ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రపంచ సంస్కృత దినోత్సవం నేపథ్యంలో ప్రధాని శుభాకాంక్షలు


సంస్కృత భాషకు ప్రోత్సాహం... వారసత్వ పరిరక్షణపై నిబద్ధత పునరుద్ఘాటన

Posted On: 09 AUG 2025 10:13AM by PIB Hyderabad

శ్రావణ పౌర్ణమినాడు ప్రపంచ సంస్కృత దినోత్సవ నిర్వహణ నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సంస్కృతం “కాలతీత జ్ఞాన, వ్యక్తీకరణలకు మూలం” అని పేర్కొంటూ, విభిన్న రంగాల్లో దాని శాశ్వత ప్రభావాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.

సంస్కృత బోధన, అభ్యాసం, ప్రాచుర్యం కల్పించడంలో ప్రపంచవ్యాప్తంగా కృషి చేస్తున్న పండితులు, విద్యార్థులు, ఔత్సాహికుల అంకితభావాన్ని ఈ సందర్భంగా శ్రీ మోదీ ప్రశంసించారు. సంస్కృత భాష బలోపేతం, అభ్యాసం, పరిశోధనల దిశగా గత దశాబ్ద కాలంలో ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నదని ఆయన వివరించారు. ఇందులో భాగంగా కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయాల ఏర్పాటు, సంస్కృత అభ్యసన కేంద్రాల ప్రారంభం, సంస్కృత పండితులకు ఆర్థిక సహాయం, రాతప్రతుల డిజిటలీకరణ లక్ష్యంగా ‘జ్ఞాన భారత్‌’ అమలు వంటి అనేక కార్యక్రమాలు చేపట్టామని గుర్తుచేశారు.

దీనికి సంబంధించి సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన వరుస సందేశాల్లో:

“శ్రావణ పౌర్ణమి నేపథ్యంలో మనం ఈ రోజున ప్రపంచ సంస్కృత దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. సంస్కృతం కాలాతీత జ్ఞాన, వ్యక్తీకరణలకు మూలం. ఈ భాష ప్రభావాన్ని అన్ని రంగాల్లో మనం చూడవచ్చు. ప్రపంచవ్యాప్తంగా సంస్కృతం నేర్చుకుంటున్న, ప్రాచుర్యంలోకి తెస్తున్న ప్రతి ఒక్కరినీ అభినందించడానికి ఇది తగిన సందర్భం.”

“సంస్కృత భాషకు విశేష ప్రాచుర్యం కల్పించడంలో భాగంగా ప్రభుత్వం గత పదేళ్ల నుంచీ అనేక విధాలుగా కృషి చేసింది. ఈ మేరకు కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయాల ఏర్పాటు, సంస్కృత అభ్యసన కేంద్రాల ప్రారంభం, సంస్కృత పండితులకు ఆర్థిక సహాయం, రాతప్రతుల డిజిటలీకరణ లక్ష్యంగా ‘జ్ఞాన భారత్‌’ అమలు వంటి అనేక కార్యక్రమాలు చేపట్టాం. వీటిద్వారా అసంఖ్యాక విద్యార్థులు, పరిశోధకులకు ప్రయోజనం చేకూరింది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***


(Release ID: 2154622)