ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
ఎన్‌హెచ్-139డబ్ల్యూలో భాగంగా బీహార్‌లో ఉన్న 78.942 కి.మీ హెబ్‌గంజ్-అరెరాజ్-బేతియా మార్గాన్ని నాలుగు వరుసలుగా అభివృద్ధి చేసేందుకు ఆమోదం తెలిపిన క్యాబినెట్
రూ. 3822.31 కోట్ల వ్యయంతో హైబ్రిడ్ యాన్యుటీ పద్ధతిలో (హెచ్ఏఎం) నిర్మాణం
Posted On:
24 SEP 2025 3:07PM by PIB Hyderabad
ఎన్‌హెచ్-139డబ్ల్యూలో భాగంగా బీహార్‌లో ఉన్న 78.942 కి.మీ హెబ్‌గంజ్-అరెరాజ్-బేతియా మార్గాన్ని నాలుగు వరుసలుగా అభివృద్ధి చేసేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. రూ. 3822.31 కోట్ల మూలధన వ్యయంతో హైబ్రిడ్ యాన్యుటీ పద్ధతిలో (హెచ్ఏఎం) దీనిని నిర్మించనున్నారు.
ప్రతిపాదిత నాలుగు వరుసల గ్రీన్‌ఫీల్డ్ రహదారి.. రాష్ట్ర రాజధాని పాట్నా నుంచి పశ్చిమ చంపారన్ జిల్లాలోని బేతియా వరకు ఉండనుంది. ఇది ఉత్తర బీహార్ జిల్లాలైన వైశాలి, సరన్, సివాన్, గోపాల్‌గంజ్, ముజఫర్‌పూర్, తూర్పు చంపారన్‌లను పశ్చిమ చంపారన్‌లోని ఇండో-నేపాల్ సరిహద్దు వెంట ఉన్న ప్రాంతాలతో అనుసంధానిస్తుంది. సుదూర సరకు రవాణాకు ఉపయోగపడే ఈ ప్రాజెక్టు కీలకమైన మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తెస్తుంది. దీనితో పాటు వ్యవసాయ కేంద్రాలు, పారిశ్రామిక ప్రాంతాలు, దేశ సరిహద్దు వాణిజ్య మార్గాలకు అనుసంధానతను మెరుగుపరచడం ద్వారా ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది.
ఏడు ప్రధానమంత్రి గతి శక్తి ఆర్థిక కేంద్రాలు, ఆరు సామాజిక కేంద్రాలు, ఎనిమిది రవాణా కేంద్రాలు, తొమ్మిది ప్రధాన పర్యాటక- మతపరమైన కేంద్రాలను ఈ ప్రాజెక్టు అనుసంధానం చేస్తుంది. కేసరియా బుద్ధ స్థూపం (సాహెబ్‌గంజ్), సోమేశ్వరనాథ్ మందిర్ (అరెరాజ్), జైన మందిర్, విశ్వ శాంతి స్థూపం (వైశాలి), మహావీర్ ఆలయం (పాట్నా) వంటి కీలక సాంస్కృతిక వారసత్వ, బౌద్ధ పర్యాటక ప్రదేశాలకు చేరుకోవటాన్ని సులభతరం చేస్తుంది. తద్వారా బీహార్‌లోని బౌద్ధ సర్క్యూట్‌తో పాటు రాష్ట్రానికి ఉన్న అంతర్జాతీయ పర్యాటక సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుంది.
ప్రస్తుత ఎన్‌హెచ్-139డబ్ల్యూ ఇరుకుగా, లోపభూయిష్టంగా ఉండటంతో పాటు జనసమ్మర్థ ప్రాంతాల నుంచి వెళుతున్నది. ప్రత్యామ్నాయ మార్గంలో రానున్న ఈ కొత్త రహదారి… ఎన్‌హెచ్-31, ఎన్‌హెచ్-722, ఎన్‌హెచ్-727, ఎన్‌హెచ్-27, ఎన్‌హెచ్-227ఏ రహదారులకు ముఖ్యమైన అనుసంధాన మార్గంగా ఉపయోగపడుతుంది.
ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్ మార్గంలో సగటు వాహన వేగం గంటకు 80 కి.మీ ఉండనుంది. అయితే గంటకు 100 కి.మీ వేగంతో వెళ్లే సామర్థ్యంతో ఈ రహదారికి రూపకల్పన చేశారు. ప్రయాణికులతో పాటు సరకు రవాణా వాహనాలకు సురక్షితమైన, వేగవంతమైన అంతరాయంలేని అనుసంధానను కల్పిస్తుంది. ఇది సాహెబ్‌గంజ్, బేతియా మధ్య ప్రస్తుతం ఉన్న 2.5 గంటల ప్రయాణ సమయాన్ని కేవలం ఒక గంటకు తగ్గిస్తుంది.
78.94 కి.మీ పొడవున్న ఈ ప్రతిపాదిత ప్రాజెక్టు ప్రత్యక్షంగా 14.22 లక్షల పని దినాలు, పరోక్షంగా 17.69 లక్షల పని దినాల ఉపాధిని కల్పిస్తుంది. ఈ కారిడార్ చట్టుపక్కల ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు పెరగడం వల్ల అదనపు ఉపాధి అవకాశాలు కూడా పెరగనున్నాయి.
ఎన్‌హెచ్-139డబ్ల్యూ లోని సాహెబ్‌గంజ్-అరెరాజ్-బేతియా ప్రాజెక్టు అలైన్‌మెంట్ మ్యాప్
(Release ID: 2170756)
Visitor Counter : 6
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam