మంత్రిమండలి
azadi ka amrit mahotsav

నౌకా నిర్మాణం, నౌకా వాణిజ్యానికి ఆర్థిక సాయం, దేశీయ సామర్ధ్యాన్ని బలోపేతం చేయడానికి సమగ్ర నాలుగు స్తంభాల వ్యూహం

భారత నౌకా నిర్మాణం, నౌకా వాణిజ్య రంగాల పునరుద్ధరణ కోసం

రూ 69,725 కోట్ల ప్యాకేజీకి మంత్రివర్గం ఆమోదం

మొత్తం రూ 24,736 కోట్ల కార్పస్‌తో నౌకా నిర్మాణానికి ఆర్థిక సాయం అందించే

పథకం గడువు 2036 మార్చి 31 వరకు పొడిగింపు

రూ.20,000 కోట్లతో మారిటైమ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌కు ఆమోదం తెలిపిన మారిటైమ్ డెవలప్‌మెంట్ ఫండ్‌

దేశీయ నౌకా నిర్మాణ సామర్థ్యాన్ని స్థూలంగా 4.5 మిలియన్ టన్నులకు విస్తరించడం లక్ష్యంగా రూ.19,989 కోట్ల వ్యయంతో నౌకా నిర్మాణ అభివృద్ధి పథకం

Posted On: 24 SEP 2025 3:08PM by PIB Hyderabad

నౌకా వాణిజ్య రంగ వ్యూహాత్మక, ఆర్థిక ప్రాముఖ్యతను గుర్తిస్తూ భారత నౌకా నిర్మాణం, నౌకా వాణిజ్య రంగాల పునరుజ్జీవనం కోసం రూ 69,725 కోట్ల సమగ్ర ప్యాకేజీని ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ ఆమోదించింది. దేశీయ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి.. దీర్ఘకాలిక ఆర్థిక సాయాన్ని మెరుగుపరచడానికి.. గ్రీన్‌ఫీల్డ్, బ్రౌన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్ అభివృద్ధిని ప్రోత్సహించడానికి.. సాంకేతిక సామర్థ్యాలు-నైపుణ్యాలను మెరుగుపరచడానికి.. బలమైన నౌకా వాణిజ్య మౌలిక సదుపాయాల ఏర్పాటుకు చట్టపరమైన, పన్నులపరమైన, విధానపరమైన సంస్కరణల అమలు కోసం రూపొందించిన నాలుగు స్తంభాల వ్యూహాన్ని ఈ ప్యాకేజీ పరిచయం చేస్తుంది.

 

ఈ ప్యాకేజీ కింద మొత్తం రూ.24,736 కోట్ల కార్పస్‌తో నౌకా నిర్మాణం కోసం ఆర్థిక సాయం అందించే పథకం (ఎస్‌బీఎఫ్ఏఎస్) గడువును మార్చి 31, 2036 వరకు పొడిగించారు. దేశంలో నౌకా నిర్మాణాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో రూపొందించిన ఈ పథకంలో రూ 4,001 కోట్ల కేటాయింపు గల షిప్‌బ్రేకింగ్ క్రెడిట్ నోట్‌ భాగంగా ఉంది. అన్ని కార్యక్రమాల అమలును పర్యవేక్షించడం కోసం ఒక జాతీయ నౌకా నిర్మాణ మిషన్‌నూ ఏర్పాటు చేస్తారు.

 

రూ 25,000 కోట్ల కార్పస్‌తో ఈ రంగానికి దీర్ఘకాలిక ఆర్థిక సహాయం అందించేందుకు మారిటైమ్ డెవలప్‌మెంట్ ఫండ్ (ఎన్‌డీఎఫ్) ఆమోదం తెలిపింది. భారత ప్రభుత్వం నుంచి 49 శాతం భాగస్వామ్యంతో రూ 20,000 కోట్ల మారిటైమ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్.. రుణాల ప్రభావ వ్యయాన్ని తగ్గించడానికి, ప్రాజెక్ట్ బ్యాంకింగ్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి రూ 5,000 కోట్ల వడ్డీ ప్రోత్సాహక నిధి దీనిలో భాగంగా ఉన్నాయి. దేశీయ నౌకా నిర్మాణ వార్షిక సామర్థ్యాన్ని స్థూలంగా 4.5 మిలియన్ టన్నులకు విస్తరించడం.. మెగా నౌకా నిర్మాణ క్లస్టర్లకు మద్దతు ఇవ్వడం.. మౌలిక సదుపాయాల విస్తరణ.. ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీకి అనుబంధంగా భారత నౌకా సాంకేతికత కేంద్రాన్ని ఏర్పాటు చేయడం.. నౌకా నిర్మాణ ప్రాజెక్టులకు బీమా మద్దతు సహా రిస్క్ కవరేజీని అందించడం లక్ష్యంగా రూ 19,989 కోట్ల బడ్జెట్ వ్యయంతో నౌకా నిర్మాణ అభివృద్ధి పథకాన్ని (ఎస్‌బీడీఎస్) అమలు చేస్తారు.

 

ఈ మొత్తం ప్యాకేజీ.. స్థూలంగా 4.5 మిలియన్ టన్నుల నౌకా నిర్మాణ సామర్థ్యాన్ని సాధించడంతో పాటు దాదాపు 30 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తుందనీ, భారత నౌకా వాణిజ్య రంగంలోకి సుమారు రూ.4.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తుందని భావిస్తున్నారు. దాని ఆర్థిక ప్రభావానికి మించి ఈ పథకం.. కీలకమైన సరఫరా వ్యవస్థలు, నౌకా వాణిజ్య మార్గాలను మరింత సమర్థంగా మార్చడం ద్వారా జాతీయ, ఇంధన, ఆహార భద్రతనూ బలోపేతం చేస్తుంది. ఇది భారత భౌగోళిక రాజకీయ సమర్థతను, వ్యూహాత్మక సాధికారతను శక్తిమంతం చేయడంతో పాటు.. ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతను ముందుకు తీసుకువెళుతూ ప్రపంచ నౌకా రవాణా, నౌకా నిర్మాణ రంగాల్లో భారతదేశాన్ని శక్తిమంతమైన పోటీదారుగా నిలుపుతుంది.

 

శతాబ్దాల వాణిజ్యం, సముద్రయానంతో భారత ఉపఖండాన్ని ప్రపంచంతో అనుసంధానించిన సుదీర్ఘమైన, విశిష్టమైన నౌకా వాణిజ్య చరిత్ర భారత్ సొంతం. ప్రస్తుతం నౌకా వాణిజ్య రంగం భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉంది. పరిమాణం పరంగా దేశ వాణిజ్యంలో దాదాపు 95 శాతం, విలువ పరంగా 70 శాతం వాటాను కలిగి ఉంది. దీనిలో ప్రధాన భాగం నౌకా నిర్మాణ రంగానిదే. అందుకే దీనిని తరచుగా ‘‘భారీ యాంత్రికతకు తల్లి’’గా చెబుతారు. ఈ రంగం ఉపాధి, పెట్టుబడులకు గణనీయంగా దోహదపడటమే కాకుండా జాతీయ భద్రతను, వ్యూహాత్మక స్వాతంత్య్రాన్ని, వాణిజ్యం-ఇంధన సరఫరా వ్యవస్థల సామర్థ్యాన్నీ పెంపొందిస్తుంది.

 

***


(Release ID: 2170680) Visitor Counter : 45