ప్రధాన మంత్రి కార్యాలయం
ముంబయిలో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
Posted On:
13 JUL 2024 8:28PM by PIB Hyderabad
మహారాష్ట్ర గవర్నర్ శ్రీ రమేష్ బైస్ గారు, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే గారు, నా కేబినెట్ సహచరులు పీయూష్ గోయల్ గారు, రాందాస్ అథవాలే గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ గారు, అజిత్ దాదా పవార్ గారు, రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు మంగళ్ ప్రభాత్ గారు, దీపక్ కే సర్కార్ గారు, ఇతర ప్రముఖులు, సోదరీ సోదరులారా!
మహారాష్ట్రలోని నా సోదరీ సోదరులందరికీ శుభాకాంక్షలు!
ఈ రోజు మహారాష్ట్ర, ముంబయిలలో రూ.30,000 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసే భాగ్యం నాకు లభించింది. ఈ ప్రాజెక్టులు ముంబయి, దాని పరిసర ప్రాంతాల కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తాయి. రోడ్డు, రైలు ప్రాజెక్టులతో పాటు మహారాష్ట్ర యువత నైపుణ్యాభివృద్ధి కోసం ఒక ప్రధాన పథకం కూడా ఇందులో ఉంది. ఇది అనేక ఉద్యోగ అవకాశాలను అందిస్తుంది. మీరు దీని గురించి వార్తాపత్రికల్లో చదివి ఉండవచ్చు.. టీవీలోనూ చూసి ఉండవచ్చు. రెండు-మూడు వారాల కిందటే కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్ర కోసం వధావన్ పోర్టు ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ రూ.76,000 కోట్ల ప్రాజెక్ట్ ఈ ప్రాంతంలో 10 లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టిస్తుంది.
మిత్రులారా,
గత నెల రోజులుగా దేశవిదేశాలకు చెందిన పెట్టుబడిదారులు ముంబయిలో సంబరాలు జరుపుకొంటున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి పెట్టుబడిదారుడు మూడోసారి మన ప్రభుత్వం అధికారం చేపట్టడం పట్ల ఉత్సాహంగా ఉన్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వం మాత్రమే స్థిరత్వాన్ని అందించగలదని ప్రజలు గుర్తించారు. మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. ఈ మూడో పదవీకాలంలో ఎన్‌డీఏ ప్రభుత్వం మూడు రెట్లు వేగంగా పనిచేస్తుందని నేను ప్రతిజ్ఞ చేసాను. ఈ వాగ్దానం ఫలించడం మనం ఈ రోజు చూస్తున్నాం.
మిత్రులారా,
మహారాష్ట్రకు అద్భుతమైన చరిత్ర, దృఢమైన వర్తమానం, సుసంపన్న భవిష్యత్తు కల ఉన్నాయి. అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణంలో మహారాష్ట్ర పాత్ర కీలకమైనది. పారిశ్రామిక బలం, వ్యవసాయ శక్తి, బలీయమైన ఆర్థిక రంగం ఈ రాష్ట్రం సొంతం. ఈ శక్తి ముంబయిని దేశ ఆర్థిక రాజధానిగా నిలిపింది. ఈ శక్తిని ఉపయోగించుకుని మహారాష్ట్రను ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తి కేంద్రంగా మార్చడం.. ముంబయిని ప్రపంచ ఫిన్‌టెక్ రాజధానిగా మార్చడం నా లక్ష్యం. పర్యాటకం పరంగా భారత్‌లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఛత్రపతి శివాజీ మహారాజ్ పరాక్రమానికి ప్రతీకలుగా నిలిచే అద్భుతమైన కోటలు.. కొంకణ్‌లోని మంత్రముగ్ధులను చేసే సముద్ర తీరాలు, సహ్యాద్రి కొండల మీదుగా ఉత్కంఠభరితమైన అనుభూతి కలిగించే ప్రయాణాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కాన్ఫరెన్స్ టూరిజం, మెడికల్ టూరిజంకు అపారమైన అవకాశాలున్నాయి. భారత్ అభివృద్ధిలో మహారాష్ట్ర నూతన అధ్యాయాన్ని లిఖించడానికి సిద్ధంగా ఉంది. మనమంతా ఈ ప్రయాణంలో భాగమయ్యాం. నేటి కార్యక్రమం ఈ మహాయుతి ప్రభుత్వ మహోన్నత లక్ష్యాలకు అంకితమైంది.
మిత్రులారా,
21వ శతాబ్దపు భారత ఆకాంక్షలు ప్రస్తుతం అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. ఈ శతాబ్దంలో దాదాపు 25 సంవత్సరాలు గడిచిపోయాయి. మన దేశ ప్రజలు వేగవంతమైన అభివృద్ధి కోసం ఆసక్తిగా ఉన్నారు. రాబోయే 25 సంవత్సరాల్లో భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంతో ఉన్నారు. ఈ ప్రయత్నంలో ప్రత్యేకించి ముంబయి, సాధారణంగానే మహారాష్ట్ర పాత్ర కీలకం. మహారాష్ట్ర, ముంబయి వాసుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే మా లక్ష్యం. దీని కోసం ముంబయి చుట్టుపక్కల ప్రాంతాల్లో కనెక్టివిటీని పెంచేందుకు మేం సమష్టి ప్రయత్నాలు చేస్తున్నాం. ముంబయిలోని కోస్టల్ రోడ్, అటల్ సేతు ఇప్పుడు పూర్తయ్యాయి. అటల్ సేతు నిర్మాణ సమయంలో చాలా వ్యతిరేకత ఎదురైంది.. దానిని ఆలస్యం చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. ఈ రోజు ప్రతి ఒక్కరూ దాని అపారమైన ప్రయోజనాలను చూస్తున్నారు. ప్రతిరోజూ దాదాపు 20,000 వాహనాలు దీనిని ఉపయోగిస్తున్నాయనీ, ప్రతిరోజూ 20-25 లక్షల రూపాయల విలువైన ఇంధనం ఆదా అవుతోందని నాకు సమాచారం అందింది. పన్వేల్ చేరుకోవడానికి ఇప్పుడు దాదాపు 45 నిమిషాల సమయం తగ్గింది.. ఫలితంగా సమయం ఆదా అవుతోంది, పర్యావరణ ప్రయోజనాలూ లభిస్తున్నాయి. ఈ విధానంతో మేం ముంబయి రవాణా వ్యవస్థను ఆధునికీకరిస్తున్నాం. ముంబయి మెట్రో విస్తరణ కూడా వేగంగా జరుగుతోంది. పదేళ్ల కిందట ముంబయిలో కేవలం 8 కిలోమీటర్ల మెట్రో లైన్ మాత్రమే ఉండేది.. ఈ రోజు అది దాదాపు 80 కిలోమీటర్లకు విస్తరించింది. అదనంగా ముంబయిలో దాదాపు 200 కిలోమీటర్ల మెట్రో నెట్‌వర్క్ పనులూ జరుగుతున్నాయి.
మిత్రులారా,
భారతీయ రైల్వేల అద్భుత పరివర్తన ముంబయి, మహారాష్ట్రలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తోంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, నాగ్‌పూర్, అజ్ని స్టేషన్ల పునరాభివృద్ధి వేగంగా జరుగుతోంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, లోకమాన్య తిలక్ స్టేషన్‌లలో కొత్త ప్లాట్‌ఫారమ్‌లు ప్రారంభమయ్యాయి. ఈ స్టేషన్ల నుంచి 24 కోచ్‌లు ఉండే పొడవైన రైళ్లను నడపడానికి ఇది వీలు కల్పిస్తుంది.
మిత్రులారా,
గత దశాబ్దంలో మహారాష్ట్రలో జాతీయ రహదారుల పొడవు మూడు రెట్లు పెరిగింది. గోరేగావ్-ములుంద్ లింక్ రోడ్ ప్రాజెక్ట్ అభివృద్ధి-పర్యావరణం మధ్య సామరస్యాన్ని ప్రదర్శిస్తుంది. థానే నుంచి బోరివలి వరకు జంట సొరంగ ప్రాజెక్టు పనులు కూడా ఈ రోజు ప్రారంభమవుతున్నాయి. ఇది ఈ రెండు ప్రదేశాల మధ్య ప్రయాణ సమయాన్ని కేవలం కొద్ది నిమిషాలకు తగ్గిస్తుంది. మన తీర్థయాత్ర స్థలాలను అభివృద్ధి చేయడానికి, యాత్రికులకు అందుబాటులో ఉన్న సదుపాయాలను మెరుగుపర్చడానికి ఎన్‌డీఏ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. ప్రస్తుతం లక్షలాది మంది భక్తులు పండరీపూర్ వారీలో భక్తిశ్రద్ధలతో పాలుపంచుకుంటున్నారు. పూణే నుంచి పండరీపూర్ వరకు ప్రయాణం సజావుగా సాగేందుకు, భక్తులకు తగిన వసతులు అందుబాటులో ఉంచేందుకు ఎన్‌డీఏ ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. సంత్ జ్ఞానేశ్వర్ పాల్ఖి మార్గ్‌లో సుమారు 200 కిలోమీటర్ల విస్తీర్ణంలో పనులు పూర్తయ్యాయి. సంత్ తుకారాం పాల్ఖి మార్గ్‌లో 110 కిలోమీటర్లకు పైగా పనులు పూర్తయ్యాయి. ఈ రెండు మార్గాలూ త్వరలోనే యాత్రికులకు అందుబాటులోకి వస్తాయి. (ప్రధానమంత్రి మరాఠీ భాషలో కొన్ని వ్యాఖ్యలు చేశారు.)
సోదరీ సోదరులారా,
ఇటువంటి కనెక్టివిటీ మౌలిక సదుపాయాలు పర్యాటకం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తున్నాయి. కొత్త ఉపాధి అవకాశాలనూ సృష్టిస్తున్నాయి. మెరుగైన కనెక్టివిటీ మహిళలకు సౌలభ్యాన్ని, భద్రతనూ అందిస్తుంది.. వారి గౌరవాన్ని పెంచుతుంది. ఎన్‌డీఏ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాలు పేదలు, రైతులు, మహిళలు, యువతకు సాధికారత కల్పిస్తున్నాయి. మహారాష్ట్ర మహాయుతి ప్రభుత్వం కూడా అదే నిబద్ధతను పంచుకుంటోంది. ప్రతి సంవత్సరం 10 లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ అందించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతిజ్ఞ చేయడం నాకు సంతోషంగా ఉంది. ప్రధానమంత్రి యువ కార్య ప్రశిక్షణ యోజన కింద శిక్షణ సమయంలో ఉపకార వేతనాలనూ అందిస్తారు.
మిత్రులారా,
నైపుణ్యాభివృద్ధి, పెద్ద ఎత్తున ఉపాధి దేశానికి చాలా అవసరం. ఈ లక్ష్యాల కోసం మా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. కోవిడ్-19 వంటి పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ గత 4-5 సంవత్సరాలుగా భారత్ రికార్డు స్థాయిలో ఉపాధిని సాధించింది. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉపాధిపై ఒక వివరణాత్మక నివేదికను విడుదల చేసింది. గత 3-4 సంవత్సరాల్లో దేశంలో సుమారు 8 కోట్ల కొత్త ఉద్యోగాలు సృష్టించినట్లు ఈ నివేదిక పేర్కొన్నది. ఈ గణాంకాలు ఉపాధి గురించి తప్పుడు కథనాలను వ్యాప్తి చేసేవారి నోరు మూయిస్తాయి. ఇటువంటి తప్పుడు కథనాలు పెట్టుబడి, మౌలిక సదుపాయాల అభివృద్ధికి, దేశ పురోగతికీ హానికరం. వారి ప్రతి విధానం యువతకు ద్రోహం చేయడం, ఉపాధిని అడ్డుకోవడం లక్ష్యంగా ఉంది. వారి నిజమైన ఉద్దేశాలు ఇప్పుడు బహిర్గతమవుతున్నాయి. భారత ప్రజలు తెలివైనవారు.. అందుకే వారి అబద్ధాలు, మోసాలను తిరస్కరిస్తున్నారు. వంతెన నిర్మించినప్పుడల్లా.. రైల్వే ట్రాక్ వేసినప్పుడల్లా.. రహదారి నిర్మించినప్పుడల్లా.. స్థానికంగా రైలు కోచ్ తయారు చేసినప్పుడల్లా ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగం పెరిగేకొద్దీ ఉద్యోగాల సృష్టి రేటు కూడా పెరుగుతుంది. రాబోయే కాలంలో మరిన్ని కొత్త పెట్టుబడులతో ఈ అవకాశాలు మరింత పెరుగుతాయి.
మిత్రులారా,
ఎన్‌డీఏ ప్రభుత్వ అభివృద్ధి నమూనా సమాజంలోని అణగారిన వర్గాలకు ప్రాధాన్యమిస్తుంది. దశాబ్దాలుగా సామాజికంగా అట్టడుగున ఉన్న వారిపై మేం దృష్టి సారించాం. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పేదలకు పక్కా ఇళ్లకు సంబంధించి మేం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నాం. రైతుల సంక్షేమం కోసం ముఖ్యమైన చర్యలు తీసుకున్నాం. ఇప్పటివరకు 4 కోట్ల మంది పేదలకు పక్కా ఇళ్లను అందించాం. రాబోయే సంవత్సరాల్లో మహారాష్ట్రలోని లక్షలాది మంది పేదలు, దళితులు, వెనకబడిన, గిరిజన కుటుంబాలు సహా 3 కోట్ల మంది పేద కుటుంబాలకు పక్కా ఇళ్లను అందిస్తాం. మంచి ఇల్లు ప్రతి కుటుంబానికి అవసరం మాత్రమే కాదు.. కుటుంబ గౌరవానికి సంబంధించినది. అందుకే నగరాల్లో నివసిస్తున్న పేదలు, మధ్యతరగతి వారి ఇంటి కలను నెరవేర్చడానికి మేం కృషి చేస్తున్నాం.
మిత్రులారా,
వీధి వ్యాపారులు గౌరవప్రదమైన జీవితాలను గడిపేలా చేసేందుకు మేం కట్టుబడి ఉన్నాం. ఈ విషయంలో స్వనిధి యోజన వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంది. ఇప్పటివరకు ఈ పథకం కింద 90 లక్షల రుణాలు మంజూరయ్యాయి. వీటిలో దాదాపు 13 లక్షల రుణాలు మహారాష్ట్రలోని విక్రేతలకు వెళ్ళాయి. కేవలం ముంబయిలోనే 1.5 లక్షల మంది వీధి వ్యాపారులు స్వనిధి యోజన ద్వారా ప్రయోజనం పొందారు. స్వనిధి ద్వారా బ్యాంకుల నుంచి లభించే సహాయం వారి వ్యాపారాలను బలోపేతం చేస్తోంది. ఈ పథకంతో సంబంధం ఉన్న వారి నెలవారీ ఆదాయం సుమారు 2,000 రూపాయలు పెరిగింది.. అంటే సంవత్సరానికి 20,000-25,000 రూపాయల అదనపు ఆదాయం వారికి లభిస్తున్నట్లు అధ్యయనాలు సూచిస్తున్నాయి.
మిత్రులారా,
స్వనిధి పథకం గురించి మరో ముఖ్యమైన విషయాన్ని నేను ప్రధానంగా ప్రస్తావించాలనుకుంటున్నాను. ఈ రుణాలను పొందినవారు వాటిని పూర్తిగా తిరిగి చెల్లిస్తున్నారు. ఇది నా పేద సోదరీ సోదరుల ఆత్మగౌరవాన్ని, సమగ్రతను ప్రతిబింబిస్తుంది. విశేషమేమిటంటే.. స్వనిధి లబ్ధిదారులు ఇప్పటివరకు రూ. 3.25 లక్షల కోట్ల విలువైన డిజిటల్ లావాదేవీలు నిర్వహించారు. ఇది డిజిటల్ ఇండియాను శక్తిమంతం చేయడమే కాకుండా మన దేశానికి కొత్త గుర్తింపును కూడా ఇస్తుంది.
మిత్రులారా,
దేశంలో సాంస్కృతిక, సామాజిక, జాతీయ చైతన్యానికి మహారాష్ట్ర గణనీయంగా దోహదపడింది. ఈ భూమి ఛత్రపతి శివాజీ మహారాజ్, బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే, అన్నాభావు సాథే, లోకమాన్య తిలక్, వీర్ సావర్కర్ వంటి అనేక మంది మహనీయుల వారసత్వాలకు నిలయం. ఈ ప్రముఖ వ్యక్తులు ఊహించిన సామరస్యపూర్వక సమాజం, బలమైన దేశం కోసం మనం కృషి చేయాలి. శ్రేయస్సుకు మార్గం సామరస్యం, సద్భావనలోనే ఉందని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. ఈ భావనతోనే ఈ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా ధన్యవాదాలు!
భారత్ మాతా కీ జై!
భారత్ మాతా కీ జై!
భారత్ మాతా కీ జై!
చాలా ధన్యవాదాలు.
గమనిక: ప్రధానమంత్రి హిందీలో చేసిన ప్రసంగానికి అనువాదం.
***
(Release ID: 2173386)
Visitor Counter : 11
Read this release in:
English
,
Urdu
,
हिन्दी
,
Hindi_MP
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam