ప్రధాన మంత్రి కార్యాలయం
రోజ్‌గార్ మేళాను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
నేడు నియామక పత్రాలు అందుకున్న 51 వేలకు పైగా యువత
ఇటువంటి ఉద్యోగ మేళాల ద్వారా లక్షలాది మంది ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలను పొందారు
వీరంతా ఇప్పుడు జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారు
అతిపెద్ద జనాభా, ప్రజాస్వామ్యం భారత్ బలంగా ప్రపంచం గుర్తించింది
అతిపెద్ద యువ జనాభా, అతిపెద్ద ప్రజాస్వామ్యం భారత్ సొంతం
దేశంలో వృద్ధి చెందుతున్న అంకురసంస్థలు, ఆవిష్కరణలు, పరిశోధన రంగాలు
దేశ యువత సామర్థ్యాలను మెరుగుపరుస్తున్నాయి
ప్రైవేట్ రంగంలోనూ కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది
ఇటీవలే ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకానికీ ఆమోదం
నేడు భారత్ ప్రధాన బలంగా మారిన తయారీరంగం
తయారీరంగంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తున్నాం
తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికే ఈ సంవత్సరం బడ్జెట్‌లో మిషన్ మాన్యుఫాక్చరింగ్ ప్రకటించాం
గత దశాబ్దంలో 90 కోట్లకు పైగా భారత పౌరులు సంక్షేమ పథకాల పరిధిలోకి వచ్చారని తెలిపిన అంతర్జాతీయ కార్మిక సంస్థ - ఐఎల్ఓ నివేదిక
ప్రపంచ బ్యాంకు వంటి ప్రధాన ప్రపంచస్థాయి సంస్థలు నేడు భారత్‌ను ప్రశంసిస్తున్నాయి
ప్రపంచంలోనే అత్యున్నత సమానత్వం
Posted On:
12 JUL 2025 1:11PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు రోజ్‌గార్ మేళాను ఉద్దేశించి ప్రసంగించారు. వివిధ ప్రభుత్వ విభాగాలు, సంస్థల్లో కొత్తగా ఉద్యోగాలు పొందిన 51,000 మందికి పైగా యువతకు వీడియో అనుసంధానం ద్వారా నియామక పత్రాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ, భారత ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఈ యువత కొత్త బాధ్యతలు ప్రారంభించనున్నదని తెలిపారు. వివిధ విభాగాల్లో తమ సేవలను ప్రారంభిస్తున్న యువకులను ఆయన అభినందించారు. ఉద్యోగ నిర్వహణలో ఎన్ని బాధ్యతలు ఉన్నప్పటికీ.. "పౌరులకు ప్రథమ ప్రాధాన్యం" అనే సూత్ర మార్గనిర్దేశంలో దేశానికి సేవ చేయడమే వారి సమష్టి లక్ష్యమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
భారత్ జనాభా, ప్రజాస్వామ్య పునాదుల అసమాన బలాన్ని ప్రధానమంత్రి ప్రధానంగా ప్రస్తావించారు. ప్రపంచంలోనే అతిపెద్ద యువ జనాభా, అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన భారత్.. దేశీయంగానే కాకుండా ప్రపంచ వేదికపైనా భవిష్యత్తును రూపొందించగల ప్రత్యేక సామర్థ్యం ఉన్నదని ఆయన స్పష్టం చేశారు. ఈ విస్తారమైన యువశక్తి దేశానికి గొప్ప మూలధనంగా ఉందన్న ప్రధానమంత్రి.. ఈ మూలధనాన్ని దీర్ఘకాలిక శ్రేయస్సుకు ఉత్ప్రేరకంగా మార్చేందుకు ప్రభుత్వం ధృడమైన ప్రయత్నాలు కొనసాగిస్తోందన్నారు.
"రెండు రోజుల క్రితమే, నేను అయిదు దేశాల పర్యటన నుంచి తిరిగి వచ్చాను. నేను సందర్శించిన ప్రతి దేశంలోనూ భారత యువ శక్తి కళ్లకు కడుతోంది. ఈ పర్యటన సందర్భంగా సంతకం చేసిన ఒప్పందాలు దేశవిదేశాల్లో భారత యువతకు ప్రయోజనం చేకూరుస్తాయి" అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. రక్షణ, ఔషధాలు, డిజిటల్ టెక్నాలజీ, ఇంధనం, అరుదైన భూ సంబంధిత ఖనిజాల వంటి కీలక రంగాల్లో ఈ పర్యటన సందర్భంగా సంతకం చేసిన వివిధ ఒప్పందాలు దీర్ఘాకాలిక ప్రయోజనాలను అందిస్తాయన్నారు. "ఈ కార్యక్రమాలు భారత గ్లోబల్ ఆర్థికస్థితిని బలోపేతం చేయడమే కాకుండా తయారీ, సేవల రంగాల్లో భారతీయ యువతకు అర్థవంతమైన అవకాశాలను కూడా కల్పిస్తాయి" అని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
అభివృద్ధి చెందుతున్న ఉపాధి రంగాన్ని ప్రస్తావిస్తూ.. 21వ శతాబ్దంలో ఉద్యోగాల స్వభావం వేగంగా పరివర్తన చెందుతోందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఆవిష్కరణలు, అంకురసంస్థలు, పరిశోధనల ప్రాముఖ్యాన్ని వివరిస్తూ.. దేశంలో ఆయా రంగాలు అద్భుత పురోగతిని సాధిస్తూ యువత పెద్ద కలలు కనేందుకు శక్తినిస్తున్నాయని పేర్కొన్నారు. ఆశయం, దార్శనికత, కొత్త వాటిని సృష్టించాలనే బలమైన కోరికతో యువత ముందుకు సాగడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మన యువత పట్ల తనకు అపారమైన విశ్వాసం, ప్రేమ ఉన్నాయన్నారు.
భారత ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడంపై ప్రధానంగా దృష్టి సారిస్తోందని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇటీవలే ప్రభుత్వం ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని ఆమోదించింది. ఈ పథకం కింద, ప్రైవేటు రంగంలో తొలిసారిగా ఉద్యోగం పొందిన యువకులకు ప్రభుత్వం రూ. 15,000 అందిస్తుంది. “మరో విధంగా చెప్పాలంటే, ప్రభుత్వం వారి తొలి ఉద్యోగంలో మొదటి జీతానికి సహకారం అందిస్తోంది. దీని కోసం, ప్రభుత్వం సుమారు రూ. 1 లక్ష కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. ఈ పథకం దాదాపు 3.5 కోట్ల కొత్త ఉద్యోగాల సృష్టికి సహాయపడుతుందని భావిస్తున్నాం” అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.
దేశాభివృద్ధిని కొనసాగించడం, ఉపాధి కల్పన, ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించే దిశగా ప్రయత్నాలను వేగవంతం చేయడంలో భారత తయారీ రంగ పరివర్తన శక్తిని ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇటీవలి సంవత్సరాల్లో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం గణనీయంగా బలోపేతమైందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. పీఎల్ఐ (ఉత్పత్తి ఆధారిత పథకం) పథకం ద్వారా దేశవ్యాప్తంగా 11 లక్షలకు పైగా ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లోనూ అపూర్వమైన విస్తరణ సాధ్యమైందని తెలిపారు. “నేడు, దేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ విలువ దాదాపు రూ. 11 లక్షల కోట్లు. ఇది 11 సంవత్సరాల కిందట కంటే అయిదు రెట్లు ఎక్కువ. గతంలో మన దేశంలో మొబైల్ ఫోన్లను తయారు చేసే యూనిట్లు 2 నుంచి 4 వరకు మాత్రమే ఉండేవి. నేడు దేశంలో లక్షలాది యువతకు ఉపాధి కల్పిస్తున్న మొబైల్ ఫోన్ తయారీ యూనిట్ల సంఖ్య సుమారుగా మూడు వందలకు చేరింది” అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.
రక్షణ తయారీలో భారత్ ప్రపంచంలో అగ్రగామిగా ఎదుగుతూ రూ. 1.25 లక్షల కోట్లకు పైగా ఉత్పత్తిని సాధించిందని ప్రధానమంత్రి తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద రైలింజను తయారీ కేంద్రంగా భారత్ ఆవిర్భవించిందన్నారు. రైలింజన్లు, రైలు కోచ్ లు, మెట్రో కోచ్‌ల ఎగుమతిలో భారత్ పురోగతిని ఆయన ప్రశంసించారు. ఆటోమొబైల్ రంగం కేవలం అయిదు సంవత్సరాల్లోనే సుమారు రూ. 4 లక్షల కోట్లకు పైగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించిందనీ, ఫలితంగా కొత్త కర్మాగారాలు, కొత్త ఉద్యోగావకాశాలు, రికార్డు స్థాయిలో వాహన అమ్మకాలు జరిగాయన్నారు.
ఇటీవలి అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) నివేదికను ఉటంకిస్తూ.. గత దశాబ్దంలో 90 కోట్లకు పైగా భారతీయ పౌరులు ప్రభుత్వ సంక్షేమ పథకాల పరిధిలోకి వచ్చారని ఆ నివేదిక స్పష్టం చేసిందన్నారు. భారత సంక్షేమ కార్యక్రమాల దీర్ఘకాలిక ప్రభావాన్ని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ పథకాలు సంక్షేమ ప్రయోజనాలకే పరిమితం కాకుండా, ముఖ్యంగా గ్రామీణ భారతంలో పెద్ద ఎత్తున ఉపాధిని సృష్టించడంలోనూ కీలక పాత్ర పోషించాయని ఆయన పేర్కొన్నారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన వంటి ప్రధాన కార్యక్రమాలను ప్రధానమంత్రి వివరించారు. ఈ కార్యక్రమాల కింద 4 కోట్ల శాశ్వత గృహాల నిర్మాణం పూర్తవగా, మరో 3 కోట్ల గృహాలు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. స్వచ్ఛ భారత్ కింద చేపట్టిన 12 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణ పనులు... ప్లంబర్లు, నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించగా, ఉజ్వల యోజన కింద 10 కోట్లకు పైగా ఎల్‌పిజి కనెక్షన్లు బాటిలింగ్ మౌలిక సదుపాయాలు, డెలివరీ నెట్‌వర్క్‌ల విస్తరణకు దారితీశాయన్నారు. ఫలితంగా వేలాది పంపిణీ కేంద్రాలు, లక్షలాది కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
"రూఫ్‌టాప్ సోలార్ అమర్చుకోవడం కోసం ప్రతి ఇంటికి రూ. 75,000ల కన్నా ఎక్కువ మొత్తం అందించే ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా గృహాల విద్యుత్ బిల్లులను తగ్గించడం సాధ్యమైంది. దీంతో పాటు సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లు, సోలార్ ప్యానెల్ తయారీదారులకు ఉపాధి అవకాశాలు పెరిగాయి. నమో డ్రోన్ దీదీ కార్యక్రమం గ్రామీణ మహిళలకు డ్రోన్ పైలట్‌లుగా శిక్షణనిచ్చి సాధికారత కల్పించింది" అని ప్రధానమంత్రి తెలిపారు.
3 కోట్ల మంది మహిళలను లక్‌పతి దీదీలుగా మార్చే లక్ష్యంతో దేశం ముందుకు సాగుతోందనీ, ఇప్పటికే 1.5 కోట్ల మంది మహిళలు లక్‌పతి దీదీలుగా సాధికారత సాధించారని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. బ్యాంక్ సఖి, బీమా సఖి, కృషి సఖి, పశు సఖి వంటి వివిధ పథకాలు మహిళలు సుస్థిర ఉపాధిని పొందేందుకు వీలు కల్పించాయన్నారు. పీఎమ్ స్వనిధి పథకం వీధి వ్యాపారులు, హాకర్ల కోసం అధికారిక సహాయాన్ని అందించి, లక్షలాది మందిని ప్రధాన ఆర్థిక కార్యకలాపాల్లోకి తీసుకువచ్చిందని ఆయన పేర్కొన్నారు. పీఎమ్ విశ్వకర్మ పథకం ద్వారా శిక్షణ, పనిముట్లు అందుకున్న సంప్రదాయిక హస్తకళాకారులు, చేతివృత్తులవారు, సర్వీస్ ప్రొవైడర్‌ల పునరుజ్జీవనం సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు.
ఇలాంటి అనేక పథకాల ప్రభావంతోనే గత పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. “ఉపాధి అవకాశాలు లేకుండా ఇటువంటి పరివర్తన సాధ్యం కాదు. అందుకే నేడు ప్రపంచ బ్యాంకు వంటి ప్రధాన ప్రపంచస్థాయి సంస్థలు భారత్‌ను ప్రశంసిస్తున్నాయి. భారత్ ఇప్పుడు ప్రపంచంలోని అత్యున్నత స్థాయి సమానత్వం కలిగిన అగ్ర దేశాల సరసన నిలిచింది” అని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
ప్రస్తుత దశను అభివృద్ధి మహాయజ్ఞంగా, పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పనకు అంకితమైన జాతీయ లక్ష్యంగా ప్రధానమంత్రి అభివర్ణించారు. దేశ యువత, కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారు ఈ లక్ష్యాన్ని నూతన శక్తితో, అంకితభావంతో ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
ప్రతి పౌరుడిని దైవంగా భావించాలని భోదించే "నాగరిక్ దేవో భవ" మార్గదర్శక తత్వాన్ని ప్రధానమంత్రి గుర్తుచేశారు. కొత్తగా నియమితులైన వారికి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపిన శ్రీ నరేంద్ర మోదీ వారికి ప్రజా సేవలో ఉజ్వలమైన, అర్థవంతమైన భవిష్యత్తు లభించాలని ఆకాంక్షిస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.
నేపథ్యం
ఉపాధి కల్పనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలనే ప్రధానమంత్రి నిబద్ధతకు అనుగుణంగా.. దేశవ్యాప్తంగా 47 ప్రదేశాల్లో 16వ రోజ్‌గార్ మేళా నిర్వహించారు. యువత సాధికారత కోసం, దేశ నిర్మాణంలో పాల్గొనడానికి వారికి అర్థవంతమైన అవకాశాలను కల్పించడం కోసం రోజ్‌గార్ మేళా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దేశవ్యాప్తంగా రోజ్‌గార్ మేళాల ద్వారా ఇప్పటివరకు 10 లక్షలకు పైగా నియామక పత్రాలు అందించారు.
దేశవ్యాప్తంగా ఎంపికైన కొత్త ఉద్యోగులు.... రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, తపాలా శాఖ, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖలతో పాటు ఇతర విభాగాలు, మంత్రిత్వ శాఖల్లో చేరనున్నారు.
***
MJPS/VJ
(Release ID: 2144251)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Nepali
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam