ప్రధాన మంత్రి కార్యాలయం
ఇండియా-యూకే మధ్య కుదిరిన పరస్పర ప్రయోజనకర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని, డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్‌ను స్వాగతించిన ప్రధానమంత్రి మోదీ, యూకే ప్రధాని స్టార్మర్
* ఈ ఒప్పందాలను ద్వైపాక్షిక సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో చారిత్రక మైలురాళ్లుగా అభివర్ణించిన ఇరువురు నాయకులు
* ఈ ఒప్పందాలు రెండు దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక సహకారాన్ని, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తాయి, ఉద్యోగాలను సృష్టిస్తాయి, రాకపోకలను పెంపొందిస్తాయి
* భారత్‌ను సందర్శించాలని పీఎం స్టార్మర్‌ను ఆహ్వానించిన ప్రధాని మోదీ
Posted On:
06 MAY 2025 6:28PM by PIB Hyderabad
బ్రిటన్ ప్రధాని సర్ కీర్ స్టార్మర్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు టెలిఫోన్లో సంభాషించారు. రెండు దేశాల మధ్య విజయవంతంగా కుదిరిన ప్రతిష్ఠాత్మకమైన, పరస్పర ప్రయోజనకరమైన ఇండియా-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని, డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్‌ను ఇరువురు నాయకులు స్వాగతించారు.
ద్వైపాక్షిక సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో కీలకమైన మైలురాయిగా దీనిని ఇరువురు నేతలు అభివర్ణించారు. ఇది రెండు ఆర్థిక వ్యవస్థల్లోనూ వాణిజ్యం, పెట్టుబడులు, ఆవిష్కరణలను ప్రోత్సహించడంతో పాటు, ఉద్యోగాల కల్పనకు దోహదపడుతుంది. ప్రపంచంలో పెద్దవైన, స్వేచ్చాయుత మార్కెట్ కలిగిన రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య కుదిరిన ఈ చారిత్రక ఒప్పందాలు.. వ్యాపారంలో కొత్త అవకాశాలను సృష్టిస్తాయని, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేస్తాయని, ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధాలను పెంపొందిస్తాయని ఇరుపక్షాల నాయకులు అంగీకరించారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థల మధ్య సంబంధాలను బలోపేతం చేసి, వాణిజ్య అవరోధాలను తగ్గించే అంశం.. దృఢమైన, సురక్షితమైన ఆర్థిక వ్యవస్థలను అందించాలనే తమ పరివర్తన ప్రణాళికలో భాగమని ప్రధాని స్టార్మర్ అన్నారు.
భారత్, యూకే మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాల విస్తరణ.. బలోపేతమవుతున్న బహుపాక్షిక భాగస్వామ్యంలో ప్రధానాంశంగా ఉంటుందని ఇద్దరు నాయకులు పేర్కొన్నారు. వస్తువులు, సేవల వాణిజ్యంలో సమతుల్యమైన, లాభధాయకమైన, ప్రతిష్ఠాత్మకమైన ఎఫ్‌టీఏ ఒప్పందం ద్వైపాక్షిక వాణిజ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది. అలాగే ఉపాధి కల్పనకు కొత్త మార్గాలను సృష్టిస్తుంది. జీవన ప్రమాణాలను మెరుగుపరిచి రెండు దేశాల ప్రజల సంక్షేమాన్ని పెంపొందిస్తుంది. ప్రపంచ మార్కెట్ అవసరాలకు తగిన విధంగా సంయుక్తంగా రూపొందించే ఉత్పత్తులు, సేవలు రెండు దేశాల కొత్త సామర్థ్యాన్ని వెలికితీస్తాయి. భారత్-యూకే మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య పునాదులపై ఏర్పాటైన ఈ ఒప్పందం సహకారం, సంక్షేమంలో కొత్త శకానికి మార్గం వేస్తుంది.
ప్రధాని స్టార్మర్‌ను భారత్‌ను సందర్శించాల్సిందిగా ప్రధానమంత్రి మోదీ ఆహ్వానించారు. ఇరుదేశాల నాయకులు సంప్రదింపులు కొనసాగించేందుకు అంగీకరించారు.
***
(Release ID: 2127358)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam