ప్రధాన మంత్రి కార్యాలయం
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో సెప్టెంబరు 11న ప్రధాని పర్యటన
వారణాసిలో మారిషస్ ప్రధానికి ఆతిథ్యమివ్వనున్న భారత ప్రధాని
అన్ని రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై సమీక్ష
భారత ‘మహాసాగర్’ దృక్పథం, ‘పొరుగు దేశాలకు ప్రాధాన్యం’ విధానంలో మారిషస్ కీలకం
శ్రేయస్సు, సుస్థిరత దిశగా ఉమ్మడి ప్రయాణంలో వారణాసి సదస్సు కీలకం
డెహ్రాడూన్‌లో వరద పరిస్థితిపై ఏరియల్ సర్వేతోపాటు ప్రధాని అధ్యక్షతన సమీక్షా సమావేశం
Posted On:
10 SEP 2025 1:01PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సెప్టెంబరు 11న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో పర్యటించనున్నారు.
2025 సెప్టెంబరు 9 నుంచి 16 వరకు భారత్‌లో అధికారికంగా పర్యటిస్తున్న గౌరవ మారిషస్ ప్రధానమంత్రి డాక్టర్ నవీన్‌చంద్ర రాం గూలంకు ఉదయం 11:30 గంటల సమయంలో వారణాసిలో భారత ప్రధానమంత్రి ఆతిథ్యమిస్తారు.
అనంతరం ప్రధానమంత్రి డెహ్రాడూన్‌కు పయనమవుతారు. సాయంత్రం 4:15 గంటల సమయంలో ఉత్తరాఖండ్‌లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపడతారు. సాయంత్రం 5 గంటల సమయంలో అధికారులతో జరిగే ఉన్నత స్థాయి సమీక్ష సమావేశానికి ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తారు.
శాశ్వత నాగరికతా సంబంధాలకూ, అలాగే భారత్ - మారిషస్ మధ్య ప్రత్యేక, విశిష్ట సంబంధాలను నెలకొల్పిన ఆధ్యాత్మిక అనుబంధం, విస్తృత ప్రజాసంబంధాలకూ చారిత్రక నగరం- వారణాసిలో ఈ ఇద్దరు నాయకుల మధ్య జరగనున్న సమావేశం నిదర్శనం.
అభివృద్ధిలో భాగస్వామ్యం, సామర్థ్యాభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ.. పూర్తిస్థాయిలో సహకారంపై జరిగే ద్వైపాక్షిక చర్చల సందర్భంగా ఇద్దరు నాయకులు సమీక్షిస్తారు. ఆరోగ్యం, విద్య, విజ్ఞాన శాస్త్రం- సాంకేతికత, ఇంధనం, మౌలిక సదుపాయాలతో పాటు పునరుత్పాదక ఇంధనం, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, సముద్ర ఆర్థిక వ్యవస్థల వంటి వర్ధమాన రంగాల్లోనూ సహకారాన్ని విస్తరించుకొనే అవకాశాలపై వారు చర్చిస్తారు.
2025 మార్చిలో మారిషస్‌లో భారత ప్రధానమంత్రి శ్రీ మోదీ అధికారిక పర్యటన ద్వారా ఏర్పడిన బలమైన సానుకూల సంబంధాలు ఈ పర్యటనకు నేపథ్యం. ఆ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రులిద్దరూ ద్వైపాక్షిక సంబంధాలను ‘మెరుగైన వ్యూహాత్మక భాగస్వామ్యం’గా తీర్చిదిద్దారు.
హిందూ మహాసముద్ర ప్రాంతంలో విలువైన భాగస్వామి, సన్నిహిత సముద్ర పొరుగు దేశం మారిషస్. భారత మహాసాగర్ (మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్సుమెంట్ ఫర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఎక్రాస్ రీజియన్) దృక్పథానికి, ‘పొరుగు దేశాలకు ప్రాధాన్యం’ విధానానికి మారిషస్ కీలకం. ఇరుదేశాల మధ్య సహకారం బలపడడం.. ప్రజా శ్రేయస్సుకే కాకుండా, అభివృద్ధి చెందుతున్న దేశాల ఉమ్మడి ఆకాంక్షల దృష్ట్యా కూడా అత్యంత కీలకమైన అంశం.
ప్రజా శ్రేయస్సులో పరస్పర సహకారం, సుస్థిరాభివృద్ధితోపాటు భద్రమైన, సమ్మిళిత భవిష్యత్తు దిశగా భారత్, మారిషస్ ఉమ్మడి ప్రయాణంలో వారణాసి సదస్సు ఓ కీలక మైలురాయిగా నిలవనుంది.
(Release ID: 2165295)
Visitor Counter : 8
Read this release in:
Assamese
,
Bengali
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam