సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ముంబయిలో 56వ ‘ఐఎఫ్‌ఎఫ్‌ఐ’ సారథ్య సంఘం తొలి సమావేశం

Posted On: 18 JUL 2025 4:51PM by PIB Hyderabad

 గోవాలో నిర్వహించనున్న భారత 56వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం-2025 సన్నాహాలపై చర్చించేందుకు సారథ్య సంఘం ఈ రోజు తొలిసారి సమావేశమైంది. ముంబయి నగరంలోని జాతీయ చలనచిత్ర పరిశ్రమాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎఫ్‌డీసీ) ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి కేంద్ర సమాచార-ప్రసార శాఖ మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్ అధ్యక్షత వహించారు. మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు, చిత్రోత్సవాల డైరెక్టర్ శ్రీ శేఖర్ కపూర్, ‘ఎన్‌ఎఫ్‌డీసీ’ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రకాష్ మగ్దూమ్ సహా గోవా ప్రభుత్వ సమాచార- ప్రసార మంత్రిత్వశాఖ, ‘ఎన్‌ఎఫ్‌డీసీ’ నుంచి సీనియర్ అధికారులతోపాటు సారథ్య సంఘంలో సభ్యులైన దేశవిదేశీ చలనచిత్ర పరిశ్రమల ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ‘ఐఎఫ్‌ఎఫ్‌ఐ-2025’ నిర్వహణ దిశగా వ్యూహాత్మక ప్రణాళిక రూపకల్పనపై వారు దృష్టి సారించారు. ఇందులో భాగంగా కార్యక్రమాల ఖరారు (ప్రోగ్రామింగ్), ప్రచారం (ఔట్రీచ్), ప్రతిభావంతులకు ఆహ్వానం, వేడుకల సార్వజనీనత, గ్లోబల్ పొజిషనింగ్, ప్రజా భాగస్వామ్యం పెంపు వగైరాలు లక్ష్యంగా వినూత్న కార్యకలాపాలపై సమగ్రంగా చర్చించారు. భారత 56వ అంతర్జాతీయ చలనిచత్రోత్సవం-2025ను ఈ ఏడాది నవంబరు 20 నుంచి 28 వరకూ గోవాలో నిర్వహించనున్నారు. ఇందులో యువతరంపై లోతుగా దృష్టి సారిస్తూ, ఎంపిక చేసిన అంశాల్లో మాస్టర్‌ క్లాసులు, పరిశ్రమ వర్క్‌ షాప్‌లు, నెట్‌వర్కింగ్ వేదికల ద్వారా విద్యార్థి చిత్రనిర్మాతలు, యువ కంటెంట్ సృష్టికర్తలకు కొత్త బాటలు పరచాలని కమిటీ నిర్ణయించింది. ఈ వేదికలు కొత్త గళాలను అంతర్జాతీయ ప్రోత్సాహకులతో అనుసంధానిస్తాయి.

‘ఐఎఫ్ఎఫ్ఐ’తో సమాంతరంగా సరికొత్త ‘రీబ్రాండెడ్ వేవ్స్‌ ఫిల్మ్ బజార్’ కూడా ఏర్పాటవుతుంది.  దక్షిణాసియాలో అతిపెద్ద చలనచిత్ర మార్కెట్, భారత అంతర్జాతీయ చిత్ర ప్రచార కార్యక్రమంలో ఇదొక కీలక భాగం. కంటెంట్, సృజనాత్మకత, సహ-నిర్మాణం తదితరాలకు భారత్‌ను ప్రపంచ కూడలిగా మలచే విస్తృత వ్యూహంలో భాగంగా ఫిల్మ్ బజార్‌ను ఈసారి ‘వేవ్స్‌ ఫిల్మ్ బజార్‌’గా రీబ్రాండింగ్ చేయడంపై సారథ్య సంఘం చర్చించి ఆమోదించింది.

ఈ ఉత్సవ నిర్వహణకు రూపమివ్వడంలో మరింత సమగ్ర, సృజనాత్మక ఆలోచనలను ఆహ్వానించే దిశగా సారథ్య సంఘం సభ్యుల సంఖ్యను గణనీయ స్థాయిలో 16 నుంచి 31కి పెంచారు. తద్వారా పరిశ్రమ ప్రాతినిధ్యం మరింత వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ కమిటీలో అనుపమ్ ఖేర్, గుణీత్ మోంగా కపూర్, సుహాసిని మణిరత్నం, ఖుష్బూ సుందర్, పంకజ్ పరాశర్, ప్రసూన్ జోషి వంటి ప్రముఖులున్నారు. అలాగే సినిమా, నిర్మాణం, మీడియా, సాంస్కృతిక రంగాల నుంచి అపార నైపుణ్యంగల వారు కూడా ఇందులో సభ్యులుగా ఉన్నారు.

సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ బలోపేతం, మీడియా-వినోద పరిశ్రమలో అంకుర సంస్థలకు మద్దతు, ఏకగవాక్ష సదుపాయం, ప్రోత్సాహక సంధాన విధానాలతో భారత్‌లో చిత్రీకరణకు ప్రపంచ స్థాయి నిర్మాణ సంస్థలను ప్రోత్సహించడమనే విస్తృత భారతీయ దృక్పథంతో ‘ఐఎఫ్‌ఎఫ్‌ఐ-2025’కు రూపకల్పన చేశారు. ఈ మేరకు ప్రతిష్ఠాత్మక ప్రోగ్రామింగ్, సమ్మిళిత విధానం, చలనచిత్ర నైపుణ్యంపై నిబద్ధత తదితరాలతో ఈ 56వ చలనచిత్రోత్సవం ఓ కీలక ఘట్టంగా నిలిచిపోనుంది. ఆ మేరకు అనుసంధానిత, సృజనాత్మక, సహకారాత్మక ప్రపంచంలో నానాటికీ వేగంగా పురోగమిస్తున్న చలనచిత్ర రంగ పరిణామానికి ఇది అద్దం పడుతుంది.

 

****


(Release ID: 2145968)