సహకార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ సహకార విధానం - 2025 ను ఆవిష్కరించిన కేంద్ర హోమ్, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘సహకార్ సే సమృద్ధి’ దార్శనికతను సాకారం చేసే దిశగా
జాతీయ సహకార విధానం ఒక చరిత్రాత్మక అడుగు.
దూరదృష్టితో కూడిన జాతీయ సహకార విధానం ఆచరణాత్మకం, ఫలితాల ఆధారితం
ప్రతి తాలూకాలో ఐదు ఆదర్శ సహకార గ్రామాలను అభివృద్ధి చేయడం
జాతీయ సహకార విధానం ముఖ్య లక్ష్యాలలో ఒకటి.
గ్రామాలు, వ్యవసాయం, గ్రామీణ మహిళలు, దళితులు, గిరిజనులపైనే సహకార విధానం ప్రధాన దృష్టి
జాతీయ సహకార విధానం ద్వారా పర్యాటకం, ట్యాక్సీ సేవలు, బీమా, హరిత ఇంధనం వంటి రంగాల్లో కూడా సహకార సంఘాల ఏర్పాటు
2034 నాటికి జిడిపికి సహకార రంగం వాటాను మూడింతలు చేయడం, 50 కోట్ల క్రియాశీల సభ్యులను సహకార రంగంలోకి తీసుకురావడం, యువతను ఉపాధి అవకాశాలతో అనుసంధానించడం లక్ష్యంగా
పెట్టుకున్న జాతీయ సహకార విధానం
సహకార సంఘాల సంఖ్యను 30 శాతం పెంచడం, ప్రతి గ్రామంలో కనీసం ఒక సహకార సంఘాన్ని ఏర్పాటు చేయడం కూడా నూతన సహకార విధానం ముఖ్య లక్ష్యాలు.
“ఒకప్పుడు కొందరు సహకార రంగానికి భవిష్యత్తు లేదనే వారు- కానీ నేను ఈరోజు చెబుతున్నాను-
భవిష్యత్తు సహకార రంగానిదే”

Posted On: 24 JUL 2025 8:45PM by PIB Hyderabad

జాతీయ సహకార విధానం - 2025 ను కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సహకారశాఖ సహాయ మంత్రులు శ్రీ క్రిషన్ పాల్ గుర్జార్, శ్రీ మురళీధర్ మొహోల్, సహకార శాఖ కార్యదర్శి డాక్టర్ ఆశిష్ కుమార్ భూటానీ, మాజీ కేంద్ర మంత్రి, నూతన సహకార విధానం ముసాయిదా కమిటీ చైర్మన్ శ్రీ సురేష్ ప్రభు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

జాతీయ సహకార విధానం - 2025 ఆవిష్కరణ కార్యక్రమంలో కేంద్ర సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ప్రసంగిస్తూ... శ్రీ సురేష్ ప్రభు నేతృత్వంలో 40 మంది సభ్యుల కమిటీ వివిధ భాగస్వాములతో చర్చించిన అనంతరం దేశ సహకార రంగానికి సమగ్ర, దార్శనిక సహకార విధానాన్ని సమర్పించిందని అన్నారు. సహకార రంగానికి మెరుగైన భవిష్యత్తు కోసం, 40 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేశామని, ఇది ప్రాంతీయ వర్క్ షాప్ లను నిర్వహించిందని, సహకార రంగానికి చెందిన నాయకులు, నిపుణులు, విద్యావేత్తలు, మంత్రిత్వ శాఖలు, ఇతర భాగస్వాములందరితో విస్తృత చర్చలు జరిపి విధానాన్ని రూపొందించినట్లు శ్రీ అమిత్ షా తెలిపారు. ఈ కమిటీకి 750 సూచనలు అందాయని, 17 సమావేశాలు నిర్వహించి, ఆర్బీఐ, నాబార్డుతో సంప్రదింపుల అనంతరం విధానాన్ని ఖరారు చేసిందన్నారు.

2002లో తొలిసారిగా భారత ప్రభుత్వం సహకార విధానాన్ని ప్రవేశపెట్టిందని, ఆ సమయంలో కూడా దివంగత అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధానిగా తమ పార్టీయే అధికారంలో ఉందని శ్రీ అమిత్ షా గుర్తు చేశారు. ఇప్పుడు 2025 లో, భారత ప్రభుత్వం రెండో సహకార విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు, శ్రీ నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా మళ్ళీ తమ పార్టీయే అధికారంలో ఉందని అన్నారు. దేశానికి, దేశాభివృద్ధికి అవసరమైన వాటిని సాధించడానికి దూరదృష్టి, పాలనా దృక్పథంతో కూడిన అవగాహన ఉన్న పార్టీ మాత్రమే సహకార రంగానికి ప్రాధాన్యం ఇవ్వగలదని శ్రీ అమిత్ షా అన్నారు

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆశిస్తున్న సహకారం ద్వారా సమృద్ధి (సహకార్ సే సమృద్ధి) ని సాధించే దిశగా కొత్త సహకార విధానం ఒక చరిత్రాత్మక అడుగు అని శ్రీ అమిత్ షా అన్నారు. 2027 నాటికి భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని మోదీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. దీనితో పాటు, తన 1.4 బిలియన్ పౌరుల సమ్మిళిత అభివృద్ధి బాధ్యతను కూడా ప్రభుత్వం కలిగి ఉందని, అందరికీ సమష్టి అభివృద్ధి, ప్రతి ఒక్కరికీ సమానమైన వృద్ధి, ప్రతి ఒక్కరి సహకారంతో జాతీయ పురోగతి ఉండే నమూనాను రూపొందించడమే భారత్ ప్రధాన ఉద్దేశమని ఆయన అన్నారు.

స్వాతంత్ర్యం వచ్చిన దాదాపు 75 సంవత్సరాల తరువాత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సహకార రంగానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారని శ్రీ అమిత్ షా అన్నారు. దీని ఏర్పాటు నాటికి సహకార రంగం శిథిలావస్థలో ఉందని, ప్రధాని మోదీ సంకల్పమైన 'సహకర్ సే సమృద్ధి'ని నెరవేర్చడానికి ఏర్పాటు అయిన సహకార మంత్రిత్వ శాఖ దేశంలోని అతి చిన్న సహకార సంఘాల సభ్యులలో కూడా నేడు గర్వం, ఆత్మవిశ్వాసం నింపిందని, ఇది మంత్రిత్వ శాఖ సాధించిన గొప్ప విజయమన్నారు. గత నాలుగేళ్లలో సహకార రంగం అన్ని విధాలా కార్పొరేట్ రంగానికి దీటుగా నిలిచిందన్నారు. 2020కి ముందు కొందరు సహకార రంగం నిర్వీర్యమైందని ప్రకటించారని, కానీ ఇప్పుడు దాని ప్రాముఖ్యతను, భవిష్యత్తును కూడా వారు గుర్తించారని ఆయన అన్నారు.

భారతదేశం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందడం చాలా ముఖ్యమని, అలాగే దాని 1.4 బిలియన్ల ప్రజల అభివృద్ధి పట్ల కూడా సమానమైన శ్రద్ధ అవసరమని శ్రీ అమిత్ షా అన్నారు. మొత్తం 140 కోట్ల మంది ప్రజల సహకారంతో దేశ ఆర్థిక వ్యవస్థను సమగ్రంగా అభివృద్ధి చేయగల సామర్థ్యం సహకార రంగానికి మాత్రమే ఉందని ఆయన స్పష్టం చేశారు. అనేక మంది వ్యక్తుల నుంచి చిన్న మొత్తంలో మూలధనాన్ని సమీకరించి పెద్ద ఎత్తున సంస్థలను సృష్టించే ప్రత్యేక సామర్థ్యం సహకార రంగానికి ఉందన్నారు. సహకార విధానాన్ని రూపొందించేటప్పుడు, భారతదేశంలోని 140 కోట్ల మంది ప్రజల అభివృద్ధిపై ముఖ్యంగా గ్రామాలు, వ్యవసాయం, గ్రామీణ మహిళలు, దళితులు, గిరిజనుల అభివృద్ధిపై దాని ప్రధాన దృష్టి ఉండేలా శ్రద్ధ తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. 'సహకర్ సే సమృద్ధి' ద్వారా 2047 నాటికి వికసిత భారత్ ను సాధించడం నూతన సహకార విధానం దార్శనికత అని ఆయన అన్నారు. ప్రతి గ్రామంలో కనీసం ఒక సహకార సంస్థను ఏర్పాటు చేయడమే గాకుండా, అవి వృత్తి పరంగా, పారదర్శకంగా, సాంకేతిక ఆధారితంగా బాధ్యతాయుతంగా, ఆర్థికంగా స్వావలంబనతో, విజయవంతంగా పనిచేసేలా ప్రోత్సహించడం నూతన విధానం లక్ష్యమని ఆయన వివరించారు.

సహకార రంగానికి నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి పునాదిని బలోపేతం చేయడం, చైతన్యాన్ని పెంపొందించడం, భవిష్యత్తు కోసం సహకార సంఘాలను సిద్ధం చేయడం, సమ్మిళితాన్ని పెంచడం పరిధిని విస్తరించడం, కొత్త రంగాలకు విస్తరించడం సహకార అభివృద్ధికి యువ తరాన్ని సిద్ధం చేయడం అనే ఆరు మూల సూత్రాలను నిర్వచించినట్లు అమిత్ షా తెలిపారు.

పర్యాటకం, ట్యాక్సీ సేవలు, బీమా, హరిత ఇంధనం వంటి రంగాలకు సంబంధించి సహకార మంత్రిత్వ శాఖ సమగ్ర ప్రణాళికను రూపొందించిందని సహకార శాఖ మంత్రి తెలిపారు. అతి తక్కువ సమయంలోనే ట్యాక్సీ, ఇన్సూరెన్స్ రంగాల్లో కూడా సహకార వ్యవస్థ గొప్పగా ప్రారంభమవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందుతున్న ఈ రంగాలలో సహకార యూనిట్ల భాగస్వామ్యం అంటే ఇప్పటికే విజయవంతమైన సహకార సంస్థలు కలసి కొత్త సహకార యూనిట్లు ఏర్పాటుచేయడం, ఆ యూనిట్లు ఈ కొత్త రంగాల్లో తమ కార్యకలాపాలు ప్రారంభిస్తాయని ఆయన వివరించారు. ఈ యూనిట్ల ద్వారా లభించే లాభాలు అంతిమంగా గ్రామీణ స్థాయిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సభ్యులకు చేరతాయని చెప్పారు. భవిష్యత్ తరాల కోసం భారతదేశ అభివృద్ధికి సహకార రంగం ఓ శక్తిమంతమైన సాధనంగా నిలుస్తుందన్న విశ్వాసాన్ని బలంగా పెంపొందించడమే లక్ష్యమని, అలాగే ఒక భారీ, బలమైన సహకార వ్యవస్థను నిర్మించడం ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతి రంగంలోనూ సహకార సంస్థలకు నిరంతర మద్దతు ఇవ్వడానికి పూర్తిగా సిద్ధంగా ఉందని శ్రీ అమిత్ షా అన్నారు. అయితే, ఈ సంస్థలు అంతర్గతంగా తమను తాము బలపడించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసం 83 అంశాలను గుర్తించామని, అందులో 58 అంశాలపై పని పూర్తయిందని, 3 అంశాలు పూర్తిగా అమలయ్యాయని, ఇంకా 2 పాయింట్లు నిరంతరం అమలు జరగాల్సి ఉందని తెలిపారు. మిగిలిన అంశాలపై ఇప్పుడు చర్యలు చేపడతామని ఆయన చెప్పారు. అన్ని రాష్ట్రాలు ఈ విధానాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తే, అది సమగ్రత కలిగిన, స్వావలంబనతో కూడిన, భవిష్యత్‌కు సిద్ధమైన ఒక ఆదర్శ నమూనాను సృష్టిస్తుందనీ, దేశంలోని సహకార వ్యవస్థకు కొత్త రూపాన్ని అందిస్తుందనీ ఆయన అన్నారు.

2034 నాటికి దేశ జీడీపీలో సహకార రంగం వాటాను మూడింతలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర సహకార శాఖ మంత్రి తెలిపారు. ఇది ఒక ముఖ్యమైన లక్ష్యమని అంగీకరించిన ఆయన, దానిని సాధించడానికి తగిన ఏర్పాట్లు చేశామని తెలిపారు. సహకార రంగంలో సభ్యత్వం లేని లేదా క్రియారహితంగా ఉన్న 50 కోట్ల మంది పౌరులను క్రియాశీలక భాగస్వామ్యంలోకి తీసుకురావడమే ప్రధాన లక్ష్యమని, సహకార సంఘాల సంఖ్యను కూడా 30 శాతం పెంచనున్నామని తెలిపారు. ప్రస్తుతం 8.3 లక్షల సొసైటీలు ఉన్నాయని, ఈ సంఖ్యను 30 శాతం పెంచుతామన్నారు.

ప్రతి పంచాయతీలో కనీసం ఒక ప్రాథమిక సహకార యూనిట్ ఉంటుందని, ఇది ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (పిఏసీఎస్), ప్రాథమిక పాడి సహకార, ప్రాథమిక మత్స్య సహకార, ప్రాథమిక బహుళార్థసాధక పిఏసీఎస్ లేదా మరేదైనా ఇతర ప్రాథమిక సహకార సంఘమైనా కావచ్చునని ఆయన పేర్కొన్నారు. యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఈ యూనిట్లు దోహదపడతాయన్నారు. పారదర్శకత, ఆర్థిక స్థిరత్వం, సంస్థాగత విశ్వాసాన్ని పెంపొందించడానికి ప్రతి యూనిట్ కు సాధికారత కల్పించాలని ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసం క్లస్టర్, మానిటరింగ్ వ్యవస్థను కూడా అభివృద్ధి చేయనున్నారు.

ఆదర్శ సహకార గ్రామం (మోడల్ కోఆపరేటివ్ విలేజ్) కార్యక్రమాన్ని మొదట గాంధీనగర్ లో ప్రారంభించామని, ఇది నాబార్డు చొరవ అని శ్రీ అమిత్ షా తెలిపారు. రాష్ట్ర సహకార బ్యాంకుల ద్వారా ప్రతి మండలంలో ఐదు మోడల్ కోఆపరేటివ్ గ్రామాలను ఏర్పాటు చేసి శ్వేత విప్లవం 2.0 ద్వారా మహిళల భాగస్వామ్యాన్ని ఈ కార్యక్రమానికి అనుసంధానం చేస్తామని తెలిపారు. ఈ పథకాలన్నింటినీ క్షేత్రస్థాయిలో రెండు ప్రత్యేక కమిటీల ద్వారా అమలు చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ విధానాన్ని క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు సహకార మంత్రిత్వ శాఖ సర్వసన్నద్ధంగా ఉందని, గ్రామాల సామాజిక, ఆర్థిక వృద్ధిలో గణనీయమైన మార్పు తీసుకురావడం, వచ్చే రెండు దశాబ్దాల్లో అతిచిన్న సహకార యూనిట్లకు కూడా సాంకేతిక పరిజ్ఞానం చేరేలా చూడటం లక్ష్యంగా ఈ విధానంలో కీలక అంశాలు ఉన్నాయని ఆయన వివరించారు. వివిధ ప్రక్రియల కంప్యూటరీకరణ ద్వారా సహకార సంఘాల నిర్వహణ పద్ధతులను పూర్తిగా మార్చి పారదర్శకతను, సామర్థ్యాన్ని పెంచనున్నట్లు తెలిపారు. సహకార రంగంలో పోటీ, ఆర్థిక స్థిరత్వం, పారదర్శకత, సవాళ్లను తట్టుకునే శక్తిని పెంపొందించడానికి ఈ మార్పులను పర్యవేక్షణ యంత్రాంగం ద్వారా క్షేత్రస్థాయిలో అమలు చేయనున్నారు. అంతేకాకుండా, ఈ విధానాన్ని సముచితంగా, ప్రభావవంతంగా ఉంచడానికి ప్రతి 10 సంవత్సరాలకు అవసరమైన చట్ట సవరణలు చేయడానికి ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు.

ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతను సాధించడానికి దేశంలోని పేదలతో పాటు గ్రామీణ, వ్యవసాయ రంగాలను భారత ఆర్థిక వ్యవస్థలో నమ్మదగిన అంతర్భాగంగా మార్చడమే ఈ సహకార విధానం లక్ష్యమని శ్రీ అమిత్ షా అన్నారు. ప్రతి రాష్ట్రానికి సమతుల్య సహకార అభివృద్ధి కోసం దిశా ప్రణాళికను రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సహకార విధానం దార్శనికమైనది, ఆచరణాత్మకమైనది, ఫలితాల ఆధారితమైనదని ఆయన స్పష్టం చేశారు. ఈ విధానం ఆధారంగా భారతదేశ సహకార ఉద్యమం భారత స్వాతంత్ర్య శతాబ్ది సంవత్సరం 2047 నాటికి స్థిరంగా ముందుకు సాగుతుందని శ్రీ షా అన్నారు. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి మాత్రమే కాకుండా ఉపాధి కల్పన, వ్యక్తిగత ఆత్మగౌరవాన్ని పెంపొందించడం 'సహకార్ సే సమృద్ధి' లక్ష్యమని ఆయన చెప్పారు. ఈ విధానానికి పునాదిగా సభ్యుల కేంద్రీకృత నమూనాను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సహకార రంగం మూల ఉద్దేశ్యం సభ్యుని సంక్షేమమే కావాలని, అదే సిద్ధాంతంతో ఈ విధానాన్ని రూపొందించామని ఆయన స్పష్టం చేశారు. దేశ ఆర్థికాభివృద్ధిలో మహిళలు, యువత, గిరిజనులు, దళితుల భాగస్వామ్యాన్ని పెంపొందించే అవకాశాలను సృష్టించడంపై కూడా ఈ విధానం దృష్టి సారించింది.

మంచి పనితీరు కనబరిచే షెడ్యూల్డ్ కోఆపరేటివ్ బ్యాంకులను వాణిజ్య బ్యాంకులతో సమానంగా పరిగణించేలా చర్యలు తీసుకుంటామని, అవి ఎక్కడా ద్వితీయ శ్రేణి పరిస్థితిని ఎదుర్కోకుండా చూస్తామని శ్రీ అమిత్ షా చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లకు చేరువయ్యేందుకు నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్ పోర్ట్స్ లిమిటెడ్ ను ఏర్పాటు చేసినట్లు కూడా ఆయన పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో పారదర్శక నిర్వహణ ఆధారంగా పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు) నమూనాను ఇప్పటికే అభివృద్ధి చేశామని, రాబోయే రోజుల్లో అన్ని రకాల సహకార సంఘాలు టెక్నాలజీ ఆధారిత పారదర్శక నిర్వహణ వ్యవస్థలను అనుసరిస్తాయని ఆయన వివరించారు. పర్యావరణ సుస్థిరత, సహకార సంఘాల మధ్య సహకారం అనే సూత్రం ద్వారా పురోగతి సాధిస్తామని చెప్పారు.

దేశంలో సహకార రంగాన్ని నిర్మించాలని మోదీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, యువత ఉత్తమ విద్యను అభ్యసించిన తర్వాత సహకార సంస్థలను వృత్తిగా ఎంచుకుంటారని కేంద్ర సహకార శాఖ మంత్రి తెలిపారు. సహకార రంగంలోని అన్ని సమస్యలను పరిష్కరించడానికి, వచ్చే 25 ఏళ్లలో దాని అభివృద్ధిని నిర్ధారించడానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు దోహదపడే అన్ని రంగాలతో సమానంగా ఉంచడానికి కొత్త సహకార విధానానికి సామర్ధ్యం ఉందని ఆయన అన్నారు. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి అన్ని రాష్ట్రాలు మోడల్ బైలాస్ ను అవలంబించాయని శ్రీ షా చెప్పారు.

దేశంలో ఉత్తమ విద్యనభ్యసించిన యువత సహకార రంగాన్ని ఒక ఉపాధి మార్గంగా ఎంచుకునే విధంగా సహకార రంగాన్ని అభివృద్ధి చేయడం మోదీ ప్రభుత్వ లక్ష్యమని అని శ్రీ అమిత్ షా తెలిపారు. ఈ కొత్త సహకార విధానం సహకార రంగంలో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించగల శక్తిని కలిగి ఉందని, వచ్చే 25 ఏళ్లలో స్థిరమైన అభివృద్ధిని సాధించడమే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థకు దోహదపడే ఇతర రంగాల సరసన దీనిని నిలబెట్టగలదని శ్రీ అమిత్ షా తెలిపారు. అన్ని రాష్ట్రాలు రాజకీయ భేదాభిప్రాయాలను పక్కనపెట్టి ఈ నమూనా బైలాస్‌ను స్వీకరించాయని ఆయన పేర్కొన్నారు. 45 వేల కొత్త ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్) ఏర్పాటు పనులు దాదాపు పూర్తయ్యాయని, పీఏసీఎస్ ల కంప్యూటరీకరణ కూడా పూర్తయిందని, పీఏసీఎస్ లకు కేటాయించిన 25 కొత్త కార్యకలాపాల్లో పురోగతి సాధించామని ఆయన తెలిపారు. పీఎం జన ఔషధి కేంద్రాలను ప్రారంభించేందుకు ఇప్పటివరకు 4,108 పీఏసీఎస్ లు, పెట్రోల్, డీజిల్ రిటైల్ అవుట్ లెట్లను నడపడానికి 393 పీఏసీఎస్ లు, ఎల్పీజీ పంపిణీ కోసం 100కు పైగా పీఏసీఎస్ లు దరఖాస్తు చేసుకున్నాయని, హర్ ఘర్ నల్ సే జల్ (ప్రతి ఇంటికీ కుళాయి నీరు) పథకం, పీఎం సూర్య ఘర్ యోజన నిర్వహణపై పీఏసీఎస్ లు కృషి చేస్తున్నాయని తెలిపారు.

ఈ కార్యకలాపాలన్నింటికీ శిక్షణ పొందిన మానవ వనరులను అందించడానికి త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయానికి ఇప్పటికే పునాది వేశామని శ్రీ షా చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి ప్రభుత్వం 'సహకార్ ట్యాక్సీ' కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తుందని, దీని కింద మొత్తం లాభం నేరుగా డ్రైవర్ కు వెళ్తుందని ఆయన చెప్పారు. అంతర్జాతీయ సహకార సంవత్సరానికి భారతదేశం తన సొంత లక్ష్యాలను నిర్దేశించుకుందని, వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి కృషి చేస్తోందని ఆయన తెలిపారు.

ప్రభుత్వం తన సహకార నమూనాను క్రమంగా బలోపేతం చేస్తోందని, సేంద్రియ ఉత్పత్తుల ఎగుమతులు, విత్తనోత్పత్తి, బ్రాండింగ్, మార్కెటింగ్ కోసం మూడు బహుళ రాష్ట్ర సహకార సంఘాలను ఏర్పాటు చేసినట్లు శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో శ్వేత విప్లవం 2.0 గ్రామీణాభివృద్ధికి ప్రధాన ఆధారంగా మారుతుందని, ఇందులో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఆయన ఉద్ఘాటించారు.

సమాజంలోని ప్రతి వర్గానికి సాధికారత కల్పించడం, దూరదృష్టితో సమ్మిళిత అభివృద్ధిని సాధించే లక్ష్యంతో ప్రధాని మోదీ ఎంతో ముందుచూపుతో సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారని, ఈ నూతన సహకార విధానం రాబోయే 25 సంవత్సరాల పాటు సహకార రంగాన్ని సమున్నతంగా ఉంచుతుందని, దీనిని అభివృద్ధికి దోహదపడే భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న రంగంగా మారుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

 

****

 


(Release ID: 2148724)