ప్రధాన మంత్రి కార్యాలయం
ఢిల్లీలో పార్లమెంటు సభ్యుల కోసం కొత్తగా నిర్మించిన ఫ్లాట్‌లను ప్రారంభించనున్న ప్రధానమంత్రి
పూర్తి స్థాయి ఆధునిక సౌకర్యాలతో 184 టైప్–VII బహుళ అంతస్తుల ఫ్లాట్‌ల నిర్మాణం
భవనాల ప్రాంగణంలో సింధూర్ మొక్కను నాటి, కార్మికులతో సంభాషించనున్న ప్రధాని మోదీ
ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగించనున్న ప్రధాని
Posted On:
10 AUG 2025 10:44AM by PIB Hyderabad
ఢిల్లీలోని బాబా ఖరక్ సింగ్ మార్గ్‌లో పార్లమెంటు సభ్యుల కోసం కొత్తగా నిర్మించిన 184 టైప్–VII బహుళ అంతస్తుల ఫ్లాట్‌లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2025 ఆగస్టు 11న ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నారు.
ఈ నివాస ప్రాంగణంలో ప్రధానమంత్రి సిందూర్ మొక్కను నాటనున్నారు. కార్మికులతో కూడా ఆయన సంభాషించనున్నారు. ఈ సందర్భంగా ప్రారంభోత్సవాన్ని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు.
ఈ భవన సముదాయాన్ని స్వయం సమృద్ధిగా ఉండేలా నిర్మించారు. పార్లమెంటు సభ్యులు పని చేసుకునేందుకు వీలుగా పూర్తి స్థాయి ఆధునిక సౌకర్యాలు ఈ ఫ్లాట్‌లలో ఉన్నాయి. హరిత సాంకేతికతతో ఉన్న ఈ సముదాయం గృహ-3 స్టార్ రేటింగ్ ప్రమాణాలతో ఉంది. దీనిని జాతీయ భవన నిర్మాణ నియమావళి (ఎన్‌బీసీ) - 2016కు అనుగుణంగా నిర్మించారు. పర్యావరణ సుస్థిరత విషయంలో సరిపడా చర్యలు తీసుకున్నారు. ఇవి ఇంధన పరిరక్షణ, పునరుత్పాదక ఇంధనోత్పత్తి, ప్రభావవంతమైన వ్యర్థాల నిర్వహణకు దోహదపడతాయని భావిస్తున్నారు. అధునాతన నిర్మాణ సాంకేతికతలను, ముఖ్యంగా అల్యూమినియం రేకులను ఉపయోగించి కాంక్రీటుతో నిర్మించే పద్ధతి (మోనోలితిక్ కాంక్రీట్ విత్ అల్యూమినియం షట్టరింగ్) ద్వారా ధృడత్వంతో కూడిన ఈ ఇళ్ల నిర్మాణం సకాలంలో పూర్తైంది. దివ్యాంగులకు కూడా ఇది అనుకూలంగా ఉండనుంది. ఇది భవనాల నిర్మాణంలో సమ్మిళితత్వానికి ఇచ్చిన ప్రాధాన్యతను తెలియజేస్తోంది.
పార్లమెంటు సభ్యులకు సరిపడా ఇళ్లు లేని కారణంగా ఈ ప్రాజెక్టును చేపట్టాల్సి వచ్చింది. కావాల్సినంత భూమి లభించకపోవటం వల్ల భూ వినియోగాన్ని మెరుగుపరిచేందుకు, నిర్వహణ ఖర్చులను తగ్గించే లక్ష్యంతో ఒకదాని మీద ఒక ఇళ్లు నిర్మించే పద్ధతికి (వర్టికల్ హౌసింగ్) ప్రాధాన్యతనిచ్చారు.
ప్రతి ఇంటిలో సుమారు 5,000 చదరపు అడుగుల ఉపయోగించదగిన స్థలం (కార్పెట్ ఏరియా) ఉంది. దీనివల్ల నివాస, అధికారిక పనులకు కావాల్సినంత స్థలం లభిస్తుంది. కార్యాలయాలు, సిబ్బంది వసతి, సామాజిక కేంద్రానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రజా ప్రతినిధులుగా పార్లమెంటు సభ్యులు బాధ్యతలను నిర్వర్తించడంలో ఇవి సహాయపడనున్నాయి.
సముదాయంలోని అన్ని భవనాలను భూకంప నిరోధకత సాంకేతికతతో ఆధునిక నిర్మాణ నిబంధనలకు అనుగుణంగా నిర్మించారు. ఇక్కడ ఉండే వారి భద్రతను నిర్ధారించేందుకు సమగ్రమైన పకడ్భందీ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు.
***
(Release ID: 2154855)
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam