హోం మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీలో నిర్వహించిన బీఎస్ఎఫ్ ఇన్వెస్టిచ్యూర్ వేడుకలు, రుస్తమ్‌జీ స్మారకోపన్యాస కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
ఉగ్రవాదం-పాకిస్తాన్ మధ్య బంధాన్ని ఆపరేషన్ సిందూర్ యావత్ ప్రపంచానికి తెలియజెప్పింది
ప్రధానమంత్రి మోదీ బలమైన రాజకీయ సంకల్పం, త్రివిధ దళాల అసాధారణ పరాక్రమం, నిఘా సంస్థలు అందించిన కచ్చితమైన సమాచారం కారణంగానే ఆపరేషన్ సిందూర్ సాధ్యమైంది
మన గడ్డపై ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనలో లక్ష్యాలన్నీ అత్యంత కచ్చితత్వంతో, విజయవంతంగా పూర్తి చేసి ఆపరేషన్ సిందూర్ చరిత్ర సృష్టించింది
ఆపరేషన్ సిందూర్ ద్వారా బీఎస్ఎఫ్, సైన్యం తమ అసమాన ధైర్యసాహసాలను ప్రపంచానికి చాటిచెప్పాయి
భారత పౌరులు, సైనిక స్థావరాలపై జరిగిన దాడులకు ప్రతిస్పందనగా భారత సైన్యం పాకిస్తాన్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేసి మన ఎదురుదాడి సత్తాను ప్రదర్శించింది
భారత సైనికుల ధైర్యం.. అద్భుతమైన ఎదురుదాడి సామర్థ్యం.. సంయమనాన్ని నేడు యావత్ ప్రపంచం ప్రశంసిస్తోంది.
బీఎస్‌ఎఫ్ సరిహద్దులో ఉన్నంతవరకు, పాకిస్థాన్ సైన్యం ఒక్క అంగుళమైనా ముందుకు రాలేదు
1971 యుద్ధంలో బీఎస్ఎఫ్ ధైర్యాన్ని, సహకారాన్ని భారత్ ఎన్నటికీ మరవదు.. బంగ్లాదేశ్ కూడా దానిని మరవకూడదు
Posted On:
23 MAY 2025 4:36PM by PIB Hyderabad
ఈరోజు న్యూఢిల్లీలో నిర్వహించిన సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) ఇన్వెస్టిచ్యూర్ వేడుకలు, రుస్తమ్‌జీ స్మారకోపన్యాస కార్యక్రమాలకు కేంద్ర హోం, సహకార శాఖా మంత్రి శ్రీ అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర హోం శాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) డైరెక్టర్, సరిహద్దు భద్రతా దళం డైరెక్టర్ జనరల్ సహా అనేక మంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కేంద్ర హోం, సహకార శాఖా మంత్రి శ్రీ అమిత్ షా మాట్లాడుతూ, సవాలుతో కూడిన పరిస్థితుల్లో పరిమిత వనరులతో ప్రారంభమైన సంస్థ.. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ప్రతిష్టాత్మకమైన సరిహద్దు భద్రతా దళంగా ఎదిగిన తీరును, 1965 నుంచి 2025 వరకు సాగిన బీస్ఎఫ్ ప్రయాణం చక్కగా వివరిస్తుందన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థగా నిలిచే క్రమంలో ఎదురయ్యే సవాళ్లను దేశభక్తితో అధిగమించి బీఎస్ఎఫ్ అత్యుత్తమ ఉదాహరణగా నిలిచిందని ఆయన కొనియాడారు. 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు.. అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు.. దట్టమైన అడవులు.. కఠినమైన పర్వతాలు.. తీరప్రాంతాలు ఇలా అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో బీఎస్ఎఫ్ సిబ్బంది ప్రదర్శించిన దేశభక్తి, అంకితభావం వల్లే ప్రథమ శ్రేణి రక్షణ సంస్థగా గౌరవాన్ని పొందినదని ఆయన స్పష్టం చేశారు. ప్రతి సరిహద్దు భద్రత కోసం ప్రత్యేకంగా ఒక దళాన్ని నియమించాలని నిర్ణయం తీసుకున్నామన్న శ్రీ అమిత్ షా, బీఎస్ఎఫ్ సామర్థ్యం ఆధారంగా అత్యంత సవాలుతో కూడిన బంగ్లాదేశ్, పాకిస్థాన్ సరిహద్దుల రక్షణ బాధ్యతను వారికి అప్పగించామని తెలిపారు.

బీఎస్ఎఫ్ బలోపేతంలో కీలక పాత్ర పోషించిన శ్రీ కె.ఎఫ్. రుస్తమ్‌జీ సేవలను గుర్తుచేసుకుంటూ, 1965 యుద్ధం తర్వాత, శాంతి సమయంలో కూడా సరిహద్దుల భద్రత కోసం బలగాల అవసరం ఏర్పడిందనీ, ఆ కారణంగానే బీఎస్ఎఫ్ ఆవిర్భావం జరిగి, రుస్తమ్‌జీ దాని మొదటి డైరెక్టర్ జనరల్ అయ్యారని కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా తెలిపారు. 1971లో భారత్‌పై రుద్దిన యుద్ధంలో బీఎస్ఎఫ్ సిబ్బంది చూపిన ధైర్యసాహసాలు, సహకారాన్ని దేశం ఎప్పటికీ మరచిపోదనీ, బంగ్లాదేశ్ ఎప్పటికీ దానిని మర్చిపోకూడదనీ ఆయన పేర్కొన్నారు. బంగ్లాదేశ్ ఏర్పాటులో బీఎస్ఎఫ్ ముఖ్య పాత్ర పోషించిందన్న శ్రీ అమిత్ షా, అన్యాయానికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో సాయుధ దళాలతో కలిసి పనిచేయడం ద్వారా బీఎస్ఎఫ్ ధైర్యసాహసాలకు ఆదర్శప్రాయమైన ప్రమాణాలను నెలకొల్పిందని కొనియాడారు.

సరిహద్దు భద్రతతో పాటు, అంతర్గత భద్రత, విపత్తు నిర్వహణ అలాగే ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో బీఎస్ఎఫ్ చురుగ్గా పాల్గొని అత్యుత్తమ ఫలితాలను సాధించిందని శ్రీ అమిత్ షా ప్రశంసించారు. ఎన్నికలు, కోవిడ్-19 మహమ్మారి, క్రీడా కార్యక్రమాలు, ఉగ్రవాదం-నక్సలిజాన్ని ఎదుర్కోవడం ఇలా అప్పగించిన ప్రతి బాధ్యతను బీఎస్ఎఫ్ అద్భుతంగా నిర్వర్తించిందని ఆయన పేర్కొన్నారు.

బీఎస్ఎఫ్, సాయుధ దళాలు ప్రపంచం ముందు అసమానమైన శౌర్యానికి ఉదాహరణగా నిలిచిన సమయంలో నేటి ఇన్వెస్టిచ్యూర్ వేడుకలు జరుగుతున్నాయని కేంద్ర హోంమంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బలమైన రాజకీయ సంకల్పం, నిఘా సంస్థల కచ్చితమైన సమాచారం అలాగే మన త్రివిధ దళాల అద్భుత ప్రదర్శనకు ఆపరేషన్ సిందూర్ చక్కటి నిదర్శనమన్నారు. దశాబ్దాలుగా మన దేశం పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోందన్న శ్రీ అమిత్ షా, గతంలో పాకిస్థాన్ అనేక ఉగ్రవాద దాడులకు పాల్పడినా.. వాటికి తగిన విధంగా ఎప్పుడూ స్పందించలేదన్నారు.
2014లో శ్రీ నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో, ఉరిలో మన సైనికులపై అతిపెద్ద ఉగ్రవాద దాడి జరిగినప్పుడు తొలిసారి ఉగ్రవాదుల స్థావరాల్లోకి వెళ్లి మెరుపు దాడులు నిర్వహించడం ద్వారా తగిన ప్రతిస్పందన తెలిపామని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. ఈ ప్రతిస్పందన ఉగ్రవాద కార్యకలాపాలను అంతం చేస్తుందని భావించినా అది జరగలేదని, పుల్వామాలో మన సైనికులపై మరో ఉగ్రవాద దాడి జరిగిందన్నారు. ఈసారి, భారత దళాలు వైమానిక దాడితో నిర్ణయాత్మకంగా స్పందించి, మరోసారి ఉగ్రవాద స్థావరాలను నాశనం చేశాయి. అయితే ఇటీవల పహల్గామ్‌లో పాకిస్థాన్ ప్రాయోజిత ఉగ్రవాదులు అమాయక పర్యాటకులను వారి మతాన్ని అడిగి మరీ వారి భార్యలు, కుటుంబాల ఎదుటే దారుణంగా చంపారని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. ఈ ఉగ్రవాద దాడికి తగిన ప్రతిస్పందన తప్పక లభిస్తుందని ప్రధానమంత్రి మోదీ ప్రకటించిన క్రమంలో, ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాదానికి దీటైన జవాబునిచ్చామని ఆయన తెలిపారు. మన సాయుధ దళాల ధైర్యసాహసాలు, అద్భుత సామర్థ్యాలను నేడు యావత్ ప్రపంచం ప్రశంసిస్తోందని కేంద్ర హోంమంత్రి పేర్కొన్నారు.
ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఉగ్రవాద దాడులకు ప్రతిస్పందనలు లభించినప్పటికీ, భారత్ ఇచ్చిన ప్రతిస్పందన ప్రత్యేకమైనదని కేంద్ర హోంమంత్రి వ్యాఖ్యానించారు. పహల్గామ్ దాడి తర్వాత, మనం ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించి.. నిమిషాల వ్యవధిలో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశామని, వాటిలో రెండు ఉగ్రవాద సంస్థల ప్రధాన కార్యాలయాలు కూడా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. భారత దళాలు మొదట పాకిస్థాన్ సైనిక స్థావరాలు, వారి వైమానిక స్థావరాలపై దాడి చేయలేదనీ, మన గడ్డపై దారుణమైన హింసకు పాల్పడిన ఉగ్రవాద స్థావరాలను మాత్రమే ధ్వంసం చేశాయని ఆయన స్పష్టం చేశారు. మన దాడి పూర్తిగా ఉగ్రవాదులపైనే కాబట్టి ఇది సరిపోతుందని నమ్ముతున్నామని శ్రీ అమిత్ షా తెలిపారు. ఉగ్రవాదులపై దాడిని తనపై జరిగిన దాడిగా పరిగణించడం ద్వారా పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న విషయం నిరూపితమైందన్న ఆయన, అందుకే మన దేశ పౌరుల, సైనిక సంస్థలు లక్ష్యంగా ఆ దేశం దాడికి తెగించిందన్నారు. భారత వైమానిక రక్షణ వ్యవస్థ అద్భుతమైనదని, పాకిస్థాన్ దాడులు మనకు ఎలాంటి హాని కలిగించలేవని కేంద్ర హోంమంత్రి స్పష్టం చేశారు.

పాకిస్థాన్ సైన్యం మన పౌరుల, సైనిక సంస్థలపై దాడికి ప్రయత్నించినప్పుడు, భారత సాయుధ దళాలు వారి వైమానిక స్థావరంపై దాడితో నిర్ణయాత్మకంగా స్పందించి మన ఎదురుదాడి సామర్థ్యాలను ప్రదర్శించాయని.. ఇది వారి వైమానిక రక్షణ వ్యవస్థ అసమర్థతను కూడా స్పష్టం చేసిందని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. ఆ సమయంలో కూడా, మన దళాలు పాకిస్థాన్లో పౌరులు నివసించే ఏ ప్రదేశాలపైనా దాడి చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా, పాకిస్థాన్-ఉగ్రవాదం మధ్య బంధం మొత్తం ప్రపంచానికి తెలిసిందన్నారు. పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి జరిగినప్పుడు, పాకిస్థాన్ సైన్యం స్పందించిందనీ, మరణించిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు కూడా పాకిస్థాన్ సైనిక అధికారులు హాజరవడం ప్రపంచమంతా చూసిందని ఆయన పేర్కొన్నారు.
ఉగ్రవాదంతో సంబంధం లేదని బుకాయిస్తూ వచ్చిన పాకిస్థాన్ అసలు రూపం ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రపంచానికి పూర్తిగా తెలిసిపోయిందని, పాకిస్థాన్ ప్రాయోజిత ఉగ్రవాదమే భారత్‌లో దాడులకు పాల్పడుతున్నట్లు ఇది నిర్ధారించిందని కేంద్ర హోంమంత్రి స్పష్టం చేశారు. మన గడ్డపై ఉగ్రవాద దాడులకు ఆపరేషన్ సిందూర్ ద్వారా చరిత్రలోనే అత్యంత కచ్చితమైన, విజయవంతమైన ప్రతిస్పందన తెలిపామన్నారు. ప్రపంచవ్యాప్తంగా నిపుణులు మన సైనికుల ధైర్యం, సామర్థ్యాలు, సంయమనాన్ని ప్రశంసిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
మన సైన్యం, బీఎస్ఎఫ్ సరిహద్దు రక్షక దళాలు దేశానికే గర్వకారణమని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. సరిహద్దులో బుల్లెట్లకు బుల్లెట్లతో సమాధానం ఇవ్వడం ద్వారా.. బీఎస్ఎఫ్ ఉన్నంత వరకు, పాకిస్థాన్ సైన్యం ఒక్క అంగుళం కూడా ముందుకు రాలేదని నిరూపణ అయిందన్నారు. రక్షణ ఉత్పత్తిలో స్వావలంబన సాధించిన భారత విజయాన్ని ఆపరేషన్ సిందూర్ సమర్థంగా ప్రదర్శించిందని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో, ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో ఈ ప్రచారం మరింత ఊపందుకుని, మనం మరింత స్వావలంబన దిశగా ముందుకు సాగుతామన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో బీఎస్ఎఫ్ సిబ్బంది మొహమ్మద్ ఇంతియాజ్ అహ్మద్, దీపక్ చింగాఖమ్ మాతృభూమి రక్షణ కోసం అత్యున్నత త్యాగం చేశారని, వారి పేర్లు దేశ రక్షణ చరిత్రలో ఎప్పటికీ సువర్ణాక్షరాలతో లిఖించి ఉంటాయని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు.
పదిహేను వేల కిలోమీటర్లకు పైగా పొడవైన, అత్యంత సవాలుతో కూడిన భారత సరిహద్దును బీఎస్‌ఎఫ్ సురక్షితంగా ఉంచుతోందని కేంద్ర హోంమంత్రి తెలిపారు. గత ఐదేళ్లుగా, బీఎస్‌ఎఫ్ అనేక సాంకేతిక పరిష్కారాలను కనుగొనే ప్రయత్నాలు చేసిందని ఆయన పేర్కొన్నారు. కంచె నిర్మాణం సాధ్యం కాని ప్రాంతాల్లో, సరిహద్దు భద్రత కోసం బీఎస్‌ఎఫ్ ప్రపంచస్థాయి సాంకేతిక పరిష్కారాలను ప్రయోగాత్మకంగా అమలు చేసిందని తెలిపారు. బీఎస్ఎఫ్ సిబ్బంది అనేక అంతర్గత పరిష్కారాలను కూడా అభివృద్ధి చేశారని, భౌగోళికంగా సవాలుతో కూడిన సరిహద్దుల భద్రత కోసం రూపొందించిన ఈ సాంకేతిక పురోగతులు రాబోయే రోజుల్లో దేశాన్ని సురక్షితంగా ఉంచడంలో సహాయపడతాయని ఆయన తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌లో.. బీఎస్‌ఎఫ్, సైన్యం అసమానమైన ధైర్యసాహసాలకు చక్కని ఉదాహరణను ప్రపంచానికి నిర్దేశించాయని కేంద్ర హోంమంత్రి వ్యాఖ్యానించారు.
1965, డిసెంబర్ 1న ప్రారంభమైన నాటి నుంచి, 2.75 లక్షల మంది సిబ్బందితో జల, భూ, వాయు భద్రతా విభాగాలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని సరిహద్దు భద్రతా దళాల్లో బీఎస్ఎఫ్ అగ్రగామిగా నిలిచి, తన పాత్రను అద్భుతంగా నిర్వర్తించిందని శ్రీ అమిత్ షా కొనియాడారు. ఒక పద్మ విభూషణ్, రెండు పద్మ భూషణ్, ఏడు పద్మశ్రీ, ఒక మహావీర్ చక్ర, ఆరు కీర్తి చక్ర, పదమూడు శౌర్య చక్ర, యాబై ఆరు ఆర్మీ పతకాలు సహా 1,246 పోలీసు శౌర్య పతకాలతో బీఎస్ఎఫ్ సిబ్బంది ధైర్యసాహసాలను దేశం ఎల్లప్పుడూ గౌరవిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇంతటి ప్రశంసలు అందుకున్న ఈ బలగాల అసాధారణ అంకితభావానికి ఇది నిదర్శనమని శ్రీ అమిత్ షా వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లలో, సుమారు 1.1 లక్షల కిలోగ్రాముల మాదకద్రవ్యాలను బీఎస్ఎఫ్ స్వాధీనం చేసుకోవడం ద్వారా, మాదకద్రవ్యాలపై పోరాటాన్ని మరింత బలోపేతం చేసిందన్నారు. గడిచిన ఐదేళ్ల కాలంలో 78 మందికి పైగా నక్సలైట్లను హతమార్చడం ద్వారా, నక్సల్ వ్యతిరేక కార్యకలాపాల్లో కూడా బీఎస్ఎఫ్ గణనీయ తోడ్పాటునందించినట్లు కేంద్ర హోంమంత్రి తెలిపారు.
బీఎస్ఎఫ్ సిబ్బంది ధైర్యసాహసాలకు నరేంద్ర మోదీ ప్రభుత్వం, హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) సహా యావత్ దేశం సంపూర్ణ మద్దతునిస్తుందని కేంద్ర హోంమంత్రి స్పష్టం చేశారు. బీఎస్ఎఫ్ సిబ్బంది పట్ల యావత్ దేశం సంపూర్ణ విశ్వాసం, గౌరవం కలిగి ఉందన్నారు.
****
(Release ID: 2130906)