ప్రధాన మంత్రి కార్యాలయం
పరీక్షా పే చర్చ 2024లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లితండ్రులతో మాట్లాడిన ప్రధానమంత్రి
“మన పిల్లలలో సహనశక్తిని పెంపొందించి ఒత్తిళ్లను ఎదుర్కోవడంలో సహాయంగా ఉండడం ఎంతో ముఖ్యం”
"విద్యార్థులు ఎదుర్కొంటున్న సవాళ్లను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలసి పరిష్కరించాలి"
"ఆరోగ్యకరమైన పోటీతోనే విద్యార్థుల వికాసం”
“ఉపాధ్యాయులది ఉద్యోగ పాత్ర కాదు. విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దే బాధ్యత వారిపై ఉంది”
"తల్లిదండ్రులు పిల్లల రిపోర్ట్ కార్డులను వారి విజిటింగ్ కార్డుగా మార్చుకోకూడదు"
“విద్యార్థులు, ఉపాధ్యాయుల బంధం పాఠ్యప్రణాళిక, పాఠ్యాంశాలకు అతీతంగా ఉండాలి"
"మీ పిల్లల మధ్య పోటీ, శత్రుత్వ బీజాలను ఎప్పుడూ నాటవద్దు. సొదరీసొదరులు ఒకరికొకరు స్ఫూర్తిదాయకం కావాలి"
"మీరు చేసే అన్ని పనులలోనూ, చదువులోనూ నిబద్ధతతో, నిర్ణయాత్మకంగా ఉండటానికి ప్రయత్నించండి"
"వీలైనంత వరకు సమాధానాలు రాయడం అలవాటు చేసుకోండి. మీరు ఆ అభ్యాసం కలిగి ఉంటే, పరీక్షా కేంద్రంలో ఒత్తిడి చాలావరకు తగ్గుతుంది”
“టెక్నాలజీ భారం కాకూడదు. దానిని విచక్షణాయుతంగా ఉపయోగించండి"
“సరైన సమయం అంటూ ఏదీ ఉండదు. కాబట్టి దాని కోసం వేచి చూడకండి. సవాళ్లు ఎదురవ
Posted On:
29 JAN 2024 1:39PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీ లోని భారత మండపంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లితండ్రులతో పరీక్షా పే చర్చా (పీపీసీ) ఏడో సంచికను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ ను ఆయన తిలకించారు. పరీక్షా పే చర్చ అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషితో నడిచే ఒక ఉద్యమం. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజాన్ని ఒక చోట చేర్చి, ప్రతి బిడ్డ ప్రత్యేక వ్యక్తిత్వాన్ని గౌరవించే, ప్రోత్సహించే, తనను తాను పూర్తిగా వ్యక్తీకరించుకునే వాతావరణాన్ని సృష్టించడం దీని ఉద్దేశం.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఎగ్జిబిషన్‌లో నూతన జాతీయ విద్యా విధానం వంటి ఆకాంక్షలు, భావనలపై వివిధ రూపాల్లో విద్యార్థులు ప్రదర్శించిన ఆవిష్కరణలను ప్రస్తావించారు. ఈ ఆవిష్కరణలు వివిధ అంశాల గురించి కొత్త తరాలు ఏమనుకుంటున్నారో, ఈ సమస్యలకు వారి వద్ద ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయో ప్రతిబింబిస్తున్నాయని ఆయన అన్నారు.
చర్చా వేదిక అయిన భారత మండపం ప్రాముఖ్యాన్ని గురించి విద్యార్థులకు వివరిస్తూ, ఇందులో జరిగిన జి-20 శిఖరాగ్ర సదస్సులో ప్రపంచంలోని ప్రధాన నాయకులందరూ కలసి ప్రపంచ భవిష్యత్తు పై చర్చించడం గురించి తెలిపారు.
బయటి నుంచి ఒత్తిడి, ఆందోళన
విద్యార్థులపై అదనపు ఒత్తిడి పెంచే సాంస్కృతిక సామాజిక అంచనాలు వంటి బాహ్య అంశాలను ఎదుర్కోవాల్సిన అవసరాన్ని ఒమన్‌లోని ఒక ప్రైవేట్ సీబీఎస్ఈ పాఠశాల విద్యార్థిని దానియా షాబు, ఢిల్లీ బురారీలోని గవర్నమెంట్ సర్వోదయ బాల విద్యాలయానికి చెందిన ఎం.డి. అర్ష్ ప్రస్తావించారు. ప్రధానమంత్రి మాట్లాడుతూ, ఏడో సంచిక అయినప్పటికీ సాంస్కృతిక, సామాజిక అంచనాలకు సంబంధించిన ప్రశ్నలు పీపీసీలో ప్రతీసారీ ప్రస్తావనకు వస్తూనేఉన్నాయని అన్నారు. విద్యార్థులపై బాహ్య ఒత్తిడి ప్రభావాన్ని తగ్గించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ఆయన స్పష్టం చేశారు. అలాగే తల్లిదండ్రులు కూడా ఈ అనుభవాన్ని తరచూ ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని, దానిని జీవితంలోని భాగంగా భావించి సిద్ధం కావాలని ప్రధానమంత్రి సూచించారు. అలవాటు పడిన ఒక వాతావరణ పరిస్థితి నుంచి మరో అతి విరుద్ధమైన వాతావరణ పరిస్థితికి ప్రయాణం చేయడాన్ని ఉదాహరణను చూపిస్తూ, మనసు ముందుగానే తీవ్రమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేలా సిద్ధమవుతుందని, అలాగే విద్యార్థులు కూడా మానసికంగా తమకు తామే సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఒత్తిడి స్థాయిని అంచనా వేసి, దాన్ని క్రమంగా పెంచుతూ ముందుకు సాగితే విద్యార్థుల సామర్థ్యానికి ఆటంకం కలగదని అన్నారు. వ్యవస్థీకృత సిద్ధాంతాన్ని అమలు చేయడం కంటే, ప్రక్రియను అభివృద్ధి చేసుకుంటూ వెళ్లే క్రమంలో విద్యార్థులు, కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు కలిసి బాహ్య ఒత్తిడి సమస్యను ఎదుర్కోవాలని శ్రీ మోదీ పిలుపునిచ్చారు. అలాగే, విద్యార్థుల కుటుంబాలు ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే విధానాలను చర్చించుకోవాలని ఆయన సూచించారు.
స్నేహితుల మధ్య ఒత్తిడి, పోటీ
స్నేహితుల మధ్య ఒత్తిడి, పోటీకి సంబంధించి అండమాన్,నికోబార్ దీవులలోని గవర్నమెంట్ డెమాన్‌స్ట్రేషన్ మల్టిపర్పస్ స్కూల్ కు చెందిన భాగ్యలక్ష్మి, గుజరాత్ లోని జెఎన్‌వి పంచమహల్ కు చెందిన దృష్టీ చౌహాన్, కేరళ లోని కోజికోడ్ కేంద్రీయ విద్యాలయానికి చెందిన స్వాతి దిలీప్ అడిగిన ప్రశ్నలకు ప్రధానమంత్రి సమాధానమిస్తూ, పోటీ ప్రాముఖ్యతను వివరించారు. అయితే, పోటీ ఆరోగ్యకరంగా ఉండాలని ఆయన ఉద్ఘాటించారు. చాలా సందర్భాలలో, అనారోగ్యకరమైన పోటీకి బీజాలు కుటుంబ పరిస్థితుల్లోనే పడతాయని, ఇది తోబుట్టువుల మధ్య విపరీతమైన పోటీకి దారితీస్తుందని ఆయన చెప్పారు. పిల్లల మధ్య పోలికలను మానుకోవాలని తల్లిదండ్రులను మోదీ కోరారు. ఆరోగ్యకరమైన రీతిలో పోటీ పడుతూనే ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి పిల్లలు ప్రాధాన్యం ఇచ్చిన వీడియో ఉదాహరణను ప్రధాన మంత్రి ఇచ్చారు. పరీక్షలలో బాగా రాణించడం అనేది సున్నా - మొత్తం ఆట కాదని, పోటీ ఎవరితోనో కాదు, మనతో మనకే అని ఆయన అన్నారు. స్నేహితుని మంచి ప్రదర్శన మన ప్రదర్శనకు ఏమాత్రం అడ్డు కాదని అన్నారు. ఈ ధోరణి, స్ఫూర్తిదాయకం కాని వారితో స్నేహం చేసేందుకు దారితీయవచ్చని ప్రధానమంత్రి పేర్కొన్నారు. తమ పిల్లలను ఇతరులతో పోల్చవద్దని ఆయన తల్లిదండ్రులను కూడా కోరారు. పిల్లల విజయాన్ని తమ విజిటింగ్ కార్డ్‌గా చేసుకోవద్దని కూడా ఆయన వారిని కోరారు. స్నేహితుల విజయాన్ని చూసి ఆనందించాలని ప్రధాని మోదీ విద్యార్థులకు సూచించారు. ‘స్నేహం అనేది లావాదేవీలతో కూడిన భావోద్వేగం కాదు’ అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
విద్యార్థులకు స్ఫూర్తినివ్వడంలో ఉపాధ్యాయుల పాత్ర
ఆంధ్రప్రదేశ్‌లోని ఉప్పరపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల సంగీత ఉపాధ్యాయుడు శ్రీ కొండకంచి సంపతరావు, అస్సాంలోని శివసాగర్‌కు చెందిన ఉపాధ్యాయుడు బంటీ మేడి అడిగిన ప్రశ్నలకు ప్రధానమంత్రి సమాధానమిస్తూ, విద్యార్థులను ప్రేరేపించడంలో ఉపాధ్యాయుల పాత్ర గురించి ప్రధానమంత్రి వివరించారు. ఒక తరగతికి మాత్రమే కాకుండా పాఠశాల మొత్తానికి చెందిన విద్యార్థుల ఒత్తిడిని సంగీతం దూరం చేయగలదని ప్రధానమంత్రి అన్నారు. తరగతి మొదటి రోజు నుంచి పరీక్షల సమయం వరకు విద్యార్థి, ఉపాధ్యాయుల అనుబంధాన్ని క్రమంగా విస్తరించాలని స్పష్టం చేశారు. ఇందువల్ల పరీక్షల సమయంలో ఒత్తిడిని పూర్తిగా తొలగిస్తుందని అన్నారు. కేవలం తాము బోధించే సబ్జెక్టుల ఆధారంగా మాత్రమే విద్యార్థులకు అందుబాటులో ఉండడం కాకుండా ఎల్లవేళలా వారితో సన్నిహితంగా ఉండాలని ఆయన ఉపాధ్యాయులను కోరారు. తమ రోగులతో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండే వైద్యులను ఉదాహరణగా పేర్కొంటూ, ఇఅటువంటి బంధం సగం నివారణగా పనిచేస్తుందని ప్రధానమంత్రి అన్నారు. విద్యార్థుల కుటుంబాలతో కూడా వ్యక్తిగత సంబంధాన్ని పెంచుకోవాలని, వారి ముందు విద్యార్థుల తెలివితేటలను అభినందించాలని ఆయన సూచించారు. “ఉపాధ్యాయులు ఉద్యోగ పాత్రలో లేరు. వారు విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దే బాధ్యతను మోస్తున్నారు” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
పరీక్షల ఒత్తిడిని జయించడం
పశ్చిమ త్రిపురలోని ప్రణవానంద విద్యా మందిర్‌కు చెందిన అద్రియా చక్రవర్తి, ఛత్తీస్‌గఢ్ బస్తర్‌లోని జవహర్ నవోదయ విద్యాలయ విద్యార్థి షేక్ తైఫుర్ రెహమాన్, ఒడిశా లోని కటక్ ఆదర్శ విద్యాలయ కు చెందిన రాజ్యలక్ష్మి ఆచార్య పరీక్షల సమయంలో ఒత్తిడిని ఎదుర్కోవడం గురించి ప్రధానమంత్రిని అడిగారు. తల్లిదండ్రుల అతి ఉత్సాహం లేదా విద్యార్థుల అతి చిత్తశుద్ధి వల్ల తప్పులు జరగకుండా చూసుకోవాల్సిన అవసరాన్ని ప్రధానమంత్రి వివరించారు. కొత్త బట్టలు, ఆచారాలు లేదా కొత్త వస్తువులతో పరీక్ష రోజున అతిగా హంగామా చేయవద్దని ఆయన తల్లిదండ్రులను కోరారు. చివరి నిమిషం వరకు సన్నద్ధమవుతూ ఉండవద్దని, మనసులో ఎలాంటి అలజడి లేకుండా పరీక్షలకు హాజరు కావాలని, అనవసరమైన ఒత్తిడికి దారితీసే కారణమయ్యే బయటి ప్రతికూలతలను దూరం చేసుకోవాలని ఆయన సూచించారు. చివరి నిమిషంలో ఎలాంటి భయం లేకుండా, ప్రశ్నపత్రాన్ని చదివి, తగిన సమయాన్ని కేటాయిస్తూ సమాధానాలు రాయాలని ప్రధానమంత్రి వారికి సూచించారు. చాలా వరకు పరీక్షలు ఇంకా రాతపరీక్షలే అని, కంప్యూటర్లు, ఫోన్ల వల్ల రాసే అలవాటు తగ్గిపోతోందని ప్రధానమంత్రి అన్నారు. రాయడం అలవాటు చేసుకోవాలని ఆయన వారిని కోరారు. చదివే/అధ్యయనం చేసే సమయంలో 50 శాతం రాయడానికి కేటాయించాలని ఆయన వారిని కోరారు. ఏదైనా రాసినప్పుడు మాత్రమే దానిని సరిగా అర్థం చేసుకుంటారని ఆయన అన్నారు. ఇతర విద్యార్థుల వేగాన్ని చూసి భయపడవద్దని ఆయన వారిని కోరారు.
ఆరోగ్యకరమైన జీవనశైలి
పరీక్షలకు సిద్ధం కావడానికి, ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించడానికి మధ్య సమతుల్యత గురించి ప్రస్తావిస్తూ, రాజస్థాన్‌లోని సీనియర్ సెకండరీ పాఠశాల విద్యార్థి ధీరజ్ సుభాస్, లడఖ్‌లోని కార్గిల్ పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయ విద్యార్థిని నజ్మా ఖాతూన్, అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్ టోబి లాహ్మే ఉపాధ్యాయుడు అభిషేక్ కుమార్ తివారీ, వ్యాయామంతో పాటు చదువులను ఎలా సాగించాలని ప్రధానమంత్రిని అడిగారు. శారీరక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం కోసం మొబైల్ ఫోన్లను రీఛార్జ్ చేసుకోవాలని అన్నారు. సమతుల్య జీవనశైలి పాటించాలని, ఏదీ అతిగా చేయకూడదని ఆయన సూచించారు. “ఆరోగ్యకరమైన మనసు కోసం ఆరోగ్యకరమైన శరీరం చాలా అవసరం” అని ప్రధానమంత్రి అన్నారు. ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని రోజువారీ నియమాలు పాటించాల్సిన అవసరం ఉందని, సూర్యరశ్మిలో సమయం గడపడం, సక్రమంగా పూర్తి నిద్రపోవడం వంటి విషయాలను కూడా ఆయన ప్రస్తావించారు. ఆధునిక ఆరోగ్య శాస్త్రం ప్రకారం చాలా ముఖ్యమైనదిగా భావించే అవసరమైన నిద్రను స్క్రీన్ సమయం వంటి అలవాట్లు తినేస్తున్నాయని ఆయన అన్నారు. తాను కూడా పడుకున్న 30 సెకన్లలోనే గాఢ నిద్రలోకి వెళ్లే శైలిని కొనసాగిస్తున్నట్లు చెప్పారు. "మెలకువగా ఉన్నప్పుడు పూర్తిగా మెలకువగా ఉండటం, నిద్రలో ఉన్నప్పుడు గాఢ నిద్రపోవడమే సమతుల్యత" అని ఆయన అన్నారు. పోషకాహారం గురించి మాట్లాడుతూ, సమతుల్య ఆహారంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఫిట్నెస్ కోసం క్రమం తప్పని వ్యాయామం, శారీరక శ్రమల ప్రాముఖ్యతను కూడా ఆయన వివరించారు.
కెరీర్ పురోగతి
పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణా బారక్‌పూర్‌లోని కేంద్రీయ విద్యాలయకు చెందిన మధుమిత మల్లిక్, హర్యానాలో పానిపట్‌లోని ది మిలీనియం స్కూల్‌కు చెందిన అదితి తన్వర్ ప్రస్తావించిన కెరీర్ పురోగతి అంశంపై ప్రధానమంత్రి మాట్లాడుతూ, వృత్తి జీవన మార్గం విషయంలో స్పష్టత అవసరమని, గందరగోళం, అనిశ్చితి ఉండరాదని స్పష్టం చేశారు. పరిశుభ్రతకు ఉదాహరణను, దాని వెనుక ఉన్న ప్రధానమంత్రి సంకల్పాన్ని వివరిస్తూ, దేశంలో 'స్వచ్ఛత' ఒక ప్రాధాన్యతాంశంగా మారుతోందని శ్రీ మోదీ ఉద్ఘాటించారు. గత 10 సంవత్సరాలలో కళ, సాంస్కృతిక రంగంలో భారతదేశ మార్కెట్ 250 రెట్లు పెరిగిందని ఆయన తెలియజేశారు. “మనకు సామర్థ్యం ఉంటే, దేనికైనా జీవం పోయగలం” అని ఆయన అన్నారు. విద్యార్థులు తమను తాము తక్కువ అంచనా వేసుకోరాదని ప్రధాని అన్నారు. పూర్తి అంకితభావంతో ముందుకు సాగాలని ఆయన సూచించారు. జాతీయ విద్యా విధానం గురించి మాట్లాడుతూ, ఒకే స్ట్రీమ్‌కు కట్టుబడి ఉండకుండా విభిన్న కోర్సులను అనుసరించే నిబంధనలను ప్రధానమంత్రి ప్రముఖంగా తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌లో విద్యార్థుల భాగస్వామ్యం, నైపుణ్యం, అంకితభావాన్ని ఆయన ప్రశంసించారు. ప్రభుత్వ పథకాలను తెలియజేయడానికి వారు చేసిన కృషి భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖతో పోలిస్తే చాలా మెరుగ్గా ఉందని ఆయన అన్నారు. "గందరగోళాన్ని తొలగించడానికి మనం నిర్ణయాత్మకంగా ఉండాలి" అని ప్రధానమంత్రి అన్నారు. రెస్టారెంట్‌లో ఆహారాన్ని ఆర్డర్ చేసే ఉదాహరణను ఇస్తూ, అక్కడ ఏమి తినాలో నిర్ణయించుకోవాలి. అలాగే, తీసుకోవాల్సిన నిర్ణయాల సానుకూలతలు, ప్రతికూలతలను కూడా అంచనా వేసుకోవాలని ఆయన సూచించారు.
తల్లిదండ్రుల పాత్ర
వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కార్యక్రమంలో చేరిన పుదుచ్చేరి ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాలకు చెందిన విద్యార్థిని దీపశ్రీ తల్లిదండ్రుల పాత్ర గురించి, విద్యార్థులు నమ్మకాన్ని పెంచుకోవడం గురించి ప్రధానమంత్రిని అడిగారు. ప్రధానమంత్రి కుటుంబాల్లో నమ్మకం లోపించడాన్ని ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ, ఈ తీవ్రమైన సమస్యను పరిష్కరించాలని తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను కోరారు. ఈ సమస్య ఆకస్మికం కాదని, సుదీర్ఘ ప్రక్రియ ఫలితమని, ఉపాధ్యాయులైనా, , తల్లిదండ్రులైనా, లేదా విద్యార్థులయినా ప్రతి ఒక్కరికీ వారి ప్రవర్తనపై లోతైన ఆత్మపరిశీలన అవసరమని శ్రీ మోదీ అన్నారు. సమాచారాన్ని నిజాయితీతో పంచుకుంటే నమ్మకం క్రమంగా పెరుగుతుందని ఆయన అన్నారు. విద్యార్థులు తమ వ్యవహారాల్లో నిజాయితీగా, చిత్తశుద్ధితో ఉండాలి. అదేవిధంగా, తల్లిదండ్రులు కూడా తమ పిల్లలపై అనుమానానికి బదులుగా నమ్మకాన్ని ఉంచాలి. నమ్మకం లేకపోవడం వల్ల ఏర్పడే దూరం పిల్లలను డిప్రెషన్ వైపు నెట్టవచ్చు. విద్యార్థులతో కమ్యూనికేషన్ మార్గాలను తెరిచి ఉంచాలని, పక్షపాతానికి దూరంగా ఉండాలని ప్రధానమంత్రి ఉపాధ్యాయులను కోరారు. పిల్లలకు సహాయపడే సానుకూల విషయాలను చర్చించడానికి స్నేహితుల కుటుంబాలు క్రమం తప్పకుండా కలుసుకోవాలని ఆయన అభ్యర్థించారు.
టెక్నాలజీ చొరబాటు
మహారాష్ట్ర లోని పూనేకు కు చెందిన తండ్రి చంద్రేష్ జైన్ విద్యార్థుల జీవితాల్లో టెక్నాలజీ చొరబాటు అంశాన్ని లేవనెత్తగా, జార్ఖండ్‌లోని రామ్‌గఢ్‌కు చెందిన తల్లి పూజా శ్రీవాస్తవ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల విస్తరణ మధ్య చదువులను ఎలా నిర్వహించాలని అడిగారు.హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్పూర్, కాంగూలోని టీఆర్ డీఏవీ పాఠశాల విద్యార్థి అభినవ్ రాణా అభ్యాస సాధనంగా మొబైల్ టెక్నాలజీ ప్రయోజనాలను ఉపయోగించుకుంటూనే, పరీక్షల ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొనేలా విద్యార్థులకు అవగాహన, ప్రోత్సాహం కల్పించడం గురించి ప్రస్తావించారు. "దేనికైనా అతి పనికిరాదు" అని ప్రధానమంత్రి అన్నారు. పోషకాలు అధికంగా ఉన్నప్పటికీ, ఇంట్లో వండిన భోజనాన్ని అతిగా తీసుకుంటే కడుపులో సమస్యలు, ఇతర సమస్యలు వస్తాయని, మొబైల్ ఫోన్‌ను అధికంగా వినియోగించినా అంతేనని ఆయన పోల్చారు. విచక్షణ ఆధారిత నిర్ణయాలతో టెక్నాలజీని, మొబైల్ ఫోన్లను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. "తల్లిదండ్రులంతా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు"అని ప్రధానమంత్రి గోప్యత రహస్యం అనే అంశాన్ని ప్రస్తావిస్తూ అన్నారు. రాత్రి భోజనం సమయంలో ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు వాడకుండా, ఇంట్లో నో గాడ్జెట్ జోన్ లు ఉండేలా కుటుంబంలో నియమనిబంధనలు ఉండాలని ప్రధాని పేర్కొన్నారు. "ప్రస్తుత ప్రపంచంలో టెక్నాలజీకి దూరంగా ఎవరూ పారిపోలేరు" అని ప్రధానమంత్రి అన్నారు. అయితే, దానిని ఒక భారంగా పరిగణించకుండా, సమర్థవంతంగా వినియోగించడాన్ని నేర్చుకోవడం తప్పనిసరి అని ఆయన అన్నారు. టెక్నాలజీ ఒక విద్యా సాధనం అని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ప్రధానమంత్రి సూచించారు. పారదర్శకతను నెలకొల్పడానికి తమ ఇళ్లలోని ప్రతి మొబైల్ ఫోన్ పాస్‌కోడ్‌లను ప్రతి సభ్యునితో పంచుకోవాలని కూడా సిఫార్సు చేశారు. "ఇది చాలా చెడులను నివారిస్తుంది" అని ఆయన అన్నారు. ప్రత్యేకమైన మొబైల్ అప్లికేషన్‌లు, సాధనాల వాడకంతో స్క్రీన్ సమయాన్ని పర్యవేక్షించడం గురించి కూడా ప్రధానమంత్రి ప్రస్తావించారు. తరగతి గదిలో మొబైల్ ఫోన్ల సృజనాత్మక వినియోగం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.
ప్రధానమంత్రిగా ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారు? ఎలా సానుకూలంగా ఉంటారు?
చెన్నైలోని మోడరన్ సీనియర్ సెకండరీ స్కూల్ విద్యార్థి ఎం వాగేష్ ప్రధానమంత్రి పదవిలో ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటున్నారని ప్రధానమంత్రిని అడిగారు. ఉత్తరాఖండ్‌లోని ఉదం సింగ్ నగర్ కు చెందిన డైనాస్టీ మోడరన్ గురుకుల్ అకాడమీ విద్యార్థిని స్నేహా త్యాగి, “ మేం మీలాగా సానుకూలంగా ఎలా ఉండగలం?” అని ప్రధానమంత్రిని ప్రశ్నించారు. ప్రధాన మంత్రి పదవిలో ఉండే ఒత్తిడిని పిల్లలు అర్థం చేసుకోవడం సంతోషం కలిగిస్తోందని శ్రీ మోదీ అన్నారు. జీవితంలో ప్రతి ఒక్కరూ ఊహించని పరిస్థితులను ఎదుర్కొంటారని, వాటిని తప్పించుకు తిరుగుదామనుకునేవారు జీవితంలో ఏదీ పెద్దగా సాధించలేరని ఆయన అన్నారు. "నాకు ఉపయోగకరంగా అనిపించిన నా విధానం ఏమిటంటే, 'నేను ప్రతి సవాల్ ను సవాలు చేస్తా. సవాలు ముగిసేవరకు ఏం చేయకుండా చూస్తూ ఉండిపోను. ఇది నాకు ఎల్లప్పుడూ నేర్చుకునే అవకాశాన్ని ఇస్తుంది. కొత్త పరిస్థితులను ఎదుర్కోవడం నన్ను మరింత చురుగ్గా చేస్తుంది” అన్నారు. “నాకు 140 కోట్ల మంది దేశప్రజలు అండగా ఉన్నారన్నదే నాకు అతిపెద్ద విశ్వాసం. 10 కోట్ల సవాళ్లు ఉంటే, వందల కోట్ల పరిష్కారాలు ఉంటాయి. నేను ఎప్పుడూ ఒంటరిగా ఉన్నానని, అంతా నాపైనే ఉందని భావించను. నా దేశం, దేశప్రజల సామర్థ్యాల గురించి నాకు తెలుసు. ఇదే నా ఆలోచనకు మూలాధారం" అని ఆయన అన్నారు. తాను ముందుండాల్సి వస్తుందని, తప్పులు తనవే అంటరాని, అయినా దేశ సామర్థ్యాలు తనకు బలం ఇస్తాయని తెలిపారు. "నా దేశప్రజల సామర్థ్యాలను నేను ఎంతగా పెంచితే, సవాళ్లను ఎదుర్కొనే నా సామర్థ్యం అంతగా మెరుగుపడుతుంది" అని ఆయన అన్నారు. పేదరికం సమస్యను ఉదాహరణగా పేర్కొంటూ, పేదవారే పేదరికాన్ని తొలగించాలని నిర్ణయించుకున్నప్పుడు, పేదరికం తప్పక పోతుందని ప్రధానమంత్రి అన్నారు. "పక్కా ఇల్లు, మరుగుదొడ్డి, విద్య, ఆయుష్మాన్, పైపుల ద్వారా నీరు వంటి కలలను సాకారం చేసుకునే సాధనాలను వారికి అందించడం నా బాధ్యత. ప్రతిరోజు ఎదుర్కొనే అవమానాల నుంచి ఒకసారి విముక్తి పొందిన తర్వాత, పేదరిక నిర్మూలనపై వారికి నమ్మకం కలుగుతుంది” అని చెప్పారు. తన 10 సంవత్సరాల పాలనలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ఆయన పేర్కొన్నారు.
అంతేకాకుండా, ఎవరికైనా పనులకు ప్రాధాన్యత ఇచ్చే వివేకం ఉండాలని ప్రధానమంత్రి అన్నారు. ఇది అనుభవం, అన్నింటినీ విశ్లేషించడం ద్వారా వస్తుంది. తాను చేసే పొరపాట్లను కూడా పాఠాలుగా పరిగణిస్తానని ఆయన అన్నారు.
కోవిడ్ మహమ్మారిని ఉదాహరణగా పేర్కొంటూ, చేతులు ముడుచుకు కూర్చోవడం కంటే ప్రజలను ఒక తాటిపైకి తెచ్చి, వారి సామూహిక శక్తిని పెంచే దిశగా ప్రయత్నించానని ప్రధానమంత్రి చెప్పారు. దీపాలు వెలిగించడం, శబ్దం చేయించడం వంటి చర్యల ద్వారా ప్రజలలో నమ్మకాన్ని నింపినట్లు పేర్కొన్నారు. అలాగే, క్రీడా విజయాలను జరుపుకోవడం, సరైన వ్యూహం, దిశ, నాయకత్వం వల్ల అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాల్లో విస్తృత స్థాయిలో పతకాలు సాధించగలిగామని అన్నారు.
సుపరిపాలన కోసం కూడా, కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయికి సంపూర్ణ సమాచారం, అలాగే ఉన్నత స్థాయి నుంచి కింది స్థాయికి సంపూర్ణ మార్గదర్శకత్వం అందించే వ్యవస్థ ఉండాలని ఆయన అన్నారు.
జీవితంలో ఎప్పుడూ అసంతృప్తి కూడదని, నిర్ణయం తీసుకున్న తర్వాత సానుకూలత మాత్రమే మిగిలి ఉంటుందని ప్రధాని అన్నారు. "నా జీవితంలో నిరాశ అనేదానికి అన్ని దారులు, కిటికీలు మూసేశాను" అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఏదైనా చేయాలనే సంకల్పం బలంగా ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోవడం సులభం అవుతుందని ఆయన అన్నారు. "స్వార్థపూరిత ఉద్దేశ్యం లేనప్పుడు, నిర్ణయంలో ఎప్పుడూ గందరగోళం ఉండదు" అని స్పష్టం చేశారు. ప్రస్తుత తరం జీవితాలను సులభతరం చేయడానికి ప్రాధాన్యత ఇస్తూ, తమ తల్లిదండ్రులు పడిన కష్టాలను నేటి తరం ఎదుర్కోకూడదని ప్రధానమంత్రి అన్నారు. "ప్రస్తుత తరమే కాకుండా, భవిష్యత్ తరాలు కూడా తమ ప్రతిభను చాటుకోవడానికి, తమ సామర్థ్యాలను ప్రదర్శించడానికి అవకాశం ఉన్న దేశాన్ని నిర్మించడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది" అని ప్రధానమంత్రి అన్నారు, ఇది మొత్తం దేశం సామూహిక సంకల్పంగా ఉండాలని స్పష్టం చేశారు. సానుకూల దృక్పథం శక్తిని వివరిస్తూ, అత్యంత ప్రతికూల పరిస్థితులలో కూడా సానుకూల ఫలితాలను చూసేందుకు అది బలాన్ని ఇస్తుందని ప్రధానమంత్రి అన్నారు. విద్యార్థులంతా వారి జీవిత లక్ష్యాలను సాధించాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
—-
(Release ID: 2168845)
Visitor Counter : 7
Read this release in:
Kannada
,
Bengali
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam