పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
భద్రత, ప్రయాణికుల సౌకర్యాలు, విమానయాన పనితీరును సమీక్షించిన కేంద్ర మంత్రి శ్రీ రామ్ మోహన్ నాయుడు
కేంద్ర మంత్రితో భేటీ అయిన ఎయిర్ ఇండియా సీఎండీ
కార్యాచరణ కొనసాగింపు, నిర్వహణ, పారదర్శక కమ్యూనికేషన్‌కు మద్దతు, ప్రయాణికుల భద్రత, సౌకర్యాలపై చర్చ
స్పైస్ జెట్, ఇండిగో, ఆకాశ్ సంస్థలతోనూ సమావేశం
విమానాల పనితీరు, భద్రతా పర్యవేక్షణ, ప్రయాణికుల సౌకర్యాలను సమీక్షించిన కేంద్ర మంత్రి
స్థానిక సంస్థలు, ఏజెన్సీల సహకారంతో.. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై స్థిరంగా కొనసాగుతున్న ఏఏఐబీ దర్యాప్తు
Posted On:
19 JUN 2025 5:25PM by PIB Hyderabad
అహ్మదాబాద్ సమీపంలో ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద దుర్ఘటన నేపథ్యంలో.. భద్రత, ప్రయాణికుల సౌకర్యాలు, విమానయాన పనితీరుపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సమగ్ర సమీక్ష నిర్వహించింది.
విమానాశ్రయ డైరెక్టర్లతో చర్చించిన కేంద్ర మంత్రి
ప్రమాదానంతర తనిఖీలు, వాతావరణ మార్పులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా కొన్ని దేశాలు గగనతలాలను మూసివేయడం వంటి పలు కారణాల వల్ల విమానాల రీషెడ్యూల్ జరుగుతున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా గల అన్ని విమానాశ్రయాల డైరెక్టర్లతో వీడియో మాధ్యమం ద్వారా సమావేశమైన పౌర విమానయాన మంత్రి శ్రీ కింజరాపు రామ్ మోహన్ నాయుడు.. క్షేత్రస్థాయి సంసిద్ధత, ప్రయాణికులకు సహాయపడే విధానాలను సమీక్షించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు:
ప్రయాణికుల సమస్యలకు అక్కడికక్కడే సత్వర పరిష్కారం అందించేలా విమానయాన సంస్థలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండాలని స్పష్టం చేశారు.
ముఖ్యంగా విమానం ఆలస్యమైన, రద్దీ ఎక్కువగా ఉన్న సందర్బాల్లో టెర్మినల్స్ వద్ద ఆహారం, తాగునీరు, కూర్చునేందుకు తగిన సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి.
ప్రయాణికుల ఫిర్యాదుల సత్వర పరిష్కారం కోసం వినియోగదారుల విచారణ కేంద్రాల వద్ద తగినంత సిబ్బందిని నియమించాలి.
గేట్ మార్పు, సరుకుల రవాణాలో మద్దతు విషయంలో కార్యాచరణపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న విమానయాన సంస్థలకు సాధ్యమైన మేరకు అన్ని విధాలుగా సహాయం అందించాలని విమానాశ్రయ డైరెక్టర్లను కోరారు.
సురక్షితమైన, భద్రతతో కూడిన విమానాశ్రయ వాతావరణం కోసం.. పక్షులు, విచ్చలవిడిగా తిరిగే జంతువులను నివారించడం సహా వన్యప్రాణుల ప్రమాద నిర్వహణను బలోపేతం చేయాలని విమానాశ్రయ డైరెక్టర్లను ఆదేశించారు.
భద్రత, విమానయాన కార్యకలాపాలను సమీక్షించిన కేంద్ర మంత్రి
ఎయిర్ ఇండియా ఛైర్మన్-మేనేజింగ్ డైరెక్టర్‌తో కేంద్ర పౌర విమానయాన మంత్రి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మూడు కీలక అంశాలను గురించి చర్చించారు:
కార్యాచరణ కొనసాగింపును నిర్వహించడం
ప్రజలతో పారదర్శకమైన, జవాబుదారీగా ఉండే సమాచారాన్ని పంచుకోవడం
ప్రయాణికుల భద్రత, సౌలభ్యం.
మధ్యప్రాచ్యంలో మారుతున్న పరిస్థితులు, భద్రతా తనిఖీలను పెంచడం, యూరప్‌లో రాత్రివేళ విమాన ప్రయాణాలపై నిషేధం వంటి కారణాలతో ఎయిర్ ఇండియా నడిపే విమానాల సంఖ్యను తగ్గించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఫలితంగా సంస్థ కార్యకలాపాలను తాత్కాలికంగా తగ్గించి, విమానాల షెడ్యూలు మార్చుతూ, విమానాలు వేరే మార్గాల్లో నడుపుతూ, మీడియా ద్వారా ఆ మార్పులను ప్రకటిస్తోంది. దీని ద్వారా ప్రభావితమయ్యే ప్రయాణికులు తిరిగి వేరే సమయం కోసం బుక్ చేసుకోవచ్చు, లేదంటే వారికి పూర్తి మొత్తాన్ని వాపసు చేస్తున్నారు. ఈ విషయాలను సమావేశంలో ప్రధానంగా చర్చించిన అనంతరం.. విమానాశ్రయాల్లో క్షేత్రస్థాయి సమన్వయాన్ని బలోపేతం చేసుకోవాలని, విమానాల రద్దు/ఆలస్యం గురించి ప్రయాణికులకు స్పష్టమైన సమాచారం అందించాలని, వినియోగదారుల సేవా కేంద్రాల సిబ్బంది ప్రయాణికులతో సున్నితంగా వ్యవహరిస్తూ, పెరుగుతున్న ప్రయాణికుల సమస్యలను సానుభూతితో, స్పష్టతతో పరిష్కరించేందుకు పూర్తిగా సంసిద్ధంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ఎయిర్ ఇండియాను కేంద్ర మంత్రి కోరారు.
ఈనెల 18, 19 తేదీల్లో స్పైస్ జెట్, ఇండిగో, ఆకాశ్ సంస్థల సీనియర్ మేనేజ్‌మెంట్‌లతో కేంద్ర మంత్రి సమావేశాలు నిర్వహించారు. విమానాల పనితీరు, భద్రతా పర్యవేక్షణ, ప్రయాణికుల అనుభవం, సౌలభ్యం, వైమానిక కమ్యూనికేషన్ వ్యూహాన్ని ఈ సందర్భంగా ఆయన సమీక్షించారు.
మెరుగైన పర్యవేక్షణ, సమన్వయం కోసం కార్యాచరణ అంశాలపై విమానయాన సంస్థలతో కాలానుగుణ సమీక్ష నిర్వహించే విధానాన్ని అమలు చేయాలని కూడా నిర్ణయించారు.
ఏఏఐబీ దర్యాప్తు స్థితిపై తాజా సమాచారం
అహ్మదాబాద్ సమీపంలో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) అధికారిక విచారణను ప్రారంభించింది.
ఏఏఐబీకి చెందిన బహుళ-విభాగాల బృందం ఈనెల 12 నుంచి దర్యాప్తును ప్రారంభించింది. ఏఏఐబీ డీజీ ఈ విచారణకు ఆదేశించారు. ఐసీఏఓ ప్రోటోకాల్‌ల ప్రకారం ఎన్‌టీఎస్‌బీ, ఓఈఎమ్ బృందాలు ఏఏఐబీకి దర్యాప్తులో సహకారం అందిస్తున్నాయి.
ఈనెల 13న డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ (డీఎఫ్‌డీఆర్), కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్)ల సంయుక్త యూనిట్‌ను విమాన ప్రమాద ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు. మరో సెట్ ఈనెల 16న లభించింది. ఈ మోడల్ విమానంలో రెండు బ్లాక్‌బాక్స్ సెట్‌లు ఉన్నాయి.
స్థానిక సంస్థలు, ఏజెన్సీల సహకారంతో ఏఏఐబీ దర్యాప్తు స్థిరంగా కొనసాగుతోంది. సైట్ డాక్యుమెంటేషన్, ఆధారాల సేకరణ సహా కీలక రికవరీ పనులు పూర్తయ్యాయి. తదుపరి విశ్లేషణ ప్రస్తుతం కొనసాగుతోంది.
దర్యాప్తు పూర్తి పారదర్శకంగా నిర్వహించడానికి మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది. అత్యున్నత స్థాయి ప్రమాణాలతో కూడిన ప్రయాణికుల భద్రత, సౌలభ్యం కోసం అన్ని తప్పనిసరి ప్రోటోకాల్‌లు, నిబంధనలను అనుసరిస్తున్నారు.
సంవత్సరాలుగా భారతీయ విమానయానానికి మూలాధారంగా ఉన్న.. ప్రయాణకుల విశ్వాసాన్ని నిలబెట్టడానికి, కార్యాచరణలో స్థిరత్వాన్ని తీసుకురావడానికి సంఘటితమైన, జవాబుదారీ బృందంగా కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకతను కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
దురదృష్టకర ప్రమాదంలో కూలిపోయిన AI171 విమానం నుంచి లభించిన సీవీఆర్/డీఎఫ్‌డీఆర్‌ల డేటాను తిరిగి పొందడం, విశ్లేషించడం కోసం వాటిని విదేశాలకు పంపుతున్నట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేశాయి. అయితే అన్ని సాంకేతిక, భద్రత, రక్షణపరమైన అంశాలను పరిగణించిన తరువాత మాత్రమే విమాన రికార్డర్‌లను డీకోడ్ చేయించాల్సిన ప్రదేశం గురించి ఏఏఐబీ నిర్ణయం తీసుకుంటుంది. ఇటువంటి సున్నితమైన విషయాలపై ఊహాగానాలకు దూరంగా ఉంటూ, దర్యాప్తు ప్రక్రియ సక్రమంగా ముందుకు సాగడానికి సహకరించాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది.
పౌర విమానయానానికి సంబంధించి అన్ని అంశాల్లో అత్యున్నత ప్రమాణాలతో కూడిన భద్రతను నిర్ధారించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రయాణికుల భద్రత, సౌకర్యాలకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అత్యంత ప్రాధాన్యమిస్తోంది.
***
(Release ID: 2137925)