వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ప్రపంచ సవాళ్లను అధిగమించడానికి ఏకతాటిపైకి భారత్...
స్వదేశీపైనా, ఆత్మనిర్భర్ భారత్‌పైనా ప్రత్యేకశ్రద్ధ అత్యవసరం: వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్
‘‘జీరో డిఫెక్ట్, జీరో ఎఫెక్ట్’’ ప్రధాన అభివృద్ధే భారత్ ధ్యేయం...
ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయ భాగస్వామి, స్థిరతాయత్నాల్లో అగ్రగామి భారత్: శ్రీ గోయల్
జీఎస్టీ రేట్లలో తగ్గింపు, సంస్కరణలతో దేశీయ వ్యాపారాలకు ఊతం...
ప్రపంచంలో ఆర్థిక శక్తిగా త్వరలో అవతరించనున్న భారత్: శ్రీ పీయూష్ గోయల్
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సారథ్యంలో...
అయిదు బలహీన దేశాల జాబితా నుంచి అగ్రగామి అయిదు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగిన భారత్: శ్రీ పీయూష్ గోయల్
Posted On:
08 SEP 2025 1:59PM by PIB Hyderabad
ప్రపంచానికి ఎంత పెద్ద సమస్య వచ్చినా, భారత్ మాత్రం స్థిరంగా ఉంటుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ అన్నారు. ఈఈపీసీ ఇండియా 56వ జాతీయ పురస్కారాల కార్యక్రమంలో ఈ రోజు ఆయన ప్రసంగించారు. ఎలాంటి సంక్షోభానికైనా ఎదురొడ్డి నిలిచే బలం మన దేశానికి ఉందని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వాణిజ్య సంస్థలు స్వదేశీ ఉత్పాదనలపై దృష్టి కేంద్రీకరించాలని, ఇది భారత అభివృద్ధికి తోడ్పడడంతో పాటు దేశ ఆర్థిక భద్రతను పటిష్ఠపరుస్తుందని స్పష్టం చేశారు. భారత్ ఎగుమతులపైనా, దిగుమతులపైనా- విదేశీ నియంత్రణలుంటాయన్న సంగతి ఇటీవలే తెలిసిందనీ, ఈ చర్యల వల్ల వాణిజ్యానికి అడ్డంకులు ఎదురవుతాయన్నారు. ఈ కారణంగా, స్వావలంబన యుక్త భారత్ దిశగా అడుగులు వేయడంపై మరింతగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
నవకల్పనకు పెద్దపీట వేయాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆగస్టు 15న చెబుతూ, స్వదేశీ వస్తువులను ఆదరించాలని ప్రముఖంగా ప్రస్తావించినట్లు శ్రీ గోయల్ గుర్తు చేశారు. దేశంలో తయారు చేసిన ఉత్పాదనలపై వాణిజ్య సంస్థలతో పాటు 140 కోట్ల మంది భారతీయులు దృష్టిపెట్టాలని ఆయన అన్నారు. దిగుమతులపై ఆధారపడుతున్న వాణిజ్య సంస్థలు ముడిపదార్థాలను దేశంలోనే కొనుగోలు చేస్తూ, తుది ఉత్పాదనలను తీర్చిదిద్దడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలని ఆయన సూచించారు.
రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము... ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు. ఆమె తన ప్రసంగంలో భారత్ ఇంజినీరింగ్ ఎగుమతులను ప్రస్తావిస్తూ, ఈ ఎగుమతులు కొన్ని దశాబ్దాల వ్యవధిలోనే అధికం అయ్యాయన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలపరచడంలో, ప్రపంచంలో భారత్ స్థాయిని పెంచడంలో ఎగుమతులకు ఎంత ప్రాధాన్యం ఉందో కూడా ఆమె వివరించారు.
వాణిజ్యం, ఎంఎస్ఎంఈ రంగాలపై భారత్ బలం ఆధారపడి ఉందనీ, ఈ రంగాలు దేశ వాణిజ్యానికి వెన్నెముకగా ఉన్నాయనీ శ్రీ గోయల్ ప్రధానంగా చెప్పారు. భారత్ అంతకంతకు మరింత బలపడుతోందని, ఎవరిముందూ తలొగ్గబోదని, మన ఆత్మవిశ్వాసానికి తిరుగులేదని ఆయన అన్నారు. ఈఈపీసీ ప్రస్థానాన్ని మంత్రి ప్రస్తావిస్తూ, 1955లో ఎగుమతుల విలువ ఒక కోటి యూఎస్ డాలర్లు ఉంటే ప్రస్తుతం 11,600 కోట్ల యూఎస్ డాలర్లకు ఎగబాకిందని తెలిపారు. కాలం గడిచే కొద్దీ, ఇంజినీరింగ్ రంగం మరింత భారీ లక్ష్యాలతో ‘ఇంతింతై వటుడింతయై..’ అన్న చందంగా వృద్ధి చెందగలదని ఆయన చెప్పారు.
భారత్‌పై తనకు పూర్తి నమ్మకం ఉందని మంత్రి అన్నారు. ‘‘జీరో డిఫెక్ట్, జీరో ఎఫెక్ట్’’ అనే ఆదర్శవాక్యం గొప్ప ఫలితాలను అందించగలుగుతుందని చెప్పారు. భారత్‌లో నాణ్యమైన ఉత్పాదనలను తయారు చేయడంతో పాటు వాటిని ప్రపంచం నలుమూలలా విక్రయించేందుకు చర్యలు ప్రయత్నించాలని ఆయన ఉద్ఘాటించారు. ఇండియాను ఇవాళ ప్రపంచదేశాలు భరోసానిచ్చే భాగస్వామిగా భావిస్తున్నాయనీ, ఆ స్థాయిని కాపాడుకోవడం ముఖ్యమన్నారు. స్థిరత్వం తాలూకు ప్రయోజనాలు ఎంత విస్తృతమైనవో భారత్‌కు తెలుసని చెప్పారు. బాధ్యత గల అంతర్జాతీయ సమాజ సభ్యదేశంగా భారత్ ప్రకృతి పరిరక్షణ బాధ్యతను గుర్తించిందనీ, ప్యారిస్‌లో ‘కాప్21’ని నిర్వహించిన సందర్భంగా ఎన్‌డీసీ పక్షాన ఇండియా చేసిన వాగ్దానాలను మరచిపోలేదనీ, అంతర్జాతీయ సుస్థిరత్వం దిశగా ప్రయాణించడంలో వరుస సంవత్సరాల్లో అగ్రగామి మూడు స్థానాల్లో ఇండియా నిలిచిందనీ మంత్రి తెలిపారు.
భారత్ బలహీనమైన అయిదు ఆర్థికవ్యవస్థల్లో ఒకటిగా ఉన్న స్థాయి నుంచి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో అగ్రగామి అయిదు దేశాల్లో ఒకటిగా అవతరించిందని శ్రీ గోయల్ తెలిపారు. గత నాలుగు సంవత్సరాలుగా ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ మన దేశానిదేనని కూడా ఆయన వివరించారు. గడచిన మూడు నెలల్లో, దేశం 7.8 శాతం జీడీపీ వృద్ధిని సాధించిందని ఆయన చెబుతూ ఇది ప్రపంచ రికార్డని అభివర్ణించారు.
జీఎస్టీ రేట్లను తగ్గించడంతో పాటు సరళతరం చేసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. మన దేశంలో డిమాండుకు ఉత్తేజాన్ని అందించారని మంత్రి అన్నారు. దీంతో ఉద్యోగులకు కొత్త అవకాశాలతో పాటు ఆదాయం పెరుగుతుందని చెప్పారు. బలమైన ఆర్థిక వ్యవస్థలో మౌలిక సదుపాయాలపై చేసే ఖర్చుతో పాటు వినియోగదారుల పరంగా గిరాకీ.. ఈ రెండూ పెరిగితే, ప్రపంచ శక్తిగా భారత్ అభివృద్ధి చెందకుండా, ప్రపంచంలోని ఏ శక్తీ మనల్ని ఆపజాలదని కూడా శ్రీ గోయల్ వ్యాఖ్యానించారు.
ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి ఫలాలను అందరికీ సమానంగా అందించడం ఎంతో ముఖ్యమని శ్రీ పీయూష్ గోయల్ చెప్పారు. జీఎస్టీ రేట్లను తగ్గించినందువల్ల కలిగే ప్రయోజనాలను వినియోగదారులకు పూర్తి స్థాయిలో తప్పక బదలాయించాలని, అభివృద్ధి ఫలాలు దేశంలో అందరికీ అందేటట్లు చూడడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ పునాదిని బలపరిచేట్లు చూడాలన్నారు. భారత్ ఒక ఉమ్మడి కుటుంబంలా పనిచేస్తూ వివిధ రంగాలు ఒకదానికొకటి మద్దతివ్వడం ద్వారా సమ్మిళిత వృద్ధి దానంతట అదే నమోదవుతుందన్నారు. స్థిర ప్రాతిపదిక కలిగిన, సమ్మిళితమైన అభివృద్ధికి ప్రపంచంలో ఒక ఆదర్శ నమూనాగా భారత్ మారుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
***
(Release ID: 2164690)
Visitor Counter : 2