ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

క్రొయేషియా ప్రధానమంత్రితో సంయుక్త పత్రికా ప్రకటన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటనకు తెలుగు అనువాదం

Posted On: 19 JUN 2025 5:32PM by PIB Hyderabad

గౌరవ ప్రధానమంత్రి,
రెండు దేశాల ప్రతినిధులు, ,
మీడియా మిత్రులకు,
నమస్కారం!

శుభ మధ్యాహ్నం!

చరిత్ర ప్రసిద్ధి గాంచిన ఈ అందమైన జాగ్రెబ్ నగరంలో నాకు లభించిన ఉత్సాహం, అభిమానం, సాదర స్వాగతానికి క్రొయేషియా ప్రధానమంత్రికి, ప్రభుత్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

క్రొయేషియాలో ఒక భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. ఈ అవకాశం నాకు రావడం నా అదృష్టం.

మిత్రులారా,

భారత్, క్రొయేషియా దేశాలు ప్రజాస్వామ్యం, న్యాయ పాలన, బహుళవాదం, సమానత్వం వంటి ఉమ్మడి విలువల ద్వారా కలిసిపోయాయి. గత ఏడాది భారత ప్రజలు నాకు, క్రొయేషియా ప్రజలు ప్రధాని ఆండ్రేజ్ ప్లెంకోవిచ్‌ కు వరుసగా మూడోసారి అధికార బాధ్యతలు అప్పగించడం ఒక సంతోషదాయకమైన యాదృచ్ఛికం. ఈ పునరావృత ప్రజా తీర్పుతో , ఈ పదవీకాలంలో రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల వేగాన్ని మూడింతలు పెంచేందుకు మేం కట్టుబడి ఉన్నాం.

రక్షణ రంగంలో దీర్ఘకాలిక సహకారానికి అవసరమైన రక్షణ సహకార ప్రణాళిక సిద్ధమవుతోంది. ఈ ప్రణాళిక ప్రధానంగా శిక్షణ, సైనిక పరస్పర మార్పులు, రక్షణ పరిశ్రమలో సహకారం వంటి అంశాలపై దృష్టి పెడుతుంది. మా ఆర్థిక వ్యవస్థలు పరస్పరం అనుకూలంగా ఉన్న పలు రంగాలను గుర్తించాయి; వాటిపై చురుకైన చర్యలు తీసుకుంటాం.

ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచేందుకు, విశ్వసనీయ నమ్మదగిన సరఫరా వ్యవస్థలను రూపొందించేందుకు అనేక రంగాలలో సహకారాన్ని విస్తరించాలని నిర్ణయించాం. ఫార్మా, వ్యవసాయం, సమాచార సాంకేతిక పరిజ్ఞానం, పరిశుభ్ర సాంకేతికత, డిజిటల్ టెక్నాలజీ, పునరుత్పాదక ఇంధనం, సెమీకండక్టర్లు వంటి కీలక రంగాల్లో సహకారాన్ని పెంపొందించనున్నాం.

నౌకా నిర్మాణం, సైబర్ భద్రతలో సహకారాన్ని బలోపేతం చేస్తాం. మా సాగరమాల ప్రాజెక్టు కింద ఓడరేవుల ఆధునికీకరణ తీరప్రాంత అభివృద్ధి,  బహుళ-నమూనా కనెక్టివిటీ కార్యక్రమాలలో పాల్గొనడానికి క్రొయేషియా కంపెనీలకు గణనీయమైన అవకాశాలు ఉన్నాయి. రెండు దేశాల విద్యా సంస్థలు, పరిశోధనా కేంద్రాల మధ్య సంయుక్త పరిశోధన, సహకారాన్ని ప్రోత్సహించడంపై కూడా దృష్టి సారించాం. ఇంకా అంతరిక్ష రంగంలో ఉన్న అనుభవం, నైపుణ్యాన్ని క్రోయేషియాతో పంచుకోవడానికి భారత్ కట్టుబడి ఉంది.

మిత్రులారా,

శతాబ్దాల నాటి మన పురాతన సాంస్కృతిక బంధాలు పరస్పర ప్రేమకు, సౌహార్ద్రానికి  బలమైన పునాదిగా నిలిచాయి. 18వ శతాబ్దంలో ఇవాన్ ఫిలిప్ వెజ్డిన్ యూరప్‌లో సంస్కృత వ్యాకరణాన్ని ప్రచురించిన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందారు. గత 50 సంవత్సరాలుగా జాగ్రెబ్ విశ్వవిద్యాలయంలో ఇండాలజీ విభాగం క్రియాశీలకంగా పనిచేస్తోంది.

సాంస్కృతిక బంధాలను,  ప్రజల మధ్య సంబంధాలను మరింత పటిష్టం చేయాలని ఈరోజు మేం నిర్ణయించాం. జాగ్రెబ్ విశ్వవిద్యాలయంలో హిందీ పీఠానికి సంబంధించిన అవగాహన ఒప్పందం గడువును 2030 వరకు పొడిగించాం. వచ్చే ఐదు సంవత్సరాల కోసం ఒక సాంస్కృతిక మార్పిడి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం.

ప్రజల రాకపోకలను సులభతరం చేయడానికి మొబిలిటీ ఒప్పందం త్వరలో తుది రూపం దాల్చనుంది. భారతదేశంలోని నైపుణ్యం కలిగిన ఐటీ మానవ వనరులను క్రోయేషియన్ కంపెనీలు ఉపయోగించుకునే అవకాశం పొందగలవు. రెండు దేశాల మధ్య పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి గల మార్గాలపై కూడా మేం చర్చించాం.

ఇక్కడ యోగాకు ఉన్న ప్రజాదరణను నేను స్పష్టంగా గుర్తించాను. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా క్రొయేషియా ప్రజలు ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారని నాకు పూర్తి నమ్మకం ఉంది.

మిత్రులారా,

ఉగ్రవాదం మానవత్వానికి శత్రువు, ప్రజాస్వామ్య సిద్ధాంతాలను విశ్వసించే ప్రతీ ఒక్కరికీ ఉగ్రవాదం వ్యతిరేకమని మేము ఏకాభిప్రాయానికి వచ్చాం. ఏప్రిల్ 22న భారత్‌లో జరిగిన ఉగ్రవాద దాడి అనంతరం క్రోయేషియా ప్రధాని,  ప్రభుత్వం వ్యక్తపరిచిన సంఘీభావానికి  హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం.  ఇలాంటి క్లిష్ట సమయాలలో మా మిత్రుల మద్దతు మాకెంతో విలువైనది.

ఈరోజు ప్రపంచంలో భారత్,  యూరప్ మధ్య భాగస్వామ్యం అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉందనే విషయంలో మేమిద్దరం ఏకాభిప్రాయానికి వచ్చాం. యూరోపియన్ యూనియన్‌తో భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలోక్రొయేషియాతో మద్దతు,  సహకారం అత్యంత కీలకమైనవి.

యూరప్‌లో అయినా, ఆసియాలో అయినా పరిష్కారాలను యుద్ధరంగంలో కనుగొనలేమని మేమిద్దరం గాఢంగా నమ్ముతున్నాం. సంభాషణలు, దౌత్యం మాత్రమే ముందుకు సాగే ఏకైక ఉపయోగకరమైన మార్గాలు.  ప్రతి దేశ ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమత్వాన్ని పరస్పరం గౌరవించడం చాలా అవసరం.

మిత్రులారా,

ఈరోజు  బాన్స్కీ ద్వోరి వద్ద ఉండటం నాకు ఒక ప్రత్యేకమైన క్షణం. ఇక్కడే సాక్‌సిన్స్కీ క్రొయేషియన్ భాషలో తన చరిత్రాత్మక ప్రసంగాన్ని అందించారు. ఈరోజు నేను హిందీ భాషలో నా ఆలోచనలు వ్యక్తపరచడం నాకు గర్వంగా, సంతృప్తిగా అనిపిస్తోంది. ఆయన చెప్పినట్టే, భాష అనేది ఒక వంతెన - ఈరోజు మనం ఆ వంతెనను మరింత బలోపేతం చేస్తున్నాం.

క్రోయేషియా పర్యటన సందర్భంగా నాకు అందించిన ఆత్మీయ ఆతిథ్యానికి గాను మరోసారి ప్రధానమంత్రికి నా హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేస్తున్నా. త్వరలోనే క్రొయేషియా ప్రధానమంత్రిని భారత్‌లో ఆహ్వానించడానికి నేను ఎదురుచూస్తాను.

మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు

గమనిక: ఇది ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి సుమారు తెలుగు అనువాదం.


 

***


(Release ID: 2139827)