ప్రధాన మంత్రి కార్యాలయం
79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు
Posted On:
15 AUG 2025 3:52PM by PIB Hyderabad
79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ప్రసంగం 103 నిమిషాల పాటు కొనసాగింది. ఆయన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాల్లో ఇదే సుదీర్ఘమైనది. ఇందులో భాగంగా పలు నిర్ణయాత్మక ప్రకటనలు చేశారు. 2047 నాటికి వికసిత్ భారత్‌ను సాధించటంపై ఒక సాహసోపేతమైన రోడ్ మ్యాప్‌ను ఇచ్చారు. ప్రధానమంత్రి ప్రసంగం స్వావలంబన, ఆవిష్కరణ, ప్రజల సాధికారతపై దృష్టి సారించింది. ఇతరులపై ఆధారపడే స్థాయి నుంచి ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయమైన, సాంకేతికతపరంగా అభివృద్ధి చెందిన, ఆర్థికంగా ధృడమైన దేశంగా మారిన భారత్ ప్రయాణాన్ని ప్రధానంగా పేర్కొన్నారు.
భారత పురోగతి స్వావలంబన, ఆవిష్కరణలు, ప్రజా సాధికారతపై ఆధారపడిందని ప్రధానంగా పేర్కొన్న ఆయన.. 2047 వికసిత్ భారత్ దార్శనికతను వివరించారు. వ్యూహాత్మకమైన రక్షణ రంగం నుంచి సెమీకండక్టర్లు వరకు, హరిత ఇంధనం నుంచి వ్యవసాయం వరకు, డిజిటల్ సార్వభౌమాధికారం నుంచి యువత సాధికారత వరకు 2047 నాటికి భారత్‌ను 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు రోడ్ మ్యాప్ కృషి చేయనుంది. ఇది ప్రపంచ పోటీతత్వం, సామాజిక సమ్మిళిత్వం, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి కలిగి ఉంటుంది.
ప్రధానమంత్రి ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
1. సాధారణ అంశాలు
* ఈ స్వాతంత్య్ర దినోత్సవ పండుగ మన ప్రజల 140 కోట్ల తీర్మానాల వేడుక.
* భారతదేశం నిరంతరం ఐక్యతా స్ఫూర్తిని బలోపేతం చేస్తోంది.
* 75 సంవత్సరాలుగా భారత రాజ్యాంగం ఒక దీపస్తంభంలా మనల్ని నడిపిస్తోంది.
* భారత రాజ్యాంగం కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన మొదటి గొప్ప వ్యక్తి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ.
* ప్రకృతి మనందరినీ పరీక్షిస్తోంది. గత కొన్ని రోజులుగా మనం కొండచరియలు విరిగిపడటం, భారీ వర్షాలు, ఇతర విపత్తులు లాంటి అనేత ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొన్నాం.
* ఆపరేషన్ సిందూర్ చేపట్టిన ధైర్యవంతులైన యోధులకు ఎర్రకోట నుంచి వందనం చేసేందుకు ఈ రోజు నాకు గొప్ప అవకాశం లభించింది.
* చాలా కాలంగా ఎదుర్కొంటున్న అణు బెదిరింపులను ఇకపై సహించబోమని భారత్ ఇప్పుడు నిర్ణయించుకుంది.
* మన శత్రువులు భవిష్యత్తులో ఉగ్రవాద దాడులను కొనసాగిస్తే మన సైన్యం సొంతంగా నిర్ణయం తీసుకొని.. అది ఎంచుకున్న సమయంలో, అది సరైనదని భావించే విధంగా చర్యలు తీసుకొని, అది ఎంచుకున్న వాటిని లక్ష్యంగా చేసుకుంటుంది. మేం తదనుగుణంగా వ్యవహరిస్తాం. మేం తగిన తీరులో తీవ్రంగా స్పందిస్తాం.
* రక్తం, నీరు కలిసి ప్రవహించకూడదని భారత్ ఇప్పుడు నిర్ణయించుకుంది. సింధు జలాల ఒప్పందం అన్యాయమని ప్రజలు గ్రహించారు. మన రైతులు బాధపడుతున్నప్పుడు సింధు నది నుంచి శత్రువు భూములకు సాగునీరు అందించింది.
* మన రైతులు, దేశ ప్రయోజనాల దృష్ట్యా సింధు జల ఒప్పందం మనకు ఆమోదయోగ్యం కాదు.
* వికసిత్ భారత్‌కు ఆధారం కూడా స్వావలంబన భారత్.
* ఆధారపడటం ఒక అలవాటుగా మారినప్పుడు మనం స్వావలంబన గురించి కనీసం ఆలోచన చేయకుండా వదిలేసి ఇతరులపై ఆధారపడటం అనేది ఒక గొప్ప దురదృష్టం.
* స్వావలంబన మన సామర్థ్యంతో ముడిపడి ఉంటుంది. స్వావలంబన తగ్గడం మొదలైనప్పుడు మన సామర్థ్యం కూడా క్షీణించటం కొనసాగుతుంది. అందువల్ల మన సామర్థ్యాన్ని కాపాడుకోవడానికి, కొనసాగించేందుకు, పెంచేందుకు స్వావలంబన కలిగి ఉండటం అత్యవసరం.
* భారతదేశం నేడు ప్రతి రంగంలోనూ ఆధునిక వ్యవస్థను తయారుచేస్తోంది. ఈ ఆధునిక వ్యవస్థలు మన దేశాన్ని ప్రతి రంగంలోనూ స్వావలంబన చేస్తాయి.
* "దేశంలోని యువత తమ వినూత్న ఆలోచనలను ముందుకు తీసుకురావాలని నేను పిలుపునిస్తున్నాను. నేటి ఆలోచన రాబోయే తరాల భవిష్యత్తును రూపొందిస్తుంది. ఈ ప్రయాణంలో నేను మీతో భుజం భుజం కలిపి నిలబడతాను".
* కొవిడ్ విషయంలో భారత్ తయారుచేసిన స్వదేశీ టీకాలు, కొవిన్ వంటి వ్యవస్థలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను కాపాడాయి. దీని ప్రేరణతో ఆవిష్కరణల పరిధిని విస్తరించాలి.
* మన శాస్త్రవేత్తలు, యువత సొంత జెట్ ఇంజిన్‌లను తయారు చేయాలి. దీనిని ఒక ప్రత్యక్ష సవాలుగా తీసుకోవాలి.
* భారత్ సొంత ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చుకోవడమే కాకుండా వైద్య స్వావలంబన, ఆవిష్కరణల విషయంలో ప్రపంచ కేంద్రంగా మారేలా చూసుకునేందుకు శాస్త్రవేత్తలు, వ్యవస్థాపకులు కొత్త మందులు, వైద్య సాంకేతికతల విషయంలో పేటెంట్లను పొందాలి. తద్వారా శాస్త్ర సాంకేతిక, మానవ సంక్షేమంలో నాయకత్వం వహించే సామర్థ్యాన్ని భారత్ ప్రదర్శించగలదు.
* జాతీయ తయారీ రంగ మిషన్ గొప్ప వేగంతో పురోగమిస్తోంది.
* దేశ బడ్జెట్‌లో ఎక్కువ భాగం ఇప్పటికీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ దిగుమతి చేసుకోవడానికే వెళ్తోంది. భారత తీరప్రాంతేతర ఇంధన వనరులను ఉపయోగించుకోవడానికి, ఇంధన స్వావలంబనను పెంచేందుకు, విదేశీ ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు పూర్తిగా స్వతంత్ర, శక్తిమంతమైన భారత్ దిశగా ముందడుగు వేసేందుకు నేషనల్ డీప్ వాటర్ ఎక్స్‌ప్లోరేషన్ మిషన్ ప్రారంభిస్తాం.
* ప్రజలు, దుకాణదారులు "వోకల్ ఫర్ లోకల్" కార్యక్రమం కింద దేశంలో తయారైన వస్తువులను ప్రోత్సహించాలి.
* స్వదేశీ అనేది గౌరవం, సామర్థ్యం నుంచి రావాలి.. బలవంతం చేయటం వల్ల కాదు.
* స్వావలంబనను పెంచేందుకు, వ్యవస్థాపకతకు మద్దతు ఇవ్వడానికి.. భారత ఆర్థిక, పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేయడానికి దుకాణాల వెలుపల "స్వదేశీ" బోర్డులను ఉపయోగించే కనిపించే విధంగా ప్రచారం కల్పించేందుకు మనం ముందుకు రావాలి.
* దేశ బలం దాని ప్రజలు, ఆవిష్కరణ, స్వావలంబనకు సంబంధించిన నిబద్ధతలో ఉంది.
* గత దశాబ్దంలో భారతదేశం సంస్కరణలు చేపడుతూ, మంచి పనితీరు కనబరుస్తూ పరివర్తన చెందుతోంది. కానీ ఇప్పుడు మరింత శక్తి సామర్థ్యాలతో ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైంది.
* చట్టాలు, నిబంధనలు, ప్రక్రియలు సులభతరంగా ఉండే.. వ్యవస్థాపకతను ప్రోత్సహించే, ప్రతి భారతీయుడు వికసిత్ భారత్ నిర్మాణానికి దోహదపడే ఆధునిక, సమర్థవంతమైన, ప్రజలకు అనుకూలమైన వ్యవస్థను సృష్టించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.
* తదుపరి తరం సంస్కరణల కోసం ఒక కార్యాచరణ బృందాన్ని (టాస్క్ ఫోర్స్) ఏర్పాటు చేస్తాం. ఇది ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన ప్రస్తుతం ఉన్న అన్ని చట్టాలు, నియమాలు, విధానాలను నిశితంగా పరిశీలిస్తుంది. కార్యాచరణ బృందం నిర్ణీత కాలక్రమంలో పని చేస్తుంది:
- అంకురాలు, ఎంఎస్ఎంఈ, పారిశ్రామిక వ్యవస్థాపకులకు చట్టపరమైన ఖర్చులను తగ్గించడం
- చట్టపరంగా ఏకపక్షంగా తీసుకునే చర్యల భయాన్ని తొలగించటం.
- సులభతర వ్యాపారం కోసం చట్టాల క్రమబద్ధీకరణ జరిగేలా చూసుకోవటం.
* ఈ సంస్కరణలు ఆవిష్కరణ, వ్యవస్థాపకత, ఆర్థిక వృద్ధికి మద్దతు ఇచ్చే వ్యవస్థను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
* సామాజిక న్యాయాన్ని నిర్ధారించేందుకు మేం సంతృప్త విధానంతో పనిచేస్తున్నాం.
* సంతృప్త విధానంతో నేడు ప్రభుత్వం మీ ఇంటి వద్దకు వస్తోంది. కోట్లాది మంది లబ్ధిదారులు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందుతున్నారు. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ నిజంగా ఒక భారీ మార్పు తీసుకొచ్చిన ముందడుగు.
* గత 10 సంవత్సరాలలో 25 కోట్లకు పైగా పేదరికాన్ని అధిగమించి బయటకి వచ్చారు. వారంతా కొత్త "నవ-మధ్యతరగతి"ని సృష్టించారు.
* మేము సామాజికంగా వెనుకబడిన వారితోని మాత్రమే సంబంధం కలిగి లేం. ఆకాంక్షిత జిల్లాలు, బ్లాక్ కార్యక్రమాల ద్వారా వెనుకబడిన ప్రాంతాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నాం.
* భారతదేశం ఇకపై జాతీయ ప్రయోజనాల విషయంలో రాజీపడదు. పూర్తిగా స్వదేశీ సాంకేతికతలు, రక్షణ వ్యవస్థలపై ఆధారపడుతూ వేగంగా, నిర్ణయాత్మకంగా వ్యవహరించే విషయంలో దేశానికి ఉన్న సామర్థ్యాన్ని ఈ ఆపరేషన్ ప్రధానంగా తెలియజేసింది.
* ఇతరులపై ఆధారపడటం వల్ల దేశ స్వాతంత్య్రంపై అనుమానాలు రేకెత్తుతాయి. ఆధారపడటం ఒక అలవాటుగా, ప్రమాదకరమైనదిగా మారటం దురదృష్టకరం. అందుకే మనం స్వావలంబన పొందడం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండటంతో పాటు దానికి కట్టుబడి ఉండాలి. స్వావలంబన అంటే ఎగుమతులు, దిగుమతులు, రూపాయి లేదా డాలర్ గురించి మాత్రమే కాదు.. ఇది మన సామర్థ్యాలు, సొంతంగా మన కాళ్ల మీద మనం నిలబడే శక్తికి సంబంధించినది.
* సంస్కరణలు కేవలం ఆర్థిక అంశాలకు సంబంధించినవే కాదు.. ప్రజల దైనందిన జీవితాలను మార్చటానికి సంబంధినవి.
* సాధారణ ప్రజలు సౌలభ్యం, న్యాయబద్ధత, సాధికారతను పొందగల ఆధునిక, పౌర-కేంద్రీకృత ప్రభుత్వం కోసం మన ప్రభుత్వం సంస్కరణలు చేపట్టింది.
* ప్రజల కోసం ప్రభుత్వం పనిచేసే దేశాన్ని నిర్మించేందుకు భారత్ నిర్మాణాత్మక, చట్టపరమైన, విధానపరమైన, ప్రక్రియాత్మక సంస్కరణలకు కట్టుబడి ఉంది.
* ఇతరులు విధంచే పరిమితులపై దృష్టి పెట్టే బదులు.. భారత్ సొంత పురోగతిని మెరుగుపరుచుకోవాలి.
* ఆర్థిక స్వప్రయోజనాలు పెరుగుతోన్న ప్రస్తుత ప్రపంచంలో భారత్ సామర్థ్యాలను బలోపేతం చేయడం, అవకాశాలను విస్తరించడం, ప్రజలను శక్తిమంతం చేయడంపై దృష్టి పెట్టాలి. ఈ సంస్కరణలు దేశం మరింత ధృడంగా, సమ్మిళితంగా, ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వంతో ఉండేలా చూసుకుంటూ ప్రభుత్వ సంస్కరణల విషయంలో వేగవంతమైన దశకు నాంది పలుకుతాయి.
* స్వాతంత్య్ర శతాబ్ది నాటికి సుసంపన్నమైన, శక్తిమంతమైన వికసిత్ భారత్‌ను తయారు చేసేందుకు ప్రతి దేశంలో తయారు చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా లేదా శాస్త్రీయ, సాంకేతిక, వ్యవస్థాపక కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా దేశ నిర్మాణానికి దోహదపడాలి.
* అభివృద్ధి చెందిన దేశాన్ని తయారు చేసుకునేందుకు ఆగిపోవటం కానీ, తలవంచటం కానీ చేయం. మేం కష్టపడి పనిచేస్తూనే ఉంటాం. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్‌ను తయారుచేస్తాం.
* మన జీవితాలు, వ్యవస్థలు, మన నియమాలు, చట్టాలు, సంప్రదాయాలలో బానిసత్వానికి సంబంధించి మూలాన్ని కూడా మిగిలిపోనివ్వం. అన్ని రకాల బానిసత్వాల నుంచి విముక్తి పొందే వరకు మేం విశ్రమించం.
* మన సాంస్కృతిక వారసత్వం పట్ల మేం గర్వంగా ఉన్నాం. మన గుర్తింపునకు అతిపెద్ద కొలమానం, అతిపెద్ద రత్నం, అతిపెద్ద కిరీటం మన సాంస్కృతిక వారసత్వమే. మన సంస్కృతి పట్ల గర్వంగానే ఉంటాం.
* వీటన్నింటిలో ఐక్యత అనేది అత్యంత శక్తిమంతమైన మంత్రం. అందువల్ల ఐక్యతను ఎవరూ విచ్ఛిన్నం చేయకూడదనేది మన సమష్టి సంకల్పం.
2. రక్షణ మంత్రిత్వ శాఖ
* ఆపరేషన్ సిందూర్ అనేది భారతదేశ రక్షణ స్వావలంబన, మన వ్యూహాత్మక స్వయంప్రతిపత్తికి నిదర్శనం.
* రక్షణ రంగంలో స్వావలంబన కోసం గత పదేళ్లుగా మేం స్థిరంగా చేసి కృషి ఆపరేషన్ సిందూర్‌లో కనిపించింది.
* భారత్‌లో తయారైన ఆయుధాలను ఉపయోగించి ఉగ్రవాద నెట్‌వర్క్‌లను, పాకిస్థాన్‌లోని మౌలిక సదుపాయాలను ఆపరేషన్ సిందూర్ నిర్వీర్యం చేసింది. భారత్ ఇకపై అణు బెదిరింపులకు, విదేశీ ఒత్తిడికి భయపడదనే సందేశాన్ని ఇది ఇచ్చింది.
* భారత్‌లో తయారైన ఆయుధాలతో సహా స్వదేశీ వ్యవస్థలు భారతదేశం నిర్ణయాత్మకంగా, స్వతంత్రంగా వ్యవహరించడానికి వీలు కల్పించాయి. దేశ భద్రత విషయంలో విదేశాలపై ఆధారపడటం సరికాదని తెలియజేశాయి.
* భారతీయ ఆవిష్కర్తలు, యువత దేశంలోనే జెట్ ఇంజన్‌లను అభివృద్ధి చేయాలి. తద్వారా భవిష్యత్ రక్షణ సాంకేతికత పూర్తిగా స్వదేశీ, స్వావలంబనగా ఉండేలా చూసుకోవచ్చు.
* ఆధునిక రక్షణ ఆవిష్కరణలకు మార్గనిర్దేశం చేయడానికి దేశానికి ఉన్న గొప్ప సాంస్కృతిక, పౌరాణిక చరిత్ర ప్రేరణనిస్తోంది. దాడి చేయటం, దాడులను నిరోధించటంలో భారత్ సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు ‘మిషన్ సుదర్శన చక్ర’ను తీసుకొస్తాం. ఇది శత్రువుల ఆయుధాలను గాలిలోనే ఆపేసేందుకు, దాడులు చేసే విషయంలో దేశ సామర్థ్యాలను పెంచేందుకు ఉపయోగపడుతుంది.
* శ్రీ కృష్ణుని సుదర్శన చక్రం మాదిరిగానే ఈ మిషన్ కూడా వ్యూహాత్మక స్వయంప్రతిపత్తికి భారత్ నిబద్ధతను తెలియజేస్తోంది. ఏదైనా ముప్పునకు వేగంగా, కచ్చితత్వంతో శక్తిమంతంగా స్పందించే వ్యవస్థ ఉండేలా ఇది చూసుకుంటుంది.
* వేగంగా, కచ్చితత్వంతో శక్తిమంతంగా స్పందించేందుకు వ్యవస్థను మెరుగుపరచటానికి, భారత వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని బలోపేతం చేయడానికి దీనిని రూపొందించారు.
* 2035 నాటికి అన్ని ప్రజా ప్రదేశాలు ఈ మెరుగైన దేశవ్యాప్త భద్రతా కవచం పరిధిలో ఉంటాయి. ఇది దేశానికి సమగ్ర రక్షణను అందిస్తుంది. అంతేకాకుండా రక్షణ విషయంలో స్వావలంబనకు సంబంధించి భారత్ నిబద్ధతను తెలియజేస్తోంది.
3. ఆర్థిక మంత్రిత్వ శాఖ
* దీపావళి నాటికి తీసుకురానున్న తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు రోజువారీ నిత్యావసరాలపై పన్నులను తగ్గిస్తాయి. ఇవి ఎంఎస్ఎంఈలు, స్థానిక విక్రేతలు, వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తాయి. ఇవి ఆర్థిక వృద్ధిని ప్రేరేపించటంతో పాటు మరింత సమర్థవంతమైన, ప్రజలకు అనుకూలమైన ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తాయి.
* పన్ను వ్యవస్థను పారదర్శకంగా, సమర్థవంతంగా చేస్తూ ఆదాయపు పన్ను సంస్కరణలు, ఫేస్‌లెస్ అసెస్‌మెంట్ తీసుకొచ్చాం.
* దేశ నిర్మాణానికి దోహదపడటానికి ఆసక్తిగా ఉన్న నా మధ్యతరగతి కుటుంబాలకు ఆదాయపు పన్ను నుంచి రూ. 12 లక్షల వరకు వార్షిక ఆదాయాన్ని మినహాయించడం చాలా ఆనందాన్ని కలిగించింది.
* తయారీలో మన బలాన్ని ప్రపంచం గుర్తించాలంటే, మనం నిరంతరం ఎలాంటి లోపం లేకుండా, పర్యావరణంపై ఎలాంటి ప్రభావం పడకుండా నాణ్యత కొత్త ప్రమాణాలను అందుకోవాలి.
* మన ప్రతి ఉత్పత్తికి అధిక విలువ ఉండాలి.. కానీ తక్కువ ఖర్చు ఉండాలి. ఈ స్ఫూర్తితోనే మనం ముందుకు సాగాలి.
* ప్రపంచ అస్థిరత మధ్య భారత ఆర్థిక క్రమశిక్షణ, దేశ ఆర్థిక శక్తి ఆశాకిరణంగా మిగిలిపోయింది. ప్రపంచం మొత్తం మన ఆర్థిక వ్యవస్థపై విశ్వాసం వ్యక్తం చేస్తోంది.
4. హోం మంత్రిత్వ శాఖ
* దేశంలో జనాభా సమగ్రతను కాపాడటం అత్యంత ముఖ్యమైనది.
* సరిహద్దు ప్రాంతాలలో చొరబాట్లు, అక్రమ వలసల కారణంగా జనాభాలో వచ్చే అసమతుల్యత వల్ల ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి పౌరుల జీవనోపాధిని ప్రభావితం చేస్తాయి.
* భారతదేశ ఐక్యత, సమగ్రత, భద్రతను కాపాడుకునేందుకు వ్యూహాత్మక, సామాజిక సవాళ్లను ఎదుర్కోవటమే లక్ష్యంగా ఉన్నత స్థాయి జనాభా మిషన్‌ను ప్రారంభిస్తాం.
* మన గిరిజన ప్రాంతాలు, యువత మావోయిజం బారిన పడి ఉన్నారు. నేడు మేం అలాంటి జిల్లాల సంఖ్యను 125 నుంచి కేవలం 20కి తీసుకొచ్చాం.
* ఒకప్పుడు "రెడ్ కారిడార్" అని పిలుచే ప్రాంతాలు ఇప్పుడు హరిత అభివృద్ధి కారిడార్‌లుగా మారుతున్నాయి. ఇది మనకు గర్వకారణం.
* భారతదేశ చిత్రపటంలో ఒకప్పుడు రక్తంతో ఎరుపు రంగులో ఉన్న భాగాల్లో మేం ఇప్పుడు రాజ్యాంగం, చట్టబద్ధ పాలన, అభివృద్ధిలతో కూడిన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాం.
5. వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ
* ఆధారపడటం నుంచి స్వావలంబన వైపు దేశం చేసిన ప్రయాణంలో రైతులు వెన్నెముకగా ఉన్నారు.
* వలస పాలన దేశాన్ని పేదరికంలోకి నెట్టింది. కానీ రైతుల అవిశ్రాంత కృషి దేశంలోని ధాన్యాగారాలను నింపింది. ఇదే దేశం ఆహార సార్వభౌమత్వాన్ని కాపాడింది.
* భారతదేశం రైతుల ప్రయోజనాలపై రాజీపడదు.
* “ రైతులు, పశువుల పెంపకందారులకు చెడు కలిగించే విధానానికి వ్యతిరేకంగా నేను నిలబడి.. వారి హక్కులు, జీవనోపాధిని కాపాడుతున్నాను”.
* గత సంవత్సరం భారత రైతులు ధాన్యాల ఉత్పత్తిలో మునుపటి అన్ని రికార్డులను బద్దలు కొట్టారు.
* భారత్ పాలు, పప్పుధాన్యాలు, జనపనారలో అగ్రస్థానం.. బియ్యం, గోధుమలు, పత్తి, పండ్లు, కూరగాయలలో రెండో స్థానంలో ఉంది. దేశాభివృద్ధికి వ్యవసాయం ఒక మూలస్తంభంగా ఉంది.
* దేశానికి ఉన్న ప్రపంచ పోటీతత్వాన్ని ప్రతిబింబిస్తూ వ్యవసాయ ఎగుమతులు రూ. 4 లక్షల కోట్లు దాటాయి.
* రైతులను మరింత శక్తిమంతం చేసేందుకు పీఎం ధన్-ధాన్య కృషి యోజనను వ్యవసాయపరంగా 100 వెనుకబడిన జిల్లాల కోసం ప్రారంభిస్తాం. పీఎం-కిసాన్, నీటిపారుదల పథకాలు, పశుసంరక్షణ పథకాలతో పాటు ఇది కూడా రైతులకు మద్దతునివ్వనుంది. దేశానికి వెన్నెముక అయిన రైతులు బలంగా, ధృడంగా ఉండేలా ఈ పథకం చూసుకుంటుంది.
* ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, వర్షపు నీటి సంరక్షణ, నీటిపారుదల ప్రాజెక్టులు, నాణ్యమైన విత్తనాల పంపిణీ, సకాలంలో ఎరువుల సరఫరా వంటి ప్రభుత్వ పథకాలు దేశవ్యాప్తంగా రైతుల విశ్వాసాన్ని పెంచాయి.
6. పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ
* ఉత్తర భారతదేశంలోనే పశువుల్లో పాదాలు, నోటికి సంబంధించిన వ్యాధిని నివారించడానికి దాదాపు 125 కోట్ల టీకాలను ఉచితంగా వేశాం.
7. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
* 50-60 సంవత్సరాల క్రితం సెమీకండక్టర్ తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి చేసిన ప్రయత్నాలను పుట్టుకలోనే పాతేశారు. అదే సమయంలో ఇతర దేశాలు ఈ విషయంలో పురోగమించాయి. భారత్ ఇప్పుడు సెమీకండక్టర్ తయారీలో మిషన్ మోడ్‌లో ఉంది.
* కీలకమైన సాంకేతిక విషయంలో దేశ పురోగతిని ప్రతిబింబిస్తూ 2025 చివరి నాటికి భారత్‌లో తయారీ సెమీకండక్టర్ చిప్‌లను ఆవిష్కరిస్తుంది.
* ప్రపంచ పోటీతత్వానికి ఏఐ, సైబర్ భద్రత, డీప్ టెక్, ఆపరేటింగ్ సిస్టమ్‌లలో ఆవిష్కరణ అవసరం.
8. అంతరిక్ష శాఖ
* గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా సాధించిన అద్భుతమైన విజయాల పట్ల దేశం మొత్తం సంతోషం వ్యక్తం చేస్తోంది.
* భారత్ సొంత అంతరిక్ష కేంద్రం నిర్మించాలనే ప్రతిష్టాత్మక ప్రణాళికలతో ఆత్మనిర్భర్ భారత్ గగన్‌యాన్‌కు సిద్ధమౌతోంది. ఇది స్వదేశీ అంతరిక్ష సామర్థ్యాల కొత్త శకం ప్రారంభాన్ని తెలియజేస్తోంది.
* 300 కు పైగా అంకురాలు ఉపగ్రహాలు, అంతరిక్ష అన్వేషణ, అత్యాధునిక అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాలలో చురుకుగా ఆవిష్కరణలు చేస్తున్నాయి. దేశ అంతరిక్ష రంగం, అన్వేషణలో పాలుపంచుకోవటమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ముందజలో ఉండటాన్ని ఇది తెలియజేస్తోంది.
9. అణుశక్తి శాఖ
* ప్రస్తుతం 10 కొత్త అణు రియాక్టర్లు పనిచేస్తున్నాయి. 100వ స్వాతంత్య్ర దినోత్సవం నాటికి అణుశక్తి సామర్థ్యాన్ని పదిరెట్లు పెంచుకోవాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఇంధన స్వావలంబనను బలోపేతం చేయటమే కాక స్థిర వృద్ధికి మద్దతునిస్తుంది.
* యువత ఉజ్వల భవిష్యత్తుకు, రైతుల సంక్షేమానికి ఇంధన స్వాతంత్య్రం అత్యంత ముఖ్యమైనది. దీన్ని సాధిస్తాం.
* గత 11 సంవత్సరాలలో ఇంధన స్వావలంబన అనే మన సంకల్పం దిశగా భారత్‌లో సౌరశక్తి ముప్పై రెట్లు పెరిగింది.
* మిషన్ గ్రీన్ హైడ్రోజన్‌లో భారత్ ఇవాళ వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతోంది.
* ప్రపంచం గ్లోబల్ వార్మింగ్ గురించి చర్చించుకుంటుండగా భారత్ 2030 నాటికి 50% స్వచ్ఛ ఇంధనాన్ని సాధించాలని నిర్ణయించుకుంది. కానీ ప్రజల నిబద్ధత కారణంగా ఆ లక్ష్యం 2025 నాటికే నెరవేరింది.
* సౌర, అణు, జల, హైడ్రోజన్ శక్తి విషయంలో భారత్ ముందుకు సాగింది. ఇంధన స్వాతంత్య్రం దిశగా ఇది నిర్ణయాత్మక అడుగును ఇది తెలియజేస్తోంది.
విద్యుత్ మంత్రిత్వ శాఖ
* సౌర విద్యుత్ ప్యానెల్స్ అయినా లేదా ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన విడిభాగాలు అయినా మనకు అవసరమైన వాటిని సొంతంగా మనమే తయారు చేసుకోవాలి.
గనుల మంత్రిత్వ శాఖ
* ఇంధనం, పరిశ్రమ, రక్షణ అవసరాలకు కావాల్సిన వనరులను పొందేందుకు భారత్ నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్‌ను ప్రారంభించింది. ఇది 1,200 ప్రాంతాల్లో అన్వేషణ కొనసాగిస్తోంది.
* ఈ ఖనిజాల విషయంలో నియంత్రణ కలిగి ఉండటం వల్ల వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి బలపడుతుంది. అంతేకాకుండా భారత పారిశ్రామిక, రక్షణ రంగాలు స్వావలంబనగా ఉండేలా చూసుకుంటుంది.
21. యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
* యువత భారత సొంత సామాజిక మాధ్యమాలు, డిజిటల్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలి. కమ్యూనికేషన్, డేటా, సాంకేతిక వ్యవస్థలు సురక్షితంగా, స్వతంత్రంగా ఉండేలా చూసుకోవాలి. దీనితో పాటు భారత డిజిటల్ స్వయంప్రతిపత్తిని బలోపేతం చేయాలి.
* క్రీడలను ప్రోత్సహించేందుకు మేం జాతీయ క్రీడా విధానాన్ని తీసుకువచ్చాం.
* దేశంలో 'ఖేలో ఇండియా విధానాన్ని' ప్రవేశపెట్టాం.
గమనిక: కొన్ని అంశాలు ఒకటి కంటే ఎక్కువ మంత్రిత్వ శాఖలకు సంబంధినవి. అందుకే అవి పునరావృతమయ్యాయి.
***
(Release ID: 2157071)