ప్రధాన మంత్రి కార్యాలయం
పర్యావరణం, కాప్-30లతో పాటు ప్రపంచ ఆరోగ్యం అంశాలపై బ్రిక్స్ 17వ శిఖరాగ్ర సదస్సు.. ప్రసంగించిన ప్రధానమంత్రి
Posted On:
07 JUL 2025 11:38PM by PIB Hyderabad
"పర్యావరణం, కాప్-30, ప్రపంచ ఆరోగ్యసంరక్షణ’’ అంశాలపై సోమవారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొని, సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బ్రిక్స్ సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాలతో పాటు పాలుపంచుకోవాల్సిందంటూ ఆహ్వానాన్ని అందుకున్న దేశాలు కూడా పాల్గొన్నాయి. ప్రపంచ భవిష్యత్తును పరిగణనలోకి తీసుకొని ఇలాంటి అధిక ప్రాధాన్యం కలిగిన అంశాలపై కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు బ్రెజిల్‌కు ఆయన తన ధన్యవాదాలు తెలిపారు. వాతావరణ మార్పును ఇంధన సమస్యల పరిష్కారం అనే ఒకే అంశంతో ముడిపెట్టి చూడడం భారతదేశం దృక్పథం కాదని, జీవనానికి ప్రకృతికి మధ్య సమతూకాన్ని ప్రభావితం చేసే అంశం ఇదని తమ దేశం భావిస్తోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. వాతావరణ పరంగా న్యాయాన్ని ఏర్పరచడం అంటే అది ఒక నైతిక బాధ్యత అని, దీనిని తప్పక నిర్వర్తించాల్సిందేనని భారత్ సంకల్పించిందని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. పర్యావరణ సంరక్షణ దిశలో కార్యాచరణను చేపట్టడానికి భారత్ ఎంతో చిత్తశుద్ధితో ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ప్రజానుకూల, భూగ్రహానికి మిత్రపూర్వక ప్రగతిసాధక విధానాలను ప్రోత్సహించడానికి తీసుకొంటున్న వివిధ కార్యక్రమాలను గురించి ఆయన సమగ్రంగా సభకు వివరించారు. ఈ సందర్భంగా మిషన్ లైఫ్ (పర్యావరణ అనుకూల జీవనం), 'ఏక్ పేడ్ మా కే నామ్' (తల్లి పేరు మీద ఒక మొక్కను నాటడం), అంతర్జాతీయ సౌరశక్తి కూటమి, సమర్థవంతమైన విపత్తు సన్నద్ధ కూటమి (కోయలిషన్ ఫర్ డిజాస్టర్ రేజీలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్), హరిత హైడ్రోజన్ మిషన్, ప్రపంచ జీవ ఇంధన వేదిక, పులుల సంరక్షణ కూటమి (బిగ్ క్యాట్స్ అలయన్స్) తదితర కార్యక్రమాలను ప్రధానమంత్రి ప్రస్తావించారు.
భారత్ అభివృద్ధి పథంలో ముందుకు సాగిపోవడానికి ప్రకృతిని సంరక్షిస్తూనే ఆ గమ్యం దిశగా పయనించాలన్న విధానాన్ని అనుసరిస్తోందని ప్రధానమంత్రి తెలిపారు. ఇండియా అత్యంత వేగంగా వృద్ధిని నమోదు చేస్తున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఉండి, అదే కాలంలో ప్యారిస్ వాగ్దానాలను నిర్ణీత కాలాని కంటే ముందుగానే నెరవేర్చిందన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు వాతావరణ మార్పును దృష్టిలో పెట్టుకొని అమలుచేయాల్సిన కార్యక్రమాలను అవి అమలు చేయగలగాలంటే వాటికి టెక్నాలజీని బదలాయించడంతో పాటు తిరిగి చెల్లింపులు అంతగా భారం కాకుండా ఉండే రీతిన ఆర్థిక సహాయాన్ని అందించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ విషయంలో, బ్రిక్స్ కూటమి ఆమోదించిన ‘ఫ్రేంవర్క్ డిక్లరేషన్ ఆన్ క్లైమేట్ ఫైనాన్స్’ ఒక ముఖ్య నిర్ణయమని ఆయన అన్నారు.
హరిత ప్రధాన లక్ష్యాలపై శ్రద్ధ తీసుకొంటూ అభివృద్ధి సాధనలో ముందుకు సాగిపోతుండడానికే భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి వివరించారు. కోవిడ్ మహమ్మారి విజృంభించిన కాలంతో సహా సదా భారత్ తోటి దేశాలకు అండదండలను అందించడంలో ‘‘వన్ ఎర్త్, వన్ హెల్త్’’ సూత్రాన్ని (దీనికి ఈ భూగోళం ఒకటే, సర్వ మానవాళి ఆరోగ్యసహితంగా జీవించాలి అని భావం) అనుసరించిందని ఆయన చెప్పారు. భారత్ డిజిటల్ మాధ్యమం సాయంతో ఆరోగ్యసంరక్షణ పథకాలను విజయవంతంగా అమలుచేసిందని ఆయన ప్రధానంగా ప్రస్తావిస్తూ, ఆ కార్యక్రమాల వల్ల ఒనగూరిన అనుభవాల సారాన్ని ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు అందించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా, ‘బ్రిక్స్ పార్ట్‌నర్‌షిప్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ సోషల్లీ డిటర్మైన్డ్ డిసీజెస్’ (సమాజంలో గుర్తించిన వ్యాధుల నివారణకు ఉద్దేశించిన బ్రిక్స్ భాగస్వామ్యం) శీర్షిక ఒక తీర్మానాన్ని ఆమోదించడాన్ని ఆయన స్వాగతించారు.
వచ్చే సంవత్సరంలో బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలను భారత్ స్వీకరించబోతోంది. ఈ సందర్భంగా, భారత్ తన అజెండాలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు పెద్దపీట వేయనుందని, ప్రజా ప్రయోజనాలే పరమావధిగా దృష్టిని కేంద్రీకరించడంతో పాటు ‘‘మానవతకు పట్టం’’ కట్టే విధానాన్ని అనుసరిస్తుందని ప్రధానమంత్రి తెలిపారు. ఇండియా అధ్యక్షత వహించే కాలంలో, బ్రిక్స్‌కు ఒక కొత్త రూపాన్ని ఇవ్వడానికి పాటుపడుతుందని, బ్రిక్స్ సంక్షిప్త నామానికి అర్థం కూడా బిల్డింగ్ రిజిలియన్స్ అండ్ ఇన్నొవేషన్ ఫర్ కోఆపరేషన్ అండ్ సస్టెయినబిలిటీగా (సహకారం, దీర్ఘకాలికతలు లక్ష్యాలుగా ఆటుపోట్లకు తట్టుకొనే స్వభావంతో పాటు నవకల్పనను పెంచి పోషించడం) నిలవనుందని ప్రధానమంత్రి వివరించారు. శిఖరాగ్ర సదస్సును ఫలప్రదంగా నిర్వహించారంటూ అధ్యక్షుడు శ్రీ లూలాకు ఆయన అభినందనలు తెలియజేస్తూ, తనకు స్నేహపూర్వక ఆతిథ్యాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు పలికారు.
***
(Release ID: 2143095)
Read this release in:
Kannada
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil