ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం: సంస్కరణ, స్వావలంబన, ప్రతి భారతీయుడికి సాధికారత కల్పించే దార్శనికత
Posted On:
15 AUG 2025 10:23AM by PIB Hyderabad
79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. భారతదేశ స్వావలంబన, పరివర్తన ప్రయాణాన్ని ప్రధానంగా తెలియజేశారు. గత దశాబ్దంలో సంస్కరణలు, గణనీయమైన పనితీరుతో భారత్ పరివర్తన చెందిందని.. కానీ ఇప్పుడు మరింత శక్తి సామర్థ్యాలతో ముందుకు సాగాల్సిన సమయం అసన్నమైందని అన్నారు. చట్టాలు, నిబంధనలు, వివిధ ప్రక్రియలు సరళీకృతంగా ఉండే.. పారిశ్రామిక వాతావరణానికి ప్రోత్సాహం లభించే, ప్రతి భారతీయడు వికసిత్ భారత్ నిర్మాణానికి దోహదపడే విధంగా ఆధునిక, సమర్థవంతమైన, ప్రజలకు అనుకూలమైన వ్యవస్థను సృష్టించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.
చట్టాలు, నిబంధనల సరళీకరణ
ప్రధాన మంత్రి మోదీ ప్రసంగం ప్రారంభంలో గడిచిన కాలంలో ప్రభుత్వం చారిత్రాత్మక సంస్కరణలు చేపట్టిందని అన్నారు. 40,000 కంటే ఎక్కువ అనవసరమైన నిబంధనలతో పాటు 1,500 కంటే ఎక్కువగా కాలం చెల్లిన చట్టాలను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా డజన్ల కొద్దీ ఇతర చట్టాలను పార్లమెంటు సరళీకృతం చేసినట్లు తెలిపారు.
ఇటీవలి సమావేశాల్లోనే 280 కంటే ఎక్కువ నిబంధనలు తొలగిపోయాయి. ఇవి పరిపాలనను సులభతరం చేయటమే కాకుండా ప్రతి భారతీయుడికి ప్రభుత్వాన్ని మరింత అందుబాటులోకి తెచ్చాయి. సంస్కరణలు కేవలం ఆర్థికమైన అంశాల గురించి మాత్రమే కాదని, ప్రజల దైనందిన జీవితాలను మార్చడం గురించని ప్రధాని మోదీ ప్రధానంగా పేర్కొన్నారు.
ప్రధాని పేర్కొన్న ఇతర కీలక అంశాలు:
* ఆదాయపు పన్ను సంస్కరణలు, ఆపేక్ష రహిత మదింపు: ఇది పన్నుల వ్యవస్థను పారదర్శకంగా సమర్థవంతంగా చేస్తోంది.
* రూ. 12 లక్షల వరకు వార్షిక ఆదాయంపై సున్నా పన్ను : కొన్ని ఏళ్ల కిందట వరకు ఊహకు కూడా అందని పరిణామం ఇది.
* కాలం చెల్లిన క్రిమినల్ చట్టాల స్థానంలో భారత న్యాయ నియమావళిని తీసుకురావటం: న్యాయానికి సంబంధించిన చట్టపరమైన విధానాలను ఇది సరళీకృతం చేసింది.
సామాన్య ప్రజలు సులభంగా న్యాయం, సాధికారతను పొందగలిగే ఆధునిక, పౌర కేంద్రీకృత ప్రభుత్వం దిశగా ఈ సంస్కరణలను తీసుకొచ్చారు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఉన్న దేశాన్ని నిర్మించే దిశగా నిర్మాణాత్మక, నియంత్రణ పూర్వక, విధానపరమైన, ప్రక్రియాత్మక సంస్కరణలకు భారత్ కట్టుబడి ఉందన్నారు.
పారిశ్రామిక వ్యవస్థాపన, ఎంఎస్ఎంఈలకు సాధికారత కల్పించడం
అంకురాలు, ఎంఎస్ఎంఈలు, పారిశ్రామిక వ్యవస్థాపకులకు చట్టపరమైన ఖర్చులను తగ్గించాలని ప్రభుత్వ సంస్కరణలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అదే సమయంలో కాలం చెల్లిన చట్టపరమైన నిబంధనల నుంచి కూడా ఇవి విముక్తిని అందిస్తున్నాయి. ఇది వ్యాపార వృద్ధికి మరింత అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించటంతో పాటు ఆవిష్కరణ, ఆర్థిక స్వావలంబనను ప్రోత్సహిస్తోంది.
తదుపరి తరం సంస్కరణలు, కార్యాచరణ బృందం
తదుపరి తరం సంస్కరణల కోసం ఒక కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఇది ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి ఉన్న అన్ని చట్టాలు, నియమాలు, విధానాలను నిశితంగా పరిశీలించనుంది. ఇది నిర్ణీత కాలక్రమంలో పని చేస్తుంది:
* అంకురాలు, ఎంఎస్ఎంఈ, పారిశ్రామిక వ్యవస్థాపకులకు చట్టపరమైన ఖర్చులను తగ్గించడం
* చట్టపరంగా ఏకపక్షంగా తీసుకునే చర్యల భయాన్ని తొలగించటం.
* సులభతర వ్యాపారం కోసం చట్టాల క్రమబద్ధీకరణ జరిగేలా చూసుకోవటం.
ఈ సంస్కరణలు ఆవిష్కరణ, పారిశ్రామిక వ్యవస్థాపకత, ఆర్థిక వృద్ధికి మద్ధతిచ్చే వ్యవస్థను సృష్టించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాయి.
తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు
రోజువారీగా వినియోగించే వస్తువులపై పన్నులను తగ్గించే లక్ష్యంతో ఈ దీపావళి నాటికి తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలను ప్రవేశపెట్టనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. "సామాన్యులపై పన్ను భారాన్ని తగ్గించే తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలను ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇది మీకు దీపావళి బహుమతి అవుతుంది" అని వ్యాఖ్యానించారు. ఈ సంస్కరణలు ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూరుస్తాయని, ఆర్థిక కార్యకలాపాలకు ఊతం ఇస్తాయని అన్నారు.
భవిష్యత్తు దార్శనికత
ఇతరులు పెట్టే పరిమితులపై దృష్టి పెట్టడానికి బదులుగా భారతదేశం తన సొంత పురోగతిని వేగంవతం చేసుకోవాలని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. ఆర్థికంగా స్వార్థ ప్రయోజనాలు పెరుగుతోన్న ప్రస్తుత ప్రపంచంలో భారత్ సామర్థ్యాలను పెంచటం, అవకాశాల పరిధిని విస్తరించడం, ప్రజలకు సాధికారత కల్పించడంపై దృష్టి పెట్టాలన్నారు. ఈ సంస్కరణలు ప్రభుత్వపరమైన పరివర్తనలో వేగవంతమైన దశకు నాంది వంటివని అన్నారు. ఇవి భారత్ మరింత ధృడంగా, సమ్మిళితంగా మారుస్తాయని.. ప్రపంచవ్యాప్తంగా పోటీ పడేలా చూసుకుంటాయని అన్నారు.
***
(Release ID: 2156734)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Nepali
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam