ప్రధాన మంత్రి కార్యాలయం
ఎన్‌డీటీవీ వరల్డ్ సమ్మిట్-2025లో ముఖ్యాంశాలను పంచుకున్న ప్రధానమంత్రి
Posted On:
18 OCT 2025 12:19PM by PIB Hyderabad
న్యూఢిల్లీలో జరిగిన ఎన్‌డీటీవీ వరల్డ్ సమ్మిట్-2025లో తన ప్రసంగ ముఖ్యాంశాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. ఈ సభను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి హాజరైన ప్రముఖులందరినీ స్వాగతించారు. ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ... ఎన్‌డీటీవీ వరల్డ్ సమ్మిట్ పండగ వాతావరణం మధ్య జరుగుతోందని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ సమావేశం "అన్‌స్టాపబుల్ ఇండియా" ఇతివృత్తాన్ని ఆయన ప్రశంసించారు. భారత్ వృద్ధిని ప్రస్తుతం ఏదీ ఆపే పరిస్థితి లేనందున అది నిజంగా సముచితంగా ఉందని వ్యాఖ్యానించారు. "భారత్ ఆగిపోదు లేదా ఆలస్యం చేయదు... 140 కోట్ల మంది భారతీయులు కలిసి వేగంగా ముందుకు సాగుతున్నారు" అని ప్రధానమంత్రి పునరుద్ధాటించారు.
‘ఎక్స్’ వేదికగా చేసిన వరుస పోస్టులలో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
"గత 11 సంవత్సరాల్లో భారత్ ప్రతి భయాన్నీ తొలగించింది... ప్రతి సవాలునూ అధిగమించింది. అందుకే భారత్ ప్రతి రంగంలోనూ స్వయం-సమృద్ధి సాధించగలదనే విశ్వాసం ఈ రోజు కనిపిస్తుంది."
"అందుకే ఈ రోజు ప్రపంచమంతా భారతదేశాన్ని నమ్మకమైన, బాధ్యతాయుతమైన, సమర్థమైన భాగస్వామిగా చూస్తోంది..."
"ప్రతి ప్రమాణాన్ని అధిగమించడం ఈ రోజు దేశ సంస్కృతిగా మారింది. అందుకే భారత్ అన్‌స్టాపబుల్‌గా ఉంది."
"దశాబ్దాల పాలనలో కాంగ్రెస్ ఎల్లప్పుడూ విధానాలు, ప్రక్రియల జాతీయీకరణకే ప్రాధాన్యమిచ్చింది. గత 11 సంవత్సరాలుగా మేం ప్రజాస్వామ్యీకరణ దిశగా నిరంతరం కృషి చేస్తున్నాం. బ్యాంకింగ్ సహా అనేక రంగాల బలోపేతమే దీని ఫలితం."
"బీఎస్ఎన్ఎల్ మేడ్ ఇన్ ఇండియా 4జీ స్టాక్ ప్రారంభం అయినా... హై-స్పీడ్ కనెక్టివిటీ ఆధారిత ఇ-సంజీవని సేవలు అయినా... పేదలు, వెనకబడిన వర్గాల జీవితాలను మెరుగుపరచడానికి మేం ఎంత వివేకంతో పనిచేస్తున్నామో ఇవి చూపిస్తాయి."
"మా పౌరుల జీవితాలను సులభతరం చేయడం... వారి పొదుపులను పెంచడంపైనే మా ప్రభుత్వం దృష్టి సారించింది. ఆదాయపు పన్ను, జీఎస్టీల్లో భారీ తగ్గింపులు దీనికి ప్రత్యక్ష నిదర్శనం."
"మావోయిస్టు ఉగ్రవాదం కారణంగా తమ బిడ్డలను కోల్పోయిన తల్లుల బాధ నాకు తెలుసు. వారిలో ఎక్కువ మంది నిరుపేద, గిరిజన కుటుంబాలకు చెందినవారే. ఆ తల్లుల ఆశీర్వాదాలతో దేశం త్వరలోనే మావోయిస్టు ఉగ్రవాదం నుంచి పూర్తిగా విముక్తి పొందుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను."
***
(Release ID: 2180756)
Visitor Counter : 8