ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బీహార్‌లోని ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధానమంత్రి సంభాషణ

Posted On: 26 SEP 2025 4:47PM by PIB Hyderabad

పరిచయకర్త: బీహార్‌లో ‘ముఖ్యమంత్రి మహిళా ఉపాధిక పథకం’ లబ్ధిదారుల నుంచి ఎంపిక చేసిన కొందరు మహిళలు ఇప్పుడు ప్రధానమంత్రితో తమ అనుభవాలను పంచుకుంటారు. మొదట- పశ్చిమ చంపారన్ జిల్లా వాస్తవ్యురాలైన సోదరి రంజిత కాజీని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.

లబ్ధిదారు (రంజిత కాజీ): గౌరవనీయ సోదరులు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి గార్లకు సగౌరవ అభివందనం. నా పేరు రంజిత కాజీ... నాది పశ్చిమ చంపారన్ జిల్లాలోని బగాహా-2 సమితిలోగల వాల్మీకి అటవీ ప్రాంతం. గిరిజన సమాజానికి చెందిన నేను- ‘జీవిక స్వయం సహాయ సంఘం-లో సభ్యురాలిని. మేమున్నది అడవి ప్రాంతం కావడం వల్ల రహదారులు, విద్యుత్తు, నీటి సరఫరా, విద్య, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు మాకు సమకూరుతాయని నేనెన్నడూ ఊహించలేదు. కానీ, ఇవాళ ఇవన్నీ అందుబాటులోకి వచ్చాయి. ఈ మేలు చేసినందుకు  గౌరవనీయ సోదరుడు ముఖ్యమంత్రిగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మాలాంటి పేద మహిళల కోసం మీరెన్నో మంచి పనులు చేశారు. ఆ మేరకు మహిళా రిజర్వేషన్లు కల్పించడం వల్ల చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు పంచాయతీ రాజ్ సంస్థలలోనూ పనిచేస్తున్నారు. మీరిప్పటికే సైకిల్ పథకం, యూనిఫాం పథకాలను అమలు చేశారు. దీనివల్ల మా కుమార్తెలు చక్కగా యూనిఫాం ధరించి, సైకిళ్లపై పాఠశాలలకు వెళ్తుండటం చూస్తే మాకెంతో ఆనందంగా ఉంది. గౌరవనీయ ప్రధానమంత్రి గారూ...  మీరు అమలులోకి తెచ్చిన ఉజ్వల పథకం కింద మాకిప్పుడు తక్కువ ధరకే వంట గ్యాస్ అందుబాటులోకి వచ్చింది. ఇంతకాలం వంటచెరకు ఉపయోగిస్తూ అనారోగ్యం పాలైన మహిళలకు పొగ నుంచి విముక్తి లభించింది... మా ఆరోగ్యంపై మీ శద్ధకు ధన్యవాదాలు. అలాగే మీ ఆశీర్వాదంతో నేడు ప్రధానమంత్రి  ఆవాస్ యోజన కింద మా సొంత పక్కా ఇళ్లలో నివసిస్తున్నాం. గౌరవనీయ సోదరుడు ముఖ్యమంత్రి గారు ఇటీవల నెలకు 125 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకాన్ని ప్రవేశపెట్టారు. అలాగే పెన్షన్‌ను రూ.400 నుంచి రూ.1100కు పెంచారు. దీనివల్ల మహిళలు ఆత్మవిశ్వాసంతో జీవిస్తున్నారు. ముఖ్యమంత్రి మహిళా ఉపాధి పథకం కింద నా బ్యాంకు ఖాతాకు రూ.2,10,000 బదిలీ కావడం నాకెంతో సంతోషం కలిగించింది. ఇందులో భాగంగా నా ఖాతాకు మొదట రూ.10,000 జమ అయింది. మాది వ్యవసాయ కుటుంబం కాబట్టి, ఈ సొమ్ముతో నేనొక పంపుసెట్‌ ఏర్పాటు చేసుకుని జొన్నలు, సజ్జలు పండించాను. తర్వాత, రూ.2 లక్షలు నా ఖాతాలో జమ అయినపుడు స్వదేశీ (స్థానిక స్వావలంబన)కు దోహదం చేసే విధంగా జొన్న, సజ్జ పిండి వ్యాపారం ప్రారంభిస్తాను. మీ చేయూత ఇదేవిధంగా కొనసాగితే మాకు మరింత ఉపాధి లభించి, జీవితంలో ముందడుగు వేయడం ద్వారా మీరు చెబుతున్నట్లు ‘లక్షాధికారి సోదరి’గా ఎదుగుతాం. ప్రస్తుతం నవరాత్రి పర్వదినాలు కావడంతో మేమంతా ఎంతో సంతోషంగా ఉన్నాం. ఈ సమయంలో మాకు మరింత మేలు చేసే విధంగా ‘ముఖ్యమంత్రి మహిళ ఉపాధి పథకం’ అమలులోకి రావడం మా పండుగ ఆనందోత్సాహాలను రెట్టింపు చేసింది. ఈ నేపథ్యంలో పశ్చిమ చంపారన్ అక్కచెల్లెళ్ల తరఫున గౌరవనీయ సోదరులైన  ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి గార్లకు మరోసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

పరిచయకర్త: ధన్యవాదాలు సోదరీ! ఇప్పుడు భోజ్‌పూర్‌ జిల్లా వాస్తవ్యురాలైన సోదరి రీటా దేవిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.

లబ్ధిదారు (రీటా దేవి): గౌరవనీయ సోదరులు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి గార్లకు ఆరా జిల్లా (భోజ్‌పూర్‌ జిల్లా కేంద్రం) తరఫున సగౌరవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నా పేరు రీటా దేవి హాటే. నేను ఈ జిల్లాలోని కోయిలా పోలీస్ స్టేషన్‌ పరిధిలోగల దౌలత్‌పూర్ పంచాయతీ మొహమ్మద్‌పూర్ గ్రామవాసిని. నేను 2015లో స్వయం సహాయ సంఘంలో సభ్యత్వం తీసుకున్నాను. ఆ తర్వాత తొలి విడతగా అందిన రూ.5,000 ఆర్థిక సహాయంతో జీవనోపాధి కోసం 4 మేకలు కొనుక్కున్నాను. వాటి ద్వారా వచ్చిన ఆదాయంతో నేను 50 కోళ్లను కొని, గుడ్ల వ్యాపారం కూడా ప్రారంభించాను. దీంతోపాటు గుడ్లను పొదగడం కోసం లైట్లు అమర్చిన చేపల తొట్టెను వాడాను. ఈ విధంగా నా కుటుంబ ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడింది. నేనిప్పుడు ‘లక్షాధికారి సోదరి’గా ఎదగడమే కాకుండా ‘డ్రోన్ సోదరి’గా కూడా శిక్షణ పొందాను. ప్రభుత్వ చేయూతతో మా కుటుంబం అద్భుతంగా ముందంజ వేసింది. ఇందుకుగాను మా జిల్లా మహిళల తరపున, గౌరవనీయ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి సోదరులకు మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ‘ముఖ్యమంత్రి మహిళా ఉపాధి పథకం’ ప్రారంభించిన తర్వాత గ్రామాలు, చిన్న పల్లెల్లోని మహిళలు ఆనందోత్సాహాలతో జీవిస్తున్నారు. వారిలో కొందరు ఆవులు, మరికొందరు మేకలు కొని పశుపోషణ చేపట్టారు. ఇంకొందరు గాజుల దుకాణం వంటివి ప్రారంభించారు. ఈ పథకం కింద తొలి విడతగా అందిన రూ.10,000తో నేను 100 కోళ్లను కొన్నాను. శీతాకాలంలో గుడ్లకు డిమాండ్ పెరుగుతుంది  కాబట్టి, నా వద్దగల 50 కోళ్లకు అదనంగా వీటిని కొన్నాను. ఇప్పుడు నేను గుడ్లతోపాటు కోళ్లు కూడా అమ్ముతున్నాను. ఇక రూ.2 లక్షలు అందితే, ‘కోళ్ల ఫారం’ ఏర్పాటు చేసి, నా వ్యాపారాన్ని మరింత పెంచుకుంటాను. అన్నయ్యలారా! ప్రభుత్వ పథకాలు మా జీవితాలను ఎంతగానో మార్చేశాయి. ఉదాహరణకు॥ ఇంతకుముందు వర్షం పడితే మట్టి గోడల ఇళ్లలో నానా అగచాట్లూ పడేవాళ్లం. కానీ,  ఇవాళ మా గ్రామం మొత్తం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పక్కా ఇళ్లలో నివసిస్తున్నాం. ముఖ్యంగా ఈ ఇళ్లు సమకూరినందుకు మహిళలందరూ ఎంతో సంతోషిస్తున్నారు. అలాగే మరుగుదొడ్ల విషయానికొస్తే- ఇంతకుముందు బహిరంగ విసర్జన తప్పని దుస్థితితో మేమెన్నో బాధలు పడ్డాం. ఇప్పుడు, గ్రామంలోని ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి ఉన్నందువల్ల ఆ బాధలు తప్పాయి. మరోవైపుఇంటింటికీ కొళాయి నీరు పథకంతో మైళ్లదూరం వెళ్లి నీరు తెచ్చుకునే అవస్థలు తప్పి,  గ్రామంలోనే సురక్షిత తాగునీరు లభిస్తోంది. దీనివల్ల అనేక వ్యాధుల నుంచి విముక్తులమయ్యాం. ఉజ్వల గ్యాస్ పథకంతో వంటగ్యాస్‌ కనెక్షన్ లభించడం వల్ల వంటింటి పొగ నుంచి విముక్తి లభించింది. ఇప్పుడు మేం చక్కగా గ్యాస్ స్టవ్‌ మీద వంట చేసుకుంటూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నాం. మేం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసే అవసరం లేకుండా ఆయుష్మాన్ ఆరోగ్య కార్డు ద్వారా రూ.5 లక్షల రూపాయల విలువైన ఉచిత చికిత్స అందుబాటులో ఉంది. అలాగే రాత్రివేళ అంధకారంలో ముగినిపోయే మా గ్రామంలో 125 యూనిట్ల ఉచిత విద్యుత్తుతో ఇంటింటా వెలుగులు పరచుకున్నాయి. ఇప్పుడు మా పిల్లలు ఎలాంటి ఆందోళన లేకుండా హాయిగా చదువుకుంటున్నారు. ఇటువంటి పథకాల వల్ల మహిళలకే కాకుండా వారి కుటుంబాలకు... ముఖ్యంగా పిల్లలకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. గతంలో నీళ్ల కోసం, బడికి వెళ్లాలంటే చాలా దూరం నడవాల్సి వచ్చేది. ఇప్పుడు పిల్లలకు సైకిళ్లు కూడా లభించడంతో యూనిఫాం ధరించి వారంతా బడికి వెళ్తుంటే చూడముచ్చటగా ఉంటోంది. ముఖ్యంగా... చిన్నతనంలో ఉచిత సైకిల్, యూనిఫాంతో స్కూలుకు సైకిలుపై వెళ్లడం నేటికీ నాకొక ప్రత్యేక అనుభవం. అందుకే, ఆరా జిల్లాతోపాటు అక్కచెల్లెళ్లు, మహిళలందరి తరపున గౌరవనీయ ప్రధానమంత్రి, నితీష్ భయ్యాలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.. అభినందనలు తెలియజేస్తున్నాను. (గమనిక: రీటా దేవి హాటే స్థానిక భాషలో ప్రసంగించగా, ఇది దానికి స్వేచ్ఛానువాదం మాత్రమే)

ప్రధానమంత్రి: సోదరి రీటా... మీ మాటల్లో చాలా వేగం ఉంది! పథకాలన్నిటినీ పేరుపేరునా ప్రస్తావిస్తూ విశదీకరించారు. ప్రతి విషయాన్నీ చాలా చక్కగా వివరించారు. సోదరీ, మీరు ఎంతవరకూ చదువుకున్నారు?

రీటా దేవి: అన్నయ్యా! ‘జీవిక’ (స్వయం సహాయ సంఘం)లో చేరాక నేను మళ్లీ చదువు ప్రారంభించాను. అలా... మెట్రిక్యులేషన్, ఇంటర్మీడియట్, బి.ఎ. పూర్తి చేసి, ప్రస్తుతం ఎం.ఎ. చదువుతున్నాను.

ప్రధానమంత్రి: ఓహ్.. అద్భుతం!

రీటా దేవి: ఇంతకుముందు పెద్దగా చదువుకోలేదు... ఇప్పుడు కూడా స్వయం సహాయ సంఘం ద్వారా చదువు కొనసాగిస్తున్నాను అన్నయ్యా..

ప్రధానమంత్రి: మంచిది... మీకు నిండు మనసుతో నా శుభాకాంక్షలు!

రీటా దేవి: అన్నయ్యా... మీకు కూడా మా మహిళలందరి తరఫున శుభాకాంక్షలు... శుభాశీస్సులు!

పరిచయకర్త: ధన్యవాదాలు రీటా దేవి సోదరీ.. ఇప్పుడు గయ జిల్లా నుంచి నూర్జహాన్‌ ఖాతూన్‌ తన అనుభవాన్ని ప్రధానమంత్రితో పంచుకుంటారు.

లబ్ధిదారు (నూర్జహాన్‌ ఖాతూన్‌): గౌరవనీయ సోదరులు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి గార్లకు నా సగౌరవ శుభాకాంక్షలు. నా పేరు నూర్జహాన్ ఖాతూన్. నేను గయ జిల్లా బోధ్ గయలోని జికాటియా సమితి పరిధిలోగల జికాటియా గ్రామవాసిని. నేనిప్పుడు ‘గులాబ్ జీ వికాస్ స్వయం సహాయ సంఘం’ అధ్యక్షురాలిని. మా జీవనోపాధి కోసం తొలి విడతగా రూ.10,000 లభిస్తాయని వినగానే, మేమందరం ఎంతో సంతోషించాం. గ్రామంలోని అన్ని ఇళ్లు, పరిసరాల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. మహిళలందరూ కలసి కూర్చుని చర్చించుకుంటే వాస్తవంగా తాము కోరుకున్న కార్యం చేపట్టగలరని స్పష్టమైంది. నేను తొలి విడత సాయంగా రూ.10,000 అందుకోగానే నా టైలరింగ్‌ దుకాణంలో ఒక కౌంటర్ ఏర్పాటు చేసి, వస్తువుల అమ్మకం ప్రారంభించాలని నిర్ణయించుకున్నాను. గతంలో నా భర్త మరో చోట దర్జీగా పనిచేసేవాడు. కానీ, ఇప్పుడు ఆయనను కూడా వెనక్కు రప్పించి, మా సొంత దుకాణం నడుపుతున్నాం. అంతేకాదు... మేం మరో 10 మందికి ఉపాధి కూడా కల్పించాం. భవిష్యత్తులో నాకు రూ.2 లక్షలు అందితే మరికొన్న యంత్రాలు కొని, ఈ వ్యాపారాన్ని మరింత విస్తరిస్తాను. తద్వారా ఇంకొక 10 మందికి ఉపాధి కల్పించగలను. మా ముఖ్యమంత్రి అన్నయ్య ఎప్పుడూ మహిళల సంక్షేమం గురించి ఆలోచిస్తూ, మా పురోగమనానికి చేయూతనిచ్చే ప్రయత్నం చేస్తుంటారు. ఈ సందర్భంగా నేనొక ముఖ్యమైన విషయం చెబుతాను... లోగడ మేం వంటింట్లో లాంతర్లు, నూనె దీపాలు ఉపయోగించేవాళ్లం. కానీ, మాకు 125 యూనిట్ల ఉచిత విద్యుత్ సౌకర్యం లభించడంతో ఆ బాధ తప్పింది. ఆ ఉచిత విద్యుత్తును సద్వినియోగం చేసుకుంటూ, అలా మిగిలే సొమ్మును పిల్లల ట్యూషన్ ఫీజు కోసం ఖర్చు చేస్తున్నాం. ఇంతకుముందు బిల్లు భారం మోయలేక మాలో చాలామంది విద్యుత్‌ కనెక్షన్‌ తీసుకోలేదు. అయితే, ఇవాళ నిరుపేదలు సహా  100 శాతం ఇళ్లలో వెలుగులు విరబూస్తున్నాయి. అందరి పిల్లలూ రాత్రిపూట హాయిగా చదువుకుంటున్నారు. అన్నయ్యా... స్వయం సహాయ సంఘం లేనప్పుడు మేం ఇళ్ల నుంచి చాలా అరుదుగా బయటకు వచ్చేవాళ్లం. అయితే, సంఘాలు ఏర్పడిన తర్వాత సామూహిక కార్యకలాపాల కోసం కదిలినప్పుడు అడుగడుగునా అవరోధాలే. చాలామంది మమ్మల్ని తిట్టేవారు.. చివరకు మా భర్తలు కొట్టేవారు. కానీ, ఇప్పుడెవరైనా మా ఇళ్లకు వస్తే- “మీ కోసం ఎవరో వచ్చారు... వెళ్లండి... బయటకు వెళ్లి మాట్లాడండి” అని వారే బయటకు పంపుతున్నారు. ఇవాళ మేం ఇళ్ల నుంచి బయటకు వెళ్లడం మా కుటుంబాలకు ఎంతో సంతోషంగా, గర్వంగా ఉంటోంది. నేనిప్పుడు మరికొందరికి ఉపాధితోపాటు, శిక్షణ కూడా ఇస్తున్నాను కాబట్టి, నేనెంతో ఆనందిస్తున్నాను. నా భర్త టైలరింగ్‌ కళలో ఎంతో నిపుణుడు కావడంతో ఆయనను మా ఇంటి పెన్నిధిగా భావించేవాళ్లం. అయితే, ఇప్పుడు ఆయన నన్ను ‘లక్షాధికారి’గా, కుటుంబానికి నిజమైన సంపదగా పరిగణిస్తాడు. అన్నయ్యా... ఒకనాడు పూరిళ్లలో కటిక పేదరికం మధ్య జీవించిన మేమివాళ దాన్నుంచి విముక్తులమయ్యాం. ఇప్పుడు మేమొక రాజభవనంలో ఉన్నట్లు సంతోషంగా జీవిస్తున్నాం. ఈ సందర్భంగా గయ  జిల్లాలోని మహిళలందరి తరపున, నా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అన్నయ్యలకు హృదయపూర్వక శుభాకాంక్షలు, ఆశీస్సులు అందిస్తున్నాను. మీకు నా  హృదయపూర్వక ధన్యవాదాలు.

ప్రధానమంత్రి: సోదరీ... నూర్జహాన్‌, మీరు అన్నిటినీ చక్కగా వివరించారు. మీరు నాకొక సాయం చేయాలి!

నూర్జహాన్‌ ఖాతూన్‌: తప్పకుండా అన్నయ్యా...

ప్రధానమంత్రి: మీరు అన్ని అంశాలనూ చాలా బాగా వివరిస్తున్నారు... వారంలో ఒక రోజు కేటాయించి వివిధ ప్రాంతాలకు లేదా గ్రామాలకు వెళ్లి, 50 నుంచి 100 మంది అక్కచెల్లెళ్లను సమీకరించి ఈ విషయాలన్నీ వివరించండి. ఆ విధంగా వారికీ మీరు స్ఫూర్తినిచ్చిన వారు కాగలరు. మీరు మనస్ఫూర్తిగా స్వీయానుభవం వివరిస్తూ, మీ కుటుంబ పురోగమనాన్ని వెల్లడిస్తారు కాబట్టి, ఆ మాటలు ఇతరులనూ ఉత్తేజపరుస్తాయి. తద్వారా మరికొందరి జీవితాల్లోనూ ఆనందం వెల్లివిరుస్తుంది. మీరెంతో చక్కగా మాట్లాడినందుకు మరోసారి అభినందనలు.. ధన్యవాదాలు!

నూర్జహాన్‌ ఖాతూన్‌: అన్నయ్యా... మీరు చెప్పినట్లు చేస్తాను. కచ్చితంగా గ్రామాలకు వెళ్లి, అన్నీ వివరిస్తాను.

పరిచయకర్త: ధన్యవాదాలు సోదరీ! చివరగా, ఇప్పుడు పూర్ణియా జిల్లా నివాసి- సోదరి పుతుల్‌ దేవిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.

లబ్ధిదారు (పుతుల్‌ దేవి): గౌరవనీయ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి గార్లకు సగౌరవ శుభాకాంక్షలు. నా పేరు పుతుల్ దేవి... నా స్వస్థలం భవానీపూర్.. నేను ముస్కాన్ స్వయం సహాయ సంఘం కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈ రోజు ‘ముఖ్యమంత్రి మహిళా ఉపాధి పథకం’ కింద రూ.10,000 ఇస్తుండటం ఎంతో సంతోషం కలిగించింది. ఇంతకుముందు నేను లడ్డూలు, బటాషే (సంప్రదాయ స్వీట్లు) దుకాణం నడిపేదాన్ని. ప్రభుత్వ సాయంతో ఇప్పుడు టిక్కీ, బలుషాహి, జలేబీ, బర్ఫీ వంటివి కూడా తయారు చేస్తున్నాను. నా శక్తివంచన లేకుండా శ్రమిస్తూ- రూ.2 లక్షల సహాయం కూడా అందుకుని, నా వ్యాపారాన్ని మరింత విస్తరించడమే కాకుండా ఇంకొందరికి ఉపాధి కూడా కల్పించగలను. అలాగే, మీరు ప్రారంభించిన జీవికా బ్యాంకు ద్వారా తక్కువ వడ్డీకి రుణం పొంది, మా కుటుంబ ఆర్థిక పరిస్థితిని మరింత బలోపేతం చేస్తాను. గౌరవనీయ ప్రధానమంత్రి స్వదేశీ పిలుపు స్ఫూర్తితో నేను కూడా దేశం బలోపేతమయ్యేలా కృషి చేస్తాను. ఇక మా అత్తగారి పెన్షన్‌ రూ.400  నుంచి రూ.1100కు పెరగడం నాకెంతో సంతోషాన్నిస్తోంది. అలాగే 125 యూనిట్ల ఉచిత విద్యుత్తుతో, మిగిలే బిల్లు సొమ్మును నా బిడ్డ చదువుకు ఉపయోగించగలను. ఈ నేపథ్యంలో మా ఇళ్లలో ఆనందోత్సాహాలు నింపే పథకాలను అమలు చేస్తున్నందుకు పూర్ణియా జిల్లా నివాసితులందరి తరపున గౌరవనీయ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీకిద్దరికీ నిండు మనసుతో అభివాదం చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

ప్రధానమంత్రి: సోదరీ పుతుల్ దేవి... మీరు సొంత వ్యాపారం ప్రారంభించే సమయంలో మీ కుటుంబం లేదా ఇరుగుపొరుగు నుంచి దుకాణంలో కూర్చోవడంపై మిమ్మల్ని నిరుత్సాహపరిచే గ్రామస్థుల మాటలతో బహుశా ఇబ్బందులు పడి ఉంటారేమో కదా!?

పుతుల్‌ దేవి: అవును సర్.... అందరూ హేళనగా నవ్వేవారు... కానీ, నేను పట్టు విడవలేదు. దృఢ సంకల్పంతో లడ్డూ, బటాషే తయారుచే్స్తూ స్వల్ప స్థాయిలో వ్యాపారం ప్రారంభించాను. ఆ తర్వాత ‘జీవిక’ (స్వయం సహాయ సంఘం)లో చేరి రుణం తీసుకున్నాను. అప్పటికి నాకొక పూరిల్లు కూడా లేదు... కానీ, ఇప్పుడు ఆ వ్యాపారం ద్వారా ఆర్జించిన సొమ్ముతోనే ఇల్లు కట్టుకున్నాను. అలాగే నా కొడుకు చదువు దెబ్బతినకుండా చూసుకున్నాను. ఇవాళ వాడు స్వయం ప్రతిభతో ప్రభుత్వ కళాశాలలో బి.టెక్‌ సీటు సంపాదించి, కటీహార్‌లో చదువుతున్నాడు.

ప్రధానమంత్రి: ఓహ్... అది అద్భుతం పుతుల్ దేవి గారూ... మీరు జలేబీ గురించి ప్రస్తావించారు... ఒకప్పుడు మన దేశంలో జలేబీ రాజకీయాలు ఎక్కవగా ఉండేవి.. మీకు తెలుసా!?

పుతుల్‌ దేవి: అవునవును సర్‌!

ప్రధానమంత్రి: మంచిది... మీ అనుభవాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు.

పరిచయకర్త: ధన్యవాదాలు సోదరీ... ఇప్పుడు ‘ముఖ్యమంత్రి మహిళా ఉపాధి పథకం’ కింద లబ్ధిదారులకు తలా రూ.10,000 వంతున రూ.7,500 కోట్ల మొత్తాన్ని బదిలీ చేస్తూ రిమోట్ బటన్‌ నొక్కాల్సిందిగా గౌరవనీయ ప్రధానమంత్రి గారిని అభ్యర్థిస్తున్నాను.

 

***


(Release ID: 2172266) Visitor Counter : 6