ప్రధాన మంత్రి కార్యాలయం
ఎం.ఎస్. స్వామినాథన్ శతాబ్ది అంతర్జాతీయ సమావేశాన్ని ఆగస్టు 7న న్యూఢిల్లీలో ప్రారంభించనున్న ప్రధాని
సమావేశ ప్రధానాంశం: *‘ఎవర్‌గ్రీన్ రివల్యూషన్, ది పాత్‌వే టు బయోహ్యాపీనెస్’..
*ఆహారం, శాంతి రంగాల్లో విశేష కృషికి ఎం.ఎస్. స్వామినాథన్ పేరిట తొలి పురస్కారాన్ని అందించనున్న ప్రధానమంత్రి
Posted On:
06 AUG 2025 12:20PM by PIB Hyderabad
ఎం.ఎస్. స్వామినాథన్ శతాబ్ది సందర్భంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ సమావేశాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు ఉదయం సుమారు 9 గంటలకు న్యూఢిల్లీలోని ఐసీఏఆర్ పూసాలో ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.
ఈ సమావేశానికి ప్రధానాంశంగా తీసుకున్న ‘‘ఎవర్‌గ్రీన్ రివల్యూషన్- ది పాత్‌వే టు బయోహ్యాపీనెస్’’ అందరికీ ఆహార లభ్యత లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రొఫెసర్ స్వామినాథన్ తన జీవితాన్ని అంకితం చేశారని చాటిచెప్పనుంది. ‘ఎవర్‌గ్రీన్ రివల్యూషన్’ (ఈ మాటకు..పచ్చదనం అంతరించిపోకుండా చూడడానికే ఎప్పుడూ పాటుపడుతూ ఉందాం.. అని భావం) సిద్ధాంతం ఆధారంగా విస్తృత కార్యాచరణ చేపట్టడంపై చర్చించడానికి శాస్త్రవేత్తలకు, విధాన రూపకర్తలకు, అభివృద్ధి రంగ నిపుణులతో పాటు దీనిలో ఆసక్తి ఉన్న ఇతర వర్గాలకు ఈ సమావేశం ఒక వేదికను అందించనుంది. దీనిలో ప్రధానంగా చర్చించే విషయాల్లో.. ప్రకృతి అందిస్తున్న వనరులను, జీవ వైవిధ్యాన్ని సంరక్షించేందుకు దీర్ఘకాల ప్రాతిపదికన చర్యలు చేపట్టడం, ఆహార భద్రతను, పోషణ సంబంధిత భద్రతను దృష్టిలో పెట్టుకొని వ్యవసాయాన్ని లాభదాయకంగా మలచడం, వాతావరణ మార్పులకు అలవాటుపడుతూ వాతావరణంలో హఠాత్తుగా ఎదురయ్యే ఆటు పోటులను తట్టుకొనే వ్యవస్థల్ని పటిష్ఠపరచడం, సమానత్వ ఆధారిత- దీర్ఘకాలిక జీవనోపాధి మార్గాలను అందించగలిగేలా సరైన టెక్నాలజీలను వినియోగించుకోవడం.. వీటితో పాటు యువత, మహిళలు, సమాజంలో అంతగా ఆదరణకు నోచుకోని వర్గాలను కలుపుకొని అభివృద్ధి బాటలో ముందుకు సాగిపోవడం.. భాగంగా ఉన్నాయి.
ఎం.ఎస్. స్వామినాథన్ అడుగుజాడల్లో కృషి చేస్తున్న విశిష్టులను గౌరవించాలనే ఉద్దేశంతో ‘ఎం.ఎస్. స్వామినాథన్ అవార్డ్ ఫర్ ఫుడ్ అండ్ పీస్’ను (ఆహారం, శాంతి .. ఈ రంగాల్లో విశేష కృషికి ఎం.ఎస్. స్వామినాథన్ పేరిట పురస్కారం) ప్రదానం చేయడాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ అవార్డును ఎం.ఎస్. స్వామినాథన్ రిసర్చ్ ఫౌండేషన్ (ఎంఎస్ఎస్ఆర్ఎఫ్), ది వరల్డ్ అకాడమి ఆఫ్ సైన్సెస్ (టీడబ్ల్యూఏఎస్) ప్రవేశపెడుతున్నాయి. మొట్టమొదటి అవార్డును ఈ సమావేశం సందర్భంగా ప్రధాని అందజేయనున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల వ్యక్తులకు ఇచ్చే అంతర్జాతీయ స్థాయి పురస్కారమిది. ఈ అవార్డుతో ..ఆహార భద్రతను మెరుగుపరచడంతో పాటు సమాజంలో అణచివేతకు లోనైన, అంతగా ఆదరణకు నోచుకోని వర్గాలకు వాతావరణం పరంగా న్యాయాన్ని, సమానతను అందించడానికి, శాంతిని పెంపొందించడానికి.. విజ్ఞానశాస్త్ర పరిశోధనలు చేస్తూ, విధానాలను రూపొందిస్తూ, క్షేత్రస్థాయిలో భాగస్వామ్యాలను ఏర్పరుస్తూ, స్థానికంగా సామర్థ్యాలను పెంచుతూ గొప్పగా తోడ్పడుతున్నవారిని.. గౌరవించనున్నారు.
***
(Release ID: 2153003)
Read this release in:
Assamese
,
Bengali
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam