పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పంచాయతీల కోసం కృత్రిమ మేధ ఆధారిత 'సభాసార్' ను ఢిల్లీలో ప్రారంభించనున్న కేంద్ర మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్

గ్రామసభ సమావేశాల మినిట్స్ (సారాంశ నివేదికల) తయారీని వేగవంతం చేసే ఏఐ ఆధారిత సాధనం

Posted On: 14 AUG 2025 9:36AM by PIB Hyderabad

గ్రామసభ లేదా ఇతర పంచాయితీ సమావేశాల ఆడియో, వీడియో రికార్డింగ్ ల నుంచి ముఖ్యమైన అంశాలను (మినిట్స్ ఆఫ్ మీటింగ్ - ఎంఓఎమ్) ను స్వయంచాలకంగా తయారు చేయడానికి రూపొందించిన కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత సాధనం ‘సభాసార్‘ ను పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ (ఎంఓపీఒఆర్) ప్రారంభించనుంది.

 

కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లాలన్ సింగ్, కేంద్ర పంచాయితీ రాజ్ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్.పి.సింగ్ బఘేల్ సమక్షంలో ఈ రోజు న్యూఢిల్లీలో ఈ కార్యక్రమం జరగనుంది.

 

సభాసార్ ఆధునిక ఏఐ, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్ఎల్‌పీ) సాంకేతికతలను ఉపయోగించి, చర్చల లోని మాటలను లిఖిత రూపంలోకి మారుస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు, కార్యాచరణ అంశాలను గుర్తిస్తుంది. అలాగే చక్కగా రూపుదిద్దిన సమావేశ నివేదిక ( మినిట్స్) లను తయారు చేస్తుంది. భారత ప్రభుత్వ జాతీయ భాషా అనువాద మిషన్ ‘భాషిణి’తో అనుసంధానమైన ఈ సాధనం ప్రస్తుతం 13 భారతీయ భాషల్లో దీన్ని అందిస్తుంది. దీని వల్ల భాషాపరమైన ఇబ్బందులు ఉన్న పంచాయతీ సిబ్బందికి సౌలభ్యం, సౌకర్యం కలుగుతుంది. భవిష్యత్తులో భాషల సంఖ్యను కూడా క్రమంగా పెంచుతారు.

 

2025 ఆగస్టు 15న జరగనున్న ప్రత్యేక గ్రామసభల మినిట్స్ తయారీకి సభాసార్ సాధనాన్ని ఉపయోగించుకోవాలని అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలను పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కోరింది. ముందుగా త్రిపురలోని 1194 గ్రామపంచాయతీలు (సంప్రదాయ స్థానిక సంస్థలతో సహా) ప్రత్యేక గ్రామసభల మినిట్స్ తయారీకి ఈ సాధనాన్ని ఉపయోగిస్తాయి.

 

సభాసార్ అనేది డిజిటల్ ఆవిష్కరణలను ఉపయోగించి భాగస్వామ్య ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడాన్ని, అలాగే స్థానిక పరిపాలనలో సమర్థతను పెంపొందించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్న ఒక వినూత్న ప్రయత్నం. మాన్యువల్ గా పత్రాల తయారీకి అవసరమైన సమయాన్ని, శ్రమను గణనీయంగా తగ్గించడం ద్వారా పంచాయతీ అధికారులు పారదర్శకంగా, జవాబుదారీతనంతో పాలనపైన, ప్రజలకు సేవలు అందించడంపైన మరింత దృష్టి పెట్టడానికి సభాసార్ దోహదపడుతుంది.

***


(Release ID: 2156633)