ప్రధాన మంత్రి కార్యాలయం
భారత్- జపాన్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్న ప్రధాని
Posted On:
29 AUG 2025 2:23PM by PIB Hyderabad
భారత పరిశ్రమల సమాఖ్య, కీడాన్రెన్ (జపాన్ వాణిజ్య సమాఖ్య) టోక్యోలో 2025 ఆగస్టు 29న నిర్వహించిన భారత్ - జపాన్ ఎకనామిక్ ఫోరంలో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, జపాన్ ప్రధానమంత్రి శ్రీ షిగేరు ఇషిబా పాల్గొన్నారు. భారత్ -జపాన్ వాణిజ్యాధినేతల ఫోరం సీఈవోలు సహా భారత్, జపాన్ నుంచి పారిశ్రామిక ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
భారత్ - జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యాన్నీ.. ముఖ్యంగా పెట్టుబడులు, తయారీ, సాంకేతికత రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని ప్రధానమంత్రి తన ప్రసంగంలో వివరించారు. భారత్లో తమ కార్యకలాపాలను మరింత విస్తరించాలని జపాన్ కంపెనీలను ఆహ్వానించారు. విజయవంతంగా సాగుతున్న భారత అభివృద్ధి ప్రస్థానంలో వారికి అనేక ఉత్తేజకరమైన అవకాశాలు ఉంటాయన్నారు. ప్రస్తుత కల్లోల ప్రపంచ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో విశ్వసనీయ మిత్రుల మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడం అత్యావశ్యకమని ఆయన పేర్కొన్నారు. రాజకీయ సుస్థిరత, విధాన అంచనా, సంస్కరణల పట్ల నిబద్ధత, వాణిజ్య సౌలభ్య చర్యలు భారత మార్కెట్‌పట్ల పెట్టుబడిదారుల్లో సరికొత్త నమ్మకాన్ని కల్పించాయని, అంతర్జాతీయ సంస్థలు తాజాగా భారత క్రెడిట్ రేటింగ్ ను పెంచడాన్ని బట్టి ఇది స్పష్టమవుతోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, తయారీ, పెట్టుబడులు, భారత్ - జపాన్ మధ్య మానవ వనరుల వినిమయంలో సహకారం ఆవశ్యకతను ప్రత్యేకంగా వివరిస్తూ... అంతర్జాతీయ వృద్ధిలో భారత్ వాటా దాదాపు 18 శాతంగా ఉందని, మరి కొన్నేళ్లలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా పయనిస్తోందని భారత ప్రధానమంత్రి తెలిపారు. రెండు ఆర్థిక వ్యవస్థల అనుబంధం దృష్ట్యా.. మేకిన్ ఇండియా, ఇతర కార్యక్రమాల దిశగా అయిదు కీలక రంగాల్లో భారత్ - జపాన్ మధ్య వాణిజ్య సహకారాన్ని పెంపొందించుకోవాలని ఆయన పేర్కొన్నారు. అవి: i) తయారీ - బ్యాటరీలు, రోబోటిక్స్, సెమీ కండక్టర్లు, నౌకా నిర్మాణం, అణు ఇంధన రంగాల్లో, ii) కృత్రిమ మేధ, క్వాంటం కంప్యూటింగ్, అంతరిక్షం, బయోటెక్ సహా సాంకేతికత, ఆవిష్కరణల్లో సహకారం, iii) పర్యావరణ హిత ఇంధనం దిశగా పరివర్తన, iv) రవాణా, హైస్పీడ్ రైలు – అనుబంధ వ్యవస్థలు సహా సమగ్ర మౌలిక సదుపాయాలు, v) నైపుణ్యాభివృద్ధి, ప్రజా సంబంధాలు. ప్రధానమంత్రి వ్యాఖ్యలను ఇక్కడ పూర్తిగా చూడొచ్చు [Link].
జపాన్ ప్రధానమంత్రి శ్రీ ఇషిబా మాట్లాడుతూ.. భారత ప్రతిభ, జపాన్ సాంకేతికత మధ్య భాగస్వామ్యం ద్వారా అంతరాయాల్లేని సరఫరా వ్యవస్థను నెలకొల్పడానికి జపాన్ కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని పేర్కొన్నారు. భారత్, జపాన్ మధ్య మూడు ప్రాధాన్యాలను ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రత్యక్ష భాగస్వామ్యాల బలోపేతం, సాంకేతికత - పర్యావరణ హిత కార్యక్రమాలు - మార్కెట్ సమ్మేళనం, అత్యున్నత, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, ముఖ్యంగా సెమీ కండక్టర్ వంటి కీలక రంగాల్లో సహకారం.
12వ భారత్ - జపాన్ వాణిజ్యాధినేతల ఫోరం (ఐజేబీఎల్ఎఫ్) నివేదికను ఐజేబీఎల్ఎఫ్ సహాధ్యక్షులు ప్రధానులిద్దరికీ అందజేశారు. భారత్ - జపాన్ మధ్య పెరుగుతున్న పారిశ్రామిక భాగస్వామ్యాలను వివరిస్తూ... ఉక్కు, కృత్రిమ మేధ, అంతరిక్షం, విద్య, నైపుణ్యాలు, పర్యావరణ హిత ఇంధనం, మానవ వనరుల వినిమయం వంటి వివిధ రంగాల్లో భారత్ - జపాన్ కంపెనీల మధ్య కుదిరిన వివిధ పారిశ్రామిక అవగాహన ఒప్పందాలను జపాన్ విదేశీ వాణిజ్య సంస్థ (జెట్రో) చైర్మన్, సీఈవో శ్రీ నొరిహికో ఇషిగురో ప్రకటించారు.
***
(Release ID: 2162030)
Visitor Counter : 11
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali-TR
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam