మంత్రిమండలి
ప్రధానమంత్రి వీధి వ్యాపారుల స్వావలంబన నిధి (పీఎమ్ స్వనిధి) పథకం పునర్వ్యవస్థీకరణ, రుణ వ్యవధిని
31.12.2024 మించి పొడిగించేందుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
వీధి వ్యాపారులు, వారి కుటుంబాల కోసం రుణాల పెంపు, యూపీఐ-అనుసంధానిత క్రెడిట్ కార్డులు, డిజిటల్ లావాదేవీలు, సమగ్ర సామాజిక-ఆర్థిక వృద్ధి
Posted On:
27 AUG 2025 2:49PM by PIB Hyderabad
"ప్రధానమంత్రి వీధి వ్యాపారుల స్వావలంబన నిధి (పీఎమ్ స్వనిధి) పథకం పునర్వ్యవస్థీకరణ, 31.12.2024 తర్వాతి కాలానికి రుణ వ్యవధి పొడిగింపు" నిర్ణయాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్రమంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. తాజాగా రుణ వ్యవధిని 2030 మార్చి 31 వరకు పొడిగించారు. ఈ పథకం మొత్తం వ్యయం రూపాయలు 7,332 కోట్లు. పథకం పునర్వ్యవస్థీకరణ ద్వారా 50 లక్షల మంది కొత్త లబ్ధిదారులు సహా మొత్తం 1.15 కోట్ల మందికి ప్రయోజనం చేకూర్చడం లక్ష్యంగా నిర్దేశించారు.
గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎమ్‌వోహెచ్‌యూఏ), ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) సంయుక్తంగా ఈ పథకం అమలు బాధ్యతలు చూస్తాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, వాటి క్షేత్ర స్థాయి కార్యాచరణ సంస్థల ద్వారా వీధి వ్యాపారులకు సులభంగా రుణాలు, క్రెడిట్ కార్డులను అందించేందుకు డీఎఫ్ఎస్ బాధ్యత వహిస్తుంది.
మొదటి, రెండో విడతలో అందించే రుణ మొత్తాన్ని పెంచడం, రెండో దఫా రుణాన్ని తిరిగి చెల్లించిన లబ్ధిదారులకు యూపీఐ-అనుసంధానిత రూపే క్రెడిట్ కార్డు సదుపాయం కల్పించడం, చిల్లర, టోకు లావాదేవీల కోసం డిజిటల్ క్యాష్‌బ్యాక్ ప్రోత్సాహకాలను అందించడం పునర్వ్యవస్థీకరించిన ఈ పథకం ముఖ్య లక్షణాల్లో భాగంగా ఉన్నాయి. అధికారిక పట్టణాలు, అనధికారిక పట్టణాలు, నగరశివారు ప్రాంతాలు మొదలైన ప్రాంతాలకు క్రమంగా ఈ పథకాన్ని విస్తరించనున్నారు.
మొదటి విడత రుణాలను రూ 15,000ల వరకు (రూ 10,000ల నుంచి), రెండో విడత రుణాలు రూ 25,000ల వరకు (రూ 20,000ల నుంచి) పెంచారు. మూడో విడత రుణ మొత్తం రూ 50,000. ఇందులో ఎలాంటి మార్పు చేయలేదు.
యూపీఐ-అనుసంధానిత రూపే క్రెడిట్ కార్డును అందించడం ద్వారా వీధి వ్యాపారులకు ఏవైనా అత్యవసర వ్యాపార, వ్యక్తిగత అవసరాల కోసం తక్షణ రుణం లభించనుంది.
డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం కోసం వీధి వ్యాపారులకు చిల్లర, టోకు లావాదేవీలపై రూ 1,600ల వరకు క్యాష్‌బ్యాక్ ప్రోత్సాహకాలను అందించనున్నారు.
వ్యవస్థాపకత, ఆర్థిక అక్షరాస్యత, డిజిటల్ నైపుణ్యాలు, వినియోగదారు కేంద్రిత మార్కెటింగ్‌పై ప్రధానంగా దృష్టి సారిస్తూ ఈ పథకం వీధి వ్యాపారుల సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం కృషి చేస్తుంది. ఆహార పదార్థాలు విక్రయించే వీధి వ్యాపారులకు ఎఫ్ఎస్ఎస్ఏఐ భాగస్వామ్యంతో ప్రామాణిక పరిశుభ్రత, ఆహార భద్రత వంటి అంశాల్లో శిక్షణ అందించనున్నారు.
వీధి వ్యాపారులు, వారి కుటుంబాల సమగ్ర సంక్షేమం, అభివృద్ధి కోసం 'స్వనిధి నుంచి సమృద్ధి దాకా' కార్యక్రమాన్ని నెలవారీగా నిర్వహించే లోక్ కళ్యాణ్ మేళాల ద్వారా మరింత బలోపేతం చేయనున్నారు. లబ్ధిదారులకు, వారి కుటుంబాలకు వివిధ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పూర్తిగా చేరేలా చూడటం దీని ఉద్దేశ్యం.
కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న వీధి వ్యాపారులకు అండగా నిలవడం కోసం ప్రభుత్వం 2020 జూన్ 1వ తేదీన పీఎమ్ స్వనిధి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ప్రారంభం నుంచీ వీధి వ్యాపారులకు ఆర్థిక సహాయాన్ని మించిన ప్రయోజనాలను అందించింది. ఆర్థిక వ్యవస్థకు వారు అందించే తోడ్పాటును తెలియజేస్తూ అధికారిక గుర్తింపును ఇచ్చింది.
ప్రధానమంత్రి స్వనిధి పథకం ఇప్పటికే గణనీయ విజయాలను సాధించింది. 2025 జూలై 30 నాటికి 68 లక్షలకు పైగా వీధి వ్యాపారులకు రూ 13,797ల కోట్ల విలువైన 96 లక్షలకు పైగా రుణాలు ఈ పథకం ద్వారా పంపిణీ చేశారు. డిజిటల్ లావాదేవీలు ఎక్కువగా నిర్వహించే సుమారు 47 లక్షల మంది లబ్ధిదారులు.. రూ 6.09 లక్షల కోట్ల విలువైన 557 కోట్లకు పైగా డిజిటల్ లావాదేవీల ద్వారా మొత్తం రూ 241 కోట్ల క్యాష్‌బ్యాక్ రూపంలో అందుకున్నారు. ‘స్వనిధి నుంచి సమృద్ధి దాకా’ కార్యక్రమం ద్వారా 3,564 పట్టణ స్థానిక సంస్థల్లో (యూఎల్‌బీలలో) 46 లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేసి.. ఈ పథకం ద్వారా 1.38 కోట్లకు పైగా రుణాలు మంజూరు చేశారు.
ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం, జీవనోపాధిని ప్రోత్సహించడం, ఆర్థిక సమగ్రతను కొనసాగించడం, డిజిటల్ సాధికారతను ముందుకు నడిపించడంలో అత్యుత్తమ కృషికి గాను ఈ పథకం ఆవిష్కరణల కోసం (జాతీయ స్థాయిలో) ప్రైమ్ మినిస్టర్స్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (2023) పురస్కారాన్ని పొందింది. అలాగే డిజిటల్ పరివర్తన కోసం సిల్వర్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ గవర్నమెంట్ ప్రాసెస్ రీ-ఇంజినీరింగ్ (2022) పురస్కారాన్నీ అందుకుంది.
వ్యాపార విస్తరణకు, సుస్థిర వృద్ధి అవకాశాలకు మద్దతునివ్వడానికి నమ్మకమైన ఆర్థిక వనరులను అందించడం ద్వారా వీధి వ్యాపారుల సమగ్ర అభివృద్ధి... ఈ పథకం విస్తరణ లక్ష్యంగా ఉంది. ఇది వీధి వ్యాపారులకు సాధికారత కల్పించడమే కాకుండా సమ్మిళిత ఆర్థిక వృద్ధిని.. వీధి వ్యాపారులు, వారి కుటుంబాల సామాజిక-ఆర్థిక అభ్యున్నతిని పెంపొందిస్తూ వారి జీవనోపాధిని మెరుగుపరుస్తుంది. పట్టణ ప్రాంతాలను శక్తిమంతమైన, స్వయం సమృద్ధిగల వ్యవస్థలుగా అభివృద్ధి చేస్తుంది.
***
(Release ID: 2161272)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Nepali
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam