ప్రధాన మంత్రి కార్యాలయం
బీహార్‌లోని పూర్ణియాలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం.. శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Posted On:
15 SEP 2025 7:26PM by PIB Hyderabad
భారత్ మాతాకీ... జై!
భారత్ మాతాకీ... జై!
గౌరవనీయులైన గవర్నర్ శ్రీ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, విశేష ప్రజాదరణగల ముఖ్యమంత్రి శ్రీ నితీష్ కుమార్, వేదికపై ఆసీనులైన ఇతర ప్రముఖులతోపాటు సభకు హాజరైన నా ప్రియతమ సోదరీసోదరులారా!
మీకందరికీ నా శుభాకాంక్షలు. పూరణ్ మాత వెలసిన పుణ్యభూమి, భక్త ప్రహ్లాదుడు నడయాడిన నేల, మహర్షి మెహి బాబా ప్రబోధాలు ప్రతిధ్వనించిన పవిత్ర ప్రదేశం పూర్ణియా. ఇది ఫణీశ్వర్ నాథ్ రేణు, సతీనాథ్ భాదురి వంటి నవలా రచయితలకూ పుట్టినిల్లు... వినోబా భావే వంటి ‘కర్మయోగుల’ కర్మభూమి. ఇంతటి పావన భూమికి పలుమార్లు నా శిరసాభివందనం.
మున్ముందుగా- మీ మన్నింపు కోరుతున్నాను. ఎందుకంటే- కోల్‌కతాలో నా కార్యక్రమాల పొడిగింపు కారణంగా ఇక్కడి చేరుకోవడం ఆలస్యమైంది. అయినప్పటికీ, ఇంత పెద్ద సంఖ్యలో నన్ను దీవించడానికి మీరిక్కడ ఎదురు చూస్తున్నారు. మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ, ఆలస్యమైనందుకు మరోసారి మన్నింపు అర్ధిస్తూ ప్రజలందరికీ పాదాభివందనం చేస్తున్నాను.
మిత్రులారా!
బీహార్ ప్రజల కోసం ఇవాళ దాదాపు ₹40,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశాం. వీటిలో భాగమైన రైల్వేలు, విమానాశ్రయాలు, విద్యుత్తు, నీరు సంబంధిత ప్రాజెక్టులన్నీ సీమాంచల్ కలలను సాకారం చేయగలవు. మరోవైపు ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు 40,000 మందికిపైగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారులకు పక్కా ఇళ్లను అప్పగించాం. ఈ కుటుంబాలన్నిటికీ ఇదొక శుభారంభం... ఎందుకంటే- ధన్‌తేరస్, దీపావళి, ఛత్ పూజలకు ముందు స్వగృహ ప్రవేశం నిజంగా ఒక వరమే కదా! ఇందుకుగాను వారందరికీ నా అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
మిత్రులారా!
ఇప్పటిదాకా సొంత ఇల్లు లేని సోదరీసోదరులకూ ఇవాళ భరోసా ఇస్తున్నా... మీకందరికీ కూడా పక్కా ఇల్లు లభించే రోజు వస్తుంది... ఇది మోదీ వాగ్దానం. మా ప్రభుత్వం గత 11 ఏళ్లలో పేదల కోసం 4 కోట్లకుపైగా పక్కా ఇళ్లు నిర్మించి అప్పగించిన నేపథ్యంలో మరో 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి మేం కృషి చేస్తున్నాం. ప్రతి నిరుపేదకూ సొంత గూడు కల్పించేదాకా మోదీ నిర్విరామంగా ముందుకు వెళ్తూనే ఉంటాడు. వెనుకబడిన వారికి ప్రాధాన్యం, పేదలకు సేవ మోదీ లక్ష్యాలు.
మిత్రులారా!
ఈ రోజు సర్ ఎం.విశ్వేశ్వరాయ జయంతి... ఈ నేపథ్యంలో ఇంజినీర్ల దినోత్సవం నిర్వహించుకుంటున్న వేళ దేశంలోని ఇంజినీర్లందరికీ నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ‘వికసిత భారత్’తోపాటు ‘వికసిత బీహార్’ను రూపుదిద్దడంలో వారిదే కీలక పాత్ర... నేటి కార్యక్రమంలోనూ వారి కృషి, నైపుణ్యం ప్రతిబింబిస్తాయి. ఎలాగంటే- పూర్ణియా విమానాశ్రయ టెర్మినల్ భవనం ఐదు నెలలకన్నా తక్కువ వ్యవధిలో పూర్తికావడం ఒక రికార్డు. నేనివాళ ఈ సౌధంతోపాటు ఇక్కడి నుంచి తొలి వాణిజ్య విమానాన్ని కూడా ప్రారంభించాను. మన విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు కూడా ఇక్కడే ఉన్నారు. ఆయనకు అభినందనలు తెలుపుతూ పెద్ద ఎత్తున కరతాళ ధ్వనులు చేయండి. ఎందుకంటే- ఇక్కడి నుంచి విమానాల రాకపోకలు నిర్వహించేది ఆయనే! ఈ సరికొత్త విమానాశ్రయంతో పూర్ణియా మన జాతీయ విమానయాన పటంలో స్థానం సంపాదించింది. ఇక ఇప్పటి నుంచి పూర్ణియాతోపాటు సీమాంచల్ ప్రాంతానికి దేశంలోని ప్రధాన నగరాలు, వాణిజ్య కూడళ్లతో ప్రత్యక్ష సంధానం ఏర్పడుతుంది.
మిత్రులారా!
ఈ ప్రాంతం మొత్తాన్నీ ఎన్డీఏ ప్రభుత్వం ఆధునిక హైటెక్ రైలు సేవలతో జోడిస్తుంది... ఈ క్రమంలో ఈ రోజు నేను వందే భారత్, అమృత భారత్ ఎక్స్ ప్రెస్‌లు సహా పాసింజర్ రైళ్లను ప్రారంభించాను. అలాగే అరారియా-గల్గాలియా కొత్త రైలు మార్గాన్ని ప్రారంభించడంతోపాటు విక్రమశిల-కటారియా కొత్త రైలు మార్గం నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశాను.
మిత్రులారా!
కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల కిందట మరో ప్రధాన నిర్ణయం తీసుకుంటూ బక్సర్-భాగల్పూర్ హై-స్పీడ్ కారిడార్‌లోని మోకామా-ముంగర్ సెక్షన్ మార్గానికి ఆమోద ముద్ర వేసింది. దీనివల్ల ముంగేర్, జమాల్పూర్, భాగల్పూర్ వంటి పారిశ్రామిక కేంద్రాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. దీంతోపాటు భాగల్పూర్-దుమ్కా-రాంపూర్‌హాట్ రైలు మార్గం నిర్మాణానికీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
మిత్రులారా!
దేశాభివృద్ధికి బీహార్ కూడా అభివృద్ధి చెందడం అవశ్యం కాబట్టి, రాష్ట్ర ప్రగతితోపాటు పూర్నియా, సీమాంచల్ పురోగమనం అవశ్యం. లోగడ ఆర్జేడీ, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వ దుష్పరిపాలన ఫలితంగా ఈ ప్రాంతం అధికంగా నష్టపోయింది. నేటి ఎన్డీఏ ప్రభుత్వం ఆ పరిస్థితిని చక్కదిద్దుతుండటంతో ఇప్పుడు అభివృద్ధికి కూడలిగా మారుతోంది.
మిత్రులారా!
విద్యుత్తు రంగంలో బీహార్ స్వావలంబన లక్ష్యంగా చేపట్టిన వివిధ కార్యక్రమాల్లో భాగంగా భాగల్పూర్‌లోని పిర్‌పైంటీలో 2,400 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రారంభమైంది.
మిత్రులారా!
రైతులు, పశుపోషకుల ఆదాయం పెంపు లక్ష్యానికి బీహార్ ద్వంద్వ సారథ్య ప్రభుత్వం నిబద్ధతతో ఉంది. ఈ కృషిలో భాగంగా కోసి-మెచి అంతర్రాష్ట్ర నదుల అనుసంధాన ప్రాజెక్టు తొలి దశకు పునాది వేశాం. ఇది తూర్పు కోసి ప్రధాన కాలువ విస్తరణకు దోహదం చేయడంతోపాటు లక్షల హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం కల్పించడం సహా వరదల సమస్యను పరిష్కరిస్తుంది.
మిత్రులారా!
బీహార్ రైతులకు మఖానా (తామర గింజల) సాగు కూడా ఓ ముఖ్యమైన ఆదాయ వనరు. అయితే, గత ప్రభుత్వాలు మఖానాను, దాన్ని సాగుచేసే రైతులను నిర్లక్ష్యం చేయగా, పూర్తిస్థాయిలో శ్రద్ధ చూపింది మా ప్రభుత్వమే. విచిత్రమేమిటంటే- మా పాలన రాకముందు ఈ ప్రాంతంలో తిరిగిన నాయకులు ‘మఖానా’ అనే పదం కూడా విని ఉండరని ఘంటాపథంగా చెప్పగలను.
మిత్రులారా!
జాతీయ మఖానా బోర్డు ఏర్పాటుపై బీహార్ ప్రజలకు నేను లోగడ హామీ ఇచ్చిన నేపథ్యంలో నిన్ననే కేంద్ర ప్రభుత్వం దీనిపై ప్రకటన జారీ చేసింది. మఖానా రైతులకు గిట్టుబాటు ధర లభించడంతోపాటు సాగుకు సంబంధించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరువ చేసేందుకు ఈ బోర్డు నిరంతరం కృషి చేస్తుంది. మరోవైపు మఖానా రంగం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం దాదాపు ₹450 కోట్ల అంచనా వ్యయంతో ఒక పథకాన్ని ఆమోదించింది.
మిత్రులారా!
బీహార్‌లో ఈ ప్రగతి వేగం, రాష్ట్ర పురోగమనం కొందరికి రుచించడం లేదు. ఇప్పుడు బీహార్ కూడా కొత్త చరిత్ర సృష్టించగలదన్న వాస్తవాన్ని దశాబ్దాలుగా రాష్ట్రాన్ని దోచుకున్న వారు, ఈ గడ్డను వంచించిన వారు జీర్ణించుకోవడానికి సిద్ధంగా లేరు. రాష్ట్రంలోని ప్రతి రంగంలో ₹వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులు కొనసాగడాన్ని మీరిప్పుడు చూస్తున్నారు. ఆసియా కప్ హాకీ పోటీలకు రాజ్‌గిర్ ఆతిథ్యమివ్వడానికి దోహదం చేసిన అంటా–సిమారియా వంతెన వంటి చారిత్రక ప్రాజెక్టులు ఇందుకు నిదర్శనం. అలాగే, ‘మేడ్ ఇన్ బీహార్’ రైలింజిన్లు ఇవాళ ఆఫ్రికా దేశాలకు ఎగుమతి అవుతుండటం విశేషం. కానీ, ఈ పురోగమనాన్ని అంగీకరించేందుకు కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీ నాయకులు ఇచ్చగించడం లేదు. బీహార్ ముందడుగు వేసిన ప్రతి సందర్భంలోనూ వీరు రాష్ట్రాన్ని అవమానించడం ప్రారంభిస్తారు. ఆర్జేడీ మిత్రపక్షమైన కాంగ్రెస్ ఇటీవల సామాజిక మాధ్యమాల్లో బీహార్‌ను ‘బీడీ’తో పోల్చడం మీరు చూసే ఉంటారు. రాష్ట్రంపై వారి ద్వేషం అలాంటిది! అనేక కుంభకోణాలు, అవినీతి కార్యకలాపాలతో బీహార్ ప్రతిష్ఠకు వారు మచ్చతెచ్చారు. కాబట్టే, ఇప్పుడు రాష్ట్ర ప్రగతిని ఓర్వేలేక ఆ రెండు పార్టీలూ మరోసారి బీహార్‌ను అప్రతిష్ఠ పాల్జేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.
సోదరీసోదరులారా!
ఇలాంటి కుళ్లు మనస్తత్వం గలవారు రాష్ట్రానికి ఏనాడూ మంచి చేయలేరు. తమ సంచులు నిండటం గురించి మాత్రమే ఆలోచించేవారు పేదల ఇళ్ల గురించి ఎందుకు పట్టించుకుంటారు? కేంద్రంలో కాంగ్రెస్ పాలన సమయాన ప్రభుత్వం పంపే రూపాయిలో 85 పైసలు దోపిడీ అవుతున్నదని సాక్షాత్తూ ఆ పార్టీ ప్రధానమంత్రే ఒకనాడు బహిరంగంగా అంగీకరించారు. కాంగ్రెస్, ఆర్జేడీ సంకీర్ణ ప్రభుత్వ హయాంలో పేదల ఖాతాలో ఎన్నడైనా నగదు జమ అయిందా? లాంతరు (ఆర్జేడీ ఎన్నికల చిహ్నం) వెలిగించి చూపుతూ, కాళ్లాచేతులా ప్రజా ధనాన్ని జవురుకుంటూ ప్రతి రూపాయిలో 85 పైసలు వంతున మింగేశారు. దేశాన్ని కరోనా మహమ్మారి పీడించిన తర్వాత ప్రతి పేద కుటుంబానికీ ఉచిత రేషన్ లభిస్తోంది. కానీ, కాంగ్రెస్, ఆర్జేడీ ప్రభుత్వాలు ఏనాడైనా మీకు ఉచిత ఆహార ధాన్యాలిచ్చాయా? నేడు ఆయుష్మాన్ భారత్ పథకంతో ప్రతి పేద కుటుంబానికి ఏటా ₹5 లక్షల దాకా ఉచిత చికిత్స సౌకర్యం లభిస్తోంది. మరి, వారు మీ కోసం ఆస్పత్తులే నిర్మించలేకపోతే ఉచిత వైద్య సదుపాయం కల్పించగలరా? అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. అసలు వారెన్నడైనా మీ గురించి ఆలోచించిన దాఖలాలు ఉన్నాయా?
మిత్రులారా!
కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలు బీహార్ గౌరవాన్ని మంటగలపడమే కాకుండా రాష్ట్ర ప్రతిష్ఠను మసకబార్చాయి. సీమాంచల్, తూర్పు భారత ప్రాంతమంతటా చొరబాటుదారుల కారణంగా భారీ జనసంక్షోభం ఏర్పడింది. బీహార్, బెంగాల్, అస్సాం సహా పలు రాష్ట్రాల ప్రజలు తమ అక్కచెల్లెళ్లు, కుమార్తెల భద్రతపై తీవ్ర ఆందోళన పడుతున్నారు. అందుకే, ఎర్రకోట పైనుంచి ప్రసంగించిన సందర్భంగా నేను జనసంఖ్య అధ్యయన కార్యక్రమం గురించి ప్రకటించాను. అయితే, ప్రతిపక్షాల ఓటు బ్యాంకు రాజకీయ స్వార్థాన్ని ఒకసారి గమనించండి... కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీల వ్యవస్థలన్నీ చొరబాటుదారుల తరఫున వకాల్తా పుచ్చుకున్నాయి. వారిని కాపాడటం, వారి కోసం నిస్సిగ్గుగా నినదించడం చొరబాటుదారుల రక్షణకు కవాతు నిర్వహించడం వంటి అనైతిక కార్యకలాపాల్లో మునిగిపోయాయి. వీరంతా రాష్ట్ర, జాతీయ వనరులు, భద్రత రెండింటితో జూదమాడాలని భావిస్తున్నారు. కానీ, పూర్ణియా గడ్డమీది నుంచి వారికొక విషయం స్పష్టం చేస్తున్నాను. ఆ రెండు పార్టీలూ నా మాటలు జాగ్రత్తగా విని, గుర్తుంచుకోవాలి. ప్రతి చొరబాటుదారు తక్షణం దేశం నుంచి నిష్క్రమించాలి. చొరబాట్లకు అడ్డుకట్ట వేయాలని ఎన్‌డీఏ కృతనిశ్చయంతో ఉంది. అలాగే వారి రక్షణకు ముందుకొచ్చే నాయకులను, వారిని సమర్థించే వారికి ఇదే నా సవాలు. చొరబాటుదారుల రక్షణకు మీరెంత ప్రయత్నించినా, వారిని వెళ్లగొట్టే మా సంకల్పాన్ని అడ్డుకోజాలరు. చొరబాటుదారులకు కవచంగా మారడానికి ప్రయత్నించే వారు జాగ్రత్తగా వినండి. భారత్‌లో స్వదేశీ చట్టమే చెల్లుబాటు అవుతుంది తప్ప వాళ్ల ఇష్టాయిష్టాలకు ఇక్కడ తావులేదు... ఇది మోదీ శపథం. చొరబాటుదారులపై చర్యలతో దేశానికి సానుకూల ఫలితాలు లభిస్తాయి. వారికి మద్దతుగా గళమెత్తే కాంగ్రెస్, ఆర్జేడీ రెండింటికీ బీహార్ వాసులు, దేశ ప్రజలు తప్పక గుణపాఠం నేర్పుతారు.
మిత్రులారా!
బీహార్‌లో రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్, ఆర్జేడీ అధికారానికి దూరంగా ఉంచిన ఘనత నిస్సందేహంగా ఈ రాష్ట్రంలోని అమ్మలు... చెల్లెమ్మలదే. వారందరికీ నేనివాళ శిరసాభివందనం చేస్తున్నాను. ఆర్జేడీ హయాంలో పట్టపగలే హత్యలు, అత్యాచారాలు, అపహరణలకు అత్యంత దారుణంగా బలైన వారు మీరే. అలాంటి ఈ నేలపై ఇప్పుడు ద్వంద్వ చోదక ప్రభుత్వంలో అదే మహిళలు ‘లక్షాధికారి సోదరి’, ‘డ్రోన్ సోదరి’గా రూపొందుతున్నారు. ఆ మేరకు ‘డ్రోన్ దీదీ’లుగా ఎదిగిన స్వయం సహాయ సంఘాల మహిళలు భారీ విప్లవానికి సారథ్యం వహిస్తున్నారు. ముఖ్యంగా శ్రీ నితీష్ కుమార్ నాయకత్వంలో అమలవుతున్న ‘జీవిక దీదీ’ ఉద్యమ విజయం అసాధారణం... తద్వారా యావద్దేశానికీ బీహార్ ఒక ప్రేరణగా మారింది.
మిత్రులారా!
మా చెల్లెమ్మల కోసం ఇవాళ కూడా దాదాపు ₹500 కోట్ల మేర సామాజిక పెట్టుబడి నిధి విడుదలైంది. ఈ నిధులు మొత్తం సాముదాయక సమాఖ్యలకు చేరడం ద్వారా గ్రామాల్లోని స్వయం సహాయ సంఘాల మహిళలకు సాధికారత లభిస్తుంది. తద్వారా వారు తమ సంఘాల సామర్థ్యాన్ని మరింత విస్తరించుకునే అవకాశమిస్తుంది.
మిత్రులారా!
కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలకు నిరంతరం ఒకటే ఆలోచన... అదే సొంత కుటుంబాల ప్రయోజనం. అందుకే, వారు మీ కుటుంబాలను ఎన్నటికీ పట్టించుకోరు. కానీ, మీరందరూ మోదీ కుటుంబం! అందుకే, మోదీ- ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’ అని నినదిస్తాడు. మరి, ఈ రెండు పార్టీల నాయకులు చేసేదేమిటి? సొంత కుటుంబాలకు మద్దతు.. స్వీయ కుటుంబ ప్రగతే వాళ్లకు అన్నిటికన్నా ముఖ్యం!
కాబట్టి, సోదరీసోదరులారా!
మోదీ మీ పొదుపు గురించే కాదు... ఖర్చుల గురించి కూడా పట్టించుకుంటారు. అందుకే చాలా పండుగలు దగ్గర పడుతున్న వేళ... ముఖ్యంగా ఈ ఏడాది దీపావళి, దసరా, ఛత్ వంటి పర్వదినాలకు ముందు మా ప్రభుత్వం పేదలకు, మధ్యతరగతికి భారీ కానుకనిచ్చింది. ఇవాళ సెప్టెంబరు 15... సరిగ్గా ఓ వారం తర్వాత సెప్టెంబరు 22న, నవరాత్రి తొలి రోజు నుంచీ దేశవ్యాప్తంగా ‘జీఎస్‌టీ’ గణనీయంగా తగ్గుతుంది. మీ దైనందిన అవసరాల సంబంధిత చాలా వస్తువులపై పన్ను భారీగా తగ్గుతుంది. దీనివల్ల వంటగది నిర్వహణ వ్యయం చాలా తగ్గుతుందని ఇక్కడున్న అమ్మలు.. చెల్లెమ్మలకు ప్రత్యేకంగా చెబుతున్నాను. టూత్‌పేస్ట్, సబ్బు, షాంపూ నుంచి నెయ్యి సహా అనేక ఆహార పదార్థాల వరకు ప్రతిదీ చౌకగా లభిస్తుంది. పిల్లల చదువులకు అవసరమైన స్టేషనరీ సరంజామా ధరలు కూడా తగ్గుతాయి. ఈ పండుగల వేళ పిల్లలకు కొత్త దుస్తులు, బూట్లు స్వల్ప ధరకే లభిస్తాయి. పేదలపై శ్రద్ధ వహించే ప్రభుత్వం ఉన్నప్పుడు, వారి సంక్షేమం కోసం అది సరిగ్గా ఇలాగే వ్యవహరిస్తుంది.
మిత్రులారా!
స్వాతంత్ర్య పోరాట సమయంలో భారత్ శక్తిసామర్థ్యాలేమిటో పూర్ణియా పుత్రులు బ్రిటిష్ వారికి రుచి చూపారు. నేడు ఆపరేషన్ సిందూర్ ద్వారా మన శత్రువులకు ఈ దేశం బలమేమిటో మరోసారి చూపించాం. ఈ వ్యూహంలో పూర్ణియా సాహసపుత్రుడొకరు కీలక పాత్ర పోషించాడు. దేశ రక్షణ లేదా దేశాభివృద్ధి పరంగా భారత పురోగమనంలో బీహార్ సదా ప్రధాన పాత్ర పోషిస్తూనే ఉంది. బీహార్ ప్రగతి ప్రయాణంలో ఈ వేగాన్ని మనం కొనసాగించాలి. ఈ సందర్భంగా శ్రీ నితీష్ నాయకత్వంతోపాటు నేటి అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపనపై రాష్ట్రంలోని నా సోదరీసోదరులకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. మీకందరికీ మరోసారి అనేకానేక ధన్యవాదాలు. ఇప్పుడు నాతో గళం కలిపి బిగ్గరగా నినదించండి:
భారత్ మాతాకీ... జై! భారత్ మాతాకీ... జై! భారత్ మాతాకీ... జై!
అనేకానేక ధన్యవాదాలు
***
(Release ID: 2167386)
|