హోం మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో ఈరోజు నూతన మల్టీ ఏజెన్సీ సెంటర్ (ఎమ్ఏసీ)ని ప్రారంభించిన కేంద్ర హోం, సహకార శాఖా మంత్రి శ్రీ అమిత్ షా
ప్రధానమంత్రి బలమైన రాజకీయ సంకల్పానికి, నిఘా సంస్థల కచ్చితమైన సమాచారానికి, త్రివిధ దళాల అద్భుత సామర్థ్యానికి ప్రత్యేక చిహ్నంగా ఆపరేషన్ సిందూర్
భారత త్రివిధ దళాలు, సరిహద్దు భద్రతా దళాలు, భద్రతా సంస్థలు దేశానికే గర్వకారణం
ఛత్తీస్‌గఢ్- తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టల కొండల్లో (కెజిహెచ్) నిర్వహించిన చరిత్రాత్మక నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ మన భద్రతా దళాల అద్భుత సమన్వయానికి నిదర్శనం
అన్ని భద్రతా సంస్థల ప్రయత్నాలను సమన్వయం చేస్తూ, ఈ కొత్త ఎమ్ఏసీ ప్రస్తుత సంక్లిష్ట.. పరస్పర అనుసంధానిత జాతీయ భద్రతా సవాళ్లను ఎదుర్కోవడం కోసం అనువైన, సమగ్రమైన వేదిక
ఉగ్రవాదం, తీవ్రవాదం, వ్యవస్థీకృత నేరాలు, సైబర్ దాడుల వంటి తీవ్రమైన ముప్పును ఎదుర్కొనే ప్రయత్నాలను ఈ కొత్త నెట్‌వర్క్ బలోపేతం చేస్తుంది
Posted On:
16 MAY 2025 6:01PM by PIB Hyderabad
కేంద్ర హోం, సహకార శాఖా మంత్రి శ్రీ అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో కొత్త మల్టీ ఏజెన్సీ సెంటర్ (ఎమ్ఏసీ)ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ అమిత్ షా మాట్లాడుతూ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దృఢ రాజకీయ సంకల్పానికి, నిఘా సంస్థల కచ్చితమైన సమాచారం, మన త్రివిధ దళాల సామర్థ్యానికి ఆపరేషన్ సిందూర్ ఒక ప్రత్యేక చిహ్నంగా నిలుస్తుందన్నారు. భారత త్రివిధ దళాలు, సరిహద్దు భద్రతా దళం, భద్రతా సంస్థలు దేశానికే గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.
ఇటీవల ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టల కొండల్లో (కెజిహెచ్) కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఏపీఎఫ్‌లు) నిర్వహించిన చరిత్రాత్మక నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ మన భద్రతా దళాల మధ్య అద్భుతమైన సమన్వయాన్ని ప్రదర్శించిందని కేంద్ర హోంమంత్రి వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా ఇదేవిధమైన సమన్వయం కనిపించిందన్నారు. బాధ్యతల నిర్వహణలో నిఘా సంస్థలు, త్రివిధ దళాల మధ్య ప్రక్రియలు, ఆలోచనల పరంగా చక్కటి సమన్వయాన్ని ఈ ఆపరేషన్ ప్రదర్శించిందని శ్రీ అమిత్ షా తెలిపారు.
ప్రస్తుతం మన ముందున్న సంక్లిష్టమైన, పరస్పర అనుసంధానితమైన జాతీయ భద్రతా సవాళ్ల పరిష్కారం కోసం అన్ని సంస్థల ప్రయత్నాలను సమన్వయం చేసే ఒక అనువైన, సమగ్రమైన వేదికను ఈ కొత్త ఎమ్ఏసీ అందిస్తుందని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. ఉగ్రవాదం, తీవ్రవాదం, వ్యవస్థీకృత నేరాలు, సైబర్ దాడుల వంటి తీవ్రమైన ముప్పును ఎదుర్కోవడానికి దేశం చేస్తున్న ప్రయత్నాలను ఈ కొత్త నెట్‌వర్క్ బలోపేతం చేయగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
కొత్త ఎమ్ఏసీ నెట్‌వర్క్ ఏర్పాటును ప్రశంసించిన శ్రీ అమిత్ షా... రికార్డు సమయంలో హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ సంబంధిత పనులు విజయవంతంగా పూర్తి చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్ఏసీ, జీఐఎస్ సేవలతో విస్తారమైన డేటాబేస్ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి ఏఐ/ఎమ్ఎల్ టెక్నిక్‌ల వంటి భవిష్యత్ సామర్థ్యాలను దీనిలో ఉపయోగించారని ఆయన తెలిపారు. కొత్త ఎమ్ఏసీ ఏర్పాటుతో అందుబాటులోకి వచ్చిన అధునాతన డేటా విశ్లేషణలను ఉపయోగించుకోవడానికి ఈ వేదికపై వివిధ కేంద్ర సంస్థల వద్ద ఉన్న ఇతర ముఖ్యమైన డేటా బేస్‌లన్నీ ఏకీకృతం చేయవలసిన అవసరాన్ని ప్రధానంగా ప్రస్తావించిన ఆయన భవిష్యత్తు రోడ్‌మ్యాప్‌ను కూడా వివరించారు. ఎమ్ఏసీ నెట్‌వర్క్‌లో ఉత్పత్తి చేసిన డేటా అనలిటిక్స్ నాణ్యతను ఈ కొత్త నెట్‌వర్క్ ఉన్నత స్థాయికి మెరుగుపరుస్తుందనీ, అలాగే కచ్చితమైన ట్రెండ్ విశ్లేషణ, హాట్‌స్పాట్ మ్యాపింగ్, టైమ్‌లైన్ విశ్లేషణలు అంచనాత్మక, కార్యాచరణ ఫలితాలను అందించేందుకు ఇది వీలు కల్పిస్తుందని శ్రీ అమిత్ షా వివరించారు. వ్యవస్థీకృత నేరాలతో సంక్లిష్టమైన సంబంధాలను కలిగి ఉన్న ఉగ్రవాద వ్యవస్థను ఎదుర్కోవడంలో కొత్త ఎమ్ఏసీ చాలా కీలకంగా వ్యవహరించగలదని ఆయన తెలిపారు.
దేశంలోని అగ్రగామి ఇంటెలిజెన్స్ ఫ్యుజన్ సెంటర్‌గా... మల్టీ ఏజెన్సీ సెంటర్ (ఎమ్ఏసీ) 2001 నుంచి కార్యకలాపాలు సాగిస్తోంది. ఎమ్ఏసీ సాంకేతిక నవీకరణ ప్రక్రియలో నిరంతరం కేంద్ర హోం మంత్రి చురుగ్గా మార్గనిర్దేశం చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరోతో కలిసి, కొత్త ఎమ్ఏసీ అన్ని నిఘా, భద్రతా సంస్థలను, చట్టాలను అమలు చేసే సంస్థలను, దర్యాప్తు సంస్థలను అనుసంధానించింది. 500 కోట్లకు పైగా ఖర్చుతో అమలు చేసిన కొత్త ఎమ్ఏసీ నెట్‌వర్క్ గుణాత్మక, పరిమాణాత్మక పరివర్తన సాధించింది. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న కొత్త ఎమ్ఏసీ నెట్‌వర్క్, దేశంలోని ద్వీప భాగాలు, తిరుగుబాటు ప్రభావిత ప్రాంతాలు, ఎత్తైన పర్వత భూభాగాలను అనుసంధానించింది. ఇది వేగవంతమైన, సురక్షితమైన స్వతంత్ర నెట్‌వర్క్‌తో మారుమూల ప్రాంతాల్లోని జిల్లాల ఎస్పీల స్థాయి వరకు సుదూర ప్రాంతాలను కచ్చితత్వంతో అనుసంధానిస్తుంది.
***
(Release ID: 2129304)
Read this release in:
Odia
,
Khasi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam