ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
పిల్లల ఆధార్ బయోమెట్రిక్ వివరాల పూర్తి సమాచారం ఇవ్వడం తప్పనిసరి తల్లిదండ్రులు, గార్డియన్లను కోరిన యూఐడీఏఐ... 5 నుంచి 7 సంవత్సరాల లోపు పిల్లలకు ఉచితం
పాఠశాల అడ్మిషన్లు, ప్రవేశ పరీక్షలు, ఉపకార వేతనాలు,
ప్రత్యక్ష నగదు బదిలీ వంటి ప్రయోజనాలు పొందటం సులభం
Posted On:
15 JUL 2025 5:16PM by PIB Hyderabad
ఏడేళ్ళు వచ్చినా బయోమెట్రిక్స్ సమాచారాన్ని పూర్తిగా ఇవ్వని పిల్లల విషయంలో ఈ ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) తెలియజేసింది. ప్రస్తుత ఆధార్ వ్యవస్థలో ఈ పని చేయడం తప్పనిసరి అనీ, సమీపంలోని ఆధార్ సేవా కేంద్రం లేదా నియమిత కేంద్రాల్లో పూర్వపు సమాచారాన్ని పూర్తిగా నవీకరించాలని సూచించింది.
అయిదు నుంచి ఏడేళ్ళ లోపు బాలల ఆధార్ బయోమెట్రిక్స్ నవీకరణ ఉచితం
అయిదేళ్ళ లోపు చిన్నారుల ఫోటో, పేరు, పుట్టినతేదీ, చిరునామా వంటి వివరాలు... అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించినప్పుడు వారి పేరుని ఆధార్ లో నమోదు చేసుకుంటారు. అయితే చిన్నారుల వయసు రీత్యా వేలిముద్రలు, కంటిపాప (ఐరిస్) బయోమెట్రిక్స్ ను సేకరించరు.
ప్రస్తుతం ఉన్న నియమ నిబంధనల ప్రకారం పిల్లలకు అయిదేళ్ళు వచ్చేసరికి వారి వేలిముద్రలు, కంటిపాప బయోమెట్రిక్స్ ను విధిగా ఆధార్ లో నమోదు చేయవలసి ఉంటుంది. ఈ ప్రక్రియను తొలి ‘మాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్’ (ఎంయూబీ)గా వ్యవహరిస్తారు. అయిదు నుంచి ఏడేళ్ళ లోపు పిల్లల వివరాల నవీకరణ ఉచితం కాగా, ఏడేళ్ళ పైబడ్డ పిల్లల ఆధార్ వివరాల నవీకరణకు నామమాత్రపు రుసుం (రూ. 100) చెల్లించాల్సి ఉంటుంది.
చిన్నారుల బయోమెట్రిక్ వివరాలు కచ్చితత్వం, విశ్వసనీయత కలిగి ఉండాలంటే, ఎంబీయూను తక్షణమే పూర్తి చేయడం అవసరమని, పిల్లలకు ఏడేళ్ళు వచ్చిన తరువాత కూడా వివరాల నవీకరణ జరగకపోతే, ప్రస్తుత నిబంధనలను అనుసరించి, వారి ఆధార్ గుర్తింపు రద్దయ్యే అవకాశం ఉందని ఉడాయ్ స్పష్టం చేసింది.
నమోదు నుంచి అవకాశాలను అందించడం వరకు-ఆధార్ ద్వారా ప్రతి అడుగులో సాధికార కల్పన
నవీకరించిన బయోమెట్రిక్ తో కూడిన ఆధార్ వివరాలు జీవన సౌలభ్యాన్ని మెరుగుపరిచి, పాఠశాలల్లో అడ్మిషన్లు, ప్రవేశ పరీక్షలకు నమోదు, అర్హతను బట్టి ఉపకార వేతనాలు, ప్రత్యక్ష నగదు బదిలీ వంటి పథకాల ప్రయోజనాలు వంటి అనేక సౌలభ్యాలను అందిస్తుంది. పిల్లల ఆధార్ బయోమెట్రిక్ వివరాలను తక్షణమే నవీకరించాల్సిందిగా తల్లిదండ్రులను, గార్డియన్లను ఉడాయ్ కోరుతోంది. ఈ దిశగా తమ పిల్లల ఎంబీయూ ప్రక్రియను పూర్తి చేయవలసిందని ఉడాయ్ నమోదైన సంబంధిత మొబైల్ నంబర్లకు ఎస్సెమ్మెస్ లను పంపడం ప్రారంభించింది.
*****
(Release ID: 2145353)
Visitor Counter : 2
Read this release in:
Bengali-TR
,
English
,
Gujarati
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam