ప్రధాన మంత్రి కార్యాలయం
హిమాచల్ ప్రదేశ్ లోని వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో పీఎం ఏరియల్ సర్వే
వరదల వల్ల కలిగిన నష్టంపై కాంగ్రాలో సమీక్ష నిర్వహించిన పీఎం
హిమాచల్ ప్రదేశ్ లోని వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాలకు
రూ.1500 కోట్లు ఆర్థిక సాయం ప్రకటించిన పీఎం
మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 పరిహారం ప్రకటించిన పీఎం
బాధిత కుటుంబాలను కలిసి, సంతాపం వ్యక్తం చేసిన పీఎం
ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఆపద మిత్ర వాలంటీర్లను కలిసి, వారి సేవలను అభినందించిన పీఎం
మౌలిక సదుపాయాల పునరుద్ధరణ, పునర్నిర్మాణానికి
అన్ని విధాలుగా సాయమందిస్తామని హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
Posted On:
09 SEP 2025 3:01PM by PIB Hyderabad
హిమాచల్ ప్రదేశ్ లో మేఘ విస్ఫోటనం వల్ల వచ్చిన వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల జరిగిన నష్టాన్ని సమీక్షించేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 9 సెప్టెంబర్ 2025న ఆ రాష్ట్రానికి వెళ్లారు.
హిమాచల్ ప్రదేశ్ లోని వరద ప్రభావిత ప్రాంతాలైన చంబా, బారామూర్, కాంగ్రా, తదితర ప్రాంతాల్లో మొదటగా ప్రధానమంత్రి ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం, కాంగ్రాలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన నష్టాన్ని అంచనా వేయటంతో పాటు అక్కడ చేపట్టిన సహాయక, పునరావాస చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్రానికి రూ.1500 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు. ఎస్డీఆర్ఎఫ్ రెండో విడత, పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని ముందుగానే విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. పీఎం ఆవాస్ యోజన కింద జాతీయ రహదారుల పునరుద్ధరణ, పీఎంఎన్ఆర్ఎఫ్ కింద సహాయం అందించడంతోపాటు, పశువుల కోసం మినీ కిట్లను కూడా అందిస్తామని తెలిపారు.
వ్యవసాయ రంగ మద్దతుకు కావాల్సిన కీలకమైన అవసరాలను గుర్తించి, ప్రస్తుతం విద్యుత్ కనెక్షన్లు లేని రైతులే లక్ష్యంగా అదనపు సహాయాన్ని అందించనున్నారు.
పీఎం ఆవాస్ యోజన కింద, దెబ్బతిన్న ఇళ్లను జియో ట్యాగింగ్ చేస్తారు. దీనిద్వారా కచ్చితమైన నష్టాన్ని అంచనా వేసి, వేగంగా బాధితులకు సాయం అందించే అవకాశం ఉంటుంది.
పాఠశాలలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు, జరిగిన నష్టాన్ని నివేదిస్తూ పాఠశాల యాజమాన్యాలు జియోట్యాగ్ చేయటం వల్ల సమగ్ర శిక్షా అభియాన్ కింద సకాలంలో సహాయం అందుతుంది.
నీటి సంరక్షణలో భాగంగా వర్షపు నీటిని సేకరించి, నిల్వ చేసేందుకు ఇంకుడు గుంతలను నిర్మిస్తారు. ఈ ప్రయత్నాలు భూగర్భ జల మట్టాలు మెరుగుపడేందుకు, నీటి నిర్వహణకు మద్దతిస్తాయి.
హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అంతర మంత్రిత్వ శాఖల కేంద్ర బృందాలను అక్కడికి పంపింది. వారిచ్చిన నివేదిక ఆధారంగా తదుపరి అందించే సాయంపై పరిశీలిస్తారు.
ఈ విపత్తు వల్ల ప్రభావితమైన కుటుంబాలను ప్రధానమంత్రి కలిశారు. వరదల వల్ల మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ విపత్కర సమయంలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని, కావాల్సిన సాయం అందిస్తామని ఆయన పేర్కొన్నారు.
ప్రకృతి విపత్తు వల్ల మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ.2లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50,000 పరిహారాన్ని పీఎం శ్రీ మోదీ ప్రకటించారు. ఇటీవల వచ్చిన వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి కారణాల వల్ల అనాథలైన పిల్లలకు పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం కింద సమగ్ర సహకారం అందిస్తామని ప్రధానమంత్రి తెలిపారు. ఇది వారి దీర్ఘకాల శ్రేయస్సుకు ఉపయోగపడుతుందన్నారు.
విపత్తు నిర్వహణ నిబంధనల ప్రకారం రాష్ట్రాలకు ముందస్తు చెల్లింపులతో సహా అన్ని విధాలా సాయమందిస్తున్నట్లు ప్రధానమంత్రి తెలిపారు. తక్షణ సహాయక చర్యలు అందించటంలో, ప్రతిస్పందనలో చేసిన కృషికి.. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, రాష్ట్ర పరిపాలన విభాగం, ఇతర సేవా సంస్థల సిబ్బందిని ఆయన అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన వినతి పత్రం, కేంద్ర బృందాల నివేదిక ఆధారంగా నష్ట పరిహారం అంచనాలను కేంద్ర ప్రభుత్వం మరోసారి సమీక్షిస్తుంది.
పరిస్థితి తీవ్రతను గుర్తించిన ప్రధానమంత్రి... అక్కడి పరిస్థితులను చక్కదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని హామీ ఇచ్చారు.
(Release ID: 2164962)
Visitor Counter : 2
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam