ప్రధాన మంత్రి కార్యాలయం
ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో కర్తవ్య భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాని
అభివృద్ధి చెందిన భారతదేశ విధానాలు, దిశకు కర్తవ్య భవన్ మార్గనిర్దేశం చేస్తోంది: ప్రధానమంత్రి
దేశ కలలను నెరవేర్చాలనే సంకల్పాన్ని కర్తవ్య భవన్ తెలియజేస్తోంది: ప్రధానమంత్రి
ప్రతి ప్రాంతం పురోగమించాలనే సమగ్ర దృక్పథంతో భారతదేశం రూపుదిద్దుకుంటోంది: ప్రధానమంత్రి
గత 11 సంవత్సరాలలో పారదర్శకంగా, వెంటనే స్పందించే, పౌర కేంద్రీకృతమైన పాలనా నమూనాను భారత్ నిర్మించింది: ప్రధానమంత్రి
అందరం కలిసి భారత్‌ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుద్దాం. భారత్‌లో తయారీ, ఆత్మనిర్భర్ భారత్ విజయగాథను లిఖిద్దాం: ప్రధానమంత్రి
Posted On:
06 AUG 2025 8:35PM by PIB Hyderabad
ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో ఈరోజు కర్తవ్య భవన్-3 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఆగస్టు 15 కంటే ముందే క్రాంతికారక మాసమైన ఈ నెల మరో చారిత్రాత్మక ఘట్టానికి సాక్ష్యంగా నిలుస్తోందని అన్నారు. ఆధునిక భారత్ నిర్మాణంతో ముడిపడి ఉన్న కీలక మైలురాళ్లను దేశం ఒకదాని తర్వాత ఒకటి దాటుతోందని ప్రధానంగా చెప్పారు. ఢిల్లీ గురించి మాట్లాడుతూ మౌలిక సదుపాయాల విషయంలో ఇటీవల జరిగిన పురోగతిని తెలియజేశారు. ఈ సందర్భంగా కర్తవ్య పథ్, కొత్త పార్లమెంట్ భవనం, కొత్త రక్షణ కార్యాలయాల సముదాయం, భారత్ మండపం, యశోభూమి, అమరవీరులకు సంబంధించిన జాతీయ యుద్ధ స్మారక చిహ్నం, నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహంతో పాటు ప్రస్తుత ప్రారంభోత్సవం జరుగుతోన్న కర్తవ్య భవన్‌లను ప్రస్తావించారు. ఇవి కేవలం కొత్త భవనాలు లేదా సాధారణ మౌలిక సదుపాయాలు కాదని ప్రధానంగా చెబుతూ.. అమృత్ కాలంలో అభివృద్ధి చెందిన భారతదేశాన్ని రూపొందించే విధానాలు వీటిలో తయారౌతాయని అన్నారు. రాబోయే దశాబ్దాల్లో దేశం ప్రయాణించే మార్గం కూడా వీటిలోనే నిర్ణయం అవుతుందని పేర్కొన్నారు. కర్తవ్య భవన్ ప్రారంభోత్సవం సందర్భంగా అందరికీ ఆయన అభినందనలు తెలిపారు. నిర్మాణంలో పాల్గొన్న ఇంజినీర్లు, కార్మికులకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
కర్తవ్య పథ్, కర్తవ్య భవనం రెండూ భారత ప్రజాస్వామ్యం, రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతిధ్వనిస్తాయన్న ఆయన.. విస్తృత ఆలోచనల తర్వాత ఈ భవనానికి ‘కర్తవ్య భవన్’ అని పేరు పెట్టినట్లు తెలిపారు. భగవద్గీతను ఉటంకిస్తూ లాభనష్టాల ఆలోచనలను దాటుకొని బాధ్యతలు నిర్వర్తించాలన్న శ్రీ కృష్ణుడి బోధనలను ప్రధాని గుర్తు చేశారు. భారతీయ సంస్కృతిలో ‘కర్తవ్యం’ అనే పదం బాధ్యతకే పరిమితం కాదని, కార్యాచరణ ఆధారిత భారతీయ తత్వానికి సంబంధించిన సారాంశాన్ని తెలియజేస్తోందని ప్రధానంగా చెప్పారు. సొంత అనే భావనను దాటి సమష్టి దృక్పథాన్ని అలవరుచుకునే నిజమైన గొప్ప భావనే అసలైన కర్తవ్యం అని వివరించారు. కర్తవ్య అనేది కేవలం ఒక భవనం పేరు కాదని, కోట్లాది మంది భారతీయుల కలలను సాకారం చేసుకునే ఒక పవిత్ర స్థలమని ప్రధానంగా చెప్పారు. "కర్తవ్యం అనేది ప్రారంభం, విధి రెండింటిని తెలియజేస్తోంది. ఇది కరుణ, శ్రద్ధతో కట్టుబడి ఉంటుంది. ఇది కలల సౌదం, సంకల్పాల ఆశ, ప్రయత్నానికి చిహ్నం" అని ప్రధాని అన్నారు. కర్తవ్యం ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపే సంకల్ప శక్తి అని పేర్కొన్నారు. కోట్లాది మంది ప్రజల హక్కులను పరిరక్షించడానికి పునాదే కర్తవ్యం అని ప్రధానంగా అన్నారు. కర్తవ్యం అనేది భారతమాత శక్తికి వాహకమని, 'నాగరిక్ దేవో భవ' అనే మంత్రాన్ని జపించడమేనని తెలిపారు. దేశం పట్ల భక్తితో చేసే ప్రతి పని కర్తవ్యమేనని పేర్కొన్నారు.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దశాబ్దాలుగా భారతదేశ పరిపాలనా యంత్రాంగం బ్రిటిష్ వలసరాజ్యాల కాలంలో నిర్మించిన భవనాల నుంచే పనిచేసిందన్నారు. ఈ పాత భవనాలలో పని వాతావరణం అధ్వాన్నంగా ఉందని.. వాటిలో తగినంత స్థలం, వెలుతురు, గాలి లేదని చెప్పారు. హోం మంత్రిత్వ శాఖ వంటి ముఖ్యమైన మంత్రిత్వ శాఖ దాదాపు 100 సంవత్సరాలుగా తగినంత మౌలిక సదుపాయాలు లేకుండా ఒకే భవనంలో ఎలా పనిచేసిందో ఊహించటం కష్టమని వ్యాఖ్యానించారు. భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు ప్రస్తుతం ఢిల్లీ అంతటా 50 వేర్వేరు ప్రదేశాల నుంచి పనిచేస్తున్నాయన్న ఆయన..ఈ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన భవనాలు చాలా వరకు అద్దెపై నడుస్తున్నవేనని అన్నారు. అద్దె కోసం చేస్తోన్న వార్షిక వ్యయం రూ. 1500 కోట్లు ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని అన్నారు. ఇవన్నీ అక్కడక్కడ ఉన్నప్పటికీ.. ఇంత పెద్ద మొత్తాన్ని ఖర్చు చేయాల్సి వస్తోందని వివరించారు. ఈ వికేంద్రీకరణ కారణంగా ఉన్న ప్రయాణ సమస్యను కూడా చెప్పారు. ఒక శాఖ నుంచి ఇంకో శాఖకు రోజుకు 8,000 నుంచి 10,000 మంది ఉద్యోగులు రాకపోకలు సాగిస్తుంటారని.. ఫలితంగా వందలాది వాహనాలు రోడ్ల మీదికి రావటంతో పాటు వ్యయం, ట్రాఫిక్ రద్దీ పెరుగుతోందని తెలిపారు. వీటి వల్ల విలువైన సమయం వృథా అయి పరిపాలనా సామర్థ్యం ప్రత్యక్షంగా తగ్గుతోందని ప్రధానంగా పేర్కొన్నారు.
భారత్‌కు 21వ శతాబ్దపు ఆధునిక భవనాలు అవసరమన్న ప్రధానమంత్రి.. సాంకేతికత, భద్రత, సౌలభ్యం పరంగా ఉన్న భవనాల అవసరాన్ని ప్రధానంగా తేలియాజెప్పారు. అటువంటి భవనాలు సిబ్బందికి సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించాలని, త్వరితగతిన నిర్ణయం తీసుకోవడానికి వీలు కల్పించాలని , సేవలను సజావుగా అందించేలా చూసుకోవాలని పేర్కొన్నారు. కర్తవ్య భవన్ వంటి భారీ భవనాలను సమగ్ర దృక్పథంతో కర్తవ్య మార్గం చుట్టూ నిర్మిస్తున్నామని.. మొదటి కర్తవ్య భవన్ పూర్తయినప్పటికీ, అనేక ఇతర కర్తవ్య భవనాల నిర్మాణం వేగంగా సాగుతోందని తెలిపారు. కార్యాలయాలను కొత్త సముదాయాలకు మార్చిన తర్వాత, ఉద్యోగులు మెరుగైన పని వాతావరణంతో పాటు అవసరమైన సౌకర్యాలను కలిగి ఉంటారని, తద్వారా వారి ఉత్పాదకత పెరుగుతుందన్నారు. అక్కడక్కడ ఉన్న మంత్రిత్వ శాఖ కార్యాలయాల అద్దెకు ప్రస్తుతం ఖర్చు చేస్తోన్న రూ. 1,500 కోట్లను కూడా ప్రభుత్వం ఆదా చేస్తుందని పేర్కొన్నారు.
"కొత్త రక్షణ సముదాయాలు సహా భారీ కర్తవ్య భవన్, ఇతర ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు భారత్ వేగానికి నిదర్శనం మాత్రమే కాదు, దేశానికి ఉన్న ప్రపంచ దృక్పథాన్ని కూడా తెలియజేస్తాయి" అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. భారతదేశం ప్రపంచానికి అందిస్తోన్న దార్శనికతను దేశం కూడా పాటిస్తోందని, ఇది మౌలిక సదుపాయాల అభివృద్ధిలో స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. భారతదేశం ప్రపంచానికి మిషన్ లైఫ్, 'ఒకే భూమి, ఒకే సూర్యుడు, ఒకే గ్రిడ్' వంటి కార్యక్రమాలను ఇచ్చిందని, ఇవి మానవాళి భవిష్యత్తుపై ఆశను తెలియజేస్తున్నాయని తెలిపారు. కర్తవ్య భవన్ వంటి ఆధునిక మౌలిక సదుపాయాలు ప్రజానుకూల స్ఫూర్తిని, వాతావరణ అనుకూల నిర్మాణాన్ని కలిగి ఉన్నాయని తెలియజేశారు. కర్తవ్య భవన్‌పై సౌర ఫలకాలను ఏర్పాటు చేసినట్లు తెలిపిన ఆయన ఈ భవనాల్లో అధునాతన వ్యర్థ నిర్వహణ వ్యవస్థలు కూడా ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా ఏర్పాటవుతోన్న హరిత భవనాల విషయంలో దార్శనికతకు అనుగుణంగా వీటిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
దేశాన్ని పురోగమనంలో నిలపడంలో సమగ్ర దృక్పథంతో ప్రభుత్వం నిమగ్నమై ఉందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. దేశంలోని అన్ని ప్రాంతాలూ నేడు ప్రగతి పథంలో నిలిచాయని, అభివృద్ధి చేరని ప్రాంతమంటూ ఏదీ లేదని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించగా.. దేశవ్యాప్తంగా 30,000కు పైగా పంచాయతీ భవనాలనూ నిర్మించినట్టు ఆయన పేర్కొన్నారు. కర్తవ్య భవన్ వంటి కీలక నిర్మాణాలతోపాటు పేదల కోసం నాలుగు కోట్లకు పైగా పక్కా ఇళ్ళను నిర్మించామని శ్రీ మోదీ తెలిపారు. దేశవ్యాప్తంగా 300కు పైగా కొత్త వైద్య కళాశాలలను నిర్మించామనీ, అదే సమయంలో జాతీయ యుద్ధ స్మారక చిహ్నాన్నీ పోలీసు స్మారకాన్నీ కూడా ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. ఢిల్లీలో భారత్ మండపాన్ని నిర్మించగా.. దేశవ్యాప్తంగా 1,300కు పైగా అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రధానమంత్రి వివరించారు. గత పదకొండేళ్లలో దాదాపు 90 కొత్త విమానాశ్రయాల నిర్మాణంతో దేశ ప్రగతి ప్రస్థానం వేగం పుంజుకుందని, అలాగే యశోభూమి వైభవమూ ఈ విప్లవాత్మక మార్పులను కళ్లకు కడుతోందని ప్రధానమంత్రి అన్నారు.
హక్కులు, విధులు అంతర్గతంగా ముడిపడి ఉన్నాయనీ, విధులను నిర్వర్తించడం హక్కుల పునాదిని బలపరుస్తుందనీ మహాత్మాగాంధీ గట్టిగా నమ్మేవారని ప్రధానమంత్రి గుర్తుచేశారు. పౌరులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని, అదే సమయంలో ప్రభుత్వమూ పూర్తి అంకిత భావంతో తన బాధ్యతలను నిర్వర్తించాలని శ్రీ మోదీ అన్నారు. ప్రభుత్వం నిజాయితీగా పనిచేస్తే పాలనలో అది ప్రతిబింబిస్తుందని స్పష్టం చేశారు. గత దశాబ్దం దేశంలో ‘సుపరిపాలన దశాబ్దం’గా పేరెన్నికగన్నదని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. సంస్కరణలు నదీ తలం వంటివైతే.. సుపరిపాలన వాహిని, అభివృద్ధి రెండూ దాని శాఖల వంటివన్నారు. సంస్కరణలు నిరంతరమైనవని, కాలావధితో కూడిన ప్రక్రియలని చెప్పారు. భారత్ ఎప్పటికప్పుడు ముఖ్యమైన సంస్కరణలెన్నింటినో చేపట్టిందని పేర్కొన్నారు. ప్రభుత్వం-పౌరుల మధ్య సంబంధాల బలోపేతం, జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచడం, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, మహిళా సాధికారత, పరిపాలన సామర్థ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరిస్తూ... “భారత సంస్కరణలు స్థిరమైనవి మాత్రమే కాదు.. క్రియాశీలమైనవి, దార్శనికమైనవి” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఈ రంగాల్లో భారత్ ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలు చేస్తోందన్నారు. “గత పదకొండేళ్లుగా.. పారదర్శకమైన, సునిశితమైన, ప్రజా కేంద్రీకృతమైన పరిపాలన నమూనాను భారత్ రూపొందించింది” అని ప్రధానమంత్రి వివరించారు.
తాను ఏ దేశానికి వెళ్లినా జేఏఎం త్రయం (జన్‌ధన్, ఆధార్, మొబైల్) సర్వత్రా ప్రశంసలందుకుంటోందని ప్రధానమంత్రి చెప్పారు. జేఏఎం వల్ల దేశంలో ప్రభుత్వ పథకాల పంపిణీ పారదర్శకంగా మారిందని, అవి పక్కదారి పట్టకుండా ఉన్నాయని వివరించారు. రేషన్ కార్డులు, గ్యాస్ సబ్సిడీలు, స్కాలర్‌షిప్పుల వంటి పథకాలకు సంబంధించి.. మనుగడలో లేని లబ్ధిదారులే దాదాపు 10 కోట్ల మంది ఉండడం ఆశ్చర్యకరమన్నారు. వారిలో చాలా మంది అసలింకా పుట్టనే లేదని, అయినా పథకాలు పొందేవారని అన్నారు. గత ప్రభుత్వాలు ఈ నకిలీ లబ్ధిదారుల పేర్లపై నిధులను బదిలీ చేశాయని, ఆ విధంగా అక్రమంగా నిధులను మళ్లించారని శ్రీ మోదీ చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో 10 కోట్ల తప్పుడు పేర్లను లబ్ధిదారుల జాబితాల నుంచి తొలగించినట్టు తెలిపారు. ఈ చర్య దేశంలో రూ. 4.3 లక్షల కోట్లకు పైగా ప్రజాధనం పక్కదారి పట్టకుండా కాపాడినట్టు తాజా గణాంకాల ప్రకారం తెలుస్తోందన్నారు. ఈ భారీ మొత్తాన్ని ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాల కోసం ఉపయోగిస్తున్నామన్నారు. దాంతో నిజమైన లబ్ధిదారుల ప్రయోజనాలు, జాతీయ వనరులు రెండింటికీ రక్షణ లభించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
అవినీతి, నిధుల దారి మళ్లింపులే కాకుండా కాలం చెల్లిన నియమ నిబంధనలు కూడా చాలా కాలంగా ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని, అవి ప్రభుత్వ నిర్ణయ ప్రక్రియకు అవరోధం కలిగిస్తున్నాయని చెప్పిన శ్రీ మోదీ.. ఈ సమస్యను పరిష్కరించడం కోసం వాడుకలో లేని 1,500కు పైగా చట్టాలను రద్దు చేసినట్టు తెలిపారు. వలస పాలన అవశేషాలుగా ఉన్న ఆ నియమ నిబంధనలు దశాబ్దాలుగా పాలనకు ఆటంకం కలిగిస్తున్నాయన్నారు. చిన్నచిన్న కార్యకలాపాలకు కూడా గతంలో అనేక పత్రాలు సమర్పించాల్సి ఉండేదని చెప్తూ.. ఆ అనుమతిపరమైన భారం కూడా సవాళ్లను కలిగించిందన్నారు. గత పదకొండేళ్లలో 40,000కు పైగా అనుమతులను తొలగించామని, ఈ హేతుబద్ధీకరణ స్థిరమైన వేగంతో కొనసాగుతోందని ప్రధానమంత్రి తెలిపారు. గతంలో వివిధ ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వ శాఖల మధ్య బాధ్యతలు ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉండడం వల్ల జాప్యాలు, అవరోధాలు ఏర్పడ్డాయన్నారు. పనితీరును మెరుగురచడం కోసం అనేక విభాగాలను ఏకీకృతం చేయడంతోపాటు అదనంగా ఉన్న విభాగాలను తొలగించామన్నారు. అలాగే అవసరమైన చోట మంత్రిత్వ శాఖల విలీనమో లేదా కొత్తగా ఏర్పాటు చేసే దిశగానో చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. జల భద్రత కోసం జలశక్తి మంత్రిత్వ శాఖ, సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి సహకార మంత్రిత్వ శాఖ, మత్స్యకార రంగానికి ప్రాధాన్యమిస్తూ మొదటిసారిగా మత్స్యకార మంత్రిత్వ శాఖ, యువతను సాధికారులుగా తీర్చిదిద్దడం కోసం నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామిక మంత్రిత్వ శాఖ వంటి కీలక శాఖల ఏర్పాటును శ్రీ మోదీ ఉదాహరించారు. ఈ సంస్కరణలు పాలన సామర్థ్యాన్ని పెంచాయని, ప్రజా సేవలను వేగవంతం చేశాయని చెప్పారు.
ప్రభుత్వ పనితీరును మెరుగుపరచడానికి నిరంతరం కృషి చేస్తున్నామని చెప్తూ.. మిషన్ కర్మయోగి, ఐ గాట్ డిజిటల్ వేదికల వంటి కార్యక్రమాలను ప్రధానమంత్రి వివరించారు. ఇవి సాంకేతిక, వృత్తిపరమైన శిక్షణతో ప్రభుత్వ ఉద్యోగులను సాధికారులను చేస్తున్నాయన్నారు. ఇ-ఆఫీస్, ఫైల్ ట్రాకింగ్, డిజిటల్ ఆమోదాల వంటి ఏర్పాట్లు పాలన ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్నారు. ఇవి ప్రక్రియలను వేగవంతం చేయడమే కాకుండా వాటిని పారదర్శకంగా, జవాబుదారీగా మారుస్తున్నాయన్నారు.
కొత్త భవనంలోకి రావడంతో నవోత్తేజం జనించిందని, సభ్యుల శక్తియుక్తులను ఇది గణనీయంగా పెంచిందని ప్రధానమంత్రి అన్నారు. సభ్యులంతా ఈ కొత్త భవనంలో అదే ఉత్సాహంతో, అంకితభావంతో బాధ్యతలు నిర్వర్తించాలని కోరారు. పదవితో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ తమ పదవీకాలాన్ని చిరస్మరణీయంగా మలచుకునేలా కృషి చేయాలన్నారు. పదవీకాలం పూర్తయి సభను వీడిన తర్వాత.. దేశ సేవలో శక్తివంచన లేకుండా, అంకితభావంతో వ్యవహరించామని గర్వించేలా పనిచేయాలన్నారు.
ఫైళ్లు, డాక్యుమెంటేషన్ల పట్ల దృక్పథాన్ని మార్చుకోవాల్సిన అవసరముందని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఏదైనా ఫైల్, ఫిర్యాదు లేదా దరఖాస్తు నిత్యకృత్యంగానే అనిపించవచ్చనీ, కానీ ఆ కాగితం ముక్కే ఓ వ్యక్తిలో ఎన్నో ఆశలు నింపగలదనీ గుర్తించాలన్నారు. ఒకే ఫైల్ అనేక వ్యక్తుల జీవితాలతో సంక్లిష్టంగా ముడిపడి ఉంటుంది. ఈ విషయాన్ని వివరిస్తూ.. లక్ష మంది ప్రజలకు సంబంధించిన ఒక ఫైల్ ఒక్క రోజు ఆలస్యమైనా దాని వల్ల లక్ష పనిదినాలను నష్టపోవాల్సి వస్తుందని ప్రధానమంత్రి చెప్పారు. సౌలభ్యాన్ని బట్టి పనిచేయడమో లేదా సర్వ సాధారణంగా ఆలోచించడమో కాకుండా.. సేవ చేయడానికి ఉన్న అపారమైన అవకాశాన్ని గుర్తిస్తూ ఈ మనస్తత్వంతో అధికారులు బాధ్యతలు నిర్వర్తించాలని కోరారు. కొత్త ఆలోచన విప్లవాత్మక మార్పులకు బీజం వేయగలదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులంతా కర్తవ్య స్ఫూర్తితో దేశ పురోగమనంపై అంకితభావంతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. బాధ్యతల నుంచే దేశ అభివృద్ధి స్వప్నం వికసిస్తుందని వారికి గుర్తుచేశారు.
విమర్శలకు ఇది సమయం కానప్పటికీ, కచ్చితంగా ఇది ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
భారతదేశంతో సమానంగా స్వాతంత్య్రం పొందిన అనేక దేశాలు వేగంగా పురోగమించాయని, అయితే వివిధ చారిత్రక సవాళ్ల కారణంగా భారతదేశ పురోగతి వాటితో పోలిస్తే తక్కువగానే ఉందని ఆయన అన్నారు. అయితే ఈ సవాళ్లు భావితరాలకు కూడా చేరకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందని శ్రీ మోదీ ఉద్ఘాటించారు. తమ ప్రభుత్వం ఇప్పటికే చేపట్టిన ప్రయత్నాలను వివరిస్తూ, పార్లమెంట్ పాత భవనంలో తీసుకున్న ఎన్నో ముఖ్యమైన నిర్ణయాలు, విధానాలు 25కోట్లమంది పేదరికం నుంచి బయటపడేందుకు దోహదపడ్డాయని చెప్పారు. ఇప్పుడు కొత్త భవనాలలో మరింత సామర్థ్యంతో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించే దిశగా వేగంగా అడుగులు వేస్తూ అభివృద్ధి చెందిన భారత్ కలను సాకారం చేయడమే లక్ష్యమని ప్రధాని తెలిపారు. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ వంటి కార్యక్రమాల విజయగాథలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ప్రపంచంలోనే భారత్ ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు భాగస్వాములందరూ సమష్టిగా కృషి చేయాలని శ్రీ మోదీ పిలుపునిచ్చారు. జాతీయ ఉత్పాదకతను పెంచడానికి నిబద్ధతతో పనిచేయాలని కోరారు. పర్యాటకం గురించి చర్చ జరిగితే అందులో భారత్ అంతర్జాతీయ పర్యాటక గమ్యస్థానంగా గుర్తింపు పొందాలని అన్నారు. బ్రాండ్‌ల గురించి మాట్లాడినప్పుడు ప్రపంచం భారతీయ సంస్థలవైపు చూడాలని, విద్య కోసం ఆలోచిస్తే ప్రపంచం నలుమూలల నుంచి విద్యార్థులు భారత్ నే ఎంపిక చేసుకునే పరిస్థితి ఉండాలని ఆయన అన్నారు. భారత్ సామర్థ్యాలను బలోపేతం చేయడం ఉమ్మడి ప్రయత్నంగా, వ్యక్తిగత లక్ష్యంగా మారాలని స్పష్టం చేశారు.
విజయవంతమైన దేశాలు ముందుకు సాగుతున్నప్పుడు, అవి తమ సానుకూల వారసత్వాన్ని విడిచిపెట్టవని, దానిని కాపాడుకుంటాయని పేర్కొన్న శ్రీ మోదీ, 'వికాస్ ఔర్ విరాసత్' దార్శనికతతో భారతదేశం పురోగమిస్తోందని తెలిపారు. నేడు ప్రారంభించిన కొత్త కర్తవ్య భవన్ లో చారిత్రక ప్రాధాన్యం గల ఉత్తర, దక్షిణ బ్లాక్ లు భారత సజీవ వారసత్వ భాగాలుగా రూపు దిద్దుకుంటాయని ప్రధానమంత్రి ప్రకటించారు. ఈ సుప్రసిద్ధ భవనాలను "యుగే యుగీన్ భారత్ సంగ్రహాలయ" పేరుతో పబ్లిక్ మ్యూజియంలుగా మారుస్తామని, దీని ద్వారా ప్రతి పౌరుడు భారతదేశ సుసంపన్నమైన నాగరిక ప్రయాణాన్ని వీక్షించడానికి, అనుభూతి చెందడానికి వీలు కల్పిస్తుందని ఆయన అన్నారు. కొత్త కర్తవ్య భవన్ లోకి ప్రజలు ప్రవేశించగానే, ఈ ప్రదేశాల్లో నిక్షిప్తమైన స్ఫూర్తిని, వారసత్వాన్ని తమతో తీసుకువెళతారని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. కర్తవ్య భవన్ ప్రారంభోత్సవం సందర్భంగా భారత ప్రజలకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
కేంద్రమంత్రులు, ఎంపీలు, కేంద్ర ప్రభుత్వ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నేపథ్యం
ఢిల్లీలోని కర్తవ్య పథ్ లో కర్తవ్య భవన్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు.
ఆధునిక, సమర్థవంతమైన, పౌర కేంద్రీకృత పాలనకు సంబంధించి ప్రధానమంత్రి దార్శనికత పట్ల ప్రభుత్వ నిబద్ధతలో ఇది ఒక ప్రధాన మైలురాయి. విస్తృత స్థాయిలో రూపాంతరం చెందిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగమైన కర్తవ్య భవన్ -3 పరిపాలనా ప్రక్రియలను సమర్థవంతంగా మార్చి వేగవంతమైన పాలనను అందించడాన్ని లక్ష్యంగా చేసుకున్న అనేక రానున్న కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ భవనాల్లో తొలి భవనం.
ప్రభుత్వం చేపట్టిన విస్తృత పరిపాలనా సంస్కరణల అజెండాను ఈ ప్రాజెక్ట్ ప్రతిబింబిస్తుంది. మంత్రిత్వ శాఖలను ఒకే చోట చేర్చడం, ఆధునిక సాంకేతిక వసతులను అందించడంలాంటి చర్యల ద్వారా, కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది, విధానాల అమలును వేగవంతం చేస్తుంది. బాధ్యతాయుతమైన పరిపాలనా వ్యవస్థను ప్రోత్సహిస్తుంది.
ప్రస్తుతం అనేక కీలక మంత్రిత్వ శాఖలు 1950 - 1970 ల మధ్య నిర్మించిన శాస్త్రి భవన్, కృషి భవన్, ఉద్యోగ్ భవన్, నిర్మాణ్ భవన్ వంటి పురాతన భవనాల నుంచి పనిచేస్తున్నాయి, ఇవి ఇప్పుడు కాలం చెల్లి అవసరాలకు తగిన విధంగా లేవు. కొత్త సౌకర్యాలతో మరమ్మత్తు, నిర్వహణ ఖర్చులు తగ్గి ఉత్పాదకత పెంపునకు వీలవుతుంది. ఉద్యోగుల శ్రేయస్సుతో పాటు మొత్తం సేవల అందింపును కూడా మెరుగుపరుస్తాయి.
ప్రస్తుతం ఢిల్లీ అంతటా విస్తరించి ఉన్న వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలను ఏకతాటిపైకి తీసుకురావడం ద్వారా సమర్థత, సృజనాత్మకత సమన్వయాన్ని పెంపొందించడానికి వీలుగా కర్తవ్య భవన్ - 3 ని నిర్మించారు. రెండు బేస్ మెంట్లు, ఏడు లెవల్స్ (గ్రౌండ్ + 6 అంతస్తులు) తో సుమారు 1.5 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ అత్యాధునిక కార్యాలయ సముదాయం సిద్ధమైంది. హోం, విదేశీ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి, ఎంఎస్ఎంఈ, డీవోపీటీ, పెట్రోలియం- సహజ వాయువు మంత్రిత్వ శాఖలు/ విభాగాలు, ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ (పీఎస్ఏ) కార్యాలయాలు ఇందులో ఉంటాయి.
ఈ కొత్త భవనం ఆధునిక పాలనా మౌలిక వసతులకు ప్రతీకగా నిలుస్తుంది. ఇందులో ఐటీ కోసం సిద్ధంగా ఉండే సురక్షిత కార్యాలయ స్థలాలు, ఐడీ కార్డు ఆధారిత ప్రవేశ నియంత్రణలు, సమగ్ర ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థ, కేంద్రీయ కమాండ్ వ్యవస్థ వంటివి ఉండనున్నాయి. సుస్థిరతపరంగా కూడా ఇది పోటీ లేని స్థాయిలో ఉంటుంది. దీనిని గృహ -4 రేటింగ్ ను లక్ష్యంగా చేసుకుని నిర్మించారు. డబుల్ గ్లేజ్ చిత్రాలు, రూఫ్‌టాప్ సోలార్, సోలార్ వాటర్ హీటింగ్ వ్యవస్థ, ఆధునిక హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ (హెవీఏసీ) వ్యవస్థలు, వర్షపు నీటి సంరక్షణ పర్యావరణ హిత సాంకేతికతలు కూడా కలిగి ఉంటుంది. జీరో డిశ్చార్జ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఇన్-హౌస్ సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్, ఈ-వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లు, రీసైకిల్ చేసిన నిర్మాణ సామగ్రిని పెద్దఎత్తున ఉపయోగించడం ద్వారా పర్యావరణ అవగాహనను పెంపొందిస్తుంది.
జీరో డిశ్చార్జ్ క్యాంపస్ గా కర్తవ్య భవన్ ప్రధానమైన నీటి అవసరాలను తీర్చేందుకు మళ్లీ ఉపయోగించుకునేలా వ్యర్థ జలాలను శుద్ధి చేసి వినియోగిస్తుంది. జీరో డిశ్చార్జ్ క్యాంపస్‌గా కర్తవ్య భవన్ ప్రధానమైన తాపీ పని లోనూ, పేవింగ్ బ్లాక్స్ నిర్మాణం లోనూ మట్టి వాడకం, నిర్మాణ భారం తగ్గించడానికి రీసైకిల్ చేసిన నిర్మాణ వ్యర్థాలు, తేలికపాటి డ్రై పార్టిషన్స్ ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా, అంతర్గత ఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ కూడా ఉంది.
ఈ భవనాన్ని 30% విద్యుత్ ఆదా అయ్యేలా రూపొందించారు. భవనాన్ని చల్లగా ఉంచేందుకు, బయట శబ్దాన్ని తగ్గించేందుకు ప్రత్యేక గాజు కిటికీలు ఉన్నాయి. విద్యుత్ ను ఆదా చేసే ఎల్ఈడి లైట్లు, అవసరం లేనప్పుడు లైట్లు ఆపివేసి సెన్సర్లు, విద్యుత్‌ను ఆదా చేసే స్మార్ట్ ఎలివేటర్లు, అలాగే విద్యుత్ వినియోగాన్ని సమర్థంగా నియంత్రించే ఆధునిక వ్యవస్థ వంటి అన్ని ఏర్పాట్లతో విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గుతుంది. కర్తవ్య భవన్ - 3 పై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్స్ ద్వారా ఏటా 5.34 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. సోలార్ వాటర్ హీటర్లు రోజువారీ వేడి నీటి అవసరాలలో పావు వంతుకు పైగా తీరుస్తాయి. విద్యుత్ వాహనాలకు ఛార్జింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేశారు.
(Release ID: 2153431)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam