ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అనువాదం: గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో నిర్వహించిన ‘సముద్ర సే సమృద్ధి’ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 20 SEP 2025 2:33PM by PIB Hyderabad

గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్.. కేంద్ర మంత్రి మండలిలో నా సహచరులు సర్బానంద సోనోవాల్, సీ.ఆర్. పాటిల్, మన్‌సుఖ్‌ మాండవీయ, శంతనూ ఠాకూర్, నిముబెన్ బంభానియా… దేశవ్యాప్తంగా 40కి పైగా ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రముఖులు, అన్ని ప్రధాన ఓడరేవులకు సంబంధించిన వివిధ రాష్ట్రాల మంత్రులు, సీనియర్ అధికారులు, ఇతర విశిష్ట అతిథులు, నా ప్రియమైన సోదరీసోదరులారా.. మీ అందరికీ నా శుభాకాంక్షలు!

భావ్‌నగర్‌లో ఒక ఉత్తేజకరమైన వాతావరణం కనిపిస్తోంది. వేదిక ముందున్న జన సంద్రం నాకు కనిపిస్తోంది. ఇంత పెద్ద జనసమూహం నాకు ఆశీస్సులు ఇచ్చేందుకు వచ్చింది. మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

ఈ కార్యక్రమం భావ్‌నగర్‌లో జరుగుతున్నప్పటికీ దేశం మొత్తానికి సంబంధించినది ఇది. 'సముద్ర సే సమృద్ధి' దిశగా భారత్ చేసే ప్రయాణానికి నేడు భావ్‌నగర్ ఒక మాధ్యమంగా ఉంది. ఈ ముఖ్యమైన కార్యక్రమానికి భావ్‌నగర్‌ వేదికగా ఎంపికైంది. గుజరాత్, భావ్‌నగర్ ప్రజలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. 

మిత్రులారా, 

సెప్టెంబర్ 17న మీరంతా నాకు శుభాకాంక్షలు పంపారు. దేశంలోని అన్ని ప్రాంతాలు, ప్రపంచ నలుమూలల నుంచి నాకు శుభాకాంక్షలు వచ్చాయి. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేయటం అసాధ్యం. ప్రపంచదేశాలతో పాటు దేశం మొత్తం నాకు లభించిన ప్రేమ, ఆశీర్వాదాలే నా గొప్ప సంపద, బలం. అందుకే బహిరంగంగా అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఒక కుమార్తె ఒక ఒక చిత్రపటం తెచ్చింది. అక్కడొక కుమారుడు కూడా ఒక చిత్రపటం తెచ్చాడు. మిత్రులారా దయచేసి వాటిని తీసుకొని రండి. ఈ పిల్లలకు నేను ఆశీర్వదిస్తున్నాను. వారిని తీసుకొవచ్చిన వారికి నా ధన్యవాదాలు. మీ ఆప్యాయతకు నేను కృతజ్ఞతతో ఉంటాను. మీరు చేసిన ఈ ప్రయత్నానికి ధన్యవాదాలు… పిల్లలారా ధన్యవాదాలు.. మిత్రమా ధన్యవాదాలు.

మిత్రులారా, 

విశ్వకర్మ జయంతి నుంచి గాంధీ జయంతి వరకు.. అంటే సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది సేవా పఖ్వాడను (పక్షం రోజుల సేవ) చేసుకుంటున్నారు. గుజరాత్‌లో సేవా పఖ్వాడ 15 రోజులే అయినప్పటికీ కూడా గత రెండు, మూడు రోజుల్లో అనేక కార్యక్రమాలు నిర్వహించినట్లు నాకు తెలిసింది. రక్తదాన శిబిరాలు వందల సంఖ్యలో ఏర్పాటు చేసి, వాటిలో ఇప్పటికే లక్ష మంది రక్తదానం చేశారు. గుజరాత్ గురించి నాకు కొన్ని విషయాలు తెలిశాయి. అనేక నగరాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించారు. లక్షలాది మంది వీటిలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 30,000 కంటే ఎక్కువ ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ఇది చాలా పెద్ద సంఖ్య. ఇక్కడ రోగ నిర్ధారణతో పాటు చికిత్సలను ప్రజలు పొందుతున్నారు. ఇక్కడ ముఖ్యంగా మహిళల ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాల్లో నిమగ్నమైన ప్రతి ఒక్కరినీ నేను అభినందిస్తున్నాను. వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా, 

ఈ సమావేశం మొదట్లో శ్రీ కృష్ణ కుమార్ సింగ్ గారిని నేను గుర్తుచేశాను. సర్దార్ పటేల్ మిషన్‌లో చేరి ఆయన భారత ఐక్యతకు గొప్ప కృషి చేశారు. అటువంటి దేశభక్తుల నుంచి ప్రేరణ పొందిన మనం ఈ రోజు భారత ఐక్యతను పెంచటంతో పాటు "ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్" స్ఫూర్తిని బలోపేతం చేస్తున్నాం. 

మిత్రులారా, 

పవిత్ర నవరాత్రి పండుగ ప్రారంభం కానున్న ప్రస్తుత సమయంలో నేను భావ్‌నగర్‌కు వచ్చాను. ఈసారి జీఎస్టీ తగ్గింపు కారణంగా మార్కెట్లు మరింత ఉత్తేజంతో ఉంటాయి. ఈ పండుగ ఉత్సాహం మధ్యన మనం ఇవాళ 'సముద్ర సే సమృద్ధి' అనే గొప్ప పండుగను చేసుకుంటున్నాం. భావ్‌నగర్ సోదరులారా.. నన్ను క్షమించాలి. దేశవ్యాప్తంగా ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందున నేను ఈ రోజు హిందీలో మాట్లాడాలి. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఒక కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నందున వల్ల నేను మీకు క్షమాపణ చెబుతూ హిందీలో మాట్లాడుతున్నాను. 

మిత్రులారా, 

21వ శతాబ్దపు భారత్ సముద్రాన్ని ఒక గొప్ప అవకాశంగా చూస్తోంది. ఓడరేవు ఆధారిత అభివృద్ధిని వేగవంతం చేసేందుకు కొద్దిసేపటి క్రితమే వేల కోట్ల విలువైన ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశాను. దేశంలో క్రూయిజ్ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ముంబయిలోని అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ ఇవాళ ప్రారంభమైంది. భావ్‌నగర్, గుజరాత్ అభివృద్ధికి సంబంధించిన అనేక ప్రాజెక్టులు కూడా ప్రారంభమయ్యాయి. దేశ ప్రజలందరికీ, గుజరాత్ ప్రజలకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 

మిత్రులారా, 

భారత్‌ నేడు "వసుధైవ కుటుంబం" అంటే ప్రపంచమంతా ఒకటే కుటుంబం అనే స్ఫూర్తితో ముందుకెళ్తోంది. మనకు ప్రపంచంలో గొప్ప శత్రువు ఎవరూ లేరు. వాస్తవానికి ఇతర దేశాలపై ఆధారపడటం అనేదే మనకున్న ఏకైక శత్రువు. అదే మన అతిపెద్ద ప్రత్యర్థి. ఆధారపడటమనే ఈ శత్రువును అధిగమించాలి. విదేశాలపై ఎక్కువగా ఆధారపడటం అంటే అంతే ఎక్కువగా జాతీయ వైఫల్యం ఉందన్న విషయాన్ని మనం నిరంతరం గుర్తు చేసుకోవాలి. ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం అత్యధిక జనాభా కలిగిన దేశం స్వావలంబనగా మారాలి. ఇతరులపై ఆధారపడి ఉంటే మన ఆత్మగౌరవం దెబ్బతింటుంది. 140 కోట్ల మంది భారతీయుల భవిష్యత్తును ఇతరుల దయకు వదిలిపెట్టలేం. దేశాభివృద్ధి లక్ష్యాలు విదేశాలపై ఆధారపడి ఉండటాన్ని మనం అనుమతించలేం. మన రాబోయే తరాల భవిష్యత్తును మనం ఫణంగా పెట్టలేం.

కాబట్టి సోదరీసోదరులారా, 

గుజరాతీలో ‘వంద వ్యాధులకు ఒకే మందు ఉంది’ అని మనం అంటుంటాం. ఆ మందే స్వావలంబన భారత్. దీనికోసం మనం సవాళ్లను నేరుగా ఎదుర్కోవటంతో పాటు విదేశాలపై ఆధారపడటాన్ని ఎల్లప్పుడూ తగ్గించుకుంటూ ఉండాలి. ప్రపంచంలో స్వావలంబన దేశంగా భారత్ బలంగా నిలబడాలి.

సోదరీసోదరులారా, 

భారతదేశంలో సామర్థ్యానికి కొరత లేదు. కానీ స్వాతంత్ర్యం తర్వాత కాంగ్రెస్ పార్టీ దేశ సామర్థ్యాన్ని పూర్తిగా విస్మరించింది. అందుకే ఆరు, ఏడు దశాబ్దాల స్వాతంత్ర్యం తర్వాత కూడా భారత్‌ అందుకోవాల్సిన వాస్తవ విజయాన్ని సాధించలేకపోయింది. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం దేశాన్ని చాలా కాలంగా లైసెన్స్ రాజ్‌లో చిక్కుకొని ఉండేలా చేసి.. ప్రపంచ మార్కెట్లకు మనల్ని దూరం చేసింది. ప్రపంచీకరణతో భాగంగా ఆ ప్రభుత్వం దిగుమతులకు మాత్రమే ద్వారాలు తెరిచింది. ఇందులో కూడా వేల కోట్ల విలువైన కుంభకోణాలు జరిగాయి. ఈ విధానాల వల్ల దేశంలోని యువతకు అపారమైన నష్టం జరగటంతో పాటు భారత్‌కు ఉన్న నిజమైన సామర్థ్యం బయట పడలేదు. 

మిత్రులారా, 

దేశం ఎదుర్కొన్న నష్టాల ఏ స్థాయిలో ఉన్నాయో సరకు రవాణా రంగంలో స్పష్టంగా తెలుస్తోంది. భారత్ శతాబ్దాలుగా సముద్రాల విషయంలో గొప్ప శక్తిగా ఉందని మీ అందరికి బాగా తెలుసు. ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద నౌకానిర్మాణ కేంద్రాలలో మనం ఒకటిగా ఉన్నాం. తీరప్రాంత రాష్ట్రాలలో తయారుచేసిన నౌకల ద్వారా అంతర్గగ వాణిజ్యంతో పాటు విదేశీ వాణిజ్యం జరిగింది. యాభై సంవత్సరాల క్రితం కూడా మనం భారత్‌లో తయారైన నౌకలను ఉపయోగించాం. ఆ సమయంలో భారత దిగుమతులు, ఎగుమతులలో 40 శాతం కంటే ఎక్కువ భారతలో తయారైన ఓడలే నిర్వహించాయి. కానీ సరకు రవాణా రంగం కూడా కాంగ్రెస్ లోపభూయిష్ట విధానాలకు బలైంది. భారత్‌లో నౌకానిర్మాణ రంగాన్ని బలోపేతం చేయడానికి బదులుగా కాంగ్రెస్ పార్టీ విదేశీ ఓడలకు అద్దె చెల్లించేందుకు మొగ్గు చూపింది. ఫలితంగా భారత్‌లోని నౌకానిర్మాణ వ్యవస్థ కుప్ప కూలిపోయింది. దీనివల్ల విదేశీ నౌకలపై ఆధారపడటం అనేది మనకు తప్పనిసరిగా మారింది. ఒకప్పుడు మన వాణిజ్యంలో 40 శాతాన్ని భారతీయ నౌకలపైనే నిర్వహించేవి. నేడు ఇది కేవలం 5 శాతానికి పడిపోయింది. అంటే మన వాణిజ్యంలో 95 శాతం విదేశీ నౌకలపైనే ఆధారపడుతున్నాం. ఇది మనకు చాలా నష్టం కలిగించింది.

మిత్రులారా, 

నేను దేశానికి కొన్ని గణంకాలు చెప్పాలనుకుంటున్నాను. ప్రజలు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే.. ప్రతి సంవత్సరం భారత్ దాదాపు 75 బిలియన్ డాలర్లు అంటే ఆరు లక్షల కోట్ల రూపాయలను విదేశీ సరకు రవాణా కంపెనీలకు చెల్లిస్తోంది. ఇది దాదాపు ప్రస్తుత రక్షణ బడ్జెట్‌తో సమానం. ఏడు దశాబ్దాలుగా మనం విదేశాలకు ఎంత మొత్తం చెల్లించామో ఊహించుకోండి. మన సొమ్ము విదేశాల్లో లక్షలాది ఉద్యోగాలు సృష్టించింది. క్రితం ప్రభుత్వాలు ఇందులో కొంత మొత్తాన్నైనా మన సరకు రవాణా పరిశ్రమలలో పెట్టుబడి పెట్టి ఉంటే.. ఇవాల్టి రోజున ప్రపంచం మన ఓడలను ఉపయోగిస్తూ ఉండేది. సరకు రవాణాలో మనం లక్షల కోట్లు సంపాదిస్తూ ఉండేవాళ్లం. అంతేకాకుండా మనం డబ్బులను భారీగా ఆదా చేసి ఉండేవాళ్లం. 

మిత్రులారా,

మనం 100 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలు జరుపుకునే 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే స్వావలంబన ఒక్కటే మార్గం. దీనికి ప్రత్యామ్నాయం లేదు. 140 కోట్ల మంది భారతీయుల సంకల్పం ఒకటిగా ఉండాలి - అది చిప్ అయినా, ఒక నౌక అయినా.  మనం దానిని భారత్ లోనే తయారు చేయాలి. ఈ దృక్పథంతో, భారత సముద్ర రంగం తదుపరి తరం సంస్కరణలను చేపడుతోంది. నేటి నుంచి దేశంలోని ప్రతి ప్రధాన నౌకాశ్రయం అనేక రకాల  పత్రాలు, వివిధ  ప్రక్రియల నుంచి విముక్తి పొందుతుంది. ''ఒక దేశం, ఒక పత్రం' ,  ''ఒక దేశం, ఒక నౌకాశ్రయ ప్రక్రియ'' లు వ్యాపారాన్ని మరింత సులభతరం  చేస్తాయి మన మంత్రి సర్బానంద సోనోవాల్  చెప్పినట్లుగా, ఇటీవలి పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో మేం అనేక పాత వలస పాలన నాటి చట్టాలను సవరించాం.  మేము సముద్ర రంగంలో అనేక వరస సంస్కరణలను ప్రారంభించాం. మా ప్రభుత్వం ఐదు సముద్ర చట్టాలను కొత్త రూపంలో ప్రవేశపెట్టింది. ఇవి నౌకా   రంగంలో, ఓడరేవుల నిర్వహణలో గణనీయమైన మార్పులను తీసుకువస్తాయి.

మిత్రులారా,

భారీ నౌకలను నిర్మించడంలో భారత్ శతాబ్దాలుగా నైపుణ్యం కలిగివుంది. తరువాతి తరం సంస్కరణలు ఈ పూర్వ  వైభవాన్ని పునరుద్ధరించడానికి సహాయపడతాయి. గత దశాబ్దంలో,  40 కి పైగా నౌకలు,  జలాంతర్గాములను నావికాదళంలోకి చేర్చాం. ఒకటి లేదా రెండు మినహా, ఇవన్నీ భారత్ లోనే తయారయ్యాయి.  మీరు ఐఎన్ఎస్ విక్రాంత్ గురించి వినే ఉంటారు ఈ శక్తివంతమైన నౌక పూర్తిగా భారత్ లో తయారైంది. ఇందులో ఉపయోగించిన అధిక నాణ్యత గల ఉక్కు కూడా భారత్ లోనే ఉత్పత్తి అయింది. ఇది మనకు సామర్థ్యం ఉందని, నైపుణ్యానికి కొరత లేదని రుజువు చేస్తుంది. పెద్ద నౌకల నిర్మాణానికి కావలసింది రాజకీయ సంకల్పం. ఈ సంకల్పంతో ముందుకు వెడతామని  నా తోటి పౌరులకు నేను హామీ ఇస్తున్నా.

మిత్రులారా,

భారత సముద్ర రంగాన్ని బలోపేతం చేయడానికి, నిన్న చారిత్రాత్మక నిర్ణయం జరిగింది. మేం ఒక ప్రధాన విధాన మార్పు చేశాం.  ప్రభుత్వం ఇప్పుడు భారీ  నౌకలను మౌలిక సదుపాయాలుగా గుర్తించింది. ఏ రంగాన్ని అయినా మౌలిక సదుపాయంగా గుర్తించినప్పుడు, అది అపారమైన ప్రయోజనాలను పొందుతుంది. అలాగే నౌకా నిర్మాణ కంపెనీలు ఇప్పుడు బ్యాంకు రుణాలు పొందడం సులభం అవుతుంది, వారికి వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి.  మౌలిక సదుపాయాల ఫైనాన్సింగ్  ప్రయోజనాలన్నంటినీ పొందగలుగుతారు. ఈ నిర్ణయం భారతీయ షిప్పింగ్ కంపెనీలపై భారాన్ని తగ్గిస్తుంది. ప్రపంచ స్థాయిలో  పోటీ పడటానికి సహాయపడుతుంది.

మిత్రులారా,

భారత్ ను గొప్ప సముద్ర శక్తిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం మూడు ప్రధాన పథకాలపై కూడా పనిచేస్తోంది. ఈ పథకాలు నౌకా నిర్మాణ రంగానికి ఆర్థిక సహాయాన్ని  సులభతరం చేస్తాయి, మన నౌకాశ్రయాలు ఆధునిక సాంకేతికతను అన్వయింపచేసుకోవడానికి తోడ్పడతాయి. అలాగే డిజైన్, నాణ్యతను మెరుగుపరుస్తాయి. రాబోయే సంవత్సరాల్లో వీటిపై రూ.70,000 కోట్లకు పైగా ఖర్చు చేయనున్నాం.

మిత్రులారా,

2007లో, నేను ఇక్కడ ముఖ్యమంత్రిగా మీకు సేవ చేస్తున్నప్పుడు, గుజరాత్ నౌకా నిర్మాణ అవకాశాలపై ఒక భారీ సదస్సు  నిర్వహించిన విషయం నాకు గుర్తుంది. ఆ సమయంలో  గుజరాత్ లో నౌకా నిర్మాణ పర్యావరణ అనుకూల వ్యవస్థకు మేం మద్దతు ఇచ్చాం.  ఇప్పుడు  దేశవ్యాప్తంగా నౌకా నిర్మాణం కోసం మేం సమగ్ర చర్యలు తీసుకుంటున్నాం.  నౌకా నిర్మాణం సాధారణ పరిశ్రమ కాదని ఇక్కడి నిపుణులకు తెలుసు. ప్రపంచవ్యాప్తంగా దీనిని "అన్ని పరిశ్రమలకు తల్లి" అని పిలుస్తారు. ఎందుకంటే ఇది కేవలం నౌకను తయారు చేయడం గురించి మాత్రమే కాదు. దీనితో అనేక అనుబంధ పరిశ్రమలు  విస్తరిస్తాయి: ఉక్కు, యంత్రాలు, ఎలక్ట్రానిక్స్, వస్త్రాలు, పెయింట్లు, ఐటి వ్యవస్థలు, ఇలా ఇంకా మరెన్నో. నౌకా పరిశ్రమ చిన్న, మధ్యతరహా పరిశ్రమలు,   ఎంఎస్ఎంఈలతో సహా ఎన్నో  రంగాలకు మద్దతు ఇస్తుంది. నౌకా నిర్మాణంలో పెట్టుబడి పెట్టిన ప్రతి రూపాయి ఆర్థిక వ్యవస్థలో దాదాపు రెట్టింపు పెట్టుబడులను సృష్టిస్తుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఒక షిప్ యార్డులో కల్పించిన  ప్రతి ఉద్యోగం సరఫరా శ్రేణిలో  ఆరు నుంచి ఏడు కొత్త ఉద్యోగాలకు దారితీస్తుంది. అంటే నౌకా నిర్మాణంలో 100 ఉద్యోగాలను సృష్టిస్తే,  సంబంధిత రంగాలలో 600 కంటే ఎక్కువ ఉద్యోగాలు లభిస్తాయి. నౌకా నిర్మాణం అలాంటి విస్తృత ప్రభావం కలిగివుంది. 

మిత్రులారా,

నౌకా నిర్మాణానికి అవసరమైన నైపుణ్యాలపై కూడా మేం దృష్టి పెట్టాం. మన ఐటీఐలు ఇందులో పాత్ర పోషిస్తాయి, మన మారిటైమ్ యూనివర్శిటీ పాత్ర కూడా పెరుగుతుంది. ఇటీవలి సంవత్సరాలలో  నేవీ, ఎన్సీసీ  మధ్య సమన్వయం ద్వారా తీర ప్రాంతాల్లో కొత్త వ్యవస్థలను ఏర్పాటు చేశాం. ఎన్సీసీ  క్యాడెట్లను నావికాదళం కోసం మాత్రమే కాకుండా వాణిజ్య రంగంలో  పాత్ర పోషించడానికి కూడా సిద్ధం చేస్తాం. 

మిత్రులారా,

నేటి భారత్ కొత్త స్ఫూర్తితో ముందుకు సాగుతోంది. మనం నిర్దేశించుకున్న లక్ష్యాలను ఇప్పుడు ముందుగానే సాధిస్తున్నాం. సౌర శక్తిలో భారత్ తన లక్ష్యాలను నాలుగైదు సంవత్సరాల ముందుగానే చేరుకుంటోంది. అదేవిధంగా, ఓడరేవుల ఆధారిత అభివృద్ధిలో 11 సంవత్సరాల క్రితం మనం నిర్దేశించిన లక్ష్యాలు విజయవంతంగా పూర్తి అవుతున్నాయి. పెద్ద నౌకల కోసం ప్రధాన ఓడరేవులను నిర్మిస్తున్నాం. సాగరమాల వంటి పథకాల ద్వారా ఓడరేవు కనెక్టివిటీని పెంచుతున్నాం. 

మిత్రులారా,

గత 11 ఏళ్లలో భారత్ తన ఓడరేవు సామర్థ్యాన్ని రెట్టింపు చేసింది. 2014కి ముందు, భారతదేశంలో సగటు షిప్ టర్నరౌండ్ సమయం రెండు రోజులు. ఈ రోజు అది ఒక రోజు కంటే తక్కువ. మేం కొత్త, పెద్ద ఓడరేవులను నిర్మిస్తున్నాం. ఇటీవల, భారత  మొట్టమొదటి డీప్-వాటర్ కంటైనర్ ట్రాన్స్-షిప్మెంట్ పోర్ట్ కేరళలో ప్రారంభమైంది. మహారాష్ట్రలో వధావన్ పోర్ట్ ను 75,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇది ప్రపంచంలోని మొదటి పది ప్రధాన ఓడరేవులలో ఒకటిగా ఉంటుంది.

మిత్రులారా,

ప్రస్తుతం ప్రపంచ సముద్ర వాణిజ్యంలో భారత్ వాటా కేవలం 10 శాతం మాత్రమే. దీనిని మనం పెంచాలి. 2047 నాటికి, ప్రపంచ సముద్ర వాణిజ్యంలో మన వాటాను మూడు రెట్లు పెంచాలని  లక్ష్యంగా పెట్టుకున్నాం.  మేం దీన్ని సాధిస్తాం. 

మిత్రులారా,

మన సముద్ర వాణిజ్యం పెరిగేకొద్దీ, మన నావికుల సంఖ్య కూడా పెరుగుతుంది. కష్టపడి పనిచేసే ఈ నిపుణులు సముద్రంలో నౌకలను నడుపుతారు, ఇంజన్లు,   యంత్రాలను నిర్వహిస్తారు.  లోడింగ్ అన్లోడింగ్ ను పర్యవేక్షిస్తారు. ఒక దశాబ్దం క్రితం, భారతదేశంలో 1.25 లక్షల కంటే తక్కువ మంది నావికులు ఉన్నారు. నేడు వారి సంఖ్య మూడు లక్షలు దాటింది. ప్రపంచానికి నావికులను అందిస్తున్న  చేస్తున్న మొదటి మూడు దేశాలలో  ఇప్పుడు భారత్ కూడా ఉంది. ఇది మన యువతకు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తోంది. ఈ విధంగా, అభివృద్ధి చెందుతున్న భారత  షిప్పింగ్ పరిశ్రమ కూడా ప్రపంచాన్ని బలోపేతం చేస్తోంది.

మిత్రులారా,

భారతదేశానికి సుసంపన్నమైన సముద్ర వారసత్వం ఉంది. మన మత్స్యకారులు, మన పురాతన ఓడరేవు నగరాలు దాని చిహ్నాలు. ఈ భావ్నగర్, ఈ సౌరాష్ట్ర దీనికి గొప్ప ఉదాహరణ. మనం ఈ వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించాలి. మన బలాన్ని ప్రపంచం ముందు ప్రదర్శించాలి. అందుకే లోథాల్ లో గ్రాండ్ మారిటైమ్ మ్యూజియంను నిర్మిస్తున్నాం. ఇది కూడా ప్రపంచంలోనే అతిపెద్ద మారిటైమ్ మ్యూజియం అవుతుంది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ మాదిరిగానే, ఇది భారత్ కు కొత్త గుర్తింపుగా మారుతుంది. త్వరలో, నేను  అక్కడికి కూడా వెళ్తాను.

మిత్రులారా,

భారత్ తీరాలు సౌభాగ్యానికి  ముఖద్వారాలుగా మారతాయి. నేను దూరదృష్టితో చూడగలను. భారత తీర ప్రాంతాలు మన సంపదకు ప్రవేశ మార్గాలుగా మారనున్నాయని నేను గర్వంగా చెప్పగలను. గుజరాత్ తీరప్రాంతం మరోసారి ఈ ప్రాంతానికి ఆశీర్వాదంగా మారుతున్నందుకు నాకు సంతోషంగా ఉంది. ఈ ప్రాంతం మొత్తం దేశానికి నౌకాశ్రయాల ఆధారిత అభివృద్ధికి కొత్త మార్గాన్ని చూపుతోంది. నేడు, భారతీయ ఓడరేవులు నిర్వహించే సరకు రవాణాలో  40% గుజరాత్ ఓడరేవుల ద్వారా వస్తుంది. త్వరలో, ఈ ఓడరేవులు కూడా డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ నుంచి ప్రయోజనం పొందుతాయి. ఇది దేశవ్యాప్తంగా వస్తువులను వేగంగా రవాణా చేయడానికి వీలు కల్పిస్తుంది. మన ఓడరేవుల సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది.

మిత్రులారా,

ఇక్కడ కూడా, ఒక ప్రధాన ఓడల విచ్ఛిన్న సౌకర్యం  అందుబాటులోకి రానుంది. అలాంగ్  లోని ఓడల విచ్ఛిన్న యార్డ్ దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణ, ఇది మన యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. 

మిత్రులారా,

వికసిత్ భారత్ కోసం మనం ప్రతి రంగంలో, , ప్రతి విభాగంలో పని వేగం పెంచాలి.  వికసిత్ భారత్‌కు మార్గం ఆత్మనిర్భర్ భారత్ మీదుగా  వెళుతుందని మనందరికీ తెలుసు. అందువల్ల, మనం గుర్తుంచుకోవాలి. మనం కొనుగోలు చేసేది ఏదైనా స్వదేశీ అయి ఉండాలి. మనం అమ్మేది ఏదైనా స్వదేశీ అయి ఉండాలి. దుకాణదారులందరూ తమ దుకాణాల్లో "ఇది స్వదేశీ" అనే పోస్టర్ ను ప్రదర్శించాలని నేను కోరుతున్నా. ఈ ప్రయత్నం ప్రతి పండుగను భారతదేశ సౌభాగ్య వేడుకగా మారుస్తుంది. ఈ స్ఫూర్తితో మీ అందరికీ మరోసారి నవరాత్రి శుభాకాంక్షలు.  

చిన్న పిల్లవాడు చాలా సేపటి నుంచి  ఒక చిత్రాన్ని పట్టుకొని ఇక్కడ నిలబడి ఉన్నాడు. అతని చేతులు నొప్పిగా ఉండి ఉంటాయి. దయచేసి అది అతని చేతిలో నుంచి తీసుకోండి. శభాష్ బాబూ! నీ చిత్రం అందింది. ఏడ్వాల్సిన అవసరం లేదు. అది అందింది. దానిపై నీ చిరునామా రాసి ఉంటే, నేను తప్పకుండా నీకు ఒక ఉత్తరం రాస్తాను.

మిత్రులారా,

ఇంత చిన్న పిల్లల ప్రేమ కంటే గొప్ప నిధి జీవితంలో ఏముంటుంది? నాకు ఘన స్వాగతం, ఆతిథ్యం, గౌరవం ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు. నాకు బాగా తెలుసు, ఆపరేషన్ సిందూర్ నిర్వహించినప్పుడు, భావ్నగర్ మొత్తం రంగంలో ఉంది. మీ స్ఫూర్తి నాకు తెలుసు. అందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.  భావ్‌నగర్ సోదరీసోదరులారా, ఆత్మనిర్భర్ భారత్ సందేశం దేశమంతటా మారుమ్రోగేలా, మీరు నవరాత్రి మండపం నుంచి మీ గొంతులు వినిపించండి.

హృదయపూర్వక ధన్యవాదాలు, నా సోదరులారా!

 

***

 


(Release ID: 2169367)