ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

Posted On: 15 AUG 2025 12:29PM by PIB Hyderabad

నా ప్రియ దేశవాసులారా,


ఈ స్వాతంత్య్ర మహోత్సవం 140 కోట్ల ప్రజల సంకల్పాన్ని ప్రతిబింబిస్తూ జరుగుతున్న వేడుక. ఈ స్వాతంత్య్ర దినోత్సవం సమష్టి విజయానికి ప్రతీక. మనందరికీ గర్వకారణం. మన హృదయాలు ఆనందంతో ఉప్పొంగే క్షణమిది. దేశంలో ఎప్పటికప్పుడు ఐక్యతా స్ఫూర్తి బలోపేతమవుతోంది. 140 కోట్ల భారతీయులు ఈ రోజు మువ్వన్నెల్లో మెరుస్తున్నారు. ‘హర్ ఘర్ తిరంగా’ రెపరెపలాడుతోంది. ఎడారులయినా, హిమాలయ శిఖరాలయినా, సముద్ర తీరాలయినా, లేదా జనసమ్మర్ధ ప్రాంతాలయినా.. అంతటా ఒకే నినాదం, ఒకే ఉత్సాహం. మనం ప్రాణం కన్నా మిన్నగా భావించే మాతృభూమి కీర్తనే మార్మోగుతోంది.

నా ప్రియ దేశవాసులారా,

1947లో లక్షలాది దేశ ప్రజల బలం తోడవగా, ఎన్నెన్నో ఆకాంక్షల నడుమ మన దేశం స్వాతంత్య్రం పొందింది. మన ఆశయాలు ఆకాశాన్ని తాకుతున్నా, మరింత పెద్ద సవాళ్లనే ఎదుర్కోవాల్సిన పరిస్థితి నాడు నెలకొని ఉంది. పూజ్య బాపూజీ సూత్రాలకు అనుగుణంగా రాజ్యాంగ సభ సభ్యులు కీలక బాధ్యతను నెరవేర్చారు. భారత రాజ్యాంగం 75 ఏళ్లుగా ఓ దీపస్తంభంలా మనకు మార్గనిర్దేశం చేస్తోంది. మన రాజ్యాంగ నిర్మాతలు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, బాబాసాహెబ్ అంబేద్కర్, పండిట్ నెహ్రూ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి అనేక మంది నిపుణులు, గొప్ప నాయకులు కీలక పాత్ర పోషించారు. మన మహిళలు కూడా విశేషంగా కృషి చేశారు. హంసా మెహతా, దాక్షాయణీ వేలాయుధన్ వంటి నిపుణులు భారత రాజ్యాంగాన్ని బలోపేతం చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు. దేశానికి మార్గనిర్దేశం చేసి, దశాదిశా చూపిన రాజ్యాంగ నిర్మాతలకు ఎర్రకోట సాక్షిగా సగౌరవంగా ప్రణమిల్లుతున్నాను.

నా ప్రియ దేశవాసులారా,
ఈ రోజు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి కూడా. భారత రాజ్యాంగం కోసం ప్రాణాలర్పించిన మొదటి మహనీయుడు ఆయన. రాజ్యాంగం కోసం ఆయన చేసిన త్యాగం, అధికరణ- 370 అనే అడ్డుగోడను బద్దలుగొట్టి ‘ఒక దేశం, ఒకే రాజ్యాంగం’ మంత్రాన్ని సాకారం చేయడం ఆయనకు మనమిచ్చిన నిజమైన నివాళి. సుదూర ప్రాంతాల గ్రామ పంచాయతీ సభ్యులు, ‘డ్రోన్ దీదీలు’, ‘లాఖ్ పతి దీదీల’ ప్రతినిధులు,” క్రీడాకారులు, జీవితాన్ని దేశానికి అంకితం చేసిన ఇతర ప్రముఖులు... ఇలా చాలా మంది విశిష్ట అతిథులు ఈ రోజు ఎర్రకోట వద్ద ఉన్నారు. ఓ విధంగా ‘మినీ భారత్’ నా కళ్లెదుట కదలాడుతోంది. టెక్నాలజీ సాయంతో ఈ విశాల భారతదేశం కూడా ఎర్రకోటతో అనుసంధానమైంది. నా తోటి దేశ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతదేశ ప్రేమికులకు, మన మిత్రులకు.. ఈ స్వాతంత్య్ర మహోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

ప్రకృతి మనందరినీ పరీక్షిస్తోంది. కొండచరియలు విరిగిపడటం, మేఘ విస్పోటం, ఎన్నెన్నో ఇతర విపత్తులు... ఇలా అనేక ప్రకృతి వైపరీత్యాలను కొన్ని రోజులుగా మనం ఎదుర్కొన్నాం. బాధితులకు సానుభూతి తెలుపుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తూ.. రక్షణ కార్యకలాపాలు, సహాయ చర్యలు, పునరావాస పనుల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నాయి.

మిత్రులారా,


ఈ ఆగస్టు 15కు మరో ప్రత్యేక ప్రాధాన్యముంది. ఈ రోజు ఎర్రకోట వేదికగా ఆపరేషన్ సిందూర్ వీర యోధులకు ప్రణమిల్లే అవకాశం లభించడం నాకు గర్వకారణం. మన వీర సైనికులు శత్రువులను వారి ఊహకందని రీతిలో శిక్షించారు. ఏప్రిల్ 22న సరిహద్దులు దాటిన ఉగ్రవాదులు.. మతమేమిటో అడిగి ప్రజలను చంపుతూ, భార్యల కళ్లెదుటే భర్తలను కాల్చేస్తూ, పిల్లల ఎదుటే తండ్రుల ప్రాణాలు తీస్తూ పహల్గామ్‌లో మారణకాండకు పాల్పడ్డారు. దేశమంతా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ఈ మారణకాండను చూసి ప్రపంచం మొత్తం దిగ్భ్రాంతి చెందింది.

నా ప్రియ దేశవాసులారా,

ఆ ఆగ్రహానికి వ్యక్తీకరణే ఆపరేషన్ సిందూర్. 22వ తేదీ నాటి సంఘటనల అనంతరం.. వ్యూహాలను నిర్ణయించడం, లక్ష్యాలను, సరైన సమయాన్ని ఎంచుకోవడంలో మన సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చాం. దశాబ్దాలుగా జరగనిదాన్ని మన సైన్యం సాధించింది. వందల కిలోమీటర్లు శత్రు భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసి, శిథిలాలుగా మార్చింది. పాకిస్థాన్‌కు ఇప్పటికీ నిద్ర పట్టడం లేదు. పాకిస్థాన్‌లో జరిగిన విధ్వంసం చాలా పెద్దది. రోజూ కొత్త విషయాలు, కొత్త సమాచారం బయటపడుతున్నాయి.

నా ప్రియ దేశవాసులారా,

మన దేశం అనేక దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని భరించింది. దేశ హృదయాన్ని గాయపరిచే ప్రయత్నాలు ఎన్నోసార్లు జరిగాయి. ఇప్పుడ మన విధానం మారింది. ఉగ్రవాదులను పెంచి పోషించేవారిని, మద్దతిచ్చేవారిని ఇకపై ఉగ్రవాదులతో భిన్నంగా చూడబోము. మానవతకు వారంతా సమాన శత్రువులు. వారి మధ్య ఎలాంటి తారతమ్యమూ లేదు. ఈ అణు బెదిరింపులను ఇకపై ఏమాత్రం సహించేది లేదని భారత్ ఇప్పుడు నిశ్చయానికి వచ్చింది. ఇంతకాలం కొనసాగిన అణు బెదిరింపులను ఇకపై భరించలేము. భవిష్యత్తులో శత్రువులు మరోసారి ఇందుకు ప్రయత్నిస్తే.. మన సైన్యం సరైన సమయంలో, సరైన విధంగా, స్వయంగా లక్ష్యాలను ఎంచుకుని, స్వతంత్రంగా తిప్పికొడుతుంది. భారత్ తగిన రీతిలో స్పందించి దీటుగా బదులిస్తుంది.

నా ప్రియ దేశవాసులారా,
రక్తమూ నీరూ ఒకేసారి ప్రవహించబోవని భారత్ ఇప్పుడు స్పష్టంగా నిశ్చయానికొచ్చింది. సింధూ జలాల ఒప్పందం ఎంత అన్యాయంగా, ఏకపక్షంగా ఉందో దేశ ప్రజలకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. భారత్‌లో పుట్టే నదుల జలాలు శత్రువుల వ్యవసాయ క్షేత్రాలకు సాగునీటిని అందిస్తుంటే.. మరోవైపు మన రైతులతోపాటు నేలలూ నీటి కొరతతో అలమటిస్తున్నాయి. ఈ ఒప్పందం గత ఏడు దశాబ్దాలుగా మన రైతులకు ఊహింపశక్యంగాని నష్టాన్ని కలిగించింది. ఇప్పుడు మనదేశానికి న్యాయబద్ధంగా దక్కాల్సిన నీరు పూర్తిగా మనకే, పూర్తిగా భారత రైతులకే అందుతుంది. ఇప్పుడున్న సింధూ జలాల ఒప్పందాన్ని దశాబ్దాలుగా భరించిన భారత్.. ఇకపై దాన్ని సహించబోదు. మన రైతుల ప్రయోజనాల దృష్ట్యా, మన దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ ఒప్పందం మనకు ఆమోదయోగ్యం కాదు.

నా ప్రియ దేశవాసులారా,

స్వతంత్రం కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేశారు. యవ్వనాన్ని ధారపోశారు. జీవితాంతం జైళ్లలో గడిపారు. ఉరికొయ్యలను ముద్దాడారు. వారు ఇవన్నీ భరించింది స్వలాభం కోసం కాదు... భరతమాత గౌరవాన్ని నిలబెట్టడం కోసం, కోట్లాది ప్రజల స్వతంత్రత కోసం, బానిసత్వ శృంఖలాలను తెంచడం కోసం మదినిండా స్వాభిమాన స్ఫూర్తిని నింపుకొన్నారు.

మిత్రులారా,

బానిసత్వం మనల్ని పేదరికంలోకి నెట్టింది. పరాధీనులుగా కూడా మార్చింది. ఇతరులపై మన ఆధీనత పెరుగుతూ వచ్చింది. మనందరికీ తెలుసు.. స్వాతంత్య్రం తర్వాత కోట్లాది ప్రజలకు ఆహారాన్ని అందించడం కీలక సవాలుగా మారింది. దేశ రైతులు కష్టపడి పనిచేసి మన ధాన్యాగారాలను నింపారు. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో వారు దేశాన్ని స్వయం సమృద్ధంగా నిలిపారు. నేటికీ ఒక దేశ ఆత్మగౌరవానికి గొప్ప కొలమానం దాని స్వావలంబనే.

నా ప్రియ దేశవాసులారా,
స్వావలంబనతో కూడిన భారత్.. వికసిత భారత్‌కు కూడా పునాది. ఇతరులపై ఎంత ఎక్కువగా ఆధారపడితే, ఒక దేశ స్వేచ్ఛ అంతగా ప్రశ్నార్థకమవుతుంది. పరాధీనత అలవాటుగా మారితే, స్వావలంబనను విడనాడి పరాధీనులుగా మారడాన్ని కనీసం గుర్తించలేకపోతే దుర్దశను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ అలవాటు ప్రమాదకరమైనది. కాబట్టి స్వావలంబన సాధించే దిశగా అనుక్షణం అప్రమత్తులుగా మెలగాలి.

నా ప్రియ దేశవాసులారా,

స్వావలంబన అనేది కేవలం దిగుమతులు, ఎగుమతులకో లేదా రూపాయలు, పౌండ్లు, డాలర్లకో పరిమితం కాదు. దాని అర్థం అంత పరిమితమైనది కాదు. స్వావలంబన మన సామర్థ్యంతో ముడిపడి ఉంది.  స్వావలంబన తగ్గడం మొదలైతే, మన సామర్థ్యం కూడా క్రమంగా క్షీణిస్తుంది. కాబట్టి మన సమర్థతను కాపాడుకోవడానికి, కొనసాగించడానికి, పెంచుకోవడానికి స్వావలంబన అత్యావశ్యకం.

మిత్రులారా,

ఆపరేషన్ సిందూర్‌లో ‘మేడిన్ ఇండియా’ అద్భుతాన్ని మనం చూశాం. మన దగ్గర ఎలాంటి ఆయుధాలున్నాయో, మన సమర్థత ఏమిటో, రెప్పపాటులో వారిని ధ్వంసం చేస్తున్న శక్తి ఏమిటో శత్రువుకు తెలియదు. ఓసారి ఊహించండి, మనకు స్వావలంబన లేకపోతే  ఆపరేషన్ సిందూర్‌ను ఇంత వేగంగా చేపట్టగలిగేవాళ్ళమా? మనకు ఆయుధాలను ఎవరు సరఫరా చేస్తారు, అవసరమైన పరికరాలు దొరుకుతాయో లేదో అనే చింతిస్తూ ఉండేవాళ్ళం. కానీ మన చేతుల్లోని, మన సాయుధ బలగాల చేతుల్లోని ‘మేడిన్ ఇండియా’ శక్తి వల్ల వారు ఎలాంటి ఆందోళన, అంతరాయం, సంకోచం లేకుండా తమ పరాక్రమాన్ని ప్రదర్శించారు. రక్షణ రంగంలో స్వావలంబన కోసం గత పదేళ్లుగా మన నిరంతర కృషి వల్లే నేడు మనం చూస్తున్న ఫలితాలు సాధ్యమయ్యాయి.

మిత్రులారా,

నేను మరో అంశాన్ని మీ దృష్టికి తేవాలనుకుంటున్నాను. ఈ 21వ శతాబ్దానికి సాంకేతికతే చోదక శక్తి అన్నది ఎవరూ కాదనలేని సత్యం. ఈ నేపథ్యంలో, ఒకసారి చరిత్రను పరిశీలిస్తే.. సాంకేతికతలో ప్రావీణ్యం సాధించిన ప్రతి దేశమూ అత్యున్నత అభివృద్ధి శిఖరాలను అధిరోహించి, సరికొత్త ఆర్థిక శక్తిగా నిలిచిన విషయం మనకు తెలుస్తుంది. సాంకేతికతలో విభిన్న కోణాలపై మనం మాట్లాడుకుంటున్న వేళ.. సెమీ కండక్టర్ల అంశాన్ని మీ దృష్టికి తెస్తున్నాను. నేను ఈ ఎర్రకోట వద్ద నిలబడి మాట్లాడుతున్నది ఏ వ్యక్తినో లేదా ప్రభుత్వాన్నో విమర్శించడానికి కాదు.. నాకు ఆ ఉద్దేశమూ లేదు. కానీ మన దేశ యువత కొన్ని విషయాలు తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. మన దేశంలో సెమీకండక్టర్లకు సంబంధించిన ఫైళ్ల కదలిక 50–60 ఏళ్ల కిందట మొదలైంది. సెమీకండక్టర్ ఫ్యాక్టరీ ఆలోచన అప్పుడు మొదలైంది. నేడు సెమీకండక్టర్లు అంతర్జాతీయ శక్తిగా మారాయి. కానీ అయిదారు దశాబ్దాల నాటి మన ఆలోచన అక్కడితోనే నిలిచిపోయి, నిరంతర జాప్యం వల్ల మరుగున పడిందన్న విషయం తెలిస్తే నా యువ మిత్రులు షాకవుతారు. సెమీకండక్టర్ల ఆలోచననే విడిచిపెట్టారు. 50-60 ఏళ్ల సమయాన్ని మనం కోల్పోయాం. అదే సమయంలో అనేక దేశాలు సెమీకండక్టర్లలో ప్రావీణ్యం సాధించి, ప్రపంచవ్యాప్తంగా శక్తిని చాటాయి.

మిత్రులారా,

ఈ రోజు మనం ఆ భారం నుంచి బయటపడి.. సెమీకండక్టర్లపై యుద్ధప్రాతిపదికన కృషి చేస్తున్నాం. వివిధ ప్రదేశాల్లో ఆరు సెమీకండక్టర్ యూనిట్లు రూపుదిద్దుకుంటున్నాయి. అలాగే, మరో నాలుగు కొత్త యూనిట్లకూ పచ్చజెండా ఊపాం.

నా దేశ ప్రజలకు, ముఖ్యంగా యువతకు, అలాగే ప్రపంచవ్యాప్తంగా భారత సాంకేతిక శక్తిని అర్థం చేసుకున్న వారికి నేనీ విషయం చెబుతున్నాను – ఈ ఏడాది చివరి నాటికి భారత ప్రజలు భారత్‌లో తయారు చేసిన ‘మేడిన్ ఇండియా’ చిప్ మార్కెటులో అందుబాటులో ఉంటుంది. మరో ఉదాహరణ కూడా చెబుతాను. ఇంధన రంగంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కోసం మనం అనేక దేశాలపై ఆధారపడుతున్నామని మనందరికీ తెలుసు. వాటిని సేకరించడానికి మనం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. ఇంధనపరంగా దేశం స్వావలంబన చేయడం అత్యావశ్యకం. ఈ దిశగా మేం సంకల్పించాం. గత 11 ఏళ్లలో సౌరశక్తి సామర్థ్యం ముప్పై రెట్లు పెరిగింది. జల విద్యుత్తును పెంచడం కోసం కొత్త ఆనకట్టలను నిర్మిస్తున్నాం. తద్వారా పర్యావరణ హిత పద్ధతుల్లో మనం ఇంధనాన్ని పొందవచ్చు. మిషన్ గ్రీన్ హైడ్రోజన్‌తో భారత్ నేడు వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతోంది. ఇంధన భవితను దృష్టిలో ఉంచుకుని, అణు ఇంధనపరంగానూ ముఖ్య కార్యక్రమాలను భారత్ చేపడుతోంది. అణు ఇంధన రంగంలో 10 కొత్త రియాక్టర్లను వేగంగా అభివృద్ధి చేస్తున్నారు. వికసిత భారత సాకారం కోసం మనం లక్ష్యంగా నిర్దేశించుకున్న, దేశం స్వాతంత్ర్యం సాధించి వందేళ్లు పూర్తయ్యే 2047 నాటికి.. మన అణు ఇంధన సామర్థ్యాన్ని పది రెట్లు పెంచుకోవాలన్న సంకల్పంతో మనం ముందుకు సాగుతున్నాం.

నా ప్రియ దేశవాసులారా,
సంస్కరణ అనేది నిరంతర ప్రక్రియ. కాలానుగుణంగా, పరిస్థితులకు బట్టి సంస్కరణలు చేపట్టాలి. అణు ఇంధన రంగంలో మనం ప్రధానమైన సంస్కరణలను ప్రవేశపెట్టాం. మన శక్తిని ద్విగుణీకృతం చేసుకోవడం లక్ష్యంగా, ఇప్పుడు అందులో ప్రైవేటు రంగానికీ తలుపులు తెరిచాం.

నా ప్రియ దేశవాసులారా,

భూ తాపం పట్ల ప్రపంచం నేడు ఆందోళన వ్యక్తం చేస్తోంది. 2030 నాటికి 50 శాతం పర్యావరణ హిత ఇంధన వినియోగాన్ని సాధించాలని భారత్ సంకల్పించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రపంచానికి చెప్తున్నాను. 2030 నాటికి దానిని మనం లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. అయితే, దేశ ప్రజల సామర్థ్యాన్ని చూడండి, అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దాలన్న వారి దృఢ సంకల్పాన్ని చూడండి... అయిదేళ్ల ముందుగానే, 2025 లోనే మనం ఆ ఇంధన లక్ష్యాన్ని సాధించాం. మనం ప్రపంచం పట్ల జవాబుదారీగా ఉండడంతోపాటు ప్రకృతిపై బాధ్యతతో మెలగడమే ఇందుకు కారణం.

నా ప్రియ దేశవాసులారా,
బడ్జెట్‌లో ఎక్కువ భాగం పెట్రోల్, డీజిల్, గ్యాస్ తీసుకురావడానికే ఖర్చయ్యాయి. లక్షల కోట్ల రూపాయలు వృథా  అయ్యాయి. ఇంధనపరంగా మనం పరాధీనులం కాకపోయి ఉంటే.. ఆ డబ్బు నా దేశ యువత భవిత కోసం ఉపయోగపడేది. పేదరికంపై పోరాటంలో ఆ డబ్బు సహాయపడి ఉండేది. నా దేశ రైతుల సంక్షేమానికి ఆ డబ్బులు ఉపయోగపడేవి. దేశంలోని పల్లెల స్థితిగతులను మార్చడానికి సహాయపడేది. కానీ మనం దాన్ని విదేశాలకు ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు మనం స్వావలంబన దిశగా కృషి చేస్తున్నాం. అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను నిలిపేందుకు ‘సముద్ర మంథన్’ దిశగా అడుగులు వేస్తున్నాం. సముద్ర మంథన్‌ను ముందుకు తీసుకెళ్లి... సముద్ర గర్భంలో చమురు, గ్యాస్ నిల్వలను గుర్తించే లక్ష్యంతో పనిచేయబోతున్నాం. అందుకే భారత్ నేషనల్ డీప్ వాటర్ ఎక్స్‌ప్లోరేష్ మిషన్‌ను ప్రారంభించబోతోంది. ఇంధనపరంగా మనం స్వతంత్రులమయ్యే దిశగా మన కీలక ప్రకటన ఇది.

నా ప్రియ దేశవాసులారా,

కీలకమైన ఖనిజాలపట్ల నేడు ప్రపంచం మొత్తం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ప్రజలకూ వాటి సామర్థం  బాగా అర్థమవుతోంది. నిన్నటి వరకు పెద్దగా దృష్టి పెట్టని విషయం నేడు కీలక దశకు చేరుకుంది. కీలకమైన ఖనిజాలలో స్వావలంబన సాధించడం మనకు కూడా చాలా ఆవశ్యకం. ఇంధన, పారిశ్రామిక, రక్షణ రంగాలతోపాటు ప్రతీ సాంకేతిక రంగంలోనూ కీలక ఖనిజాలు నేడు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. అందుకే, మనం జాతీయ కీలక ఖనిజాల మిషన్‌ను ప్రారంభించాం. 1200 కన్నా ఎక్కువ ప్రదేశాల్లో ఖనిజాన్వేషణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులోనూ స్వావలంబన దిశగా మనం అడుగులు వేస్తున్నాం.

నా ప్రియ దేశవాసులారా,

అంతరిక్ష రంగంలో అద్భుతాలను చూసి దేశ ప్రజలంతా గర్వంతో ఉప్పొంగుతున్నారు. మన గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా అంతరిక్ష కేంద్రం నుంచి తిరిగి వచ్చారు. కొన్ని రోజుల్లో ఆయన భారత్‌కు కూడా వస్తున్నారు. అంతరిక్షంలో సొంతంగా ఆత్మనిర్భర భారత గగన్‌యాన్‌కు కూడా మనం సన్నద్ధులమవుతున్నాం. మన సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకునే దిశగా కృషి చేస్తున్నాం. అంతరిక్ష రంగంలో ఇటీవలి సంస్కరణల పట్ల నేను గర్విస్తున్నాను. నా దేశంలో నేడు 300కు పైగా అంకుర సంస్థలు అంతరిక్ష రంగంలోనే పనిచేస్తున్నాయి. వేలాది మంది యువత ఆ సంస్థల్లో పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నారు. ఇది నా దేశ యువత బలం. ఇది మన దేశ యువతపై మాకున్న నమ్మకం.

నా ప్రియ దేశవాసులారా,

2047లో మనం వందేళ్ల స్వాతంత్య్ర వేడుకలు చేసుకునే నాటికి.. ‘అభివృద్ధి చెందిన భారత్’ అనే సంకల్పాన్ని సాకారం చేసుకునేందుకు 140 కోట్ల భారతీయులు పూర్తి శక్తియుక్తులతో పనిచేస్తున్నారు. ఈ సంకల్పాన్ని నెరవేర్చేందుకు భారత్ నేడు ప్రతి రంగంలోనూ ఆధునిక వ్యవస్థలను సృష్టిస్తోంది. అవి ప్రతి రంగంలోనూ దేశం స్వావలంబన సాధించేలా చేస్తాయి. ఈ రోజు ఈ ఎర్రకోట బురుజుల నుంచి దేశంలోని యువ శాస్త్రవేత్తలకు, ప్రతిభావంతులైన యువతకు, ఇంజినీర్లూ నిపుణులకూ, ప్రతీ ప్రభుత్వ విభాగానికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మన మేడిన్ ఇండియా ఫైటర్ జెట్‌ల కోసం జెట్ ఇంజిన్లు మనవే అయి ఉండాలా, వద్దా? మనల్ని ప్రపంచ ఫార్మాగా పరిగణిస్తున్నారు. టీకాల రంగంలో మనం కొత్త రికార్డులు సృష్టిస్తున్నాం. కానీ, పరిశోధన - అభివృద్ధిలో మనం మరింత శక్తిని వెచ్చించడం తక్షణ ఆవశ్యకం కాదా? మనకు మన సొంత పేటెంట్లు ఉండాలి. మానవాళి సంక్షేమం కోసం అత్యంత తక్కువ ధరల్లో, అత్యంత ప్రభావవంతమైన ఔషధాలను మనం పరిశోధించాలి. సంక్షోభ సమయాల్లో ఎలాంటి దుష్ప్రభావాలూ లేకుండా మానవాళి సంక్షేమానికి ఇవి ఉపయోగపడాలి. భారత ప్రభుత్వం బయో ఇ-3 విధానాన్ని రూపొందించింది. దేశ యువత బయోఇ-3 విధానాన్ని అధ్యయనం చేసి దానికి అనుగుణంగా కృషి చేయాలని కోరుతున్నాను. మనం దేశ గతిని మార్చాలి. ఇందుకోసం మీ సహకారం అత్యావశ్యకం.

నా ప్రియ దేశవాసులారా,

ఇది ఐటీ శకం. డేటా శక్తి మనకుంది. ఇది నేటి అవసరం కాదా? ఆపరేటింగ్ సిస్టంల నుంచి సైబర్ భద్రత వరకు, డీప్ టెక్ నుంచి కృత్రిమ మేధ వరకు... ప్రతీదీ మన సొంతంగా ఉండాలి. ఆ దిశగా ప్రజల శక్తిని సమీకకరించి, వారి సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటాలి.

మిత్రులారా,

సోషల్ మీడియా అయినా, మరే ఇతర వేదిక అయినా... అంతర్జాతీయ వేదికలపై నేడు మనం పని చేస్తున్నాం. మన యూపీఐ ప్లాట్‌ఫాం నేడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. మన సమర్థతను అది ప్రపంచానికి చాటింది. 50 శాతం రియల్ టైమ్ లావాదేవీలు భారత్‌లోనే యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి. శక్తి అంటే ఇదే. సృజనాత్మక ప్రపంచమయినా, సామాజిక మాధ్యమాలయినా, లేదా మరే వేదిక అయినా... నా దేశ యువతకు నేను సవాలు చేస్తున్నాను. రండి, మనకు మన సొంత వేదికలు ఎందుకు లేవు? మనం ఇతరులపై ఎందుకు ఆధారపడాలి? దేశ సంపద బయటికెందుకు వెళ్తోంది? మీ సామర్థ్యంపై నాకు నమ్మకముంది.

నా ప్రియ దేశవాసులారా,

ఇంధనం మాదిరిగానే ఎరువుల కోసం కూడా మనం ఇతర దేశాలపై ఆధారపడవలసి రావడం దురదృష్టకరం. ఎరువులను సక్రమంగా ఉపయోగించడం ద్వారా కూడా దేశ రైతులు భూమి తల్లికి సేవ చేయొచ్చు. విచక్షణారహితంగా వాటిని ఉపయోగించడం ద్వారా మనం భూమికి హాని కలిగిస్తున్నాం. కానీ అదే సమయంలో దేశ యువతకు, పరిశ్రమలకు, ప్రైవేటు రంగానికి నేను చెప్పదలచుకున్నాను... ఇతరులపై ఆధారపడే అవసరం లేకుండా ఎరువుల నిల్వలను నింపుకొందాం. కొత్త మార్గాలను కనుగొందాం. దేశ అవసరాలకు అనుగుణంగా సొంత ఎరువులను తయారు చేసుకుందాం.

మిత్రులారా,

రాబోయేది విద్యుత్ వాహనాల యుగం. ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలను తయారు చేసుకోకపోతే వాటి కోసం మనం ఇతరులపైనే ఆధారపడాలి. సౌర ఫలకాలయినా, ఎలక్ట్రానిక్ వాహనాలకు కావాల్సిన ఏ వస్తువులయినా... అన్నీ మనకు సొంతంగా ఉండాలి.

మిత్రులారా,

దేశ యువత సామర్థ్యంపై నమ్మకంతో నేనింత ధైర్యంగా చెప్తున్నాను. వారు కేవలం నా దేశ యువత అయినంత మాత్రానే ఆ విశ్వాసం రాలేదు. కోవిడ్ సమయంలో చాలా అంశాల్లో మనం ఇతరులపై ఆధారపడి ఉన్నాం. సొంత వ్యాక్సిన్ అవసరమని మన యువతకు చెప్తే.. దేశం దాన్ని చేసి చూపించింది. కోవిన్ ప్లాట్‌ఫాం మనదే. దేశం దాన్ని చేసి చూపింది. కోట్లాది ప్రజల ప్రాణాలను కాపాడేలా మనం కృషి చేశాం. జీవితంలోని ప్రతి రంగంలోనూ స్వావలంబన సాధించడానికి, ఉన్నతిని పొందేందుకు అదే స్ఫూర్తిని, అదే ఉత్సాహాన్ని మనం కొనసాగించాలి.  

 

మిత్రులారా,


గత 11 ఏళ్లలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పెరిగారు. నేడు టైర్-2, టైర్-3 నగరాల్లో లక్షలాది అంకుర సంస్థలు దేశ ఆర్థిక వ్యవస్థకు, ఆవిష్కరణలకు ఆలంబనగా నిలుస్తున్నాయి. అదే విధంగా కోట్లాది యువత... ముఖ్యంగా అనేకమంది యువతులు  తమ సొంత వ్యాపారాలను ప్రారంభించడానికి ముద్రా యోజన ద్వారా రుణాలు తీసుకున్నారు. వారు కేవలం తమ కాళ్లపై తాము నిలబడడమే కాదు.. ఇతరుల్ని కూడా శక్తిమంతుల్ని చేస్తున్నారు. ఇది కూడా ఒక విధంగా ప్రతి వ్యక్తికి స్వయం సమృద్ధి సాధించే అవకాశాన్ని ఇస్తోంది.


మిత్రులారా,


గతంలో మహిళల స్వయం సహాయక సంఘాలపై పెద్దగా దృష్టి పెట్టేవారు కాదు. కానీ గత 10 ఏళ్లలో మహిళల స్వయం సహాయక సంఘాలు అద్భుతాలు సృష్టించాయి. నేడు, వారి ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లకు చేరుతున్నాయి. మన మహిళల స్వయం సహాయక సంఘాలు లక్షలు, కోట్ల రూపాయల విలువైన వ్యాపారం చేస్తున్నాయి. ఒకసారి నేను “మన్ కీ బాత్”లో బొమ్మల గురించి మాట్లాడాను. మనం విదేశాల నుంచి కోట్ల రూపాయల విలువైన బొమ్మలను దిగుమతి చేసుకునే వాళ్లం. నేను “మన్ కీ బాత్”లో సరదాగా ఒక ప్రశ్న అడిగా.. "నా యువ మిత్రులారా మనం ఎప్పటికీ విదేశాల నుంచి ఇలా బొమ్మలను దిగుమతి చేసుకోవాల్సిందేనా..? అని. ఇప్పుడు నేడు సగర్వంగా చెబుతున్నా, మన దేశం బొమ్మలను ఎగుమతి చేయడం మొదలుపెట్టింది. దీని అర్థం ఏమిటంటే, అవకాశం లభించి, అడ్డంకులు తొలగితే దేశ ప్రజలు గొప్ప విజయాలు సాధించగలరు. దేశ పౌరులు  తమ శక్తిని వినియోగించి ముందుకు దూసుకెళ్లడానికి తగిన ప్రేరణ కావాలి. అది జరిగితే  ఈ దేశం కచ్చితంగా అద్భుతాలు సాధిస్తుంది.  దేశ యువతకు చెబుతున్నా: మీ ఆవిష్కరణాత్మక ఆలోచనలను ముందుకు తెండి. వాటిని మీలోనే చంపేయకండి  మిత్రులారా. ఈ రోజు మీ ఆలోచన, రాబోయే తరాల భవిష్యత్తును మలుస్తుంది. నేను మీతో ఉన్నా. మీ కోసం పని చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఈ ప్రయాణంలో మీ భాగస్వామిగా ఉండడానికి సిద్ధంగా ఉన్నా. ముందుకు రండి, తెగువ ప్రదర్శించండి. చొరవ తీసుకోండి. ఉత్పత్తుల తయారీపై దృష్టిపెడుతున్న యువతకు చెబుతున్నా... రండి, ముందడుగు వేయండి. ప్రభుత్వ నిబంధనల్ని మార్చాల్సిన అవసరం ఉంటే చెప్పండి. ఇక మనం ఆగదల్చుకోలేదు. 2047 ఎంతో దూరం లేదు..  ప్రతి క్షణం విలువైనదే మిత్రులారా.. మనం ఒక్క క్షణం కూడా వృథా చేయదల్చుకోలేదు.


మిత్రులారా,


ముందుకు సాగడానికి ఇదో గొప్ప అవకాశం. పెద్ద కలలు కనడానికి దొరికిన అవకాశం. మన సంకల్పాలకు మనల్ని మనం అంకితం చేసుకోవడానికో అవకాశం. ప్రభుత్వం మీతో ఉంది. నేను కూడా మీతోనే ఉన్నా. కాబట్టి ఇప్పుడు మనం ఒక కొత్త చరిత్ర లిఖిద్దాం.


మిత్రులారా,


నేడు, జాతీయ తయారీ మిషన్ అత్యంత వేగంగా ముందుకు సాగుతోంది. మన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలుప్రపంచవ్యాప్తంగా గుర్తింపు, గౌరవం పొందుతున్నాయి. ప్రపంచంలోని పెద్దపెద్ద ఉత్పత్తుల్లో మన దేశ సంస్థలు తయారు చేసే ఏదో ఒక పరికరం లేదా భాగం తప్పకుండా ఉంటుంది. వీటిని సగర్వంగా ఎగుమతి చేస్తున్నాం. అయితే, మనం సమగ్ర, ఏకీకృత అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. అందువల్ల వాటి సామర్థ్యాలను మరింత దృఢం చేయాలి. ఒకప్పుడు నేను ఎర్రకోట నుంచి  చెప్పా... “జీరో డిఫెక్ట్, జీరో ఎఫెక్ట్ గురించి.” నేడు నేను మరోసారి గుర్తు చేస్తున్నా. అంతర్జాతీయ విపణిలో మన బలాన్ని ప్రపంచ దేశాలు గుర్తించాలంటే నాణ్యతలో మనమెప్పుడూ కొత్త శిఖరాలను అధిరోహించాలి. ప్రపంచం నాణ్యతకు ప్రాధాన్యమిస్తుంది. మన నాణ్యత అత్యుత్తమంగా ఉండాలి. ముడి పదార్థాల లభ్యత, ఉత్పత్తి వ్యయాలను తగ్గించే మార్గాలపై  ప్రభుత్వం కూడా కృషి చేస్తుంది.

మిత్రులారా,


తయారీ రంగంలో ఉన్నవాళ్ళంతా పాటించాల్సిన మంత్రం ఒక్కటే... “తక్కువ ధర-ఎక్కువ విలువ.” మన ప్రతి ఉత్పత్తి ఎక్కువ విలువ కలిగి ఉండాలి, కానీ ఖర్చు తక్కువగా ఉండాలి. ఈ దృక్పథంతోనే మనం ముందుకు సాగాలి.

నా ప్రియ దేశవాసులారా,

దేశ స్వాతంత్య్రం కోసం ఎంతో మంది తమ ప్రాణాలను అర్పించారు. నేను ఇదివరకే  చెప్పా.. వారు తమ యవ్వనాన్ని ధారబోశారు; ఉరితాళ్లను ఆహ్వానించారు.. ఎందుకు? స్వతంత్ర భారతం కోసం. 75–100 ఏళ్ల క్రితం నాటి ఆ కాలాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి.. అప్పుడు యావత్  భారతదేశం స్వతంత్ర భారత మంత్రంతో జీవించింది.


నేడు, కాలం చెబుతోంది ఇదే.. స్వతంత్ర భారత మంత్రంతో తపించిన వారంతా మనకీ  స్వేచ్ఛను ఇచ్చారు. ఇప్పుడు సంపన్న భారత్ అన్నది 140 కోట్ల భారతీయుల మంత్రం  కావాలి. కోట్లాది మంది చేసిన త్యాగాలు మనకు స్వేచ్ఛను ఇచ్చినట్లే... కోట్లాది మంది సంకల్పం, కష్టపడే తత్వం, స్వయం సమృద్ధి, “వోకల్ ఫర్ లోకల్” ప్రోత్సాహం, స్వదేశీ మంత్రోచ్చారణతో, మనం కూడా ఒక సమృద్ధి భారత్ ను నిర్మించవచ్చు.
ఆ తరం స్వతంత్ర భారత్ కు అంకితమైతే నేటి తరం సమృద్ధి భారత్ కోసం సాహసోపేతమైన కొత్త అడుగులు వేయాలి.. కాలం చెపేది ఇదే. అందుకే దేశంలోని ప్రభావశీలురందరికీ నేను మళ్లీ మళ్లీ చెబుతున్నా... ఈ మంత్రాన్ని వ్యాప్తి చేయడంలో మీరంతా నాకు సహకరించండి.  అన్ని రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.. రండి, ఇది ఏ ఒక్క పార్టీ అజెండాయో కాదు. ఈ దేశం మనందరిదీ.. మనమంతా కలిసి “వోకల్ ఫర్ లోకల్” ను ప్రతి పౌరుడి జీవిత మంత్రంగా మారుద్దాం.


మనం దేశంలో తయారైన.. భారత పౌరుల చెమటతో తయారైన, మన మట్టివాసనతో కలిసిన, స్వయం సమృద్ధి సంకల్పాన్ని బలపరచే ఉత్పత్తులను మాత్రమే కొనాలి, ఉపయోగించాలి. ముక్త కంఠంతో ఇదే మనందరి ప్రతిజ్ఞ కావాలి. మనం ఈ ప్రపంచాన్ని మార్చడానికి ఎంతో కాలం పట్టదు స్నేహితులారా. నేడు నేను ప్రతి చిన్న వ్యాపారి, దుకాణదారుని కోరుతున్నా... మీకూ ఒక బాధ్యత ఉంది. మన చిన్నప్పుడు కేవలం “నెయ్యి దుకాణం” అని రాసిన బోర్డులు కనిపించేవి. కానీ కాలక్రమంలో “స్వచ్ఛమైన నెయ్యి దుకాణం” అని రాయడం మొదలుపెట్టారు. అదే విధంగా, దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపారులు, దుకాణదారులు తమ దుకాణాలపై “ఇక్కడ స్వదేశీ వస్తువులు అమ్ముతాం” అని బోర్డులు పెట్టాలని కోరుతున్నా. స్వదేశీ పట్ల మనకు గర్వం ఉండాలి. బలవంతంగా కాకుండా, మన బలం కోసం దాన్ని వినియోగించాలి... అవసరమైతే, ఇతరులను కూడా ఉపయోగించేలా ప్రోత్సహించాలి. అదే మన శక్తి కావాలి. అదే మనకు మార్గదర్శక మంత్రం కావాలి.


నా ప్రియ దేశవాసులారా,


చాలా కాలం నుంచి నాకు ప్రభుత్వంలో సేవ చేసే అవకాశం లభించింది. ఎన్నో ఎత్తుపల్లాలు చూశా. ప్రభుత్వాలు ఎదుర్కొనే సవాళ్లు, పరిపాలనా వ్యవస్థల పరిమితులు నాకు బాగా తెలుసు. అయినప్పటికీ, ఎవరినీ తక్కువ చేసి చూపడంలో నా శక్తిని వృథా చేయలేదు. నా అపార అనుభవంతో చెబుతున్నా.. ఇతరులను దెబ్బతీయడానికి మన శక్తిని వాడకండి; దాని బదులు మన స్వీయ సామర్థ్యాలు, విజయాలను మెరుగుపర్చడంలో మన శక్తినంతా వినియోగించండి. మనం ఎదిగి రాణించినప్పుడు ప్రపంచం మన విలువను గుర్తిస్తుంది. నేడు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక స్వప్రయోజనాలకు ప్రాధాన్యం పెరుగుతున్ననేపథ్యంలో, మనం సంక్షోభాలపై విచారం వ్యక్తం చేస్తూ కూర్చోకుండా, ధైర్యంగా మన బలం, స్థానాన్ని పెంపొందించడానికి కృషి చేయాలి. మనమంతా ఈ మార్గాన్ని ఎంచుకుంటే  ఏ స్వార్థ శక్తీ  మనల్ని ఎప్పటికీ బంధించలేదన్న విషయాన్నినా పాతికేళ్ల  పరిపాలనా అనుభవం నుంచి నేను చెప్పగలను.


గత దశాబ్దం సంస్కరించు, ప్రదర్శించు, రూపాంతరం చెందు.. అన్న దానికి నిదర్శనంగా నిలిచింది. కానీ ఇప్పుడు, మన ప్రయత్నాలకు కొత్త శక్తిని జోడించాలి. ఎఫ్డీఐ రంగంలో కావొచ్చు.. బీమా రంగంలో కావొచ్చు. లేదా దేశంలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు క్యాంపస్లు ఏర్పాటు చేయడానికి అనుమతించడం కావొచ్చు.  ఇటీవల కాలంలో ఇలా మనమెన్నో సంస్కరణలు చేపట్టాం. 40,000కు పైగా అవసరం లేని నిబంధనలను రద్దు చేశాం.  అంతేకాదు 1,500కు పైగా కాలం చెల్లిన చట్టాలను కూడా రద్దు చేశాం. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చట్టాలను సులభతరం చేయడానికి డజన్ల కొద్దీ చట్టాలను సవరిచేందుకు పార్లమెంట్ లో కృషిచేశాం. ఈసారి కూడా గందరగోళాల మధ్య ఆదాయపు పన్ను చట్టంలో జరిగిన ఒక ముఖ్యమైన సంస్కరణ కు సంబంధించిన వార్త ప్రజలకు పూర్తిగా చేరి ఉండకపోవచ్చు. 280కి పైగా సెక్షన్లను రద్దు చేయాలని మేం నిర్ణయించాం. స్నేహితులారా, మన సంస్కరణలు కేవలం ఆర్థిక రంగానికే పరిమితం కాక, పౌరుల జీవనాన్ని సులభతరం చేయడానికి కూడా ప్రయత్నించాం. ఆదాయపు పన్ను రిఫండ్లు త్వరగా రావడం సంస్కరణల ఫలితమే. నగదురహిత మదింపు విధానాలు కూడా సంస్కరణల ఫలితమే. రూ. 12 లక్షల వరకు ఆదాయపు  పన్ను మినహాయింపు కల్పించండం... దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలనే ఉత్సాహం ఉన్న నా మధ్యతరగతి కుటుంబాలకు అపారమైన ఆనందాన్ని తెచ్చిపెట్టింది. రూ. 12 లక్షల వరకు ఆదాయం పూర్తిగా పన్ను రహితం అవుతుందని ఎప్పుడూ ఎవరూ ఊహించలేదు, కానీ దాన్ని మేం నిజం చేశాం.


దేశ బలం పెరిగినప్పుడు, దాని పౌరులు దాని ప్రయోజనాలు పొందుతారు. బ్రిటిష్ పాలన నాటి నుంచి మనం శిక్షాస్మృతిలో బందీలమై, శిక్షల భయంతోనే కాలం గడిపాం.  స్వాతంత్య్రం పొందిన 75 సంవత్సరాలు ఇలాగే గడిచాయి. ఇప్పుడు మేం ఆ శిక్షాస్మృతిని రద్దు చేసి “భారతీయ న్యాయ సంహిత”ను తీసుకు వచ్చాం. ఇది భారత పౌరులపై నమ్మకం, అనుబంధ భావం, సున్నితత్వంతో కూడుకున్నది. మేం సంస్కరణల ప్రయాణాన్ని వేగవంతం చేయాలని సంకల్పించాం. అంతేకాదు, వేగంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. నా దేశవాసులకు నేను చెప్పదలచుకున్నది ఒక్కటే.. నేను చేస్తున్న ప్రతీదీ దేశం కోసం మాత్రమే, నా కోసం కాదు, ఎవరికీ నష్టం కలిగించడానికి కాదు. దేశ భవిష్యత్తు కోసం, రాజకీయ పార్టీలను, నా ప్రత్యర్థులను, సహనేతలను నేను ముందుకు రమ్మని ఆహ్వానిస్తున్నా. నిర్మాణాత్మక సంస్కరణలైనా, నియంత్రణ సంబంధిత సంస్కరణలైనా, విధాన సంస్కరణలైనా, ప్రక్రియ సంస్కరణలైనా లేదా రాజ్యాంగ సంస్కరణల అవసరమున్నా.. ఇలా అన్నిచోట్లా సంస్కరణలు చేపట్టడమే మా లక్ష్యం.


తదుపరి సంస్కరణల కోసం మేం ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఈ టాస్క్ ఫోర్స్ నిర్దిష్ట కాలవ్యవధిలో తన పని పూర్తి చేస్తుంది. ప్రస్తుత నిబంధనలు, చట్టాలు, విధానాలు, ప్రక్రియలను 21వ శతాబ్దానికి తగిన విధంగా, ప్రపంచ వాతావరణానికి సరిపడేలా, 2047 నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చే దృష్టికి అనుగుణంగా పునర్నిర్వచించాలి. ఈ లక్ష్యాన్ని నిర్ణీత కాలంలో సాధించడానికే ఈ టాస్క్ ఫోర్స్ ను  ఏర్పాటు చేశాం.


మిత్రులారా,


ఈ సంస్కరణలు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలనుకునే వారందరికీ ధైర్యాన్ని ఇస్తాయి. అవి అంకుర సంస్థలు కావొచ్చు, చిన్న పరిశ్రమలు కావొచ్చు, కుటీర పరిశ్రమలు కావొచ్చు... పారిశ్రామికవేత్తలకు నియంత్రణా వ్యయాలు గణనీయంగా తగ్గుతాయి. దాంతో వారికి కొత్త శక్తి లభిస్తుంది. ఎగుమతుల రంగంలో కూడా లాజిస్టిక్స్, విధానపరమైన  మార్పులు వారికి అధిక ప్రయోజనం చేకూరుస్తాయి.


మిత్రులారా,


వింతగా అనిపించవచ్చు కానీ, మన దేశంలో చిన్న విషయాలకే జైలుశిక్ష విధించే చట్టాలు ఉన్నాయి. వాటిపై ఎవరూ ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. అర్థంలేని కారణాలతో పౌరులను  జైలులో పెట్టే ఈ రకమైన అవసరంలేని చట్టాలను రద్దు చేయడం నా బాధ్యతగా భావించా.
ఇంతకుముందు పార్లమెంట్లో మేం ఒక బిల్లును ప్రవేశ పెట్టాం; ఈసారి మేం దాన్ని మళ్లీ తీసుకొచ్చాం.


మిత్రులారా,

ఈ దీపావళిని మీకు ద్విగుణ దీపావళిగా చేయబోతున్నా. నా ప్రియమైన దేశవాసులకు ఈ దీపావళికి ఒక పెద్ద బహుమతి లభించబోతోంది. గత 8 ఏళ్లలో, మేం జీఎస్టీ లో పెద్ద ఎత్తున సంస్కరణలు చేపట్టాం. దేశవ్యాప్తంగా పన్ను భారం తగ్గించాం. పన్ను వ్యవస్థను సులభతరం చేశాం. మళ్లీ 8 ఏళ్ల తర్వాత, ఇప్పుడు దాని సమీక్ష చేపట్టాం. ఈ సమీక్షను ప్రారంభించడానికి ఉన్నతాధికార కమిటీని ఏర్పాటు చేసి, రాష్ట్రాలతో చర్చలు కూడా నిర్వహించాం.


నా ప్రియ దేశవాసులారా,


తర్వాతి తరం జీఎస్టీ సంస్కరణలతో మేం వస్తున్నాం, ఈ దీపావళికి ఇది మీకు బహుమతి అవుతుంది, సామాన్యులకు అవసరమైన వస్తువులపై పన్నులు గణనీయంగా తగ్గుతాయి, చాలా సౌకర్యాలు పెరుగుతాయి. మన ఎంఎస్ఎంఈలకు, మన చిన్న పారిశ్రామికవేత్తలకు భారీ ప్రయోజనం లభిస్తుంది. రోజువారీ వస్తువులు చాలా చౌకగా మారుతాయి.  ఇది ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది.


నా ప్రియ దేశవాసులారా,


నేడు దేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా శరవేగంగా కదులుతోంది. మేం తలుపులు తడుతున్నాం. దానిని చాలా వేగంగా సాధిస్తాం. ఒక రోజు వస్తుంది. ఆ రోజున నేను మీ మధ్యకు వచ్చి, ఎర్రకోట నుంచి ఈ శుభవార్తను పంచుకుంటాను. నేడు యావత్ ప్రపంచం భారత ఆర్థికవ్యవస్థ పైన, ఆర్థిక పరిస్థితిపైన విశ్వాసంతో ఉంది. అస్థిరతల మధ్య, భారతదేశ ఆర్థిక క్రమశిక్షణ, ఆర్థిక శక్తి ఒక ఆశకిరణంగా నిలిచింది. ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయినప్పుడు దాని నుంచి బయటపడేది భారత్ ఒక్కటేనన్న భావన ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. నేడు ద్రవ్యోల్బణం అదుపులో ఉంది. మన విదేశీమారక నిల్వలు చాలా బలంగా ఉన్నాయి. మన స్థూల ఆర్థిక సూచికలు కూడా చాలా బలంగా ఉన్నాయి. గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీలు కూడా భారతదేశాన్ని నిరంతరం ప్రశంసిస్తున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థపై మరింత విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలు నా దేశంలోని పేదలకు, నా దేశంలోని రైతులకు, నా దేశంలోని మహిళా శక్తికి, నా దేశంలోని మధ్యతరగతికి చేరేలా, నా దేశ అభివృద్ధికి శక్తి వనరుగా మారేలా ఈ దిశగా మేం కొత్త ప్రయత్నాలు చేస్తున్నాం.


నేడు మన యువతకు కొత్త రంగాల్లో అవకాశాలు లభిస్తున్నాయి. నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి, పెద్ద పెద్ద కంపెనీల్లో ఇంటర్న్ షిప్ ల ద్వారా దేశంలోని యువత కోసం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ రోజు నేను నా దేశ యువతకు కూడా ఒక శుభవార్త తెచ్చాను. ఈ రోజు ఆగస్టు 15. ఈ  ఆగస్టు 15న దేశంలోని యువత కోసం రూ.లక్ష కోట్ల విలువైన పథకాన్ని ప్రారంభించి అమలు చేస్తున్నాం. ప్రధాన మంత్రి వికసిత భారత్ రోజ్గార్ యోజన నేటి నుంచి అమలు కానుంది. ఇది మీకు చాలా శుభవార్త. ఈ పథకం కింద ప్రైవేటు రంగంలో ఉద్యోగం పొందే ప్రతి కుమారుడు లేదా కుమార్తెకు ప్రభుత్వం రూ.15,000 ఇస్తుంది. కొత్తగా ఉపాధి కల్పించే కంపెనీలకు కూడా ప్రోత్సాహకాలు లభిస్తాయి. ప్రధాన మంత్రి వికసిత భారత్ రోజ్గార్ యోజన ద్వారా సుమారు 3.5 కోట్ల మంది యువతకు కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇందుకు యువతకు నా అభినందనలు.

 

నా ప్రియ దేశవాసులారా,


భారత నారీ శక్తిని నేడు ప్రతి ఒక్కరూ గుర్తిస్తున్నారు. మన వర్ధమాన ఆర్థిక వ్యవస్థకు మహిళలందరూ లబ్ధిదారులే. అదే సమయంలో దాని పురోగమనాన్ని వేగిరపరచడంలోనూ వారు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. అందులో మన మాతృశక్తి... మన మహిళాశక్తికీ భాగముంది. అంకుర సంస్థల నుంచి అంతరిక్ష రంగం దాకా భరతమాత ప్రియ పుత్రికలు ఆధిపత్యం చాటుకుంటున్నారు. క్రీడా రంగంలోనూ తమ ప్రాబల్యం నిరూపించుకున్నారు. సైన్యంలో తమ ప్రతిభతో వెలుగొందుతున్నారు. దేశ ప్రగతి ప్రయాణంలో నేడు వారు సగర్వంగా భుజం కలిపి పాలుపంచుకుంటున్నారు. జాతీయ రక్షణ అకాడమీ (ఎన్డీఏ) నుంచి యువతుల తొలి బృందం ఇటీవలే ఉత్తీర్ణత సాధించినపుడు యావద్దేశం గర్వించింది. టీవీ చానెళ్లన్నీ వారిపైనే దృష్టి సారించడం మనందరికీ గర్వకారణం అనడంలో సందేహం లేదు. ఇక 10 కోట్ల స్వయం సహాయ సంఘాల సోదరీమణులు అద్భుత సామర్థ్యం ప్రదర్శిస్తున్నారు. ‘నమో డ్రోన్ దీదీ’ పథకం నారీశక్తికి సరికొత్త గుర్తింపు తెచ్చిపెట్టింది. ఓ గ్రామంలో ఒక ‘డ్రోన్‌ దీదీ’ని నేను కలుసుకున్నపుడు గ్రామస్థులు తనను ‘పైలట్’ అని పిలుస్తారని చెప్పింది. అంతగా చదువుకోని తనకు ఎంతో గొప్ప హోదా లభించడం గర్వంగా ఉందని పేర్కొంది.


మిత్రులారా,


దేశంలో 3 కోట్ల మంది మహిళలను ‘లక్షాధికారి సోదరి’గా మారుస్తామని మేం ప్రతినబూనాం. ఆ దిశగా మా కృషి వేగంగా సాగుతుండటం నాకెంతో సంతృప్తినిస్తోంది. నిర్దేశిత గడువులోగా ఈ లక్ష్యాన్ని సాధించగలమని ఆత్మవిశ్వాసంతో ఇవాళ నేను దేశానికి సహర్షంగా చెబుతున్నాను. ఇప్పటికే మన నారీశక్తి తమ సామర్థ్యం చాటుకుంటూ 2 కోట్ల మంది అతి తక్కువ వ్యవధిలోనే ‘లక్షాధికారి సోదరి’ స్థాయిని అందుకున్నారు. వారిలో కొందరు ఈ రోజున మనముందే ఉన్నారు. వీరే నా బలం-బలగం.. అంతేకాదు మిత్రులారా! దేశ ప్రగతి పయనంలో వారి భాగస్వామ్యం మరింత పెరుగుతుందని నా ప్రగాఢ నమ్మకం.


నా ప్రియ దేశవాసులారా,


దేశంలోని నా రైతు మిత్రులు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధికి భారీ స్థాయిలో తోడ్పడ్డారు. ఆరుగాలం శ్రమించే వారి కృషికి సత్ఫలితాలు లభిస్తున్నాయి. ఈ మేరకు నిరుడు ఆహార ధాన్యాల ఉత్పత్తిలో మునుపటి రికార్డులన్నిటినీ వారు బద్దలు కొట్టారు. ఇదీ నా దేశానికిగల సామర్థ్యం. సాగుభూమి విస్తీర్ణమేమీ పెరగలేదు... కానీ, వ్యవస్థల్లో మార్పులతో భూ కమతాలకు నీరు ప్రవహిస్తోంది. నాణ్యమైన విత్తనాల లభ్యత సహా అన్నదాతకు మెరుగైన సౌకర్యాలు అందుతున్నాయి. కాబట్టే, దేశ సౌభాగ్యం కోసం తమ బలం పెంచుకుంటున్నారు. పాలు, పప్పుధాన్యాలు, జనపనార ఉత్పత్తిలో భారత్‌ ఇవాళ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. అలాగే రెండో అతిపెద్ద చేపల ఉత్పత్తిదారుగా రూపొందింది. నా మత్స్యకార సోదరీసోదరుల శక్తిసామర్థ్యాలను గమనించండి. వారి కృషితో చేపల ఉత్పత్తిలో రెండో స్థానానికి చేరిన మనం, రైతుల శ్రమతో బియ్యం, గోధుమలు, పండ్లు-కూరగాయల ఉత్పత్తిలోనూ రెండో స్థానానికి ఎదిగాం.


మిత్రులారా,


మన రైతుల ఉత్పత్తులు నేడు ప్రపంచ విపణికి చేరుతూ.. రూ.4 లక్షల కోట్ల మేర ఎగుమతులు నమోదయ్యాయని తెలిస్తే మీరెంతో సంతోషిస్తారు. ఈ విధంగా తామేమిటో రైతులు రుజువు చేసుకున్నారు. వీరిలో అధికశాతం చిన్న రైతులు కావడంతోపాటు పశుపోషకులు, మత్స్యకారులు... ఎవరైనా సరే, దేశ ప్రగతి పథకాల ప్రయోజనాలను మేం వారికి చేరువ చేస్తున్నాం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి.. వర్షజల సేకరణ.. నీటిపారుదల పథకాలు.. నాణ్యమైన విత్తనాలు.. ఎరువుల సరఫరా... ఏదైనా సరే- ప్రతిచోటా రైతులు ఇవాళ పంటల బీమాను విశ్వసిస్తున్నారు. రైతు నవ్యోత్సాహం పుంజుకుంటుండగా, దేశం కూడా ఆ ఫలితాలను ఆస్వాదిస్తోంది. లోగడ ఇదంతా ఊహకు కూడా అందని అంశం కాగా, నేడు సజీవ నిదర్శనం.


నా ప్రియ దేశవాసులారా,


కోవిడ్‌ మహమ్మారి సమయంలో మన పశుసంపద పరిరక్షణ కోసం టీకాను ఉచితంగా అందుబాటులోకి తేవడం గుర్తుంది కదా! ఈ టీకాను ఇప్పటిదాకా 125 డోసుల మేర ఉచితంగా సరఫరా చేశాం. గాలికుంటు లేదా గాళ్లు వ్యాధి (ఉత్తర భారతంలో ‘ఖుర్పక’) బెడద నుంచి పశువులకు విముక్తి దిశగా ఈ 125 కోట్ల మోతాదులు... అదీ ఉచితంగా అందజేశాం. ఇక దేశంలో ఏదో ఒక కారణంతో వ్యవసాయ పరంగా వెనుబడిన జిల్లాలు సాపేక్షంగా 100 వరకూ ఉంటాయి. వాటన్నిటినీ గుర్తించి, అక్కడి రైతులకు చేయూతనివ్వడం ద్వారా వారికి సాధికారత కల్పించేందుకు ఒక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించాం. దీని అమలు దిశగా ప్రధానమంత్రి ధన్-ధాన్య కృషి యోజనకు శ్రీకారం చుట్టాం. దీని ద్వారా ఆ 100 వెనుకబడిన జిల్లాలకు సాయం లభిస్తుంది. తద్వారా వారు దేశంలోని ఇతర రైతులతో పోటీపడగలరు.

 

 నా ప్రియ దేశవాసులారా,


భారత రైతులు, పశుపోషకులు, మత్స్యకారులు... వీరి సంక్షేమమే మాకు అత్యంత కీలక ప్రాథమ్యం... ప్రాధాన్యం. వారికి వ్యతిరేకంగా రూపొందే ఎలాంటి హానికర విధానాన్నైనా నిరోధించడానికి మోదీ గోడలా అడ్డు నిలుస్తాడు. ఆ మేరకు వారి విషయంలో దేశం ఎన్నడూ రాజీపడదు.


నా ప్రియ దేశవాసులారా,


పేదరికం గురించి నేను పుస్తకాలలో చదవాల్సిన అవసరం లేదు. అదేమిటో నాకు బాగా తెలుసు. మరోవైపు నేను ప్రభుత్వంలో కూడా ఉన్నాను... అందువల్ల ప్రభుత్వం ఫైళ్లకే పరిమితం కారాదన్నది నా నిశ్చితాభిప్రాయం. ప్రభుత్వమనేది దేశ పౌరుల జీవితాల్లో కనిపించాలి. దళితులైనా, అణగారినవారైనా, దోపిడీకి గురైనవారైనా ప్రభుత్వాలు వారికి మొదట సానుకూల రీతిలో వ్యవహరించాలి. ఆ దిశగా మేం నిరంతరం కృషి చేస్తున్నాం. సమాజంలో అవసరంలోగల ప్రతి వ్యక్తికీ ప్రభుత్వ పథకాలు ఉండేవని గతంలో అనుకునేవారు. కానీ, మేమివాళ ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో పటిష్ఠంగా అమలు చేస్తున్నాం. అందునా వాటిని సంతృప్త స్థాయిలో ప్రజలకు చేర్చాలని స్పష్టం చేస్తున్నాం. సంతృప్త స్థాయి సాధించడమే సామాజిక న్యాయానికి వాస్తవ ఉదాహరణ. ఇక్కడ అర్హతగల వ్యక్తిని నిర్లక్ష్యం చేసే ప్రసక్తి ఉండదు... నేరుగా వారి నివాసానికి వెళ్లి మరీ, వారికి దక్కాల్సింది దక్కేలా మేం కృషి చేస్తున్నాం.


జన్-ధన్ ఖాతాలు తెరిచినప్పుడు... అది కేవలం బ్యాంకు ఖాతా ప్రారంభించడానికి పరిమితం కాలేదు. ఆ ఖాతాలు ప్రజల్లో ఆత్మగౌరవాన్ని, బ్యాంకు తలుపులు తమకూ తెరిచి ఉన్నాయనే భావనను, బ్యాంకులోకి వెళ్లి టేబుల్ మీద చేతులు పెట్టి మాట్లాడగలననే ఆత్మవిశ్వాసాన్ని కలిగించాయి. వారిలో మేమీ నమ్మకం కల్పించాం. ఇక అనారోగ్యాన్ని నిశ్శబ్దంగా భరించే దుస్థితి నుంచి ఆయుష్మాన్ భారత్ ప్రజలను విముక్తం చేసింది. ఇప్పుడు వారికి అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణ పొందడంలో తోడ్పడుతోంది. మరోవైపు వృద్ధుల ఆరోగ్య అవసరాల కోసం రూ.5,00,000 దాకా చేయూతనివ్వడం వారి శ్రేయస్సుపై ప్రభుత్వానికి గల శ్రద్ధను చాటుతుంది. అంతేకాకుండా ప్రధానమంత్రి ఆవాస్‌ యోజనతో 4 కోట్ల మంది పేదలకు ఇళ్లు లభించాయి- అంటే... అవి కేవలం నాలుగు గోడలు కావు మిత్రులారా! వారి జీవితాల్లో కొత్త ఆశలు చిగురింపచేసిన ఆపన్నహస్తాలు.


వీధి వ్యాపారులకు ఇప్పుడు ‘పీఎం స్వానిధి పథకం’ అండగా ఉంది. ఒకనాడు అధిక వడ్డీ చక్రబంధంలో చిక్కి అల్లాడిన దుస్థితి నుంచి స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే వెసులుబాటును ఈ పథకం కల్పించింది. మరోవైపు వారిప్పుడు యూపీఐ ద్వారా కూడా చెల్లింపులు స్వీకరించడం మీరంతా చూసే ఉంటారు. ఇటువంటి సానుకూల మార్పు సమాజంలోని చిట్టచివరి వ్యక్తిదాకా కనిపించాలన్నది ప్రభుత్వ ఆశయం. అందుకే, ఈ ప్రాథమిక పథకాలను రూపొందించి అమలు చేస్తోంది. అవి వేళ్లూనుకున్నప్పుడు జనజీవన రూపాంతరీకరణకు శక్తిమంతమైన మాధ్యమం కాగలవు. ఒకప్పుడు పేదలు, అణగారిన-గిరిజన వర్గాలు, దివ్యాంగులు, వితంతువులు, సోదరీమణులు తమ హక్కుల కోసం కాళ్లరిగేలా ఒకచోట నుంచి మరో చోటకు ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి ఉండేది. అలా వారి జీవితమంతా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగడానికే ఖర్చయ్యేది. కానీ, ఇవాళ ప్రభుత్వమే సంతృప్త విధానంతో వారి ముంగిటకు చేరింది. కోట్లాది లబ్ధిదారులు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను స్వేచ్ఛగా పొందగలుగుతున్నారు. ఈ క్రమంలో ప్రత్యక్ష లబ్ధి బదిలీ (డీబీటీ) నిజంగా ఒక విప్లవాత్మక ముందడుగు.


మిత్రులారా,


ఒకప్పుడు యావద్దేశం “గరీబీ హఠావో” (పేదరికాన్ని నిర్మూలిద్దాం) నినాదాన్ని చాలాసార్లు... ఎర్రకోట పైనుంచి కూడా వింటూ వచ్చింది. ఈ నినాదాన్ని పదేపదే వినాల్సి రావడంతో దేశ ప్రజానీకం విసిగిపోయింది. పేదరిక నిర్మూలన అసాధ్యమని ప్రజలు కూడా ఓ నిర్ణయానికి వచ్చారు. కానీ, ఇప్పుడు మేం పథకాలను నేరుగా పేదల ఇంటి ముంగిటకు చేర్చాం. దీంతో వారి హృదయాల్లో ప్రభుత్వంపై అపార విశ్వాసం పొంగింది. తత్ఫలితంగా నా దేశంలోని 25 కోట్ల మంది పేదరిక విముక్తులై కొత్త చరిత్ర సృష్టికి సిద్ధమయ్యారు. ఈ మేరకు గత 10 సంవత్సరాల్లో “కొత్త మధ్యతరగతి”గా రూపొందారు.


మిత్రులారా,


ఈ కొత్త మధ్యతరగతి, ప్రస్తుత మధ్యతరగతి వర్గాల ఆశలు-ఆకాంక్షలు రెండింటితో నిండిన భాగస్వామ్యాన్ని ఏర్పరచి, దేశాన్ని ముందుకు నడిపించగల గొప్ప శక్తిగా మారుతాయి.


నా ప్రియ దేశవాసులారా,


మనం త్వరలోనే గొప్ప సామాజిక సంస్కర్త మహాత్మా జ్యోతిబా ఫూలే 200వ జయంతి వేడుకలను నిర్వహించుకోనున్నాం. ఈ కార్యక్రమాన్ని మేం ప్రారంభించబోతున్నాం. ఫూలే సిద్ధాంతాలు, ప్రబోధాలు మనకెంతో స్ఫూర్తినిస్తాయి- ముఖ్యంగా “వెనుకబడిన వారికి ప్రాధాన్యం” అన్నది ఆయన బోధించిన తారకమంత్రం. దాన్ని ఆచరణలోకి తేవడం ద్వారా ప్రగతిశీల రూపాంతరీకరణ శిఖరానికి చేరాలన్నది మా ఆకాంక్ష. దీనికోసం మా శక్తివంచన లేకుండా కృషి చేయాలని కృతనిశ్చయంతో ఉన్నాం. పారదర్శక విధానాల ద్వారా “వెనుకబడిన వారికి ప్రాధాన్యం” మంత్రాన్ని క్షేత్రస్థాయిలో వాస్తవంగా మారుస్తాం. ప్రతి వెనుకబడిన వ్యక్తి జీవితంలో వెలుగులు పూయించాలని సంకల్పించాం.


మిత్రులారా,


వీధి వ్యాపారుల కోసం ‘పీఎం స్వానిధి పథకమైనా, నిపుణులైన మన చేతివృత్తుల వారి కోసం విశ్వకర్మ పథకమైనా, గిరిజనులలోనూ వెనుకబడిన వారి కోసం ప్రధానమంత్రి జన్మాన్‌ యోజన అయినా, తూర్పు భారత్‌ను దేశంలోని మిగిలిన ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చేయడం ద్వారా నాయకత్వ అవకాశాలు కల్పించడానికైనా మేం అవిరళ కృషి చేస్తున్నాం. ఈ విధంగా సామాజిక వెనుకబాటుకు గురైన జన సమూహాలకే కాకుండా వెనుకబడిన ప్రాంతాలకు, జిల్లాలకు, సమితులకూ ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నాం. ఈ క్రమంలో 100 ఆకాంక్షాత్మక జిల్లాలు, 500 సమితులలో కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. తూర్పు భారత్ అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ రూ.వేల కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రణాళిక రూపొందించాం. అక్కడి ప్రజల జీవితాలను మెరుగుపరచి, దేశ ప్రగతి ప్రయాణంలో ఆ ప్రాంతాన్ని చురుకైన భాగస్వామిగా మార్చాలన్నది మా లక్ష్యం.


ప్రియ దేశ వాసులారా,


జీవితంలోని ప్రతి రంగంలోనూ ప్రగతి సుస్పష్టం కావాలి. ఈ దిశగా క్రీడలు కూడా తమవంతు కీలక పాత్ర పోషిస్తాయి. ఒకప్పుడు పిల్లలు ఆటపాటల్లో పాల్గొనడాన్ని తల్లిదండ్రులు ఇష్టపడేవారు కాదు. కానీ, నేడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పిల్లలు క్రీడలపై ఆసక్తి చూపినా, తగిన శిక్షణతో వివిధ స్థాయులలో రాణించినా తల్లిదండ్రులు హృదయాలు గర్వంతో ఉప్పొంగుతున్నాయి. ఇదొక శుభ సంకేతమని నా నిశ్చితాభిప్రాయం. దేశంలోని కుటుంబాల్లో క్రీడలను ప్రోత్సాహించే వాతావరణం చూసి నేనెంతో గర్విస్తున్నాను. దేశ భవిష్యత్తుకు ఇది అత్యంత శుభసూచకంగా పరిగణిస్తున్నాను.


అంతేకాదు మిత్రులారా,


క్రీడలకు ఇతోధిక ప్రోత్సాహం లక్ష్యంగా జాతీయ క్రీడా విధానాన్ని మేం రూపొందించాం. ఇందులో భాగంగా అనేక దశాబ్దాల తర్వాత ‘ఖేలో ఇండియా’ విధానం ప్రవేశపెట్టాం. దీనిద్వారా క్రీడా రంగం అభివృద్ధికి సమగ్రంగా కృషి చేయవచ్చు. పాఠశాల స్థాయి నుంచి ఒలింపిక్‌ క్రీడల స్థాయిదాకా యావత్‌ క్రీడావరణాన్ని అభివృద్ధి చేయాలని మేం భావిస్తున్నాం. శిక్షణ... దారుఢ్యం... క్రీడా మైదానం... క్రీడా సౌకర్యాలు... ఆట పరికరాల సరఫరా లేదా వాటి తయారీలో చిన్న పరిశ్రమలకు సాయం... వీటిలో ఏదైనప్పటికీ ఒక్క మాటలో చెబితే- ఈ మొత్తం వ్యవస్థను మారుమూల ప్రాంతాల బాలలకూ చేరువ చేయాలని కృతనిశ్చయంతో ఉన్నాం.


అయితే... మిత్రులారా,


నేనిప్పుడు శరీర దారుఢ్యం... క్రీడలను ప్రస్తావిస్తున్న నేపథ్యంలో- మనందరికీ ఆందోళన కలిగిస్తున్న ఒక అంశాన్ని మీ ముందుంచాలని భావిస్తున్నాను. అదే స్థూలకాయం... దేశంలోని ప్రతి కుటుంబం దీన్నొక తీవ్ర సమస్యగా పరిగణించాలి. దేశానికి నేడిది తీవ్ర సంక్షోభంగా మారుతోంది. భవిష్యత్తులో ప్రతి ముగ్గురిలో ఒకరు ఊబకాయంతో బాధపడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల ఊబకాయం ముప్పు నుంచి మనతోపాటు భవిష్యత్తరాన్ని కూడా రక్షించుకోవాలి. ఇందుకు అనేక చర్యలు చేపట్టాల్సి ఉంది... ఆ దిశగా  నేనొక చిన్న సూచన చేస్తున్నాను...  ప్రతి కుటుంబం నెలనెలా వాడే వంట నూనె పరిమాణాన్ని కనీసం 10 శాతం తగ్గించండి. అదే రీతిలో వాడకంలోనూ 10 శాతం కోతపెట్టండి. ఈ సంకల్పానికి దృఢంగా కట్టుబడితే ఊబకాయం సమస్యపై దేశవ్యాప్త పోరాటంలో విజయం దిశగా మన వంతు పాత్ర పోషించినట్లు కాగలదు.

 

నా ప్రియ దేశవాసులారా,


మన దేశం చాలా అదృష్టవంతురాలు. మనం వేల సంవత్సరాల నాటి సాంస్కృతిక వారసత్వానికి వారసులం. దాని నుంచే  మనం నిరంతరం శక్తి, ప్రేరణ, త్యాగం, సాధనకు అనుసరించాల్సిన విషయాలను పొందుతున్నాం. మన సంస్కృతి, విలువల రక్షణ కోసం సర్వస్వం త్యాగం చేసిన గురు తేగ్ బహదూర్ జీ 350వ వర్ధంతి ఈ సంవత్సరం. ఇవాళ నేను ఆయనకు గౌరవంగా నమస్కరిస్తున్నాను.

మిత్రులారా,

మన సాంస్కృతిక బలం మన వైవిధ్యంలో ఉంది. వైవిధ్యాన్ని వేడుక చేసుకోవాలని, అలాంటి అలవాటును పెంపొందించుకోవాలని మనం కోరుకుంటున్నాం. ఒక అద్భుతమైన తోటలాగా భారత మాత రకరకాల పూలతో అలంకరించి ఉండటం, ప్రతి ఒక్కటి ఆమె గొప్ప వైవిధ్యానికి తోడ్పడటం మనకు గర్వకారణం. ఈ వైవిధ్యమే మనకు గొప్ప వారసత్వం, మనకు గొప్ప గర్వం. ప్రయాగ్‌రాజ్‌లోని 'మహా కుంభ్'లో భారతదేశ వైవిధ్యం ఎలా ఉంటుందో మనం చూశాం. కోట్లాది మంది ప్రజలు ఒకటే భావోద్వేగం, ఒకటే స్ఫూర్తితో ఒకే కార్యంలో ఐక్యంగా పాల్గొన్నారు. ఇది ప్రపంచానికి నిజంగా అద్భుతంగా కనిపిస్తుంది. 'మహా కుంభ్' విజయం అనేది భారత్ ఐక్యత, బలానికి ఒక అద్భుతమైన నిదర్శనం.

మిత్రులారా,

మన దేశం భాషా వైవిధ్యంతో సమృద్ధిగా ఉంది. అందుకే మనం మరాఠీ, అస్సామీ, బంగ్లా, పాలీ, ప్రాకృత భాషలకు ప్రాచీన భాషా హోదాను ఇచ్చాం. నా అభిప్రాయం ప్రకారం మన భాషలు ఎంత అభివృద్ధి చెందితే, అవి అంత సుసంపన్నం అవుతాయి. అదేవిధంగా మన జ్ఞాన వ్యవస్థ మొత్తం అంత బలంగా తయారౌతుంది. ఇదే మన బలం. నేటి డేటా యుగంలో ఇది ప్రపంచానికి కూడా గొప్ప బలం కూడా కావొచ్చు. ఎందుకంటే మన భాషలకు ఉన్న సామర్థ్యం అలాంటిది. మనకున్న అన్ని భాషల గురించి మనం గర్వపడాలి. ప్రతి ఒక్కరూ వాటి అభివృద్ధికి తోడ్పడాలి.

మిత్రులారా,

మన రాతప్రతులు అపారమైన జ్ఞాన సంపదను కలిగి ఉన్నాయి. అయినప్పటికీ వాటి పట్ల ఉదాసీనత ఉంది. జ్ఞాన్ భారతం మిషన్ కింద ఇప్పుడు దేశవ్యాప్తంగా చేతితో రాసిన గ్రంథాలు, రాతప్రతులు, శతాబ్దాల నాటి పత్రాలను కనుగొనడానికి మేం కృషి చేస్తున్నాం. నేటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వాటిలోని జ్ఞానాన్ని సంరక్షించడానికి ప్రయత్నిస్తున్నాం.

నా ప్రియ దేశవాసులారా,

ఈ దేశం కేవలం ప్రభుత్వాలచే నిర్మాణం కాదనే విషయంలో నాకు స్పష్టత ఉంది. రాజ్యాధికారాన్ని కలిగి ఉన్నవారు మాత్రమే దీనిని నిర్మించలేరు. అధికారంలో ఉన్న వారు మాత్రమే దీనిని నిర్మించరు. ఈ దేశం రుషులు, సాధువులు, శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, రైతులు, సైనికులు, కార్మికులలో సహా కోట్లాది మంది ప్రజల శ్రమతో నిర్మాణమైంది. ప్రతి ఒక్కరి కృషి జాతి నిర్మాణానికి దోహడపతుంది. ఈ విషయంలో వ్యక్తులు, సంస్థలు సమానమైన పాత్ర పోషిస్తాయి. చాలా గర్వంగా అలాంటి ఒక సంస్థను నేడు నేను ప్రస్తావించాలనుకుంటున్నాను. వంద సంవత్సరాల క్రితం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్థాపించారు. ఈ 100 సంవత్సరాల దేశ సేవ గర్వించదగిన సువర్ణ అధ్యాయాన్ని తెలియజేస్తోంది. భారత మాతకు సేవ చేయాలనే లక్ష్యంతో, వ్యక్తిత్వ నిర్మాణం ద్వారా జాతి నిర్మాణం అనే సంకల్పంతో, స్వయంసేవకులు ఒక శతాబ్దం పాటు తమ జీవితాలను మాతృభూమి సంక్షేమానికి అంకితం చేశారు. సేవ, అంకితభావం, వ్యవస్థీకృతంగా ఉండటం, క్రమశిక్షణ అనేవి ఈ సంస్థ ముఖ్య లక్షణాలు. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్‌జీఓ. దీనికి దేశభక్తి విషయంలో 100 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ శతాబ్దపు జాతీయ సేవ ప్రయాణానికి దోహదపడిన స్వయం సేవకులందరికీ ఈ రోజు ఎర్రకోట నుంచి నేను నమస్కరిస్తున్నాను. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అంకితభావంతో చేసిన ఈ గొప్ప ప్రయాణం పట్ల దేశం గర్విస్తోంది. భవిష్యత్తులో కూడా ఇది మనకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది.

నా ప్రియ దేశవాసులారా,

మనం దేశ శ్రేయస్సు దిశగా పయనిస్తున్నాం. కానీ దానికి మార్గం భద్రత గుండానే వెళ్తుంది. గత 11 సంవత్సరాలుగా మేం జాతీయ భద్రత కోసం, దేశాన్ని రక్షించడానికి, దేశ ప్రజల భద్రతకు పూర్తి అంకితభావంతో పనిచేశాం. మార్పు తీసుకురావడంలో మేం విజయం సాధించాం. మన దేశంలో విస్తారంగా ఉన్న గిరిజన ప్రాంతాలు అనేక దశాబ్దాలుగా నక్సలిజం, మావోయిజం బారిన పడి రక్తంతో తడిసిపోయాయని అందరికి తెలుసు. నా గిరిజన కుటుంబాలు, గిరిజన తల్లులు, సోదరీమణులు ఉజ్వల భవిష్యత్తు, ఎన్నో ఆశలు గల తమ పిల్లలను కోల్పోయి అత్యంత బాధను అనుభవించారు. చిన్న వయస్సులోని వారిని తప్పుడు మార్గంలోకి లాగి, తప్పుదారి పట్టించి, వారి జీవితాలను నాశనం చేశారు. మేం ఈ విషయంలో ధృడంగా నిలబడి నిర్ణయాత్మక చర్యలు తీసుకున్నాం. 125 కంటే ఎక్కువ జిల్లాల్లో నక్సలిజం పాతుకుపోయిన సమయం ఉండేది. మన గిరిజన ప్రాంతాలు, యువత మావోయిస్టు చెరలో చిక్కుకొని ఉండేవారు. 125 కంటే ఎక్కువ ఉన్న ఆ జిల్లాల సంఖ్యను నేడు కేవలం 20కి తగ్గించాం. ఇది మన గిరిజన వర్గాలకు మేం చేసిన గొప్ప సేవ. బస్తర్ అంటే మావోయిస్టు, నక్సలైట్ బాంబులు, తుపాకుల శబ్దాలకు మారుపేరుగా ఉన్న రోజులు ఉండేవి. మావోయిజం, నక్సలిజం నుంచి విముక్తి పొందిన తర్వాత బస్తర్ యువత నేడు ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నారు. వేలాది మంది యువకులు "భారత్ మాతా కీ జై" అని నినాదాలు చేస్తూ క్రీడా రంగంలోకి ప్రవేశిస్తున్నారు. ఇక్కడ పూర్తి వాతావరణం ఉత్సాహంతో నిండి ఉంది. దేశం ఈ మార్పును చూస్తోంది. ఒకప్పుడు "రెడ్ కారిడార్" అని పిలిచే ప్రాంతాలు ఇప్పుడు హరిత అభివృద్ధి కారిడార్‌లుగా మారుతున్నాయి. ఇది మనకు గర్వకారణం. ఒకప్పుడు రక్తంతో ఎర్రగా మారిన భారత దేశంలోని ఆ ఆ ప్రాంతాల్లో మనం ఇప్పుడు రాజ్యాంగం, చట్టబద్ధ పాలన, అభివృద్ధి అనే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాం.

నా ప్రియ దేశవాసులారా,

ఇది భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి సంవత్సరం. గిరిజన ప్రాంతాలను నక్సలిజం నుంచి విముక్తి చేయడం, నా గిరిజన యువత ప్రాణాలను కాపాడటం ద్వారా మేం ఆయనకు నిజమైన నివాళి అర్పించాం.

నా ప్రియ దేశవాసులారా,

ఒక తీవ్రమైన ఆందోళన, సవాలు గురించి ఇవాళ నేను దేశాన్ని హెచ్చరించాలనుకుంటున్నాను. ఉద్దేశపూర్వక కుట్రలో భాగంగా దేశ జనాభాను మార్చే ప్రయత్నం జరుగుతోంది. కొత్త సంక్షోభానికి అంకురం వేస్తున్నారు. చొరబాటుదారులు మన యువత జీవనోపాధిని లాక్కుంటున్నారు. వీళ్లు మన సోదరీమణులు, ఆడబిడ్డలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. దీనిని మేం సహించబోం. ఈ చొరబాటుదారులు అమాయక గిరిజనులను తప్పుదారి పట్టిస్తున్నారు.. వారి భూములను స్వాధీనం చేసుకుంటున్నారు. దేశం దీనిని సహించదు. జనాభా మారినప్పుడు ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలలో ఇది జరిగినప్పుడు.. అది జాతీయ భద్రత విషయంలో సంక్షోభాన్ని సృష్టిస్తుంది. ఇది దేశ ఐక్యత, సమగ్రత, పురోగతిని దెబ్బతీస్తుంది. ఇది సామాజిక ఉద్రిక్తతకు బీజాలను నాటుతుంది. ఏ దేశం కూడా తనకు తాను చొరబాటుదారులకు అప్పగించుకోదు. ప్రపంచంలోని ఏ దేశం కూడా అలా చేయదు. అలాంటప్పుడు భారత్‌ను అలా చేసేందుకు మనం ఎలా అనుమతించగలం? మన పూర్వీకులు త్యాగాల ద్వారా స్వేచ్ఛను పొందారు. వారు మనకు స్వేచ్ఛా భారత్‌ను అందించారు. మన దేశంలో ఇటువంటి చర్యలను మనం అంగీకరించకపోవడం అనేది ఆ మహానుభావుల పట్ల మనకున్న బాధ్యత. ఇదే వారికి నిజమైన నివాళి. అందుకే ఈ రోజు ఎర్రకోట నుంచి ఉన్నత స్థాయి జనాభా మిషన్ ప్రారంభించాలని మేం నిర్ణయం తీసుకున్నట్లు నేను ప్రకటిస్తున్నాను. ఈ మిషన్ ద్వారా భారత్‌కు ఇప్పుడు పొంచి ఉన్న తీవ్రమైన సంక్షోభాన్ని కాలపరిమితితో పూర్తిగా పరిష్కరిస్తాం. ఇదే దిశలో మేం ముందుకు సాగుతున్నాం.

నా ప్రియ దేశవాసులారా,

రేపు పవిత్రమైన జన్మాష్టమి. భవవంతుడు శ్రీ కృష్ణుని జన్మదిన పండుగగా దేశవ్యాప్తంగా దీన్ని జరుపుకుంటాం.

మిత్రులారా,

నేను శ్రీకృష్ణుడిని స్మరించుకున్నప్పుడు.. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా యుద్ధ పద్ధతులు మారుతున్నట్లు మనం చూస్తున్నాం. ప్రతి కొత్త పద్ధతిలో భారత్ యుద్ధం చేయగలదని మనం చూశాం. సాంకేతికతలో మనకు ఉన్న నైపుణ్యాన్ని అంతా ఆపరేషన్ సిందూర్‌లో మనం చూపించాం. పాకిస్థాన్ మన సైనిక స్థావరాలు, మన వైమానిక స్థావరాలు, మన సున్నితమైన ప్రదేశాలు, మన ప్రార్థనా స్థలాలు, మన ప్రజలపై లెక్కలేనన్ని క్షిపణులు, డ్రోన్‌లతో దాడి చేసింది. దేశం కూడా దీనిని చూసింది. కానీ గత 10 సంవత్సరాలలో దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి చేసిన కృషి ఫలితంగా మన సైనికులు, మన సాంకేతికత వాళ్ల ప్రతి ఒక్క దాడిని గడ్డిపరకలా ఏరిపారేశారు. వాళ్లు స్వల్పంగా కూడా మనకు నష్టం కలిగించలేకపోయారు. అందుకే యుద్ధక్షేత్రంలో సాంకేతికత పెరుగుతున్నప్పుడు, సాంకేతికత ఆధిపత్యం చెలాయిస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని దేశ రక్షణ కోసం, దేశ ప్రజల భద్రత కోసం.. ఈ రోజు మనం సంపాదించిన నైపుణ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మనం సాధించిన నైపుణ్యాన్ని నిరంతరం ఆధునికీకరించుకోవాలి. కాబట్టి మిత్రులారా నేను ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాను. నాకు మీ ఆశీస్సులు కావాలి.. కోట్లాది మంది దేశప్రజల ఆశీస్సులు కావాలి. ఎందుకంటే ఎంత సుసంపన్నత ఉన్నా భద్రత పట్ల ఉదాసీనంగా ఉంటే ఆ సుసంపన్నత దేనికి కూడా పనికిరాదు. అందుకే భద్రతకు ఉన్న ప్రాముఖ్యత చాలా పెద్దది.

అందుకే నేను ఈరోజు ఎర్రకోట నుంచి చెబుతున్నాను.. రాబోయే 10 సంవత్సరాల్లో 2035 నాటికి దేశంలోని అన్ని ముఖ్యమైన ప్రదేశాలు, అంటే వ్యూహాత్మక, ప్రజా ప్రదేశాలు, ఆసుపత్రులు, రైల్వేలు, మతపరమైన కేంద్రం వంటి వాటికి కొత్త సాంకేకితక వ్యవ్యస్థల ద్వారా పూర్తి కవచాన్ని ఏర్పాటుచేస్తాం. ఈ భద్రతా కవచం విస్తరిస్తూనే ఉండాలి. దేశంలోని ప్రతి పౌరుడు సురక్షితంగా ఉన్నట్లు భావించాలి. మనపై దాడి చేసేందుకు ఏ సాంకేతికత వచ్చినా, మన సాంకేతికత దాని కంటే మెరుగైనదని నిరూపించాలి. అందుకే రాబోయే 10 సంవత్సరాలలో అంటే 2035 వరకు ఈ జాతీయ భద్రతా కవచాన్ని విస్తరించాలని, బలోపేతం చేయాలని, ఆధునికీకరించాలని నేను కోరుకుంటున్నాను. దీనికి శ్రీ కృష్ణుడి నుంచి ప్రేరణ పొంది, మనం శ్రీ కృష్ణుని సుదర్శన చక్రం మార్గాన్ని ఎంచుకున్నాం. మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు శ్రీ కృష్ణుడు సుదర్శన చక్రాన్ని సూర్యునికి అడ్జంగా పెట్టి పగటిపూటను చీకటిగా మార్చాడని మీలో చాలా మందికి తెలుసు.  శ్రీ కృష్ణుడు సూర్యకాంతిని సుదర్శన చక్రంతో ఆపాడు. తద్వారా అర్జునుడు జయద్రతను సంహరించేందుకు చేసిన తన ప్రతిజ్ఞను నెరవేర్చగలిగాడు. సుదర్శన చక్రానికి ఉన్న శక్తి ఇది.. దాని వ్యూహ ఫలితం ఇది. ఇప్పుడు దేశం సుదర్శన చక్ర మిషన్‌ను ప్రారంభించనుంది. ఈ మిషన్ సుదర్శన చక్ర ఒక శక్తిమంతమైన ఆయుధ వ్యవస్థ. ఇది శత్రువు దాడిని అడ్డుకోవటమే కాకుండా శత్రువుపై అనేక రెట్లు ధీటుగా ఎదురుదాడి చేస్తుంది.

భారతదేశ సుదర్శన చక్ర మిషన్ కోసం మేం కొన్ని ప్రాథమిక అంశాలపై నిర్ణయం తీసుకున్నాం. రాబోయే 10 సంవత్సరాలలో ఈ మిషన్‌ను తీవ్రంగా ముందుకు తీసుకెళ్లాలని మేం భావిస్తున్నాం. మొదటగా ఈ మొత్తం ఆధునిక ఆయుధ వ్యవస్థ, పరిశోధన, అభివృద్ధి, తయారీ మన దేశంలోనే జరగాలి. ఇది మన దేశ యువత నైపుణ్యంతో జరగాలి. ఇది మన దేశ ప్రజలచే తయారు కావాలి. రెండోది.. ఇందులో యుద్ధ క్షేత్రాలకు సంబంధించిన భవిష్యత్తును అంచనా వేసి, ప్లస్ వన్ వ్యూహాన్ని రూపొందించే వ్యవస్థ ఉంటుంది. మూడోది.. సుదర్శన చక్రానికి ఉన్న శక్తి. ఇది చాలా కచ్చితత్వంతో ఎక్కడికి వెళ్లాలో అక్కడికి వెళ్లి శ్రీ కృష్ణుడి వద్దకు తిరిగి వచ్చింది. ఈ సుదర్శన చక్రం ద్వారా లక్ష్యాలపై కచ్చితత్వంలో దాడి చేసే ఒక వ్యవస్థను అభివృద్ధిపై మేం ముందుకెళ్తాం. మారుతున్న యుద్ధ క్షేత్రాలను పరిగణనలోకి తీసుకొని దేశ, ప్రజల భద్రత కోసం గొప్ప నిబద్ధతతో ఈ పనిని ముందుకు తీసుకెళ్తామని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను.

నా ప్రియ దేశవాసులారా,

మనం ప్రజాస్వామ్యం, స్వతంత్ర భారతదేశం గురించి మాట్లాడేటప్పుడు రాజ్యాంగం మనకు ఒక అత్యుత్తమ వెలుగురేఖగా ఉంది. ఇది మనకు ప్రేరణనిచ్చే కేంద్రం. కానీ 50 సంవత్సరాల క్రితం భారత రాజ్యాంగం గొంతు నొక్కేశారు. భారత రాజ్యాంగానికి వెన్నుపోటు పొడిచి దేశాన్ని జైలుగా మార్చుతూ అత్యవసర పరిస్థితి విధించారు. అత్యవసర పరిస్థితి విధించి 50 సంవత్సరాలైంది. దేశంలోని ఏ తరం కూడా రాజ్యాంగాన్ని ఖూనీ చేసిన ఈ పాపాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. రాజ్యాంగాన్ని హతమార్చిన పాపులను కూడా మరచిపోకూడదు. భారత రాజ్యాంగం పట్ల మన అంకితభావాన్ని బలోపేతం చేస్తూ మనం ముందుకు సాగాలి. ఇదే మనకు ప్రేరణనిస్తుంది.

నా ప్రియ దేశవాసులారా,

నేను ఈ ఎర్రకోట నుంచి పంచ ప్రాణం గురించి చెప్పాను. నా దేశప్రజలకు ఇవాళ ఎర్రకోట నుంచి మరోసారి గుర్తు చేయాలనుకుంటున్నాను. అభివృద్ధి చెందిన భారత్‌ను నిర్మించేందుకు మేము ఆగిపోం, తలవంచం. మేం కష్టపడి పనిచేస్తూనే ఉంటాం. 2047లో మన కళ్ల ముందు అభివృద్ధి చెందిన భారత్‌ను ఆవిష్కరిస్తాం.

నా ప్రియ దేశవాసులారా,

మా రెండో ప్రతిజ్ఞ ఏమిటంటే.. మన జీవితాలు, మన వ్యవస్థలు, మన నియమ నిబంధనలు, చట్టాలు, సంప్రదాయాలలో బానిసత్వానికి సంబంధించి చివరి ఆనవాళ్లను కూడా మిగిలి పోనివ్వం. అన్ని రకాల బానిసత్వం నుంచి విముక్తి పొందే వరకు మేం విశ్రమించం.

నా ప్రియ దేశవాసులారా,
,
మన ఘన వారసత్వం గురించి మనం గర్వపడాలి. అతిపెద్ద ఆభరణం, అతిపెద్ద రత్నం, మన గుర్తింపునకు అతిపెద్ద కిరీటం మన వారసత్వం. మన వారసత్వం గురించి మనం గర్వంగా ఉందాం.

నా ప్రియ దేశవాసులారా,

వీటన్నిటిలో ఐక్యత అనేది అత్యంత శక్తిమంతమైన మంత్రం. అందువల్ల ఐక్యత అనే ఆల్లికను ఎవరూ నాశనం చేయకూడదనేది మన సమష్టి సంకల్పం.

నా ప్రియ దేశవాసులారా,

భారత మాత పట్ల మన కర్తవ్యాన్ని నెరవేర్చడం అంటే ఆరాధన కంటే తక్కువ కాదు, తపస్సు కంటే తక్కువ కాదు. అదే భావనతో మాతృభూమి సంక్షేమం కోసం వీలైనంత ఎక్కువ కృషి చేస్తూ 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ ‌అనే లక్ష్యాన్ని సాధించేందుకు మనల్ని మనం అంకింతం చేసుకుందాం. మనకు ఉన్న సామర్థ్యాలతో ఏ అవకాశాన్ని కూడా విడిచిపెట్టం. అంతేకాకుండా మేం కొత్త అవకాశాలను సృష్టిస్తాం. తదనంతరం 140 కోట్ల మంది దేశప్రజల బలంతో ముందుకు సాగుతాం. ఇలా ముందుకు సాగుతూనే ఉంటాం.. ముందుకు సాగుతూనే ఉంటాం.

నా ప్రియ దేశవాసులారా,

మనం గుర్తుంచుకోవాలి.. 140 కోట్ల మంది దేశప్రజలు గుర్తుంచుకోవాలి. కష్టపడి పనిచేసే వ్యక్తే.. చరిత్ర సృష్టించే వ్యక్తి అవుతాడు. ఉక్కు శిలలను విచ్ఛిన్నం చేసే వ్యక్తే.. కాలాన్ని తనకు అనుగుణంగా మార్చుకున్న వ్యక్తి అవుతాడు. ఇది కాలాన్ని వంచే సమయం.. ఇదే సరైన సమయం.

నా ప్రియ దేశవాసులారా,

ఈ  స్వాతంత్య్ర దినోత్సవ వేడుక సందర్భంగా మరోసారి మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు నాతో పాటు ఇలా అనండి..

జై హింద్! జై హింద్! జై హింద్!

భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై!

వందేమాతరం! వందేమాతరం! వందేమాతరం!

ధన్యవాదాలు!


(Release ID: 2157143)