ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘వికసిత భారత్‌… వికసిత ఛత్తీస్‌గఢ్‌’ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

प्रविष्टि तिथि: 24 FEB 2024 2:50PM by PIB Hyderabad

జై జోహార్‌!

   ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి శ్రీ విష్ణుదేవ్ సాయి, రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు! ఆన్‌లైన్‌ మాధ్యమం ద్వారా 90కిపైగా ప్రదేశాల నుంచి వేలాదిగా పాల్గొంటున్న నా ప్రియ కుటుంబ సభ్యులారా!

   ముందుగా రాష్ట్రంలోని అన్ని శాసనసభ నియోజకవర్గాల నుంచి ఈ కార్యక్రమంలో లక్షలాదిగా పాలుపంచుకుంటున్న నా కుటుంబ సభ్యులకు అభినందనలు. ఈసారి ఎన్నికలలో మీరు పూర్తి ఆధిక్యంతో మమ్మల్ని ఆశీర్వదించారు. మీ ఆశీస్సుల వల్లనే మేం ఇవాళ ‘వికసిత ఛత్తీస్‌గఢ్’ సంకల్పంతో మీ ముందు నిలిచాం. ఛత్తీస్‌గఢ్‌ ఏర్పాటు చేసింది బీజేపీ... ఈ రాష్ట్రాన్ని పురోగమన పథంలో నడిపించేది బీజేపీ... కాబట్టే, నేటి కార్యక్రమం ద్వారా ఈ వాస్తవాన్ని బీజేపీ పునరుద్ఘాటిస్తోంది.

మిత్రులారా!

రాష్ట్రంలోని పేదలు, రైతులు, యువత, మహిళల సాధికారత ద్వారానే ‘వికసిత ఛత్తీస్‌గఢ్’ సాకారం కాగలదు. ఆధునిక మౌలిక సదుపాయాలతో ఇందుకు బలమైన పునాది పడుతోంది. ఇందులో భాగంగా దాదాపు రూ.35,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనతోపాటు పూర్తయిన వాటిని జాతికి అంకితం చేశాం. వీటిలో బొగ్గు, సౌరశక్తి, విద్యుత్తు, అనుసంధానం సంబంధిత  వివిధ కార్యక్రమాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులతో ఛత్తీస్‌గఢ్ యువతకు కొత్త ఉపాధి అవకాశాల సృష్టితోపాటు స్వయం ఉపాధికి బాటలు పడతాయి. ఇందుకుగాను రాష్ట్రంలోని సోదరీసోదరులందరికీ నా అభినందనలు.

మిత్రులారా!

రాష్ట్రంలో ‘ఎన్టీపీసీ’ 1600 మెగావాట్ల సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణంలో భాగంగా పూర్తయిన తొలిదశను ఈ రోజు జాతికి అంకితం చేశాం. దీంపాటు ఈ ఆధునిక ప్లాంటులో రెండో దశ నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. ఈ ప్లాంటు ద్వారా ప్రజలకు స్వల్ప వ్యయంతో విద్యుత్తు సదుపాయం లభిస్తుంది. అలాగే ఛత్తీస్‌గఢ్‌ను సౌరశక్తికి ప్రధాన కూడలిగా మార్చాలని మేం లక్ష్యనిర్దేశం చేసుకున్నాం. తదనుగుణంగా నేడు రాజ్‌నంద్‌గావ్, భిలాయ్‌ నగరాల్లో భారీ సౌర విద్యుత్ ప్లాంట్లు ప్రారంభమయ్యాయి. వీటిద్వారా పరిసర ప్రాంతాలకు రాత్రి వేళ కూడా విద్యుత్‌ సరఫరా అయ్యేలా ఏర్పాట్లు చేశారు. సౌరశక్తితో ప్రజలకు విద్యుత్తు సదుపాయం కల్పించడమే కాకుండా వారి బిల్లులను సున్నా స్థాయికి తేవాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఆ మేరకు ప్రతి ఇల్లూ సౌరశక్తి ఉత్పాదన కేంద్రంగా మారాలని మోదీ ఆకాంక్షిస్తున్నాడు. ప్రతి కుటుంబం తమ ఇంట విద్యుత్తును ఉత్పత్తి చేసి వాడుకుంటూ, మిగులును విక్రయించడం ద్వారా వారికి మరొక ఆదాయ వనరు సమకూర్చాలన్నది  మోదీ ధ్యేయం. అందుకే, ‘ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ను మేం ప్రారంభించాం. ఇది ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోటి కుటుంబాలకు అందుబాటులో ఉంది. దీనికింద ఇంటి పైకప్పు మీద సౌర ఫలకాల ఏర్పాటు కోసం ప్రభుత్వం ఆర్థిక సహాయం కూడా అందిస్తుంది. ఈ రుణం నేరుగా వారి  బ్యాంకు ఖాతాలకు జమ అవుతుంది. తద్వారా ప్రతి కుటుంబానికీ 300 యూనిట్ల వరకూ ఉచితంగా  విద్యుత్తు లభిస్తుంది. అంతకుమించి ఉత్పత్తి అయితే, దాన్ని ప్రభుత్వమే కొంటుంది. ఈ విధానంతో ఏటా ఆయా కుటుంబాలకు రూ.వేలల్లో ఆదాయం సమకూరుతుంది. మరోవైపు మన రైతులను కూడా విద్యుదుత్పత్తిదారులుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పొలం గట్లమీద లేదా బంజరు భూమిలో చిన్న సౌరశక్తి ప్లాంట్ల ఏర్పాటుకు ప్రోత్సహిస్తోంది. దీంతోపాటు సౌరశక్తి మోటార్ల ఏర్పాటుకు సహాయం చేస్తోంది.

సోదరీసోదరులారా!

ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటమే కాకుండా కేంద్రంలోనూ మేమే అధికారంలో ఉన్నందున ఇప్పుడిది రెండు ఇంజిన్ల సర్కారు. కాబట్టి, మేమిచ్చిన వాగ్దానాలు వేగంగా నెరవేరుతుండటం హర్షణీయమేగాక ఎంతో ప్రశంసనీయం. ఛత్తీస్‌గఢ్‌లో లక్షలాది రైతులకు ఇప్పటికే రెండేళ్ల బోనస్ లభించింది. ఎన్నికలకు ముందు తెండు ఆకు సేకరించే వారికి వేతనాలు పెరుగుతాయని నేను హామీ ఇచ్చాను. మా రెండు ఇంజిన్ల ప్రభుత్వం ఆ వాగ్దానాన్ని నెరవేర్చింది. మునుపటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇళ్ల నిర్మాణాన్ని జాప్యం చేయడమే కాకుండా అడ్డంకులు సృష్టించింది. అయితే, బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఆ పనుల వేగం పెంచింది. దీంతోపాటు ఇంటింటికీ నీరు (హర్ ఘర్ జల్)  పథకాన్ని కూడా వేగంగా అమలు చేస్తోంది. ‘పీఎస్‌సీ’ పరీక్షలో అవకతవకలపై విచారణకు ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలో ‘మహతారి వందన యోజన’ అమలవుతున్న నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ ఆడపడుచులకు నా అభినందనలు. ఈ పథకంతో లక్షలాదిగా మహిళలు లబ్ధి పొందుతారు. బీజేపీ ఏం చెబుతుందో... అదంతా చేసి చూపుతుందని ఈ నిర్ణయాలన్నీ స్పష్టం చేస్తున్నాయి. అందుకే,  మోదీ హామీ అంటే- కచ్చితంగా నెరవేరుతుందనే పూచీ ఉంటుందని ప్రజలు విశ్వసిస్తారు.

మిత్రులారా!

శ్రమజీవులైన రైతులు, ప్రతిభగల యువత, సహజ వనరుల సంపదకు ఛత్తీస్‌గఢ్‌లో కొదవలేదు. అభివృద్ధికి అవసరమైన ప్రతి వనరూ ఉండటం ఈ రాష్ట్రానికి వరం. అయితే, స్వాతంత్ర్యం తర్వాత చాలాకాలం దేశాన్నేలిన వారికి దూరదృష్టి లేదుగనుక ఐదేళ్లపాటు రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ వరుసగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసినా- అదొక్కటే వారి లక్ష్యం కాబట్టి, దేశ భవిష్యత్తును పూర్తిగా విస్మరించింది. దేశాభివృద్ధి వారి వారి కార్యాచరణలో భాగం కానేకాదు. కాంగ్రెస్ రాజకీయాల దిశ... దశ నేటికీ అదే స్థితిలో ఉన్నాయి. వంశపారంపర్య రాజకీయాలు, అవినీతి, బుజ్జగింపు ధోరణికి మించి కాంగ్రెస్‌ ఆలోచన ధోరణిలో మార్పు రాదు. తమ కుటుంబ సంక్షేమమే ధ్యేయంగా గలవారు మీ కుటుంబాల గురించి ఎన్నడూ ఆలోచించరు. తమ వారసుల రాజకీయ భవిష్యత్తు గురించి మాత్రమే యోచించేవారు మీ బిడ్డల భవిష్యత్తుపై ఎన్నడూ దృష్టి సారించరు. కానీ, మోదీకి అన్నీ మీరే... మీరంతా మోదీ కుటుంబమే. మీ కలలే మోదీ సంకల్పం కాబట్టి, ‘వికసిత భారత్ – వికసిత ఛత్తీస్‌గఢ్ గురించి ఇప్పుడిక్కడ మాట్లాడుతున్నాను.

దేశంలోని 140 కోట్ల మంది పౌరుల సంక్షేమం దిశగా కృషిపై తన నిబద్ధతకు ఈ ‘సేవకుడు’ హామీ ఇచ్చాడు. దేశ పౌరులే కాకుండా దేశదేశాల్లోగల భారతీయులంతా గర్వంగా తలెత్తుకునేలా చేస్తానని 2014లో మోదీ వాగ్గానం చేశాడు. ఆ హామీని నెరవేర్చడానికి నన్ను నేను పూర్తిగా అంకితం చేసుకున్నాను. అలాగే పేదల విషయంలో ఏ మాత్రం రాజీపడబోమని 2014లో మోదీ హామీ ఇచ్చాడు. పేదలను దోచుకున్న వారు ఆ సొమ్మును వారికి తిరిగి ఇచ్చేయాలి. ఆ దిశగా అవినీతిపరులపై నేడు కఠిన చర్యలు తీసుకుంటున్నాడు. ఇన్నేళ్లూ దళారులు దోచుకున్న పేదల సొమ్మును ఆదా చేస్తూ దాన్ని పేదల సంక్షేమ పథకాల కోసం ఉపయోగిస్తున్నాడు. ఉచిత రేషన్, ఉచిత చికిత్స, చౌక ధరతో మందులు, పేదలకు ఇళ్ళు, ప్రతి ఇంటికీ కొళాయి నీరు, ఇంటింటికీ వంటగ్యాస్ కనెక్షన్లు, ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి వగైరా హామీలన్నీ నెరవేరుతున్నాయి. ఇదివరకెన్నడూ ఊహించని ఈ కనీస సౌకర్యాలన్నీ పేదల ఇళ్లకు చేరుతున్నాయి. వికసిత భారత్ సంకల్ప యాత్రలో భాగంగా మోదీ వాగ్దాన వాహనం గ్రామగ్రామానికీ వచ్చింది. ఆ సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై సమాచారాన్ని పంచుకుంటూ గౌరవనీయ ముఖ్యమంత్రి నాలో ఉత్సాహం ఇనుమడింపజేశారు.

మిత్రులారా!

పదేళ్ల కిందట మోదీ మరో హామీ కూడా ఇచ్చాడు... మన మునుపటి తరాల వారు దేశ ఉజ్వల భవిష్యత్తుపై ఎన్నో కలలు కన్నారు... మరెన్నో ఆశలు పెట్టుకున్నారు. వాటన్నిటినీ వాస్తవం చేయగల భారతదేశాన్ని సృష్టిస్తామని నేను వాగ్దానం చేశాను. తదనుగుణంగా ఇవాళ మన పూర్వికులు స్వప్నించిన నవ భారతం రూపొందుతోంది. గ్రామాల్లో కూడా డిజిటల్ చెల్లింపులు సాధ్యం కాగలదని పదేళ్ల కిందట ఎవరైనా ఊహించారా? బ్యాంకు పనులు, బిల్లుల చెల్లింపు, దరఖాస్తు దాఖలు వంటి పనులన్నీ ఇంటి నుంచే చేసే వీలుంటుందని ఎవరైనా కలగన్నారా? ఎక్కడో సుదూర ప్రాంతంలో పనిచేసే కొడుకు గ్రామంలోని తనకు రెప్పపాటులో డబ్బు పంపగలడని తల్లిదండ్రులెవరైనా ఊహించారా? కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నేరుగా బ్యాంకు ఖాతాకు డబ్బు పంపితే తక్షణం పేదవాడి మొబైల్ ఫోన్‌లో ఆ సమాచారం కనిపిస్తుందని ఎవరైనా అనుకున్నారా? కానీ, ఇవన్నీ నేడు మన కళ్లముందు కనిపిస్తున్న వాస్తవాలు. మీకు గుర్తుండే ఉంటుంది... కాంగ్రెస్ ప్రధానమంత్రి ఒకరు సాక్షాత్తూ తన నేతృత్వంలోని సొంత ప్రభుత్వం గురించి ఒక మాటన్నారు. ఢిల్లీ నుంచి రూపాయి పంపితే, గ్రామానికి కేవలం 15 పైసలు మాత్రమే చేరితే, మిగిలిన 85 పైసలు దారిమళ్లుతున్నట్లు తానే ఆవేదన వ్యక్తం చేశారు. మరి, ఇన్నేళ్లూ అదే పరిస్థితి కొనసాగి ఉంటే, నేడు మన దుస్థితి ఎలా ఉండేదో మీరు ఒక్కసారి ఊహించుకోండి. బీజేపీ ప్రభుత్వం గత పదేళ్లలో రూ.34 లక్షల కోట్లకుపైగా ప్రజల ఖాతాలకు పంపింది. ఇదేమీ చిన్నాచితక మొత్తం కాదు... కానీ, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ‘డీబీటీ’ ద్వారా- అంటే ఢిల్లీ నుంచి నేరుగా మీ బ్యాంకు ఖాతాలకు జమ అయింది. ఇప్పుడు లెక్కగట్టండి.. కాంగ్రెస్‌ ప్రభుత్వమే కొనసాగి ఉంటే- రూపాయికి 15 పైసలు మాత్రమే గ్రామాలకు చేరే దుస్థితి ఫలితంగా రూ.34 లక్షల కోట్లలో దళారులే రూ.29 లక్షల కోట్లు స్వాహా చేసి ఉండేవారు.

ఇక ‘ముద్ర’ యోజన కింద బీజేపీ ప్రభుత్వం యువతకు ఉపాధి-స్వయం ఉపాధి కోసం రూ.28 లక్షల కోట్ల సహాయం అందించింది. అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి ఉంటే- అందులో దాదాపు రూ.24 లక్షల కోట్లు దళారులు కాజేసేవారు. అలాగే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద దాదాపు రూ.2.75 లక్షల కోట్లు రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశాం. అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి ఉంటే- ఆ సొమ్ములో దాదాపు రూ.2.25 లక్షల కోట్లు చేజిక్కించుకుని, రైతులకు ఉత్తచేతులు చూపేవారు. ఇటువంటి పరిస్థితులను బీజేపీ ప్రభుత్వం చక్కదిద్ది, పేదల హక్కులకు భరోసా ఇచ్చింది. అవినీతిని నిర్మూలిస్తే, అభివృద్ధి ప్రణాళికల అమలుకు బాటలు పడతాయి... ఉపాధికి అనేక అవకాశాలు అందివస్తాయి. ఆ మేరకు అనేక అభివృద్ధి పనులను బీజేపీ ప్రభుత్వం చేపట్టింది. దీంతో సమాంతరంగా విద్య, ఆరోగ్య ఆధునిక సౌకర్యాలు కూడా సిద్ధమవుతున్నాయి. దేశవ్యాప్తంగా విశాల రహదారులు, కొత్త రైలు మార్గాల నిర్మాణం వంటివన్నీ నేటి బీజేపీ సుపరిపాలన ఫలితమే.

సోదరీసోదరులారా!

ప్రస్తుత 21వ శతాబ్దపు ఆధునిక అవసరాలను తీర్చగల ప్రాజెక్టుల ద్వారా ‘వికసిత ఛత్తీస్‌గఢ్’ కల తప్పక నెరవేరుతుంది. రాష్ట్రం అభివృద్ధి చెందితే, భారత పురోగమనాన్ని ఆపగల శక్తి ఏదీ ఉండదు. రాబోయే ఐదేళ్లలో భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించినపుడు ఛత్తీస్‌గఢ్ కూడా సమున్నత ప్రగతి శిఖరాలకు చేరుతుంది. కాబట్టి, తొలిసారి ఓటర్లు... ముఖ్యంగా పాఠశాలలు-కళాశాలల్లో చదివే యువ విద్యార్థులకు ఇదొక అరుదైన అవకాశం. ‘వికసిత ఛత్తీస్‌గఢ్’ వారి కలలను తప్పక నెరవేరుస్తుంది. ఈ నేపథ్యంలో నేటి అభివృద్ధి కార్యక్రమాలపై మీకందరికీ మరోసారి నా శుభాభినందనలు.

ధన్యవాదాలు!

గమనిక: ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి ఇది స్వేచ్ఛానువాదం మాత్రమే.

 

***


(रिलीज़ आईडी: 2170555) आगंतुक पटल : 18
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , Bengali , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam