన్ని భారత్ సాధించిందని ప్రధానమంత్రి అన్నారు. దేశం ఇప్పుడు నక్సలైట్లు, మావోయిస్టు తీవ్రవాదం నుంచి పూర్తి స్వేచ్ఛ పొందటంలో దాదాపు విజయం సాధించిందని అన్నారు. ‘‘2014కి ముందు దాదాపు 125 జిల్లాల్లో వామపక్ష తీవ్రవాదం ఉండేది.. వాటి సంఖ్య నేడు కేవలం 11కు తగ్గింది. వామపక్ష తీవ్రవాదంతో అత్యంత ప్రభావితమైన జిల్లాల మూడు మాత్రమే. 100కు పైగా జిల్లాలు ఇప్పుడు వామపక్ష తీవ్రవాదం నుంచి పూర్తిగా బయటపడి మొదటిసారిగా స్వేచ్ఛా ఊపిరి పీల్చుకొని దీపావళిని జరుపుకుంటున్నాయి’’ అని మోదీ అన్నారు. తరతరాలుగా భయంతో ఉన్న లక్షలాది మంది ప్రజలు ఇప్పుడు అభివృద్ధి విషయంలో జనజీవన స్రవంతిలోకి వస్తున్నారని ప్రస్తావించారు. ఒకప్పుడు మావోయిస్టులు రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, మొబైల్ టవర్ల నిర్మాణాన్ని అడ్డుకున్న ప్రాంతాల్లో ఇప్పుడు రహదారుల నిర్మాణం జరుగుతోందని, కొత్త పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు. దేశ భద్రతా బలగాల అంకితభావం, త్యాగం, ధీరత్వం ద్వారా ఈ విజయం సాధ్యమైందని అన్నారు. ఇలాంటి అనేక జిల్లాల్లో ప్రజలు మొదటిసారిగా దీపావళిని చేసుకుంటున్నారని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. జీఎస్టీ పొదుపు ఉత్సవం సందర్భంగా ఆయా ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో క్రయవిక్రయాలు జరుగుతున్నాయని తెలిపారు. ఒకప్పుడు మావోయిస్టులు భారత రాజ్యాంగ ప్రస్తావనను అణచివేసిన జిల్లాల్లో... ఇప్పుడు స్వదేశీ మంత్రం ప్రతిధ్వనిస్తోందన్నారు.
భారతదేశం వేగంగా సాధిస్తోన్న పురోగతి, పరివర్తనతో పాటు పెరుగుతోన్న అభివృద్ధి, ఆత్మ విశ్వాసాన్ని ప్రస్తావించిన ప్రధానమంత్రి.. "భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతూ 140 కోట్ల మంది ప్రజల కలలను నెరవేరుస్తోంది. భూమి నుంచి మొదలుకొని అంతరిక్షం వరకు.. ఒకప్పుడు ఊహకు కూడా అందని విజయాలు ఇప్పుడు వాస్తవ రూపం దాల్చుతున్నాయి" అని అన్నారు. జాతి నిర్మాణం అనే గొప్ప కార్యంలో సాయుధ దళాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. దళాలు కేవలం మూస ధోరణిలో పనిచేయవని, దేశ దశ దిశను నిర్దేశించే సామర్థ్యం, క్లిష్ట సమయాల్లో నడిపించే ధైర్యం, అనంతాన్ని తాకే ధీరత్వం, అసాధ్యాన్ని సుసాధ్యం చేసే స్ఫూర్తి ఉన్నాయని ప్రధానమంత్రి మోదీ వ్యాఖ్యానించారు. మన సైనికులు దృఢంగా నిలబడే పర్వత శిఖరాలను భారత విజయ చిహ్నాలుగా వర్ణించిన ఆయన.. వారి కింద ఉన్న శక్తివంతమైన సముద్ర అలలు దేశ విజయాన్ని ప్రతిధ్వనిస్తున్నాయని వివరించారు. ఈ అన్ని గొంతుకల్లోనూ ‘భారత్ మాతా కీ జై!’ అనే ఐక్యస్వరం వినిపిస్తోందని అన్నారు. ఈ ఉత్సాహం, దృఢ సంకల్పం మధ్య ప్రధానమంత్రి మరోసారి అందరికీ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రసంగాన్ని ముగించారు.
(Release ID: 2181052)
Visitor Counter : 3