సహకార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రాష్ట్ర సహకార ఎన్నికల అధికారులతో న్యూఢిల్లీలో సహకార ఎన్నికల ప్రాధికార సంస్థ (సీఈఏ) తొలి సంప్రదింపుల సమావేశం


· సహకార సంస్థలకు నిష్పాక్షిక.. స్వేచ్ఛాయుత ఎన్నికల దిశగా రాష్ట్ర సహకార ఎన్నికల అధికారులతో చర్చల యంత్రాంగం రూపకల్పన లక్ష్యం

· ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం.. హోం-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వాన చేపట్టిన సంస్కరణలు సహకార రంగాన్ని శక్తిమంతం చేస్తున్నాయి

· బహుళ-రాష్ట్ర సహకార సంఘం (ఎంఎస్‌సీఎస్‌) సహా పోటీపడే అభ్యర్థుల కోసం ప్రవర్తన నియమావళి రూపకల్పనపై చర్చించిన ‘సీఈఏ’

· అభ్యర్థుల గరిష్ఠ వ్యయ పరిమితి.. రిటర్నింగ్ అధికారుల కోసం కరదీపిక ప్రచురణ సహా జాతీయ సహకార సంఘాలలో సభ్యులైన సంఘాల నుంచి ప్రతినిధుల ఎన్నికపైనా చర్చించిన సీఈఏ

Posted On: 11 AUG 2025 4:14PM by PIB Hyderabad

సహకార ఎన్నికల ప్రాధికార సంస్థ (సీఈఏ) ఇవాళ న్యూఢిల్లీలో రాష్ట్ర సహకార ఎన్నికల అధికారులతో తొలి సంప్రదింపుల సమావేశం నిర్వహించింది. దేశవ్యాప్తంగాగల సహకార సంస్థలకు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ దిశగా చర్చల యంత్రాంగాన్ని రూపొందించడం దీని లక్ష్యం. ‘సీఈఏ’ చైర్మన్ శ్రీ దేవేంద్ర కుమార్ సింగ్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ సమావేశంలో తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా, బీహార్ రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. వైస్ చైర్‌పర్సన్ శ్రీ ఆర్.కె.గుప్తా, సహకార శాఖ స్వతంత్ర న్యాయాధికారి శ్రీ అలోక్ అగర్వాల్, కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ ఆనంద్ కుమార్ ఝా తదితరులు కూడా ఈ చర్చలో పాలుపంచుకున్నారు.
ఈ సందర్భంగా శ్రీ దేవేంద్ర కుమార్ సింగ్ మాట్లాడుతూ- ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వం, హోం-సహకారశాఖల మంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వాన ‘సీఈఏ’ ఏర్పాటు సహా  సహకార రంగంలో వివిధ సంస్కరణలను ప్రభుత్వం అమలు చేసిందని గుర్తుచేశారు. ప్రాధికార సంస్థ 2024 మార్చి నెలనుంచీ ఇప్పటిదాకా 159 ఎన్నికలను నిర్వహించిందని, అదే తరహాలో ప్రస్తుతం 69 ఎన్నికల నిర్వహణ ప్రక్రియను చేపట్టిందని తెలిపారు.
బహుళ-రాష్ట్ర సహకార సంఘాల చట్టం-2002లోని సెక్షన్ 45తోపాటు 2023లో దాని సవరణ ద్వారా కేంద్రానికి సంక్రమించిన అధికారాల మేరకు సహకార ఎన్నికల ప్రాధికార సంస్థను ఏర్పాటు చేస్తూ 2024 మార్చి 11న అధికార ప్రకటన వెలువడింది.
ఈ ఏడాదిని (2025) అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించడాన్ని శ్రీ దేవేంద్ర కుమార్ సింగ్ గుర్తుచేశారు. అలాగే సహకార రంగ పురోగమనంపై నిబద్ధతను చాటుకుంటూ ప్రభుత్వం అనేక సంస్కరణలు తెచ్చిందని పేర్కొన్నారు. సహకార సంఘాల ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా నిర్వహించే దిశగా పారదర్శకత మెరుగుకు ఎన్నికల ప్రక్రియను క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
సహకార ఎన్నికలకు ప్రామాణిక నిబంధన పత్రం (మాన్యువల్‌), ప్రవర్తన నియమావళి అవసరం ఎంతయినా ఉందని చైర్‌పర్సన్ స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగా బహుళ-రాష్ట్ర సహకార సంఘం (ఎంఎస్‌సీఎస్) సహా పోటీపడే అభ్యర్థుల కోసం ప్రవర్తన నియమావళి రూపకల్పనపై చర్చించామన్నారు. అంతేకాకుండా అభ్యర్థుల గరిష్ఠ వ్యయ పరిమితి, రిటర్నింగ్ అధికారుల కోసం కరదీపిక  ప్రచురణ, జాతీయ సహకార సంఘాలలో సభ్యులైన సహకార సంఘాల నుంచి ప్రతినిధుల ఎన్నిక, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగం సహా ఆయా రాష్ట్ర సహకార ఎన్నికల అధికారులు ప్రతిపాదించిన అంశాలపైనా సమావేశం లోతుగా చర్చించిందని శ్రీ దేవేంద్ర కుమార్‌ సింగ్‌ వెల్లడించారు.
వీటన్నిటితోపాటు సభ్యుల వాటా మూలధనం, అభ్యర్థుల కోసం చిహ్నాల వాడకం, సహకార ఎన్నికలలో చెరగని సిరా ఉపయోగం వంటివాటిని తాను స్వయంగా ప్రతిపాదించి చర్చలో పెట్టానని ఆయన తెలిపారు.
ఈ నేపథ్యంలో సహకార ఎన్నికలలో సంస్కరణల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రతి మూడు నెలలకు ఒకసారి సంప్రదింపుల కమిటీ సమావేశం నిర్వహించాలని ‘సీఈఏ’ నిర్ణయించింది.
ఈ సమావేశంలో తెలంగాణ సహకార ఎన్నికల అథారిటీ కమిషనర్ శ్రీ జి.శ్రీవినాస రావు, తమిళనాడు రాష్ట్ర సహకార సంఘాల ఎన్నికల కమిషన్ కమిషనర్ శ్రీ దయానంద్ కటారియా, ఒడిశా రాష్ట్ర సహకార ఎన్నికల కమిషనర్ శ్రీ శ్రీకాంత ప్రస్టీ, బీహార్ రాష్ట్ర ఎన్నికల అథారిటీ అధికారి శ్రీ గిరీష్ శంకర్‌తోపాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సలహాదారు శ్రీ కుమార్‌ శాంత రక్షిత్‌, మహారాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ కమిషనర్ శ్రీ అనిల్ మహాదేవ్ కవాడే, కార్యదర్శి శ్రీ అశోక్ గడే తదితరులు పాల్గొన్నారు.

 

****


(Release ID: 2155321)