ప్రధాన మంత్రి కార్యాలయం
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శత వార్షికోత్సవాలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
దేశానికి ఆర్ఎస్ఎస్ చేస్తున్న సేవలను ప్రతిబింబించేటట్లు
రూపొందించిన విశిష్ట స్మారక తపాలా బిళ్లను విడుదల చేసిన ప్రధానమంత్రి
వంద సంవత్సరాల కిందట ఆర్ఎస్ఎస్ స్థాపన...
ప్రతి యుగంలో సవాళ్లకు ఎదురొడ్డి నిలిచిన జాతీయ నిత్య చైతన్య స్ఫూర్తికి అద్దం పడుతున్న ఆర్ఎస్ఎస్
పరమ పూజ్య డాక్టర్ హెడ్గేవార్ జీకి నా నివాళులు: ప్రధానమంత్రి
దేశ ప్రజలకు సేవ చేయడానికీ, సమాజానికి సాధికారతను
అందించడానికీ అవిశ్రాంతంగా శ్రమిస్తున్న ఆర్ఎస్ఎస్ వలంటీర్లు: ప్రధానమంత్రి
ఈ రోజు విడుదల చేసిన స్మారక స్టాంపు ఓ నివాళి...
ఇది 1963 గణతంత్ర పరేడ్‌లో సగర్వంగా పాల్గొన్న ఆర్ఎస్ఎస్ వలంటీర్లకు ఒక ప్రతీక
ఆర్ఎస్ఎస్ ఏర్పాటైన నాటి నుంచీ ఆ సంస్థ దృష్టి జాతి నిర్మాణంపైనే: ప్రధానమంత్రి
ఆర్ఎస్ఎస్ శాఖ స్ఫూర్తికి నిలయం...
‘నేను’ నుంచి ‘మనం’ వైపు యాత్ర మొదలయ్యేది అక్కడే: ప్రధానమంత్రి
వ్యక్తిగత వికాసంతో పాటు శాఖలో చైతన్యాన్ని నింపేందుకు రాచమార్గమైన జాతి నిర్మాణ లక్ష్యమే ఆర్ఎస్ఎస్ వందేళ్ల కృషికి పునాదిరాయి: ప్రధానమంత్రి
లెక్కకు అందనన్ని త్యాగాలు చేసిన ఆర్ఎస్ఎస్...
‘దేశం అన్నింటి కన్నా మిన్న
Posted On:
01 OCT 2025 1:28PM by PIB Hyderabad
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శత వార్షికోత్సవాలు ఈ రోజు న్యూఢిల్లీలో నిర్వహించగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముందుగా దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజున మహా నవమి.. సిద్ధిధాత్రి అమ్మవారిని ఆరాధించేది ఈ రోజేనని ఆయన గుర్తు చేశారు. రేపు విజయదశమి మహా పర్వదినం.. ఈ పండుగ భారతీయ సంస్కృతిలో ఓ శాశ్వత జయఘోషకు సంకేతం.. అన్యాయంపై న్యాయం, అసత్యంపై సత్యం, చీకటిపై వెలుగు పైచేయిని సాధించిన సన్నివేశమని ఆయన అభివర్ణించారు. అంతటి పవిత్ర సందర్భంలో, వంద సంవత్సరాల కిందట రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ను స్థాపించారు. ఇది యాదృచ్ఛిక ఘటన ఏమీ కాదని ఆయన ఉద్ఘాటించారు. ఇది వేల సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తున్న ప్రాచీన సంప్రదాయాన్ని పునరుద్ధరించడమే.. దీనిలో భాగంగా ప్రతి యుగంలోనూ అప్పటి సవాళ్లను ఎదుర్కోవడానికి జాతీయ అంతశ్చేతన కొత్త కొత్త రూపాలను తీసుకొంటూ ఉంటుందని ఆయన అన్నారు. ఈ యుగంలో, నిత్య జాతీయ చైతన్యం మూర్తీభవించిన ఓ ప్రతిరూపంగా సంఘ్ నిలుస్తోందని ఆయన తేల్చి చెప్పారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వందో సంవత్సరానికి సాక్షులుగా నిలవడం ఇప్పటి తరానికి దక్కిన భాగ్యమని శ్రీ మోదీ ముఖ్యంగా ప్రస్తావించారు. దేశ సేవకు సంకల్పబద్ధులైన అనేక మంది స్వయంసేవకులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సంఘ్ స్థాపకుడు, ఆదర్శ నేత డాక్టర్ హెడ్గేవార్ చరణాలకు ప్రధానమంత్రి శ్రద్ధాంజలి ఘటించారు. సంఘ్ 100 సంవత్సరాల వైభవోపేత యాత్రను స్మరించుకోవడానికి భారత ప్రభుత్వం ఒక ప్రత్యేక తపాలా బిళ్లనూ, ఒక స్మారక నాణేన్నీ విడుదల చేసిందని ఆయన ప్రకటించారు. 100 రూపాయల నాణెంలో ఒక వైపు జాతీయ చిహ్నం ఉంటే, మరో వైపు సింహం, వరద ముద్రతో ఉన్న భారత్ మాత భవ్య చిత్రానికి వందనాన్ని ఆచరిస్తున్న స్వయంసేవకులు ఉన్నారు. భారతీయ కరెన్సీలో భారత్ మాత బొమ్మ కనిపించడం స్వతంత్ర భారతదేశ చరిత్రలో బహుశా ఇది మొదటి సారి కావచ్చని శ్రీ మోదీ ముఖ్యంగా ప్రస్తావించారు. సంఘ్‌కు మార్గదర్శిగా నిలిచిన ‘‘రాష్ట్రాయ స్వాహా, ఇదం రాష్ట్రాయ, ఇదం న మమ’’ అనే ఆదర్శ వాక్యం కూడా ఈ నాణెంలో చోటు చేసుకుందని ఆయన వివరించారు.
ఈ రోజున విడుదల చేసిన స్మారక తపాలా బిళ్లకున్న ప్రాధాన్యాన్ని ప్రధానమంత్రి తెలియజేస్తూ, దీనికి చారిత్రక నేపథ్యం ఉందన్నారు. 1963లో జనవరి 26న గణతంత్ర దిన కవాతు విశిష్టతను ఆయన గుర్తుకు తెస్తూ, ఆ పరేడ్‌లో ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు ఎంతో అభిమానంతో పాల్గొని, దేశభక్తి గీతాల లయకు అనుగుణంగా కదం తొక్కారన్నారు. ఆనాటి చరిత్రాత్మక ఘట్టం జ్ఞాపకాలను ఈ స్టాంపు ఒడిసిపట్టుకుని మన కళ్లెదుట నిలుపుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
‘‘ఈ స్మారక తపాలా బిళ్ల ఆర్ఎస్ఎస్ స్వయంసేవకుల అచంచల అంకిత భావానికి కూడా అద్దంపడుతోంది.. స్వయంసేవకులు దేశానికి క్రమం తప్పక సేవలందిస్తూ, సమాజాన్ని శక్తిమంతం చేస్తున్నార’’ని శ్రీ మోదీ చెప్పారు. ఈ స్మారక నాణెం, తపాలా బిళ్ల విడుదల సందర్భంగా భారతీయులకు శ్రీ మోదీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు.
గొప్ప నదులు.. తీరప్రాంతాల్లో మానవ నాగరికతను పెంచి పోషించినట్లుగానే, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కూడా ఎంతో మంది జీవనాన్ని తీర్చిదిద్ది సుసంపన్నం చేసిందని ప్రధానమంత్రి అభివర్ణించారు. నది తాను ప్రవహించిన చోట భూమినీ, పల్లెలనూ, ప్రాంతాలనూ సారవంతం చేస్తే, సంఘ్ సైతం భారతీయ సమాజంలో ప్రతి రంగాన్నీ, దేశంలో ప్రతి ప్రాంతాన్నీ స్పర్శించిందని శ్రీ మోదీ వివరించారు. ఇది నిరంతరాయ అంకితభావం, శక్తిమంతమైన జాతీయతా ప్రవాహాల పర్యవసానమేనని ఆయన అన్నారు.
ఒక నది అనేక పాయలుగా విస్తరించే మాదిరే, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కూడా శాఖోపశాఖలుగా విస్తరించిందనీ, ఈ రెండూ... వివిధ ప్రాంతాలను సమృద్ధం చేస్తున్నాయనీ ప్రధానమంత్రి పోల్చారు. సంఘ్ తన ప్రస్థానంలో వేర్వేరు అనుబంధ సంస్థల సాయంతో... విద్య, వ్యవసాయం, సమాజ సంక్షేమం, గిరిజనుల అభ్యున్నతి, మహిళలకు సాధికారత కల్పన, కళలు, విజ్ఞానశాస్త్రాలు, కార్మిక రంగం వంటి రంగాల్లో పనిచేయడం ద్వారా దేశానికి సేవ చేయడంలో నిమగ్నం అయిందన్నారు. సంఘ్ అనేక భాగాలుగా విస్తరించినప్పటికీ, వాటి మధ్య చీలిక ఎన్నడూ రాలేదని శ్రీ మోదీ ముఖ్యంగా ప్రస్తావించారు. ‘‘ప్రతి ఒక్క శాఖకూ, విభిన్న రంగాల్లో పనిచేస్తున్న ఒక్కొక్క సంస్థకూ ఒకే పరమార్థం, భావోద్వేగం ఉన్నాయి.. అది.. దేశమే అన్నింటి కన్నా మిన్న అనేదే’’ అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
‘‘నాందీ ప్రస్తావన జరిగినప్పటి నుంచీ దేశ నిర్మాణం అనే ఒక మహా ధ్యేయాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అనుసరిస్తూ, ముందుకుపోతోంది’’ అని శ్రీ మోదీ అన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి సంఘ్ వ్యక్తిగత వికాసాన్ని సాధించే దారిని ఎన్నుకొని, ఆ బాటలో ముందుకు పోయి దేశాభివృద్ధిని సాధించాలనుకుందని ఆయన చెప్పారు. ఈ మార్గంలో ముందుకు కదలడానికి సంఘ్ ఒక క్రమశిక్షణతో కూడిన పనితీరును ఒక పద్ధతినీ ఆలంబనగా చేసుకుందనీ, శాఖలను ప్రతిరోజూ, క్రమం తప్పకుండా నిర్వహిస్తూ ఉండడమే ఆ పద్ధతి’’ అని శ్రీ మోదీ వివరించారు.
‘‘పౌరులు దేశం పట్ల తమ బాధ్యతను గుర్తించినప్పుడే దేశం నిజంగా బలపడుతుందనీ, దేశం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడితేనే భారత్ ఉన్నత స్థితికి చేరుకొంటుందనీ పూజ్యుడు డాక్టర్ హెడ్గేవార్ గ్రహించార’’ని ప్రధానమంత్రి అన్నారు. ఈ కారణంగానే డాక్టర్ హెడ్గేవార్ వ్యక్తిగత వికాసానికి కట్టుబడి ఉంటూ, ఒక అపూర్వ వైఖరిని అవలంబించారని శ్రీ మోదీ చెప్పారు. ‘‘ప్రజలను వారు ఎలా ఉంటే అలా స్వీకరించి, వారిని ఎలా మలిస్తే బాగుంటుందో అలా తీర్చిదిద్దాలి’’ అనే సిద్ధాంతం బాటలో సాగాలని డాక్టర్ హెడ్గేవార్ చెప్పేవారని శ్రీ మోదీ తెలిపారు. కుండలను తయారు చేసే వ్యక్తి బంకమట్టిని తీసుకొని, నిష్ఠగా పనిచేస్తూ, ఒక ఆకారాన్ని తీర్చిదిద్ది బట్టీలో కాల్చి.. చివరకు ఇటుకలను ఉపయోగించి ఒక గొప్ప నిర్మాణాన్ని రూపొందిస్తాడు. డాక్టర్ హెడ్గేవార్ కూడా ప్రజలతో అనుబంధాన్ని ఇదే రకంగా విస్తరించారు. సామాన్యులను ఎంపిక చేసి, వారికి శిక్షణనిచ్చి, దృష్టికోణాన్ని అలవరచి, దేశం కోసం పనిచేసే అంకితభావం కల స్వయంసేవకులుగా మార్చారని శ్రీ మోదీ వివరించారు. ఈ కారణంగానే సంఘ్ గురించి చెప్పేటప్పుడు, అసాధారణ, అపూర్వ పనులను పూర్తి చేయడానికి ఒక చోట గుమికూడేది సాధారణ ప్రజానీకమేనని చెబుతారని ప్రధానమంత్రి అన్నారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు చెందిన శాఖల్లో వ్యక్తిగత వికాసం అనే ఒక పవిత్ర క్రతువు ఈనాటికీ వర్ధిల్లుతోందని శ్రీ మోదీ ముఖ్యంగా ప్రస్తావించారు. శాఖ కార్యక్రమాలను నిర్వహించే మైదానాన్ని ప్రేరణనందించే ఒక పవిత్ర స్థలంగా ఆయన అభివర్ణించారు. ‘‘ఈ స్థలంలో స్వయంసేవక్ తన ప్రయాణాన్ని ‘‘నేను’’ నుంచి ఆరంభించి, ‘‘మనం’’ వైపునకు సాగిపోతుంది. ఇది సమష్టి భావనను ప్రతిబింబిస్తుంది’’ అని శ్రీ మోదీ చెప్పారు. ఒక వ్యక్తి స్వభావాన్ని తీర్చిదిద్ది, శారీరక, మానసిక, సాంఘిక ఉన్నతికి తోడ్పడే యజ్ఞ వేదికలే శాఖలు అని ఆయన వ్యాఖ్యానించారు. శాఖలలో దేశ సేవ, సాహస భావన అంకురిస్తాయి, త్యాగం, అంకితభావం అలవడుతాయి. వ్యక్తిగత బాగోగుల ఆపేక్ష తగ్గిపోయి, స్వయంసేవక్ లో సామూహిక నిర్ణయాలు తీసుకొనేందుకూ, జట్టు స్ఫూర్తి ప్రతిఫలించే విలువలను ఇముడ్చుకొనేందుకూ ముందుకు ఉరుకుతారు అని ప్రధానమంత్రి వివరించారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వందేళ్ల ప్రయాణం జాతి నిర్మాణ దృక్పథం.. వ్యక్తిత్వ వికాసం కోసం స్పష్టమైన మార్గం.. శాఖల రూపంలో నిరాడంబరమైన, అద్భుతమైన పని విధానం.. అనే మూడు మూలస్తంభాలపై ఆధారపడిందని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఈ స్తంభాల ఆధారంతోనే సంఘ్ లక్షలాది స్వయంసేవకులను రూపొందించిందన్నారు. అంకితభావం, సేవ, జాతీయ శ్రేష్ఠత పట్ల నిబద్ధతతో విభిన్న రంగాల్లో వారు దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆవిర్భావం నుంచీ తన ప్రాధాన్యాలను దేశం ప్రాధాన్యాలతో అనుసంధానించిందని స్పష్టం చేసిన ప్రధానమంత్రి... ప్రతి యుగంలోనూ దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లను సంఘ్ ఎదుర్కోందన్నారు. స్వాతంత్య్ర పోరాటాన్ని గుర్తుచేసుకుంటూ.. గౌరవనీయ డాక్టర్ హెడ్గేవార్ సహా అనేక మంది సంఘ్ కార్యకర్తలు స్వాతంత్య్రోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని, డాక్టర్ హెడ్గేవార్ అనేకసార్లు జైలు శిక్షనూ అనుభవించారని ఆయన పేర్కొన్నారు. సంఘ్ అనేక మంది స్వాతంత్య్ర సమరయోధులకు మద్దతునిచ్చిందనీ, వారితో భుజం భుజం కలిపి పనిచేసిందని ప్రధానమంత్రి ప్రధానంగా ప్రస్తావించారు. 1942లో చిమూర్‌లో జరిగిన ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ అక్కడ చాలా మంది స్వయంసేవకులు బ్రిటిష్ దురాగతాలను భరించారని తెలిపారు. స్వాతంత్య్రం తర్వాత కూడా హైదరాబాద్‌లో నిజాం అణచివేతను ప్రతిఘటించడం నుంచి గోవా, దాద్రా-నగర్ హవేలి విముక్తికి దోహదపడటం వరకు సంఘ్ తన త్యాగాలను కొనసాగించిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మొత్తం ప్రయాణంలో "దేశమే ముందు" అనే మార్గదర్శక భావన.. "ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్" అనే మహోన్నత లక్ష్యంతో సంఘ్ ముందుకు సాగుతోందని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.
దేశసేవ ప్రయాణంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఎన్నో దాడులు, కుట్రలనూ ఎదుర్కొందని తెలిపిన ప్రధానమంత్రి.. స్వాతంత్య్రానంతరం కూడా సంఘ్‌ను అణచివేయడానికి, ప్రధాన స్రవంతితో దాని ఏకీకరణను నిరోధించేందుకు జరిగిన ప్రయత్నాలను శ్రీ మోదీ గుర్తు చేసుకున్నారు. పూజ్య గురూజీని తప్పుడు ఆరోపణలతో జైలుకు పంపారని ఆయన పేర్కొన్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత గురూజీ అత్యంత ప్రశాంతతతో స్పందిస్తూ.. "కొన్నిసార్లు నాలుక దంతాల కింద చిక్కుకుని నలిగిపోతుంది. కానీ మనం దంతాలు విరగ్గొట్టం.. ఎందుకంటే దంతాలు, నాలుక రెండూ మనవే" అని చెప్పిన మాటలను ఉటంకించారు. తీవ్రమైన హింస, వివిధ రకాల అణచివేతను భరించినప్పటికీ గురూజీకి ఎటువంటి ఆగ్రహంగానీ, ద్వేషంగానీ లేదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. మహర్షుల వ్యక్తిత్వం, సైద్ధాంతిక స్పష్టతతో గురూజీ ప్రతి స్వయంసేవకుడికి మార్గదర్శకులుగా దారి చూపుతూ.. సమాజంలో ఐక్యతను, సానుభూతి విలువలను బలోపేతం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. నిషేధాలు, కుట్రలు, తప్పుడు కేసులు ఎదుర్కొన్నప్పటికీ స్వయంసేవకులు ఎప్పుడూ ద్వేషానికి చోటివ్వలేదన్నారు. వారూ సమాజంలో భాగంగానే భావించారనీ.. అందుకే మంచీ వారికే చెందుతుంది.. తక్కువ మంచి కూడా వారికే చెందుతుందని భావించినట్లు ప్రధానమంత్రి వివరించారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఎప్పుడూ ద్వేషాన్ని పెంచుకోలేదనీ.. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ సంస్థలపై ప్రతి స్వయంసేవక్‌కు గల అచంచల విశ్వాసమే దానికి ప్రధాన కారణమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితి సమయంలో ఈ నమ్మకమే స్వయంసేవకులకు సాధికారతను, ప్రతిఘటించే శక్తినీ ఇచ్చిందని ప్రధానమంత్రి గుర్తుచేసుకున్నారు. సమాజంతో ఏకత్వం, రాజ్యాంగ సంస్థలపై విశ్వాసం అనే విలువలు స్వయంసేవకులను ప్రతి సంక్షోభంలోనూ, సామాజిక అవసరాల్లోనూ సున్నితంగా వ్యవహరించేలా మార్గదర్శనం చేశాయన్నారు. కాలక్రమేణా అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ సంఘ్ ఒక శక్తిమంతమైన మర్రి చెట్టులా స్థిరంగా నిలబడి దేశానికీ, సమాజానికీ నిరంతరం సేవ చేస్తోందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రారంభం నుంచీ దేశభక్తి, సేవకు పర్యాయపదంగా ఉందని శ్రీ మోదీ అన్నారు. విభజన సమయంలో లక్షలాది కుటుంబాలు నిరాశ్రయులైనప్పుడు స్వయంసేవకులు పరిమిత వనరులతో శరణార్థులకు సేవ చేయడంలో ముందంజలో నిలిచారని ఆయన గుర్తు చేసుకున్నారు. ఇది కేవలం సహాయ చర్య మాత్రమే కాదనీ.. ఇది జాతి ఆత్మను బలోపేతం చేసే చర్యగా ఆయన అభివర్ణించారు.
1956లో గుజరాత్‌లోని అంజార్‌లో సంభవించిన వినాశకరమైన భూకంపాన్ని ప్రధానమంత్రి ప్రధానంగా ప్రస్తావించారు. ఆ విధ్వంసం గురించి వివరిస్తూ.. అలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ స్వయంసేవకులు సహాయక, రక్షణ చర్యల్లో చురుగ్గా పాల్గొన్నారని తెలిపారు. మరొకరి బాధను తగ్గించడానికి నిస్వార్థంగా కష్టాలను భరించడం గొప్ప హృదయానికి నిదర్శనమని పేర్కొంటూ గౌరవనీయ గురూజీ అప్పటి గుజరాత్‌లోని సంఘ్ అధినేత వకీల్ సాహెబ్‌కు ఒక లేఖ రాశారని ఆయన గుర్తు చేశారు.
"ఇతరుల బాధలను తగ్గించడానికి నిరంతరం శ్రమించడం ప్రతి స్వయంసేవకుడి లక్షణం" అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. 1962 యుద్ధాన్ని గుర్తుచేసుకుంటూ.. ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవకులు సాయుధ దళాలకు అవిశ్రాంతంగా అండగా నిలుస్తూ వారి మనోధైర్యాన్ని పెంపొందించడమే కాకుండా సరిహద్దు సమీపంలోని గ్రామాల ప్రజలకూ సహాయం అందించారని తెలిపారు. తూర్పు పాకిస్తాన్ నుంచి లక్షలాది మంది శరణార్థులు ఆశ్రయం, వనరులు కరువై భారతదేశానికి వలస వచ్చిన 1971 సంక్షోభాన్నీ ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఆ క్లిష్ట సమయంలో స్వయంసేవకులు వారికి ఆహారాన్ని సమీకరించారు.. ఆశ్రయం కల్పించారు.. ఆరోగ్య సంరక్షణ సేవలనూ అందించారు.. వారి కన్నీళ్లు తుడిచారు.. వారి బాధను పంచుకున్నారని తెలిపారు. 1984 అల్లర్ల సమయంలోనూ స్వయంసేవకులు అనేక మంది సిక్కులకు ఆశ్రయం కల్పించారని శ్రీ మోదీ గుర్తుచేశారు.
చిత్రకూట్‌లోని నానాజీ దేశ్‌ముఖ్ ఆశ్రమంలో సేవా కార్యకలాపాలను చూసి మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏ.పీ.జే. అబ్దుల్ కలాం ఎంతో ఆశ్చర్యపోయారని శ్రీ మోదీ గుర్తుచేసుకున్నారు. నాగ్‌పూర్ పర్యటన సందర్భంగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంఘ్ క్రమశిక్షణ, నిరాడంబరతకు ఎంతగానో ఆకర్షితులయ్యారని ఆయన ప్రస్తావించారు.
పంజాబ్‌లో వరదలు.. హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో విపత్తులు.. కేరళలోని వయనాడ్‌లో జరిగిన విషాదం వంటి విపత్తుల్లో కూడా స్వయంసేవకులే మొదట స్పందిస్తున్నారని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రపంచం మొత్తం సంఘ్ ధైర్యాన్ని, సేవా స్ఫూర్తిని ప్రత్యక్షంగా చూసిందని ఆయన ధ్రువీకరించారు.
సమాజంలోని విభిన్న వర్గాల్లో స్వీయ-అవగాహనను, ఆత్మగౌరవాన్ని మేల్కొల్పడం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తన 100 సంవత్సరాల ప్రయాణంలో సాధించిన అత్యంత ముఖ్యమైన విజయంగా ప్రధానమంత్రి అబివర్ణించారు. దేశంలోని అత్యంత మారుమూల ప్రాంతాల్లో ముఖ్యంగా దేశంలోని దాదాపు పది కోట్ల మంది గిరిజన సోదరీ సోదరులతో సంఘ్ నిరంతరం పనిచేస్తోందని పేర్కొన్నారు. మునుపటి ప్రభుత్వాలు తరచుగా ఈ వర్గాలను పట్టించుకోకపోయినా సంఘ్ వారి సంస్కృతి, పండగలు, భాషలు, సంప్రదాయాలకు ప్రాధాన్యమిచ్చిందన్నారు. సేవా భారతి, విద్యా భారతి, వనవాసి కళ్యాణ్ ఆశ్రమం వంటి సంస్థలు గిరిజన సాధికారతకు మూలస్తంభాలుగా మారాయన్నారు. నేడు గిరిజన వర్గాల్లో పెరుగుతున్న ఆత్మవిశ్వాసం వారి జీవితాలను మారుస్తోందని శ్రీ మోదీ ధ్రువీకరించారు.
దేశంలోని మారుమూల ప్రాంతాలకు చెందిన గిరిజన వర్గాల జీవితాలను మెరుగుపరచడానికి అవిశ్రాంతంగా పనిచేస్తున్న లక్షలాది మంది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్వచ్ఛంద సేవకులకు కృతజ్ఞతలు తెలిపిన ప్రధానమంత్రి.. వారి అంకితభావం దేశ సాంస్కృతిక గుర్తింపును కాపాడటంలో కీలక పాత్ర పోషించిందన్నారు. గిరిజన ప్రాంతాలు లక్ష్యంగా ఎదురైన సవాళ్లు, జరిగిన దోపిడీని ప్రస్తావిస్తూ.. సంఘ్ నిశ్శబ్దంగా, దృఢంగా తన త్యాగాలతో అటువంటి సంక్షోభాల నుంచి దేశాన్ని రక్షించే తన కర్తవ్యాన్ని దశాబ్దాలుగా నెరవేర్చుతోందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
సామాజిక, వర్గపరమైన వివక్షత, తిరోగమన ఆలోచనల వంటి లోతైన సామాజిక రుగ్మతలు చాలా కాలంగా హిందూ సమాజానికి తీవ్రమైన సవాళ్లను విసురుతున్నాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నిరంతరం కృషి చేస్తోందన్నారు. వార్ధాలోని సంఘ్ శిబిరాన్ని మహాత్మాగాంధీ సందర్శించిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన.. సమానత్వం, కరుణ, సామరస్యం అనే సంఘ్ భావనలను గాంధీజీ బహిరంగంగానే ప్రశంసించారని అన్నారు. డాక్టర్ హెడ్గేవార్ నుంచి నేటి వరకు సంఘ్‌లోని ప్రతి ఒక్క ప్రముఖులు, సర్‌సంఘ్‌చాలక్.. వివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారని ఆయన పేర్కొన్నారు. గౌరవ గురూజీ ఇచ్చిన "న హిందూ పతితో భవేత్" అనే భావనను నిరంతరం ముందుకు తీసుకెళ్లారన్న ఆయన.. దీని అర్థం ప్రతి హిందువు ఒకే కుటుంబంలో భాగమని, ఎవరూ తక్కువ లేదా అట్టడుగు వారు కాదని చెప్పారు. "అస్పృశ్యత పాపం కాకపోతే, ప్రపంచంలో ఏదీ పాపం కాదు" అని చెప్పిన పూజ్య బాలాసాహెబ్ దేవరస్‌ను ఆయన ఉటంకించారు. పూజ్యనీయులైన రజ్జు భయ్యా, సుదర్శన్ జీలు కూడా సరసంఘ్‌చాలక్‌గా పదవీకాలంలో ఈ భావనను ముందుకు తీసుకెళ్లారని ఆయన అన్నారు. ప్రస్తుత సర్‌సంఘ్‌చాలక్ శ్రీ మోహన్ భగవత్ జీ "ఒక బావి, ఒక ఆలయం, ఒక శ్మశానవాటిక" అనే దార్శనికతతో సామాజిక సామరస్యం కోసం స్పష్టమైన సమాజ లక్ష్యాన్ని నిర్దేశించారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఎలాంటి వివక్ష, విభజన, అసమ్మతి లేని సమాజాన్ని ప్రోత్సహిస్తూ ఈ సందేశాన్ని దేశంలోని ప్రతి మూలకు సంఘ్ తీసుకెళ్లిందని అన్నారు. సామరస్యం, సమ్మిళిత సమాజం కోసం సంకల్పానికి ఇదే పునాదని వ్యాఖ్యానించారు. దీనిని సంఘ్ నూతన శక్తితో బలోపేతం చేస్తూనే ఉంటుందని అన్నారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఒక శతాబ్దం కిందట ప్రారంభమైనప్పుడు ఉన్న అవసరాలు, పోరాటాలు భిన్నంగా ఉండేవని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. అప్పుడు శతాబ్దాల రాజకీయ అణచివేత నుంచి బయటపడేందుకు, సాంస్కృతిక విలువలను కాపాడుకోవడానికి భారతదేశం కృషి చేసిందన్నారు. నేడు భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారే దిశగా పయనిస్తోన్నందున, ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి సిద్ధంగా ఉన్నందున.. దేశం ముందున్న సవాళ్లు కూడా మారాయని అన్నారు. జనాభాలో ఎక్కువ శాతం పేదరికాన్ని అధిగమిస్తున్నారు.. కొత్త రంగాలు యువతకు అవకాశాలను సృష్టిస్తున్నాయి.. భారత్ ప్రపంచవ్యాప్తంగా దౌత్యం నుంచి పర్యావరణ విధానాల వరకు స్వరాన్ని వినిపిస్తోంది. ఆర్థికంగా విదేశాలపై ఆధారపడటం, జాతీయ ఐక్యతను దెబ్బతీసే కుట్రలు, జనాభాను మార్చే కుట్ర తదితర సవాళ్లు నేడు ఉన్నాయని తెలిపారు. ఈ సమస్యలను ప్రభుత్వం వేగంగా పరిష్కరిస్తోందన్న ఆయన.. ఒక ప్రధానమంత్రిగా ఈ విషయంలో సంతృప్తితో ఉన్నట్లు తెలిపారు. వీటిని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ గుర్తించడమే కాకుండా, ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి ఒక నిర్దిష్టమైన రోడ్‌మ్యాప్‌ను కూడా రూపొందించిందన్న ఆయన.. ఒక స్వయంసేవక్‌గా ఈ విషయంలో గర్వంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
స్వీయ అవగాహన, సామాజిక సామరస్యం, కుటుంబ జాగృతి, ప్రజా క్రమశిక్షణ, పర్యావరణ స్పృహ అనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు సంబంధించిన ఐదు పరివర్తనాత్మక భావనలు.. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కోవడానికి స్వయం సేవకులకు శక్తివంతమైన ప్రేరణలుగా పనిచేస్తాయని అన్నారు. స్వీయ-అవగాహన అంటే బానిసత్వ మనస్తత్వం నుంచి బయటపడటం, సొంత సాంస్కృతిక వారసత్వం- మాతృభాష పట్ల గర్వించడం అని మోదీ వివరించారు. స్వీయ-అవగాహన అంటే స్వదేశీని స్వీకరించడం అని కూడా ఆయన ప్రధానంగా చెప్పారు. స్వావలంబన అనేది ఇకమీదట ఒక ఎంపిక కాదన్న ఆయన.. దీనినొక అవసరంగా అభివర్ణించారు. సమష్టి సంకల్పంగా స్వదేశీ మంత్రాన్ని స్వీకరించాలని కోరిన ఆయన.. "వోకల్ ఫర్ లోకల్" కార్యక్రమం అద్భుతమైన విజయం సాధించేలా చేసేందుకు ప్రతి ఒక్కరూ పూర్తి శక్తితో పని చేయాలని కోరారు.
"సామాజిక సామరస్యాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఎల్లప్పుడూ ప్రాధాన్యతనిస్తోంది" అని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. అణగారిన వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా సామాజిక న్యాయాన్ని సాధించటం, జాతీయ ఐక్యతను బలోపేతం చేయటమే సామాజిక సామరస్యం అని అన్నారు. నేడు ఐక్యత, సంస్కృతితో పాటు వేర్పాటువాద సిద్ధాంతాలు, ప్రాంతీయవాదం నుంచి సామాజిక వర్గం- భాషాపరమైన వివాదాలు, బాహ్య శక్తులచే ప్రేరేపితమైన విభజన ధోరణుల వరకు భద్రత విషయంలో దేశం సవాళ్లను ఎదుర్కొంటోందని అన్నారు. భారత ఆత్మ ఎల్లప్పుడూ "భిన్నత్వంలో ఏకత్వం"లో ఉందన్న మోదీ.. ఈ భావన విచ్ఛిన్నం అయితే దేశ బలం తగ్గిపోతుందని హెచ్చరించారు. అందుకే ఈ ఆధారభూతమైన భావనను నిరంతరం బలోపేతం చేయవలసిన అవసరం ఉందని అన్నారు.
నేడు సామాజిక సామరస్యం జనాభాలో మార్పులు, చొరబాట్ల కారణంగా తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోందని.. ఇది అంతర్గత భద్రత, భవిష్యత్తు శాంతిని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తోందని ప్రధాని పేర్కొన్నారు. ఈ ఆందోళనే తనను ఎర్రకోట నుంచి జనాభా మిషన్‌ను ప్రకటించేలా చేసేందని తెలిపారు. ఈ ముప్పును ఎదుర్కోవడానికి అప్రమత్తత, దృఢ సంకల్పంతో కూడిన చర్యలు తీసుకోవాలని కోరారు.
నేడు కుటుంబ పరివర్తన అనేది అత్యవసరమని మోదీ ప్రధానంగా చెప్పారు. భారతీయ నాగరికతకు పునాదిగా నిలిచే, భారతీయ విలువల నుంచి ప్రేరణ పొందిన కుటుంబ సంస్కృతిని పెంపొందించటమే దీని ముఖ్య ఉద్దేశ్యం అని అన్నారు. కుటుంబ విలువను కాపాడటం, పెద్దలను గౌరవించడం, మహిళలను శక్తివంతం చేయడం, యువతలో విలువలను పెంపొందించడం, కుటుంబం పట్ల బాధ్యతలను నెరవేర్చడం వంటి అంశాల ప్రాముఖ్యతను వివరించారు. ఈ విషయంలో కుటుంబాలు, సమాజం రెండింటిలోనూ అవగాహన పెంచాల్సిన తక్షణ అవసరాన్ని తెలియజేశారు.
ప్రతి యుగంలోనూ మానవ క్రమశిక్షణ అనే బలమైన పునాదితో దేశాలు అభివృద్ధి చెందాయని ప్రధానమంత్రి చెప్పారు. క్రమశిక్షణ అంటే విధులు నిర్వర్తించే భావాన్ని పెంపొందించుకోవడం, ప్రతి ఒక్కరు తమ బాధ్యతల గురించి తెలుసుకునేలా చూసుకోవడమే అని అన్నారు. పరిశుభ్రతను ప్రోత్సహించడం, జాతీయ సంపదను గౌరవించడం, చట్టాలు- నిబంధనలను పాటించేలా చూడాలని పిలుపునిచ్చారు. ప్రజలందరూ విధులను నెరవేర్చటం అనేది రాజ్యాంగ స్ఫూర్తి అన్న ఆయన.. ఈ రాజ్యాంగ ధర్మాన్ని నిరంతరం బలోపేతం చేయాలని కోరారు.
పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రస్తుత, భవిష్యత్ తరాలకు చాలా అవసరమని.. ఇది మానవాళి భవిష్యత్తుతో నేరుగా ముడిపడి ఉందని ప్రధానమంత్రి చెప్పారు. ఆర్థిక వ్యవస్థ విషయంలోనే కాకుండా పర్యావరణంపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఆయన తెలిపారు. జల సంరక్షణ, హరిత ఇంధనం వంటి కార్యక్రమాలను ఈ దిశలో కీలకమైన మెట్లుగా వర్ణించారు.
“స్వీయ అవగాహన, సామాజిక సామరస్యం, కుటుంబ పరివర్తన, ప్రజా క్రమశిక్షణ, పర్యావరణ స్పృహ అనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు సంబంధించిన ఐదు పరివర్తనాత్మక భావనలు.. దేశ సామర్థ్యాన్ని పెంపొందించడానికి, భారత్ విభిన్న సవాళ్లను ఎదుర్కోవడంలో తోడ్పాటునందించేందుకు, 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్‌ను తయారుచేసేందుకు ఆధారభూతమైన మూల స్తంభాలుగా ఉపయోగపడే కీలకమైన సాధనాలు" అని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు.
2047లో భారతదేశం తాత్విక భావనలు, శాస్త్రం, సేవ, సామాజిక సామరస్యంతో రూపుదిద్దుకున్న ఒక అద్భుతమైన దేశంగా ఉంటుందని ప్రధానమంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఇది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ దార్శనికత, స్వయంసేవకులందరి సమష్టి కృషి, వారి గంభీరమైన సంకల్పం అని అన్నారు. దేశంపై అచంచలమైన విశ్వాసంతో తయారైన స్వయంసేవక్.. లోతైన సేవా స్ఫూర్తితో త్యాగం-సాధన అనే జ్వాలలో రూపుదిద్దుకుందని,.. విలువలు, క్రమశిక్షణలతో మలినం లేకుండా తయారైందని..జాతీయ విధిని జీవితంలోని అత్యున్నత విధిగా పరిగణించడం ద్వారా స్థిరంగా కొనసాగుతోందని ఆయన గుర్తు చేశారు. భారత మాతకు సేవ చేయాలనే గొప్ప ఆలోచనతో సంఘ్ ముడిపడి ఉందని అన్నారు.
"భారతీయ సంస్కృతి మూలాలను మరింత లోతుగా చేసి బలోపేతం చేయడమే సంఘ్ స్ఫూర్తి. సమాజంలో ఆత్మవిశ్వాసం, గర్వాన్ని నింపడమే దీని ప్రయత్నం. ప్రతి హృదయంలో ప్రజా సేవ అనే జ్వాలను రగిలించడం దీని లక్ష్యం. భారతీయ సమాజం సామాజిక న్యాయానికి చిహ్నంగా మారడమే దీని గమ్యం. ప్రపంచ వేదికపై భారతదేశ స్వరాన్ని పెంచటమే దీని మిషన్. దేశానికి సురక్షితమైన, ప్రకాశవంతమైన భవిష్యత్తును నిర్ధారించడమే దీని సంకల్పం" అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఈ చారిత్రాత్మక సందర్భంగా అందరికీ అభినందనలు తెలియజేస్తూ ప్రసంగాన్ని ముగించారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్, ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖ గుప్తా, ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ (ప్రధాన కార్యదర్శి) శ్రీ దత్తాత్రేయ హోసబాలే తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నేపథ్యం-
ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా దేశానికి ఆర్‌ఎస్‌ఎస్ చేసిన కృషిని తెలియజేసేలా ప్రత్యేకంగా రూపొందించిన స్మారక తపాలా బిళ్ల, నాణేన్ని ప్రధానమంత్రి విడుదల చేశారు.
1925లో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్.. ప్రజల్లో సాంస్కృతిక అవగాహన, క్రమశిక్షణ, సేవ- సామాజిక బాధ్యతను పెంపొందించే లక్ష్యంతో స్వచ్ఛంద సేవా సంస్థగా స్థాపించారు.
జాతీయ పునర్నిర్మాణం అనే భావనతో ప్రజలే పెంచి పోషించిన ప్రత్యేక ఉద్యమమే ఆర్ఎస్ఎస్. శతాబ్దాల విదేశీ పాలనకు వ్యతిరేకంగా వచ్చిన స్పందనే ఆర్‌ఎస్ఎస్ అని భావిస్తారు. ధర్మంలో పాతుకుపోయిన భారతదేశ జాతీయ వైభవం అనే దృక్పథానికి సంబంధించిన భావోద్వేగంతో సంఘ్ ఎదిగింది.
దేశభక్తి, జాతీయ వ్యక్తిత్వ నిర్మాణం అనేవి సంఘ్ ప్రధాన ప్రాధాన్యతలు. ఇది మాతృభూమి పట్ల భక్తి, క్రమశిక్షణ, స్వీయ నిగ్రహం, ధైర్యం, వీరత్వాన్ని పెంపొందించడానికి కృషి చేస్తోంది. సంఘ్ అంతిమ లక్ష్యం భారత "సర్వాంగీన ఉన్నతి" (సర్వతోముఖాభివృద్ధి). దీనికి ప్రతి స్వయంసేవక్ అంకితం అవుతుంటారు.
గత శతాబ్దంలో విద్య, ఆరోగ్యం, సామాజిక సంక్షేమం, విపత్తు సహాయ కార్యక్రమాలలో ఆర్ఎస్ఎస్ గణనీయమైన పాత్ర పోషించింది. వరదలు, భూకంపాలు, తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆర్ఎస్ఎస్ స్వచ్ఛంద సేవకులు సహాయ, పునరావాస కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. అదనంగా ఆర్ఎస్ఎస్‌కు ఉన్న వివిధ అనుబంధ సంస్థలు యువత, మహిళలు, రైతులను శక్తిమంతం చేయడం, ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, స్థానిక ప్రజలను బలోపేతం చేయడంలో దోహదపడ్డాయి.
ఈ శతాబ్ది ఉత్సవాలు ఆర్‌ఎస్‌ఎస్ చారిత్రక విజయాలను గౌరవించడమే కాకుండా భారతదేశ సాంస్కృతిక ప్రయాణానికి, జాతీయ ఐక్యత సందేశానికి సంఘం చేసిన శాశ్వత సహకారాన్ని కూడా తెలియజేస్తున్నాయి.
***
(Release ID: 2173834)
Visitor Counter : 5