ప్రధాన మంత్రి కార్యాలయం
అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలో రేపు (22 సెప్టెంబర్) ప్రధానమంత్రి పర్యటన
అరుణాచల్ ప్రదేశ్ లోని అపారమైన జలవిద్యుత్తు సామర్థ్యాన్ని వినియోగించుకునేలా ఇటానగర్ లో రూ. 3,700 కోట్ల పైగా విలువైన రెండు భారీ జల విద్యుత్తు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న ప్రధానమంత్రి
జీవన ప్రమాణాలను మెరుగుపరిచే అనుసంధానం, ఆరోగ్యం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవం
త్రిపురలో మాతా త్రిపుర సుందరి ఆలయ సముదాయాన్ని సందర్శించి, అభివృద్ధి పనులను ప్రారంభించనున్న ప్రధానమంత్రి
Posted On:
21 SEP 2025 9:54AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సెప్టెంబర్ 22వ తేదీన అరుణాచల్ ప్రదేశ్ , త్రిపుర రాష్ట్రాల్లో పర్యటిస్తారు. అరుణాచల్ ప్రదేశ్ లోని ఇటానగర్ లో 5,100 కోట్ల రూపాయల పైగా విలువైన అనేక అభివృద్ధి పథకాలకు ఆయన శంకుస్థాపన చేస్తారు. బహిరంగసభలో ప్రసంగిస్తారు.
ఆ తరువాత, ఆయన త్రిపురలో మాతా త్రిపుర సుందరి ఆలయాన్ని దర్శించి పూజకార్యక్రమాలలో పాల్గొంటారు. మాతా త్రిపుర సుందరి ఆలయ సముదాయం' అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు.
అరుణాచల్ ప్రదేశ్ లో ప్రధానమంత్రి కార్యక్రమాలు
అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో విస్తారమైన జలవిద్యుత్ సామర్థ్యాన్ని వినియోగించుకుంటూ సుస్థిరమైన ఇంధన ఉత్పత్తిని ప్రోత్సహించడం కోసం ఇటానగర్‌లో రూ. 3,700 కోట్లకు పైగా విలువైన రెండు భారీ జలవిద్యుత్ ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని సియోం ఉప పరివాహక ప్రాంతంలో హియో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ (240 మెగావాట్లు), టాటో-I హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ (186 మెగావాట్లు) లను అభివృద్ధి చేస్తారు.
తావాంగ్‌లో అత్యాధునిక కన్వెన్షన్ సెంటర్‌కు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. సముద్ర మట్టానికి 9,820 అడుగుల ఎత్తులో ఉన్న సరిహద్దు జిల్లా తావాంగ్‌లో నిర్మించే ఈ కన్వెన్షన్ సెంటర్ జాతీయ, అంతర్జాతీయ సమావేశాలు, సాంస్కృతిక ఉత్సవాలు, ప్రదర్శనలను నిర్వహించడానికి ఒక ఒక ప్రతిష్ఠాత్మక వేదికగా నిలుస్తుంది. 1,500 మందికి పైగా ప్రతినిధులకు ఆతిథ్యం ఇవ్వగల సామర్థ్యంతో ఈ కేంద్రం అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ప్రాంత పర్యాటక, సాంస్కృతిక సామర్థ్యాలను మరింత అభివృద్ధి చేయడానికి తోడ్పడుతుంది.
రూ.1,290 కోట్లకు పైగా విలువైన పలు కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. వీటిలో రవాణా అనుసంధానం, ఆరోగ్యం, అగ్ని మాపక భద్రత, ఉద్యోగినుల వసతి గృహాలు మొదలైనవి ఉన్నాయి. ఇవి ఈ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేసి, జీవన ప్రమాణాలను మెరుగుపరచి, అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తాయని భావిస్తున్నారు.
వ్యాపార సౌలభ్యం కల్పించి, ప్రోత్సాహకరమైన పారిశ్రామిక వాతావరణాన్ని అభివృద్ధి చేయాలన్న తమ ఉద్దేశానికి అనుగుణంగా, ప్రధానమంత్రి స్థానిక పన్ను చెల్లింపుదారులు, వ్యాపారులు, పరిశ్రమ ప్రతినిధులతో సమావేశమై, ఇటీవలి జీఎస్టీ రేట్ల సవరణ ప్రభావంపై కూడా చర్చించనున్నారు.
త్రిపురలో ప్రధానమంత్రి కార్యక్రమాలు
దేశంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని అభివృద్ధి చేసి, సంరక్షించాలన్న నిబద్ధతకు అనుగుణంగా, పునరుజ్జీవనం, ఆధ్యాత్మిక వారసత్వ అభివృద్ధి (ప్రసాద్) పథకం కింద మాతబరిలోని మాత త్రిపురసుందరి దేవాలయ సముదాయం అభివృద్ధి పనులను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. పురాతన 51 శక్తి పీఠాలలో ఒకటైన . ఈ ఆలయం త్రిపుర రాష్ట్రంలోని గోమతి జిల్లా ఉదయపూర్ పట్టణంలో ఉంది.
ఈ ప్రాజెక్టు పైనుంచి చూడగానే తాబేలు ఆకారంలో కనిపించేలా రూపుదిద్దుకోనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఆలయ ప్రాంగణంలో మార్పులుచేస్తారు. కొత్త దారులు నిర్మిస్తారు. ప్రవేశ ద్వారాలను పునరుద్ధరిస్తారు. ప్రహరీ, డ్రైనేజ్ వ్యవస్థ, స్టాళ్లు, ధ్యాన మందిరం, అతిథుల వసతి గృహాలు, కార్యాలయ గదులు మొదలైన వాటితో కూడిన కొత్త మూడు అంతస్తుల సముదాయాన్ని నిర్మిస్తారు. ఈ ప్రాంతంలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి, ఉద్యోగాలను, వ్యాపార అవకాశాలను సృష్టించడానికి, సమగ్ర సామాజిక-ఆర్థిక అభివృద్ధికి ఈ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషిస్తుంది.
***
(Release ID: 2169362)
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam