ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జపాన్, చైనా పర్యటనకు బయలుదేరి వెళ్లే ముందు ప్రధాని ప్రకటన

Posted On: 28 AUG 2025 8:41PM by PIB Hyderabad

జపాన్ ప్రధానమంత్రి షిగేరు ఇషిబా ఆహ్వానం మేరకు, 15 వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆ దేశానికి వెళుతున్నాను.

నా పర్యటనలో భాగంగా, గత పదకొండేళ్లలో స్థిరమైన, గణనీయమైన పురోగతి సాధించిన మన ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యానికి తర్వాతి దశను రూపొందించడంపై మేం దృష్టి సారిస్తాం. మన సహకారానికి కొత్త రెక్కలు ఇవ్వడానికి, మన ఆర్థిక, పెట్టుబడుల సంబంధాల పరిధిని, ఆశయాన్ని విస్తరించడానికి, ఏఐ, సెమీ కండక్టర్లతో సహా నూతన, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల్లో సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మేం కృషి చేస్తాం. మన ప్రజలను అనుసంధానించే నాగరికత, సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసే అవకాశంగా సైతం ఈ పర్యటన ఉంటుంది.

జపాన్ నుంచి.. అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆహ్వానం మేరకు టియాన్జిన్‌లో జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు చైనాకు వెళతాను. ఎస్‌సీవోలో భారత్ చురుకైన, నిర్మాణాత్మక సభ్యురాలు. దీనికి మనం అధ్యక్షత వహించిన సమయంలో కొత్త ఆలోచనలను పరిచయం చేశాం. ఆవిష్కరణ, ఆరోగ్యం, సాంస్కృతిక వినిమయం రంగాల్లో సహకారాన్ని ప్రారంభించాము. ఉమ్మడి సవాళ్లను పరిష్కరించడానికి, ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడానికి ఎస్‌సీవో సభ్యులతో కలసి పనిచేసేందుకు భారత్ కట్టుబడి ఉంది. ఈ శిఖరాగ్ర సమావేశంలో అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, అధ్యక్షుడు పుతిన్‌, ఇతర నాయకులతో సమావేశమయ్యేందుకు ఎదురుచూస్తున్నాను.

జపాన్, చైనాలో నా పర్యటనలను మన దేశ ఆసక్తులను, ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్తాయని, ప్రాంతీయ, ప్రపంచ శాంతిని, భద్రతను, సుస్థిరాభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో ఫలప్రదమైన సహకారానికి దోహదపడతాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాను. 

 

***


(Release ID: 2161723) Visitor Counter : 47