ప్రధాన మంత్రి కార్యాలయం
కేరళలోని విక్రమ్ సారాభాయి అంతరిక్ష కేంద్రంలో వివిధ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగం
Posted On:
27 FEB 2024 5:05PM by PIB Hyderabad
కేరళ గవర్నర్ శ్రీ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి శ్రీ పినరయి విజయన్, నా సహచరుడు, సహాయ మంత్రి శ్రీ వి. మురళీధరన్, ఇస్రో కుటుంబ సభ్యులందరికీ... నమస్కారం!
నా ప్రసంగాన్ని ప్రారంభించడానికి ముందు.. లేచి నిలబడి కరతాళధ్వనులతో ధీరులైన ఈ నలుగురు మిత్రులనూ సత్కరించాలని మీ అందరినీ కోరుతున్నాను.
భారత్ మాతా కీ – జై!
భారత్ మాతా కీ – జై!
భారత్ మాతా కీ – జై!
భారత్ మాతా కీ – జై!
ధన్యవాదాలు.
వర్తమానాన్ని మాత్రమే కాదు.. భావి తరాలకూ మార్గనిర్దేశం చేసే క్షణాలు ప్రతీ దేశ అభివృద్ధి ప్రస్థానంలోనూ ఉంటాయి. ఈ రోజు భారత్‌కు అలాంటిదే. మన ప్రస్తుత తరం ఎంతో అదృష్టానికి నోచుకుంది. నీరు, భూమి, ఆకాశం, అంతరిక్షాల్లో చరిత్రాత్మక విజయాలు సాధించి ప్రశంసలు పొందుతోంది. ఇది కొత్త శకానికి నాంది అని కొంతకాలం కిందటే అయోధ్యలో నేను చెప్పాను. ఈ కొత్త శకంలో భారత్ ఎప్పటికప్పుడు అంతర్జాతీయ యవనికపై తన స్థానాన్ని మెరుగుపరచుకుంటోంది. మన అంతరిక్ష కార్యక్రమంలోనూ ఇది స్పష్టంగా కనిపిస్తుంది.
మిత్రులారా,
చంద్రుడి దక్షిణ ధ్రువంపై మువ్వన్నెలను రెపరెపలాడించిన మొదటి దేశంగా గతేడాది భారత్ అవతరించింది. ఆ శివశక్తి పాయింట్ నేడు ప్రపంచం మొత్తానికీ భారత్ సామర్థ్యాన్ని పరిచయం చేస్తోంది. విక్రమ్ సారాభాయి అంతరిక్ష కేంద్రంలో మరో చరిత్రాత్మక ప్రయాణాన్ని నేడు మనందరం వీక్షిస్తున్నాం. కొద్దిసేపటి కిందటే.. మొదటిసారిగా నలుగురు గగన్‌యాన్ వ్యోమగాములు దేశానికి పరిచయమయ్యారు. వీరు కేవలం నలుగురు వ్యక్తులో, నాలుగు పేర్లో కాదు.. 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను అంతరిక్షంలోకి మోసుకెళ్తున్న శక్తులు. 40 ఏళ్ల తర్వాత ఓ భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్తున్నాడు. కానీ ఈసారి.. సమయం మనది, సన్నాహాలు మనవి, రాకెట్ కూడా మనదే. నేడు ఈ వ్యోమగాములను కలిసి, వారితో మాట్లాడి, దేశ ప్రజలకు వారిని పరిచయం చేసే అవకాశం లభించినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈ మిత్రులకు యావద్దేశం తరఫునా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ 21వ శతాబ్దిలో భారత ఘన విజయంలో మీ పేరూ ఇప్పుడు ప్రత్యేకంగా నిలుస్తుంది.
మీపైనే నేటి భారత్ నమ్మకమంతా. నేటి భారత శౌర్యం, పరాక్రమం, క్రమశిక్షణ మీలో మూర్తీభవించాయి. దేశ కీర్తిప్రతిష్ఠలను ద్విగుణీకృతం చేయడానికి, అంతరిక్షంలో మువ్వన్నెలను రెపరెపలాడించడానికి కొన్నేళ్లుగా మీరు కృషి చేస్తున్నారు. సవాళ్లకే సవాలు విసిరే భారత ‘అమృత’ తరానికి ప్రతినిధులు మీరు. కఠినమైన మీ శిక్షణ కార్యక్రమంలో యోగా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఆరోగ్యకరమైన మనస్సూ, ఆరోగ్యకరమైన శరీరమూ రెండింటి సమన్వయం ఈ మిషన్‌లో కీలకం. పట్టుదలతో ఉండండి.. బలంగా నిలవండి. దేశ ప్రజల ఆశీస్సులు మీతో ఉన్నాయి. వారంతా మీకు శుభాకాంక్షలు చెబుతున్నారు. మీ శిక్షణ కార్యక్రమంలో పాలుపంచుకున్న ఇస్రో, గగన్‌యాన్ ప్రాజెక్టు సహచరులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
అయితే, నాకు కొన్ని ఆందోళనలూ ఉన్నాయి. అవి కొందరికి మింగుడుపడకపోవచ్చు. దేశ ప్రజలకు, ముఖ్యంగా మీడియాకు నా హృదయపూర్వక విజ్ఞప్తి... ఈ నలుగురూ కొన్నేళ్లుగా ఎలాంటి గుర్తింపు లేకుండానే నిరంతరం సాధన చేస్తున్నారు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. అనేక క్లిష్టమైన సవాళ్లను వారు ఎదుర్కోవాల్సి ఉంది. శారీరకంగానూ మానసికంగానూ వారు తమను తాము మరింత సన్నద్ధం చేసుకోవాల్సిన అవసరముంది. అయితే, ఈ నలుగురు వ్యోమగాములూ ఇప్పుడు సెలెబ్రిటీలయ్యారు. వారు ఎక్కడికైనా వెళ్లొచ్చు, ఎవరైనా వారి ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి ఉత్సాహం చూపొచ్చు, సెల్ఫీనో ఫొటోనో తీసుకోవాలనీ అనుకుంటారు. మీడియా ప్రతినిధులూ మైకులు పట్టుకుని నిలబడతారు. వారి కుటుంబాలు ఇబ్బందిగా భావించే అవకాశం ఉంటుంది. “వారి బాల్యం ఎలా గడిచింది? ఇక్కడివరకు ఎలా వచ్చారు?” వంటి ప్రశ్నలతో వాళ్ల గురువులను, పాఠశాలలను వెతకడం మొదలుపెడతారు. క్లుప్తంగా చెప్పాలంటే, స్వీయ క్రమశిక్షణతో సాగే వారి ప్రయాణంలో, ఇది అడ్డంకులను కలిగించే అవకాశముంది.
అందుకే నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను.. అసలు కథ ఇప్పుడే మొదలవుతోంది. మనం వారికి ఎంతగా అండగా నిలిస్తే, వారి కుటుంబాలకు ఎంతగా సహకారాన్ని అందిస్తే.. వారు అన్ని తక్కువ చిక్కులను ఎదుర్కొంటారు. చేతిలో త్రివర్ణ పతాకం, ఎదుట నిలిచి ఉన్న అంతరిక్షం, 140 కోట్ల భారతీయుల కలలు... ప్రస్తుతానికి వారి దృష్టంతా వాటిపైనే ఉండనివ్వండి. మన సంకల్పమూ, మన ఉద్వేగమూ కూడా అదే. వీలైనంత వరకు సానుకూల వాతావరణం కల్పించాలి. దేశ ప్రజల మద్దతు చాలా కీలకమని నేను భావిస్తున్నాను. ఇప్పటివరకూ, వారి పేర్లు బయటపడే వరకూ అంతా సజావుగా సాగింది. కానీ ఇప్పుడు వారికి కొన్ని సవాళ్లు ఎదురు కావచ్చు. కొన్నిసార్లు వాళ్ళు కూడా ‘‘ఓ సెల్ఫీ తీసుకుందాం, నష్టమేముంది?’’ అనుకోవచ్చు. కానీ వీటన్నింటినీ మనం అధిగమించాలి.
మిత్రులారా,
ఈ కార్యక్రమానికి ముందే గగన్‌యాన్ గురించి వివరణాత్మక సమాచారం నాకు అందింది. వివిధ పరికరాలు, వాటి పనితీరు గురించి సమాచారాన్ని నాకు చెప్పారు. గగన్యాన్లో ఉపయోగించిన పరికరాల్లో ఎక్కువ భాగం భారత్‌లోనే తయారయ్యాయని తెలిసి చాలా సంతోషించాను. ఓవైపు ప్రపంచంలో తొలి మూడు అగ్రగామి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగేలా భారత్ పురోగమిస్తున్న ఈ తరుణంలో.. మరోవైపు ఈ గగన్‌యాన్ మిషన్ మన అంతరిక్ష రంగాన్ని కూడా కొత్త శిఖరాలకు చేర్చబోతోంది. ఇది యాదృచ్చికమే అయినా, అద్భుతం. అనేక ప్రాజెక్టులను కూడా నేడు ఇక్కడ ప్రారంభించాం. ఇది ప్రపంచ స్థాయి సాంకేతిక రంగంలో దేశ సామర్థ్యాలను పెంచడమే కాకుండా, ఉపాధికి కొత్త అవకాశాలనూ సృష్టిస్తుంది.
మిత్రులారా,
అంతరిక్ష రంగంలో మహిళా శక్తికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. మహిళా శాస్త్రవేత్తలు లేకుండా చంద్రయాన్, గగన్ యాన్ వంటి ఏ మిషన్ ను ఊహించలేం. ఇవాళ 500 మందికి పైగా మహిళలు ఇస్రోలో నాయకత్వ పదవుల్లో ఉన్నారు. ఇక్కడున్న మహిళా శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, ఇంజినీర్లందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. కానీ, ఇది పురుషులను బాధించకూడదని ఆశిస్తున్నాను. వారు నిరంతరం ప్రశంసలు అందుకుంటూనే ఉంటారు.
మిత్రులారా,
యువతలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచేందుకు భారత అంతరిక్ష రంగం అందించిన సహకారానికి తగిన గుర్తింపు లభించలేదు.ఇస్రో విజయాన్ని చూసి, చాలా మంది పిల్లలు, పెద్దయ్యాక శాస్త్రవేత్త అవ్వాలనుకుంటారు. రాకెట్ కౌంట్ డౌన్, అది ఆకాశంలోకి దూసుకెళ్లటం లక్షలాది మంది పిల్లలకు స్ఫూర్తినిస్తుంది. ప్రతి ఇంట్లో పేపర్ విమానాలు తయారుచేసి ఎగరేసే ఏరోనాటికల్ ఇంజినీర్లు, మీలాంటి ఇంజినీర్, శాస్త్రవేత్తలాగా అవ్వాలని కోరుకుంటారు. లక్ష్యాన్ని సాధించాలన్న యువతలోని ఉత్సహమే ఏ దేశానికైనా గొప్ప ఆస్తి. చంద్రయాన్-2 ల్యాండింగ్ సమయం నాకు గుర్తుంది. దేశవ్యాప్తంగా పిల్లలు ఆ క్షణాన్ని వీక్షించారు. దాన్నుంచి వాళ్లు ఎంతో నేర్చుకున్నారు. గతేడాది ఆగస్ట్ 23న చంద్రయాన్ ల్యాండింగ్ విజయవంతం కావటం యువతలో నూతనోత్సాహాన్ని నింపింది. ఆరోజును మేం అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించాం. మీ అందరి భాగస్వామ్యంతో దేశ అంతరిక్ష రంగం ఈ విజయాన్ని సాధించింది. అంతరిక్ష రంగంలో మనం ఎన్నో రికార్డులు సృష్టించాం. మొదటి ప్రయత్నంలోనే అంగారక గ్రహాన్ని చేరటంలో మనం విజయం సాధించాం. ఒకే మిషన్ ద్వారా వందకు పైగా ఉపగ్రహాలను ప్రయోగించిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. చంద్రయాన్ విజయం తర్వాత కూడా, మీరు అనేక విజయాలు సాధించారు. భూమి నుంచి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో ఆదిత్య L1ని విజయవంతంగా ప్రవేశపెట్టారు. ప్రపంచంలోని కొన్ని దేశాలు మాత్రమే ఈ ఘనతను సాధించాయి. 2024 ప్రారంభమైన కొన్ని వారాల్లోనే ఎక్స్ పోశాట్, ఇన్ శాట్-3 డీఎస్ ప్రయోగాలతో మీరు విజయం సాధించారు.
మిత్రులారా,
మీరంతా భవిష్యత్తు కోసం కొత్త అవకాశ మార్గాలను చూపుతున్నారు. వచ్చే పదేళ్లలో భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ దు రెట్లు పెరిగి, 44 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. అంతరిక్ష రంగంలో ప్రధాన ప్రపంచ వాణిజ్య కేంద్రంగా భారత్ మారనుంది. రాబోయే కొన్నేళ్లలో మనం మరోసారి చంద్రునిపైకి వెళ్తాం. ఆ విజయం తర్వాత మరిన్ని లక్ష్యాలను నిర్దేశించుకుంటాం. మన మిషన్లు సాంకేతికత పరంగా మరిన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మనం చంద్రుడి ఉపరితలం నుంచి నమూనాలను సేకరించి, భూమిపైకి తీసుకువస్తాం. దీనివల్ల చంద్రుని గురించి మనకు మరింత అవగాహన పెరుగుతుంది. శుక్ర గ్రహంపై పరిశోధన కూడా ఇస్రో లక్ష్యాల్లో ఒకటి. 2035 నాటికి అంతరిక్షంలో సొంత అంతరిక్ష కేంద్రాన్ని భారత్ ఏర్పాటు చేసుకుంటుంది. ఇది విశ్వానికి సంబంధించి మనకు తెలియని ఎన్నో విషయాలను అన్వేషించటంలో తోడ్పడుతుంది. ఇది మాత్రమే కాక, 'అమృత్ కాల్'లో భాగంగా భారత్ సొంత రాకెట్ ద్వారా భారత వ్యోమగామి చంద్రునిపై అడుగుపెడతారు.
మిత్రులారా,
21వ శతాబ్దంలో అభివృద్ధి చెందుతున్న భారత్, దాని సామార్థ్యంతో ప్రపంచాన్ని అబ్బురపరుస్తోంది. గత పదేళ్లలో మేం దాదాపు 400 ఉపగ్రహాలను ప్రయోగించగా, అంతకుముందు పదేళ్లలో కేవలం 33 ఉపగ్రహాలను మాత్రమే ప్రయోగించారు. పదేళ్ల కిందట దేశంలో ఒకటి, రెండు అంకుర సంస్థలు మాత్రమే ఉండేవి. ఈ రోజు అవి రెండు వందలకు చేరుకున్నాయి. వీటిలో ఎక్కువగా యువత ప్రారంభించినవే. వారిలో కొందరు మన మధ్యే ఉన్నారు. వారి దార్శనికత, ప్రతిభ, సంకల్పాన్ని నేను అభినందిస్తున్నాను. అంతరిక్ష రంగంలో ఇటీవలి సంస్కరణలు ఈ రంగానికి కొత్త ఊపునిచ్చాయి. గతవారంలో అంతరిక్ష రంగంలో ఎఫ్ డీఐ విధానాన్ని మేం తీసుకువచ్చాం. ఇది ఈ రంగంలో 100 శాతం విదేశీ పెట్టుబడులను అనుమతిస్తుంది. ఈ సంస్కరణ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రధాన అంతరిక్ష సంస్థలు భారత్ కు రావటమే కాక, ఇక్కడి యువత, తమ ప్రతిభను ప్రపంచానికి చూపే అవకాశం లభిస్తుంది.
మిత్రులారా,
2047 కల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలని మనమంతా నిర్ణయించుకుందాం. ఈ లక్ష్య సాధనలో అంతరిక్ష రంగం కీలక పాత్ర పోషిస్తుంది. స్పేస్ సైన్స్ అనేది కేవలం రాకెట్ సైన్స్ మాత్రమే కాదు.. గొప్ప సామాజిక శాస్త్రం. అంతరిక్ష సాంకేతికత ద్వారా సమాజం, ప్రతి పౌరుడు ప్రయోజనం పొందుతారు. మన రోజువారీ జీవన విధానంలో అంతరిక్ష సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుంది. పంటల పర్యవేక్షణ, వాతావరణ సూచనలు అందించటం, తుఫాన్లు, ఇతర విపత్తులు, నీటి వనరులు, డ్రైవింగ్ సమయంలో ఉపయోగించే మ్యాప్స్, అనేక పనులు ఉపగ్రహ డేటా ద్వారా చేయగలుగుతాం. లక్షలాది మంది భారత మత్స్యకారులు 'నావిక్' ఉపగ్రహ వ్యవస్థ ద్వారా కచ్చితమైన సమాచారాన్ని పొందుతున్నారు. సరిహద్దుల రక్షణలో మాత్రమే కాక, మారుమూల ప్రాంతాల్లో విద్య, కమ్యూనికేషన్, ఆరోగ్య సేవలందించటంలో ఉపగ్రహాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అందువల్ల, వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవటంలో మీరు, ఇస్రో, అంతరిక్ష రంగం ప్రముఖ పాత్ర పోషిస్తాయి. మరోసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా 1.4 బిలియన్ భారత ప్రజల తరపున గగన్ యాన్ బృందానికి ప్రత్యేక అభినందనలు. మరోసారి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ,
ధన్యవాదాలు!
***
(Release ID: 2173080)
Visitor Counter : 7
Read this release in:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam
,
Malayalam