హోం మంత్రిత్వ శాఖ
పోలీసు సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని 2025 అక్టోబర్ 21 మంగళవారం నాడు ఢిల్లీలోని జాతీయ పోలీసు స్మారక చిహ్నం వద్ద అమరవీరులకు నివాళులర్పించనున్న రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్
1959 అక్టోబర్ 21న లడఖ్‌లో భారీగా ఆయుధాలతో చైనా దళాలు చేసిన మెరుపుదాడిలో ప్రాణాలు త్యాగం చేసిన పది మంది పోలీసులు
వీరితో పాటు విధి నిర్వహణలో ప్రాణాలు త్యాగం చేసిన పోలీసులందరి జ్ఞాపకార్థం అక్టోబర్ 21ను పోలీసు సంస్మరణ దినోత్సవంగా పాటిస్తున్న భారతదేశం
పోలీసు సంస్మరణ దినోత్సవం- 2018 సందర్భంగా జాతీయ భద్రత, సమగ్రతను కాపాడటంలో పోలీసులు చేసిన త్యాగాలకు, అత్యున్నత పాత్రకు గుర్తింపుగా జాతీయ పోలీసు స్మారక చిహ్నాన్ని జాతికి అంకింతం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
Posted On:
19 OCT 2025 11:00AM by PIB Hyderabad
పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా 2025 అక్టోబర్ 21 మంగళవారం నాడు ఢిల్లీలోని జాతీయ పోలీసు స్మారక చిహ్నం వద్ద రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అమరవీరులకు నివాళులర్పిస్తారు.
1959 అక్టోబర్ 21న లడఖ్‌లో వేడి బుడగ ప్రాంతంలో భారీగా సాయుధులైన చైనా దళాలు దాడి చేయటంతో పది మంది వీర పోలీసులు ప్రాణాలను అర్పించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం అక్టోబర్ 21ను పోలీసు సంస్మరణ దినోత్సవంగా పాటిస్తున్నారు. పోలీసు సంస్మరణ దినోత్సవం- 2018 సందర్భంగా పోలీసులు చేసిన త్యాగాలతో పాటు జాతీయ భద్రత, సమగ్రతను కాపాడటంలో వారు పోషిస్తోన్న అత్యున్నత పాత్రకు గుర్తింపుగా జాతీయ పోలీసు స్మారక చిహ్నాన్ని (ఎన్‌పీఎం) ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు.
ఈ స్మారక చిహ్నం.. పోలీసుల జాతీయ గుర్తింపు, గౌరవం, లక్షాన్ని సాధించటంలో ఐక్యత, ఉమ్మడి చరిత్ర - విధిని తెలియజేస్తోంది. ప్రాణాలను ఫణంగా పెట్టి కూడా దేశాన్ని రక్షించాలనే పోలీసుల నిబద్ధతను కూడా ఇది బలోపేతం చేస్తోంది. ఈ స్మారక చిహ్నంలో 'శౌర్య గోడ' అనే ప్రధాన స్తంభం, ఒక మ్యూజియం ఉన్నాయి. గ్రానైట్‌తో చేసిన 30 అడుగుల ఎత్తైన ఈ ప్రధాన ఏకశిలా స్తంభం.. పోలీసు సిబ్బంది సామర్థ్యం, ధృడత్వం, నిస్వార్థ సేవను సూచిస్తోంది. అమరవీరుల పేర్లతో ఉన్న శౌర్య గోడ.. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన పోలీసుల ధైర్యం, త్యాగానికి దృఢమైన గుర్తింపుగా నిలుస్తోంది. భారతదేశ పోలీసు చరిత్ర, పరివర్తనను ప్రదర్శించే కేంద్రంగా మ్యూజియం ఉంది. ఈ స్మారక చిహ్నం ఒక పవిత్రమైన యాత్రాస్థలం మాత్రమే కాదు.. పోలీసులతో పాటు ప్రజలకు కూడా ఒక గౌరవమైన ప్రదేశం. సోమవారం మినహా అన్ని రోజులలో ఈ స్మారక చిహ్నాన్ని ప్రజలు సందర్శించవచ్చు. ఈ స్మారక చిహ్నం వద్ద ప్రతి శనివారం, ఆదివారం సాయంత్రం సూర్యాస్తమయానికి ఒక గంట ముందు కేంద్ర సాయుధ పోలీసుల బలగాలు బ్యాండ్ ప్రదర్శన, కవాతు, రిట్రీట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తాయి.
పోలీసు అమరవీరులకు నివాళులర్పించే అక్టోబర్ 21 నాటి పోలీసు స్మారక దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. ప్రధాన కార్యక్రమం ఢిల్లీలోని జాతీయ పోలీసు స్మారక చిహ్నం వద్ద జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించనున్న రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్.. అక్కడే అమరవీరులకు నివాళులర్పిస్తారు. కేంద్ర సాయుధ పోలీసు దళాలు (సీఏపీఎఫ్), ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా కవాతును నిర్వహిస్తారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి (ఎంఓఎస్), పోలీసు నేపథ్యం ఉన్న ఎంపీలు, సీఏపీఎఫ్ లేదా సీపీఓల అధిపతులతో పాటు ఇతరులు స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి అమరవీరులకు నివాళులర్పిస్తారు. పదవీ విరమణ చేసిన డైరెక్టర్ జనరల్స్, పోలీసు అధికారులతో పాటు ఇతర ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
పోలీసు అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం రక్షణ మంత్రి సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా ఆయన పోలీసులకు ఉన్న సవాళ్లను వివరిస్తారు. వేడి బుడగ వద్ద అమరవీరులకు అంకితం చేసిన వేదిక వద్ద రక్షణ మంత్రి పుష్పగుచ్చాన్ని ఉంచటంతో కార్యక్రమం ముగియనుంది. ఈ కార్యక్రమం దూరదర్శన్, పోలీసు వెబ్‌సైట్‌లలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అఖిల భారత రేడియోతో పాటు ఇతర మీడియా సంస్థలు కూడా ఈ కార్యక్రమానికి కవరేజీ ఇవ్వనున్నాయి.
స్మారక కార్యక్రమాల్లో భాగంగా సీఏపీఎఫ్‌లు, సీపీఓలు అక్టోబర్ 22 నుంచి 30 వరకు జాతీయ పోలీసు స్మారక చిహ్నం వద్ద వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తాయి. ఇందులో అమరవీరుల కుటుంబ సభ్యుల సందర్శనలు, పోలీసు బ్యాండ్ ప్రదర్శన, మోటార్ సైకిల్ ర్యాలీలు, అమరవీరుల కోసం పరుగు, రక్తదాన శిబిరాలు, పిల్లలకు వ్యాస రచన- పెయింటింగ్ పోటీలు, పోలీసు సిబ్బంది త్యాగం - శౌర్యం - సేవలను తెలియజేసే వీడియో చిత్రాల ప్రదర్శనలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కూడా పోలీసులు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
****
(Release ID: 2180890)
Visitor Counter : 8
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam