ప్రధాన మంత్రి కార్యాలయం
‘ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన’ ప్రారంభోత్సవం.. న్యూఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థలో ప్రాజెక్టుల ప్రారంభం-శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Posted On:
11 OCT 2025 3:31PM by PIB Hyderabad
వేదికపై ఆసీనులైన కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, సాంకేతిక మాధ్యమం ద్వారా సంధానితులైన శ్రీ రాజీవ్ రంజన్ సింగ్, శ్రీ భగీరథ్ ఛౌదరి సహా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు, దేశవ్యాప్తంగా గల రైతున్నలు, సోదరీసోదరులారా!
ఇవాళ అక్టోబరు 11... ఇదొక చారిత్రక దినం. చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికిన ఆణిముత్యాల్లాంటి భరతమాత ప్రియ పుత్రులు- భారతరత్న శ్రీ జయప్రకాష్ నారాయణ్, భారతరత్న శ్రీ నానాజీ దేశ్‌ముఖ్ ఇద్దరూ పుట్టిన రోజు. గ్రామీణ భారతం కోసం గళమెత్తిన, ప్రజాస్వామ్య విప్లవానికి సారథ్యం వహించిన, రైతులు-పేదల సంక్షేమానికి అంకితమైన దేశమాత ముద్దుబిడ్డలు వారు. ఇటువంటి చారిత్రక దినాన దేశ స్వావలంబన, రైతు సంక్షేమం లక్ష్యంగా రెండు సరికొత్త కీలక పథకాలకు శ్రీకారం చుడుతున్నాం. ఇందులో మొదటిది.. “ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన” (పీఎండీడీకేవై), రెండోది.. “పప్పుధాన్యాల స్వావలంబన కార్యక్రమం (పీఎస్‌ఆర్‌ఎం).” కేంద్ర ప్రభుత్వం రూ.35,000 కోట్ల వ్యయంతో అమలు చేసే ఈ పథకాలు దేశంలోని లక్షలాది రైతుల ఉజ్వల భవిష్యత్తుకు భరోసా ఇస్తాయి. ఈ సందర్భంగా నా రైతు మిత్రులందరికీ నా హృదయపూర్వక అభినందనలు.
మిత్రులారా!
మన అభివృద్ధి ప్రయాణంలో వ్యవసాయం, పంటల సాగు ఎప్పుడూ వెన్నెముకగా ఉన్నాయి. మారే పరిస్థితులకు తగినట్లుగా వ్యవసాయ రంగానికి ప్రభుత్వ మద్దతు అత్యంత కీలకం. కానీ, మునుపటి ప్రభుత్వాలు దురదృష్టవశాత్తూ వ్యవసాయ రంగ భవిష్యత్తును విధికి వదిలేశాయి. అప్పట్లో ఈ రంగంపై ప్రభుత్వానికి ఒక దృక్కోణం గానీ, ఆలోచనగానీ లేదు. వ్యవసాయ సంబంధిత వివిధ ప్రభుత్వ శాఖల్లోనూ అదే నిర్లిప్తత. ఫలితంగా వ్యవసాయ రంగం క్రమంగా బలహీనపడింది. అలాంటి దుస్థితి నుంచి నేటి 21వ శతాబ్దపు భారత్ వేగంగా పురోగమించాలంటే... ముఖ్యంగా వ్యవసాయ రంగంలో సంస్కరణలు అత్యావశ్యకం. అయితే, ఈ దిశగా కృషి మాత్రం 2014 తర్వాతే మొదలైంది. వ్యవసాయంపై మునుపటి ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని మేం సరిదిద్దాం. విత్తనం నుంచి విపణి దాకా రైతు సోదరుల ప్రయోజనార్థం ఎన్నెన్నో సంస్కరణలు తేవడంతోపాటు విధానాల మెరుగుకు చర్యలు చేపట్టాం. వాటి ఫలితాలు నేడు మన కళ్లముందున్నాయి...
మునుపటితో పోలిస్తే ఆహార ధాన్యాల దిగుబడి సుమారు 900 లక్షల టన్నుల మేర పెరిగింది. అలాగే గత 11 ఏళ్లలో వ్యవసాయ ఎగుమతులు దాదాపు రెట్టింపయ్యాయి. పండ్లు, కూరగాయల ఉత్పత్తి 640 లక్షల టన్నులకు పైగా పెరిగింది. పాల దిగుబడి రీత్యా ప్రపంచంలో నేడు భారత్ అగ్రస్థానంలో ఉండగా, మత్స్య రంగంలో రెండో అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఎదిగింది. దేశంలో తేనె ఉత్పత్తి కూడా 2014తో పోలిస్తే రెట్టింపైంది. గత 11 సంవత్సరాల్లో గుడ్ల ఉత్పత్తి కూడా రెట్టింపైంది. ఇదే వ్యవధిలో దేశవ్యాప్తంగా 6 ప్రధాన ఎరువుల కర్మాగారాలు నిర్మితమయ్యాయి. రైతులకు 25 కోట్లకు పైగా భూసార కార్డులు జారీ అయ్యాయి. సూక్ష్మ నీటిపారుదల సౌకర్యం 100 లక్షల హెక్టార్లకు విస్తరించింది. ప్రధానమంత్రి పంటల బీమా పథకం ద్వారా రైతులకు రూ.2 లక్షల కోట్ల పంట నష్టపరిహారం అందుకున్నారు. అలాగే 10 వేలకు పైగా రైతు ఉత్పత్తిదారు సంస్థలు కూడా ఏర్పాటయ్యాయి. ఇక ఈ రోజు నేనీ కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చాను. చాలా మంది రైతులతో... మత్స్యకారులతో... వ్యవసాయ రంగంలోని మహిళలతో ముచ్చటిస్తూ వారి అనుభవాలను తెలుసుకునే అవకాశం నాకు లభించింది. అందుకే నా రాక జాప్యమైంది. గత 11 సంవత్సరాల్లో దేశంలోని రైతులకు ఇలాంటి విజయాలెన్నో దక్కాయి.
అయితే, మిత్రులారా!
నేడు దేశం మనోభావాలు ఎలా ఉన్నాయంటే- ఏవో కొన్ని విజయాలతో సంతృప్తి చెందడానికి ప్రజానీకం సిద్ధంగా లేదు. మనం పురోగమించాలంటే ప్రతి రంగం మెరుగుపడాలి... ఈ మెరుగుదల నిరంతరం కొనసాగాలి. ఇటువంటి ఆలోచన ధోరణి ఫలితంగా రూపొందిన ‘పీఎం ధనధాన్య కృషి యోజన’కు ఆకాంక్షాత్మక జిల్లాల పథకం విజయమే స్ఫూర్తి. అయితే, మునుపటి ప్రభుత్వాలు దేశంలో 100కు పైగా జిల్లాలు వెనుకబడ్డాయని ప్రకటించడమేగానీ, వాటిని పూర్తిగా విస్మరించాయి. కానీ, అటువంటి జిల్లాలపై మేం ప్రత్యేక శ్రద్ధ పెడుతూ వాటిని ‘ఆకాంక్షాత్మక జిల్లాలు’గా ప్రకటించాం. ఈ జిల్లాల్లో ప్రగతిశీల మార్పు దిశగా మేం అనుసరించిన సూత్రం- ‘సంధానం, సహకారం, స్పర్ధ.’ అంటే- మొదట ప్రతి ప్రభుత్వ శాఖను, వివిధ పథకాలను, జిల్లాలో ప్రతి పౌరుడినీ పరస్పరం అనుసంధానించడం. అటుపైన ప్రతి ఒక్కరూ సహకార స్ఫూర్తితో కృషి చేయడం, అనంతరం ఇతర జిల్లాలతో ఆరోగ్యకర రీతిలో పోటీ పడటం. ఈ విధానం వల్ల ఒనగూడిన ప్రయోజనాలు నేడు ప్రస్ఫుటమవుతున్నాయి.
మిత్రులారా!
ఇప్పుడు మనం ఆకాంక్షాత్మక జిల్లాలుగా వ్యవహరిస్తున్న ఈ 100కు పైగా జిల్లాలు ఇక ఎంతమాత్రం వెనుకబడిన జిల్లాలు కావు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రహదారి అంటే ఏమిటో ఈ జిల్లాల్లోని 20 శాతం ఆవాసాలకు తెలియదు. ఆకాంక్షాత్మక జిల్లాల పథకం కారణంగా అలాంటి దుస్థితి నుంచి నేడు అధికశాతం ఆవాసాలు రహదారులతో సంధానమయ్యాయి. అలాగే వెనుకబడిన జిల్లాలుగా వ్యవహరించినపుడు బాలల్లో 17 శాతానికి టీకాలు అందుబాటులో లేవు. ఇవాళ ఆ జిల్లాలు ఆకాంక్షాత్మకంగా మారిన తర్వాత బాలలందరికీ టీకా ప్రయోజనం లభిస్తోంది. అలాగే, ఆనాడు విద్యుత్తుకు నోచని 15 శాతానికిపైగా పాఠశాలల్లో ప్రతి దానికీ నేడు కరెంటు సదుపాయం ఉంది.
మిత్రులారా!
అణగారిన వర్గాలకు ప్రాధాన్యం లభించినపుడు వెనుకబడిన వారికీ అది దక్కుతుంది... తద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. ఆకాంక్షాత్మక జిల్లాల్లో మాతృ మరణాల శాతం తగ్గింది... పిల్లల ఆరోగ్యంతోపాటు విద్యా స్థాయి కూడా మెరుగుపడింది. ఈ జిల్లాలు ఇప్పుడు అనేక పారామితుల రీత్యా ఇతర జిల్లాలకన్నా మెరుగ్గా ముందడుగు వేస్తున్నాయి.
మిత్రులారా!
ఇదే తరహాలో ఇక దేశవ్యాప్తంగా ఇతరత్రా అంశాల్లో ముందంజలోగల, వ్యవసాయంలో వెనుకబడిన 100 జిల్లాల అభివృద్ధికి మేం కంకణం కట్టుకున్నాం. ఈ రోజు ప్రారంభించిన ‘ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన’కు ఆకాంక్షాత్మక జిల్లాల విజయమే స్ఫూర్తి. ఈ పథకం కింద ఎంతో సునిశిత పరిశీలన ద్వారా 100 జిల్లాలను ఎంపిక చేశాం. ఇందుకు “ఓ భూకమతంలో దిగుబడి, ఓ కమతంలో ఎన్ని పంటలు పండిస్తారు, రైతులకు రుణం లేదా పెట్టుబడి సౌలభ్యం ఉందా- ఉంటే.. ఎంతమేరకు?” అనే మూడు పారామితులను ప్రాతిపదికగా తీసుకున్నాం.
మిత్రులారా!
మనం తరచూ 36 అంకెను ప్రస్తావిస్తుంటాం... వింటుంటాం. కొన్ని విషయాల్లో 36 రకాలు ఉన్నాయంటాం. ప్రతిదాన్నీ సవాలు చేస్తాంగానీ, తద్భిన్నంగా వ్యవహరిస్తాం. అయితే, ప్రభుత్వం అమలు చేసే 36 పథకాలను ఈ పథకంతో మేం అనుసంధానిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయంపై జాతీయ కార్యక్రమం తరహాలోనే నీటిపారుదల కోసం ‘పర్ డ్రాప్ మోర్ క్రాప్’ కార్యక్రమం ఉంది. నూనె గింజల ఉత్పత్తి పెంచడానికి నూనె గింజల కార్యక్రమం ఉంది. ఇలాంటి అనేక పథకాలను ఏకీకృతం చేస్తున్నాం. అదే సమయంలో ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన మన పశుసంపద పైనా దృష్టి సారిస్తుంది. దేశంలో గాలికుంటు వ్యాధి (ఫుట్ అండ్ మౌత్ డిసీజ్) నుంచి పశువుల రక్షణ కోసం 125 కోట్లకుపైగా టీకాలను ఉచితంగా వేశారు. దీంతో జంతువుల ఆరోగ్యం మెరుగుపడి, రైతుల్లో ఆందోళన తగ్గింది. ఈ నేపథ్యంలో కొత్త పథకం కింద స్థానిక స్థాయిలో పశుసంపద ఆరోగ్య సంబంధిత కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తారు.
మిత్రులారా!
ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమం తరహాలోనే ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన విషయంలోనూ రైతులు, జిల్లా కలెక్టర్‌సహా స్థానిక ప్రభుత్వోద్యోగులపై గురుతర బాధ్యత ఉంటుంది. ‘పీఎండీడీకేవై’ కింద ఆయా జిల్లాల అవసరాలకు అనుగుణంగా పథకం ప్రణాళికను మార్చుకోవచ్చు. ఆ మేరకు రైతులు, సంబంధిత జిల్లా స్థాయి అధికారులు తమకు అనువైన కార్యాచరణను రూపొందించాలని సూచిస్తున్నాను. ఆయా జిల్లాల పరిధిలో నేల, వాతావరణం ఏయే పంటల సాగుకు అనువైనవో పరిశీలించాలి. ఎలాంటి విత్తన రకాలు అవసరమో, నిర్దిష్ట ప్రయోజనార్థం వాడాల్సిన ఎరువులేమిటో సముచిత రీతిలో నిర్ణయించే దిశగా ప్రతి జిల్లాలో సమష్టి కృషి సాగాలి. ఈ విధంగా తయారు చేసుకున్న సరికొత్త కార్యాచరణను జాగ్రత్తగా అమలు చేయాలి. ప్రతి ప్రాంతానికి, ప్రతి భూ కమతానికి తగిన ప్రణాళిక అవసరం... ఆ మేరకు ఎక్కడ అదనపు నీటి వసతి అందుబాటులో ఉందో అక్కడ తదనుగుణమైన పంటను సాగుచేయాలి. ఎక్కడ నీటి కొరత ఉంటుందో అక్కడ తక్కువ నీరు అవసరమయ్యే పంటలు పండించాలి. వ్యవసాయానికి తగిన పరిస్థితులు లేనిచోట, పశుసంవర్ధక, చేపలు-రొయ్యల పెంపకం కార్యకలాపాలను ప్రోత్సహించాలి. కొన్ని ప్రాంతాల్లో తేనెటీగల పెంపకం ద్వారా మంచి ఫలితాలు రాబట్టవచ్చు. తీరప్రాంతాల్లో సముద్రపు నాచు పెంపకం కూడా ఓ మంచి ఆదాయార్జన మార్గమే. ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన విజయం ఇలా స్థానిక స్థాయిలో చేపట్టే వివిధ కార్యక్రమాల అమలు ద్వారా మాత్రమే సాధ్యం. ముఖ్యంగా ఇందులో మన యువ అధికారులకు గురుతర బాధ్యతలుంటాయి. తమతమ పరిధిలో మార్పు దిశగా వారు కృషికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి, రైతులతో సంయుక్తంగా యువ మిత్రులు తమవంతు కృషి చేస్తూ దేశంలోని వంద జిల్లాల్లో వ్యవసాయ రంగ స్వరూపాన్ని అద్భుతంగా ఆవిష్కరించగలరని నేనెంతగానో విశ్వసిస్తున్నాను. వ్యవసాయ రంగంలో ప్రగతిశీల మార్పు ద్వారా యావత్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా రూపాంతరం చెందుతుందని మీకు హామీ ఇస్తున్నాను.
మిత్రులారా!
“పప్పుధాన్యాల స్వావలంబన కార్యక్రమం” (పీఎస్‌ఆర్‌ఎం) కూడా ఇవాళే ప్రారంభమైంది. ఇది కేవలం పప్పుధాన్యాల దిగుబడి పెంచేందుకు మాత్రమే పరిమితం కాదు.. మన భావితరానికి సాధికారత కల్పించే కార్యక్రమం. నేనింతకుముందు చెప్పినట్టు కొన్నేళ్లుగా భారత రైతులోకం అటు వరి, ఇటు గోధుమ సహా రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల దిగుబడులు సాధించారు. అందువల్లనే భారత్ నేడు ప్రపంచంలో అతిపెద్ద వ్యవసాయ ఉత్పత్తిదారు దేశాల జాబితాలోకెక్కింది. కానీ, మిత్రులారా... మనం బియ్యం, గోధుమ పిండి గురించి మాత్రమే యోచిస్తే సరిపోదు... మన ఇళ్లలో కూడా కేవలం ఈ రెండింటితోనే పూట గడవదు. అందరి ఆకలి తీరాలంటే వాటితోపాటు ఇతర ఆహార పదార్థాలు కూడా అవసరం. దాంతోపాటు పౌష్టికత కూడా ముఖ్యమే కాబట్టి, అందుకు తగినట్లు మనం ప్రణాళిక వేసుకోవాలి. పౌష్టికత విషయానికొస్తే... ముఖ్యంగా శాకాహారులకు ప్రొటీన్ అవసరం జాస్తి. మన పిల్లల ఎదుగుదలకు, భావితరం శ్రేయస్సుకే కాకుండా శారీరక-మానసిక వికాసానికీ ప్రొటీన్ ఎంతో కీలకం. మన దేశ జనాభాలో ప్రధానంగా శాకాహారులు అధికం కావడంవల్ల ప్రొటీన్ కోసం వారు పప్పుధాన్యాలపై ఆధారపడటం సహజం. అయితే, భారత్ వ్యవసాయ ప్రధాన దేశమైనప్పటికీ, దురదృష్టవశాత్తూ ఇటువంటి అవసరాలను మనం తీర్చుకోలేని స్థితిలో ఉన్నాం. దిగుమతులపై ఆధారపడక తప్పని పరిస్థితిలో సవాళ్లను ఎదుర్కొనాల్సి రావడం ఎంతో విచారకరం. ఇతర దేశాల నుంచి ఈ భారీ దిగుమతులను తగ్గించాలంటే పప్పుధాన్యాల్లో స్వావలంబన కార్యక్రమం అమలు అత్యావశ్యకం.
మిత్రులారా!
ఈ నేపథ్యంలో దేశం అవసరాలను తీర్చే దిశగా రూ.11 వేల కోట్ల నిధులతో చేపట్టిన ‘పీఎస్‌ఆర్‌ఎం’ మన రైతులకు ఎంతగానో తోడ్పడుతుంది. దేశంలో పప్పుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని ఎలాగైనా అదనంగా 35 లక్షల హెక్టార్ల దాకా పెంచాలన్నది ఈ కార్యక్రమ లక్ష్యం. ఆ మేరకు కంది, మినుము, శనగ పంటల దిగుబడి పెంచడమే కాకుండా వాటి కొనుగోలుకు సముచిత ఏర్పాట్లు కూడా చేస్తారు. తద్వారా దేశవ్యాప్తంగా 2 కోట్లమంది రైతులకు ప్రయోజనం కలుగుతుంది. నేను కొద్దిసేపటి కిందటే పప్పుధాన్యాలు సాగుచేసే రైతులతో మాట్లాడాను. వారిలో ఆత్మవిశ్వాసం, ఉత్సాహం ఉప్పొంగడం గమనించాను. తాము సాధించిన విజయాల గురించి తెలిసి, ఎంతోమంది ఇతర ప్రాంతాల రైతులు స్వయంగా వచ్చి, తమ అనుభవాల గురించి వాకబు చేస్తున్నట్లు వారు తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వం అమలులోకి తెచ్చిన కార్యక్రమం కింద పూర్తి సామర్థ్యంతో దేశాన్ని స్వయంసమృద్ధం చేయగలమన్న విశ్వాసం వారితో తొణికిసలాడటం నేను చూశాను.
మిత్రులారా!
ఎర్రకోట పైనుంచి నేను ప్రసంగించిన సందర్భంగా వికసిత భారత్ 4 బలమైన మూలస్తంభాల గురించి ప్రస్తావించాను. వాటిలో మీరు... అంటే దేశానికి ఆహార ప్రదాతలైన నా రైతులు అత్యంత శక్తిమంతమైన స్తంభం. కాబట్టే, గత 11 సంవత్సరాలుగా రైతుల సాధికారత సహా వ్యవసాయంలో మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వం సదా కృషి చేస్తోంది. మా ప్రాథమ్యమేమిటో వ్యవసాయ బడ్జెట్‌లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. గత 11 ఏళ్లలో వ్యవసాయ బడ్జెట్ దాదాపు 6 రెట్లు పెరగడంతో మన చిన్న రైతులు ఎక్కువ ఫలితం పొందగలిగారు. ఈ సందర్భంగా నేనొక ఉదాహరణ చెబుతాను... మన దేశంలో రైతులకు రాయితీతో ఎరువులు సరఫరా చేస్తుండటం మీకందరికీ తెలిసిందే. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం తన పదేళ్ల పాలనలో... అంటే- మేం అధికారంలోకి రాకముందు ఇచ్చిన రాయితీ కేవలం రూ.5 లక్షల కోట్లు కాగా, బీజేపీ-ఎన్డీఏ ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో రూ.13 లక్షల కోట్లకుపై సబ్సిడీ ఇచ్చింది.
మిత్రులారా!
కాంగ్రెస్ హయాంలో వ్యవసాయం కోసం ప్రభుత్వం ఒక ఏడాది కాలంలో వెచ్చించిన సొమ్మును బీజేపీ-ఎన్డీఏ ప్రభుత్వం ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ రూపంలో ఏకకాలంలో రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఈ పథకం కింద ఇప్పటిదాకా రూ.3.75 లక్షల కోట్లు నేరుగా రైతులకు చేరాయి.
మిత్రులారా!
రైతుల ఆదాయం పెంచే కృషిలో భాగంగా మా ప్రభుత్వం సంప్రదాయ వ్యవసాయానికి అదనంగా వివిధ మార్గాలను చూపింది. తదనుగుణంగా పశుపోషణ, చేపలు-రొయ్యల సాగు, తేనెటీగల పెంపకం వంటి కార్యకలాపాలకు ప్రాధాన్యమిస్తోంది. వీటిద్వారా చిన్న రైతులతోపాటు భూమిలేని పేదల కుటుంబాలకూ సాధికారత కల్పిస్తోంది. ఇక తేనె ఉత్పత్తి 11 ఏళ్ల కిందటితో పోలిస్తే నేడు దేశంలో దాదాపు రెట్టింపైంది. ఓ 6-7 సంవత్సరాల కిందట మనం రూ.450 కోట్ల విలువైన తేనెను ఎగుమతి చేస్తుండగా, గత సంవత్సరం తేనె ఎగుమతి రూ.1500 కోట్ల స్థాయిని అధిగమించింది... అంటే- రైతుల ఆదాయం 3 రెట్లు దాటింది.
మిత్రులారా!
గ్రామీణ సౌభాగ్యం, వ్యవసాయ ఆధునికీకరణలో మన అక్కచెల్లెళ్ల భాగస్వామ్యం నిరంతరం పెరుగుతూనే ఉంది. ఇంతకుముందే రాజస్థాన్ రాష్ట్రంలో స్వయం సహాయ సంఘం నాయకురాలైన ఓ సోదరితో నేను మాట్లాడాను. తన నాయకత్వంలోని సంఘంలో ఇవాళ 90 వేల మంది సభ్యులున్నారని ఆమె సగర్వంగా చెప్పింది. చూడండి... 90 వేల మంది ఆ సంఘంలో ఉన్నారంటే- ఆమె ఎంతగా శ్రమించి ఉంటుందో ఒకసారి ఊహించండి. అలాగే ఒక డాక్టర్ సోదరితోనూ నేను మాట్లాడాను... ఆమె వైద్యురాలైనప్పటికీ, ఇప్పుడు పశుపోషణ చేపట్టి ముందడుగు వేసింది. ఈ విధంగా... పొలం పనులైనా, పశుపోషణ అయినా- గ్రామీణ మహిళలకు నేడు ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా మూడు కోట్లమంది మహిళలను ‘లక్షాధికారి సోదరి’గా మార్చే కార్యక్రమం వ్యవసాయ రంగానికీ ఎంతగానో తోడ్పాటునిస్తోంది. ఈ మేరకు ‘నమో డ్రోన్ దీదీ’ పేరిట గ్రామీణ మహిళలు పొలాల్లో ఎరువులు, పురుగుమందుల చల్లే ఆధునిక పద్ధతులను అనుసరిస్తూ ఇతరులకు మార్గదర్శకులుగా రూపొందారు. ఈ కార్యకలాపాల ద్వారా వారు వేల రూపాయలు ఆర్జిస్తున్నారు. అలాగే వ్యవసాయ వ్యయం తగ్గించడంలోనూ వారు తమవంతు పాత్ర పోషిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి, అందుకు మద్దతివ్వడానికి దేశవ్యాప్తంగా 17,000కు పైగా క్లస్టర్లు ఏర్పాటయ్యాయి. వీటిద్వారా రైతులకు అవగాహన కల్పించడం కోసం దాదాపు 70 వేల మంది ‘వ్యవసాయ సఖి’ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు.
మిత్రులారా!
ప్రతి రైతుకూ, ప్రతి పశుపోషకుడికీ వ్యయం తగ్గించి, లాభం పెరిగేలా చూడాలన్నదే మా ధ్యేయం. మా శివరాజ్ గారు ‘జీఎస్‌టీ’ కొత్త సంస్కరణల గురించి ఎంతో ఉత్సాహంగా చెబుతున్నారు. ఇది కూడా గ్రామీణులకు, రైతులకు, పశుపోషకులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ మేరకు ప్రస్తుత పండుగల సమయంలో రైతులు పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లు కొనుగోలు చేస్తున్నారని వార్తల్లో చూస్తున్నాం. ఎందుకంటే- ట్రాక్టర్ ఇప్పుడు మరింత చౌకగా లభిస్తోంది. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నపుడు రైతుకు ప్రతిదీ ఖరీదైనదే... ట్రాక్టర్లపై నాటి సర్కారు పన్నుల కింద రూ.70 వేలు వసూలు చేసేది. జీఎస్‌టీ కొత్త సంస్కరణలతో అదే ట్రాక్టర్ ధర ఇవాళ దాదాపు రూ.40 వేలు తగ్గింది.
మిత్రులారా!
వ్యవసాయ యంత్రాలపైనా జీఎస్‌టీ గణనీయంగా తగ్గింది. ఉదాహరణకు॥ వరి నాట్ల యంత్రంపై నేడు రూ.15 వేలు ఆదా అవుతుండగా, పవర్ టిల్లర్లపై రూ.10 వేల దాకా మిగులుతోంది. అదేవిధంగా నూర్పిడి యంత్రాలపై రైతుకు రూ.25 వేల దాకా పొదుపు అవుతుంది. ఇక బిందు సేద్యం, స్ప్రింక్లర్లతో సాగు లేదా పంటకోత యంత్రాల సంబంధిత పరికరాలపైనా జీఎస్‌టీ బాగా తగ్గింది.
మిత్రులారా!
ఎరువులు, పురుగుమందులపైనా జీఎస్‌టీ తగ్గింపుతో ఖర్చు తగ్గుతుంది కాబట్టి, ప్రకృతి వ్యవసాయానికి మరింత ప్రోత్సాహం లభిస్తుంది. మొత్తం మీద దేశంలోని ఓ గ్రామీణ కుటుంబానికి ఇప్పుడు పొదుపు రెట్టింపైంది. ఎలాగంటే- దైనందిన వినియోగ వస్తువులు చౌకగా మారడమగాక వ్యవసాయ పరికరాల ధరలు కూడా అందుబాటులోకి వచ్చాయి.
ప్రియమైన రైతు మిత్రులారా!
స్వాతంత్ర్యానంతరం ఆహారోత్పత్తిలో దేశాన్ని మీరు స్వయం సమృద్ధం చేశారు. ఈ నేపథ్యంలో వికసిత భారత్‌కు రూపమివ్వడంలోనూ మీరు ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంది. ఈ మేరకు మనం స్వావలంబన సాధించడంతోపాటు ప్రపంచ విపణి కోసం కూడా దిగుబడులను పెంచాలి. మిత్రులారా.. ముఖ్యంగా ప్రపంచ మార్కెట్లలో ప్రాచుర్యంగల పంటల సాగుపైనా మనం దృష్టి సారించాలి. తద్వారా మనం ప్రపంచ దేశాల తలుపులు తట్టాలి. మరోవైపు దిగుమతులను తగ్గించుకుంటూనే ఎగుమతుల పెంపులో వెనుకబడకుండా చూసుకోవాలి. ఈ కృషిలో “పీఎండీడీకేవై, పీఎస్‌ఆర్‌ఎం” కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయి. చివరగా, ఈ శుభ సమయాన నా రైతు సోదరీసోదరులకు రెండు అద్భుత పథకాలు అందుబాటులోకి రావడంపై మరోసారి నా శుభాకాంక్షలు. అలాగే దీపావళి పండుగ సందర్భంగా ముందుగానే మీకు శుభాభినందనలు తెలియజేస్తున్నాను.
అనేకానేక ధన్యవాదాలు.
***
(Release ID: 2178061)
|