పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పెట్రోలియం, సహజ వాయువు రంగంలో అపూర్వ సంస్కరణలు: భారత చమురు, గ్యాస్‌ల అన్వేషణ, ఉత్పత్తి ఫ్రేంవర్క్ ఆధునికీకరణే ధ్యేయంగా రూపొందిన పీఎన్‌జీ ముసాయిదా నియమావళి


· ఈ నియమావళిలో పెట్టుబడిదారు స్థిరత్వం, వ్యాపార నిర్వహణలో సౌలభ్యం.. కర్బన ఉద్గారాల క్షీణతపైనా ప్రత్యేక శ్రద్ధ

· ఈ నెల 17కల్లా సూచనలను ఇవ్వాల్సిందిగా ఆసక్తిదారులకు సూచించిన మంత్రి శ్రీ హర్‌దీప్ సింగ్ పూరీ

Posted On: 09 JUL 2025 3:30PM by PIB Hyderabad

"ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో చమురు, గ్యాస్ అన్వేషణను వేగవంతం చేయడంపై  దృష్టిని కేంద్రీకరించాం. ఇందులో భాగంగా అన్వేషణతో పాటు ఉత్పత్తిని ప్రోత్సహించడానికి అనేక అపూర్వ విధాన సంస్కరణలను తీసుకువస్తున్నాం. ఇందులో  ఒక భాగమైన ముసాయిదా పెట్రోలియం-సహజవాయు నియమావళి- 2025 మన ఈ అండ్ పీ ఆపరేటర్లకు వ్యాపార నిర్వహణలో సౌలభ్యాన్ని బాగా పెంచుతుంది’’ అని పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి శ్రీ హర్‌దీప్ సింగ్ పూరి అన్నారు. ముసాయిదా పెట్రోలియం-సహజవాయు నియమావళి, సవరించిన మోడల్ రెవెన్యూ షేరింగ్ కాంట్రాక్ట్ (ఎంఆర్ఎస్‌సీ)పైన, తాజా పెట్రోలియం లీజు స్వరూపం పైనా ఈ నెల 17వ తేదీ కల్లా తమ అభిప్రాయాలను png-rules@dghindia.gov.inకు తెలియజేయాల్సిందిగా   పరిశ్రమ ప్రముఖులకు, నిపుణులకు, పౌరులకు మంత్రి విజ్ఞప్తి చేశారు. సంప్రదింపుల ప్రక్రియ ఈ నెల 17న న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ‘ఊర్జా వార్తా- 2025’ను నిర్వహించడంతో ముగియనుంది.


అనేక ప్రధాన సంస్కరణలను తీసుకువచ్చి భారత్‌లో చమురు, గ్యాస్‌ల అన్వేషణ, ఉత్పత్తికి సంబంధించిన ఫ్రేంవర్కుకు సరికొత్త రూపురేఖలను కల్పించాలనేదే ‘ద డ్రాఫ్ట్ పెట్రోలియం, నేచురల్ గ్యాస్ రూల్స్-2025’ లక్ష్యం. వాటిలో పెట్టుబడిదారులకు అనుకూలంగా స్థిరీకరణ క్లాజును ప్రవేశపెట్టడం ముఖ్య సంస్కరణ. ఇది రాబోయే కాలంలో పన్నులు, రాయల్టీలు, లేదా ఇతర లెవీల వంటి చట్టపరమైన, లేదా ఆర్థిక వ్యవస్థాగత మార్పుల ప్రతికూల ప్రభావాల నుంచి కౌలుదారులను కాపాడటానికి ఉద్దేశించింది. దీనిలో భాగంగా పరిహారాన్ని గాని, లేదా డిడక్షన్స్‌కు (తగ్గింపులకు) గాని అనుమతిస్తారు. మౌలిక సదుపాయాల కల్పన విషయంలో చేసిన పనినే మళ్లీ చేయడాన్ని తగ్గించడానికి, చిన్న సంస్థలను ప్రోత్సహించడానికి ఈ ముసాయిదా  కౌలుదారులను గొట్టపుమార్గాలు మరే ఇతర సదుపాయాలలో వినియోగంలోకి తీసుకురాని సామర్థ్యాల వివరాలను వెల్లడించాల్సిందిగా ఆదేశిస్తోంది. అలాగే ప్రభుత్వ పర్యవేక్షణలో న్యాయమైన షరతులకు లోబడి మూడో పక్షానికి అందుబాటులో ఉంచాలని చెబుతోంది.

ఆయిల్‌ఫీల్డ్ బ్లాకుల్లోపల సమీకృత పునరుత్పాదక ప్రాజెక్టులను, తక్కువ కర్బనాన్ని వెలువరించే ప్రాజెక్టులను చేపట్టడానికి ఆపరేటర్లకు ఈ ముసాయిదా నియమావళి  మొట్టమొదటిసారిగా అనుమతిని ఇస్తోంది. ఈ ప్రాజెక్టుల్లో సౌర, పవన, హైడ్రోజన్, జియోథర్మల్ ప్రాజెక్టులు భాగంగా ఉండవచ్చు. అయితే, ఇవి భద్రతా ప్రమాణాలను పాటించవలసి ఉంటుంది. అంతేకాక, పెట్రోలియం ఉత్పత్తిలో జోక్యం చేసుకోకుండా కూడా ఉండాలి. పర్యావరణ అనుకూలతకు ముసాయిదా పెద్దపీటను వేస్తూ, గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల పర్యవేక్షణకు, వెల్లడికి సంబంధించి సమగ్ర నిబంధనల్ని నిర్దేశిస్తోంది. ఈ ముసాయిదా కార్బన్ క్యాప్చర్ అండ్ స్టోరేజీ (సీసీఎస్)కి  ఒక నియంత్రణసహిత ఫ్రేంవర్కును ఏర్పరుస్తోంది. స్థల పునరుద్ధరణ నిధులను విధిగా ఏర్పాటు చేయడంతో పాటు, కార్యకలాపాలను మూసివేసిన తరువాత కనీసం అయిదు సంవత్సరాల వరకు పర్యవేక్షణ బాధ్యతలను తీసుకోవాలన్న ఆదేశాలను కూడా ముసాయిదా నియమావళిలో పేర్కొన్నారు.

డేటా గవర్నెన్స్ పరంగా చూసినప్పుడు, అన్వేషణ- ఉత్పత్తి దశల్లో కార్యకలాపాల సకల సమాచారం, లభ్యమయ్యే భౌతిక నమూనాలు  ప్రభుత్వానికే చెందుతాయి. ఈ డేటాను కౌలుదారు సంస్థలు అంతర్గతంగా ఉపయోగించుకోవచ్చు. అయితే ఏ ఎగుమతికైనా, లేదా బాహ్య వినియోగానికైనా ప్రభుత్వం నుంచి ఆమోదాన్ని పొందాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో గోప్యత పరిరక్షణ సంబంధిత నియమాలను ఏడు సంవత్సరాల పాటు పాటించాల్సి ఉంటుంది. ఈ ముసాయిదా నియమావళి ఒక అడ్జూడికేటింగ్ అథారిటీ (న్యాయనిర్ణయ ప్రాధికార సంస్థ)ను ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించింది. ఈ తరహా అథారిటీ స్థాయి సంయుక్త కార్యదర్శి స్థానాని కన్నా తక్కువగా ఉండకూడదని పేర్కొన్నారు. ఈ అథారిటీకి నియమ పాలన జరిగేటట్లు చూసే అధికారం, వివాదాల పరిష్కార అధికారం, జరిమానాలను విధించే అధికారం ఉంటాయి. వీటికి అదనంగా కౌలు విలీనాలు, పొడిగింపులు, బహుళ బ్లాకులలో విస్తరించిన రిజర్వాయర్ల యూనిటైజేషన్ (ఒక యూనిట్‌గా లెక్కకు తీసుకోవడం) వంటి అంశాలు కూడా దీని పరిధిలో చేర్చారు.  కార్యకలాపాల సరళ నిర్వహణను ఇప్పటి కంటే మెరుగుపరచాలన్న ఉద్దేశంతో ఈ ముసాయిదా నియమావళిని తీసుకువచ్చారు.

ఈ సంస్కరణలు పాతపెట్రోలియం కన్సెషన్ రూల్స్-1949తో పాటు పెట్రోలియం, సహజవాయువు నియమాలు-1959ల స్థానాన్ని తాము తీసుకోనున్నాయి. అంతేకాకుండా, చమురు క్షేత్రాల (నియంత్రణ, అభివృద్ధి) చట్టం-1948లో ఇటీవల తీసుకువచ్చిన సవరణను కూడా ఈ సంస్కరణలు అనుసరించనున్నాయి. ఈ సంస్కరణలను భారత్ ఇంతవరకు నిర్వహించిన అన్వేషణ, ఉత్పత్తి బిడ్డింగ్ రౌండ్లలో అతి భారీ బిడ్డింగ్ రౌండు అయిన ‘ఓఏఎల్‌పీ రౌండ్  X’ మొదలవడాని కన్నా ముందుగానే అమలులోకి తీసుకురాబోతున్నారు కూడా.

ముసాయిదా నియమావళికి తోడు, సవరించిన మాడల్ రెవెన్యూ షేరింగ్ కాంట్రాక్టును కూడా మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఇది ఒక కొత్త ఫ్రేంవర్క్‌ ఉద్దేశాలకు.. మరీ ముఖ్యంగా యూనిటైజేషన్, కౌలు ప్రాంతాల విలీనం, మౌలిక సదుపాయాలను పరస్పరం పంచుకోవాలన్న బాధ్యతల విషయంలో.. సరిపోలేదిగా ఉంది. సవరించిన పెట్రోలియం లీజ్ ఫార్మేట్ కౌలును వదులుకోవడం, రిజర్వాయరు విస్తరణ, రద్దుకు ఆస్కారం వంటి ప్రక్రియలపై స్పష్టతనిస్తుంది. దీంతో కార్యకలాపాల నిర్వహణలో మరింత ఎక్కువ విశ్వసనీయ స్థితి నెలకొంటుంది.  

‘‘భారత్‌లో చమురు, గ్యాసు అన్వేషణ అంత సులభంగాను, వేగవంతంగాను, అధిక లాభాలు తెచ్చిపెట్టేది గాను ఏమీ లేదు. మేమొక సరికొత్తదైన, పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉండే విధానాన్ని తీర్చిదిద్దాలని చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాం’’ అని శ్రీ హర్‌దీప్ సింగ్ పూరీ స్పష్టంచేశారు.ఆసక్తిదారులు తమ ప్రతిస్పందనను ఈ నెల 17 కల్లా  png-rules@dghindia.gov.in  కు పంపించాల్సిందిగా కోరారు. ఇప్పుడున్న ఇంధన వినియోగ పద్ధతుల నుంచి భిన్నమైన పద్ధతులకు మారాలని భారత్ పెట్టుకున్న లక్ష్యాలకు తగ్గట్టుగానే ఒక పారదర్శకత నిండి ఉండే, దీర్ఘకాలం మన్నిక కలిగి ఉండే సమర్ధ అన్వేషణ, ఉత్పత్తి పరిస్థితులను కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది.


 

***


(Release ID: 2143536)