సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
గ్లోబల్ మీడియా డైలాగ్ 2025: వేవ్స్ డిక్లరేషన్‌ను అమలు చేస్తూ, ఏఐ యుగంలో సృజనాత్మకతను ప్రోత్సహిస్తూనే సంప్రదాయాలు, వారసత్వాల వాణిని వినిపించడంలో సహకారానికి అంగీకరించిన సభ్య దేశాలు
పక్షపాతాన్ని తగ్గించడం, కంటెంట్‌ను ప్రజాస్వామ్యీకరించడం, విలువలకు ప్రాధాన్యమివ్వడం ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల బాధ్యతాయుత వినియోగాన్ని ప్రోత్సహిస్తూ డిజిటల్ అంతరాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్న వేవ్స్ డిక్లరేషన్
ప్రపంచవ్యాప్తంగా పరస్పర అనుసంధాన మార్కెట్ల ప్రజలను ఏకం చేయడం, ఉమ్మడి సాంస్కృతిక పద్ధతులను ప్రోత్సహించడం, ఆవిష్కరణలను, అన్ని పరిస్థితులను ఎదుర్కోగల సామర్థ్యాన్ని పెంపొందించడంలో మీడియా – వినోద రంగాల శక్తిని చాటిన వేవ్స్ డిక్లరేషన్
సంబంధిత నైపుణ్యాభివృద్ధి ద్వారా సృజనాత్మక సహకార యుగానికి యువ ప్రతిభను సిద్ధం చేయడం అత్యంత కీలకం: విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్
ప్రపంచ సృజనాత్మక వారధిని ఆలోచనల ఎక్స్‌ప్రెస్‌వేగా విస్తరించడం కోసం సహ-నిర్మాణ ఒప్పందాలు, ఉమ్మడి నిధులు, డిక్లరేషన్‌పై దృష్టి సారించాలి: సమాచార, ప్రసార శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్
Posted On:
02 MAY 2025 3:20PM
|
Location:
PIB Hyderabad
"సృజనాత్మకతను ప్రోత్సహించడంలో ప్రపంచ సహకారాన్ని, అదే సమయంలో పరస్పర సాంస్కృతిక విధానాలను అర్థం చేసుకోవడం మన ముందున్న మార్గం." ప్రస్తుతం ముంబయిలో జరుగుతున్న ప్రపంచ ఆడియో విజువల్, ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్ 2025) లో భాగంగా నిర్వహించిన గ్లోబల్ మీడియా చర్చల తీర్మానాల్లో ఇది ఒకటి. డిజిటల్ అంతరాన్ని తగ్గించే మార్గంలో మనమంతా ముందుకు సాగుతున్న క్రమంలో దేశాల్లో సృజనాత్మకతను విస్తృతం చేయడం మన సమష్టి పురోగతికి కీలకం అని చర్చల్లో పాల్గొన్న దేశాలు అభిప్రాయపడ్డాయి. పెరుగుతున్న ప్రపంచీకరణ మీడియా వాతావరణం మధ్య ప్రపంచ శాంతి, సామరస్యాలను పెంపొందించడంలో ప్రభుత్వాల పాత్రను చర్చించిన అనంతరం సభ్యదేశాలన్నీ వేవ్స్ డిక్లరేషన్‌ను ఆమోదించడంతో ఈ చర్చలు ముగిశాయి.
ప్రపంచవ్యాప్తంగా గల విభిన్న సంస్కృతులను ప్రదర్శించే సినిమాలు ప్రజలను చేరువ చేయగల అపార సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయనే భావన గ్లోబల్ మీడియా చర్చల్లో ప్రతిధ్వనించింది. సభ్య దేశాలు ఈ విషయంలో భారతీయ చిత్రాల పాత్రను ప్రశంసించాయి. కథ చెప్పడం కోసం వినోదాత్మక రూపంగా ఉన్న సినిమాలు పరస్పర సహకారాన్ని పెంపొందించే బలమైన శక్తిగా పనిచేస్తాయి. వినోద ప్రపంచాన్ని పునర్నిర్వచిస్తూ కథ చెప్పే కళను సాంకేతికతతో మేళవించిన వ్యక్తిగత కథలు క్రియేటివ్ ఎకానమీలో బలమైన శక్తిగా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. "బాధ్యతాయుతమైన జర్నలిజం"ని పెంపొందించాల్సిన అవసరముందన్న కొన్ని సభ్య దేశాలు, వేవ్స్ ఫోరమ్‌లో పరస్పర సహకారాల ద్వారా దీనిని పరిష్కరించవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి.
వేవ్స్ 2025 ను ప్రపంచ సమాజపు సూక్ష్మ ప్రపంచంగా అభివర్ణించిన భారత విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్, మీడియా-వినోద రంగాల భవిష్యత్తు ప్రణాళికను చర్చించడానికి ఈ సమ్మిట్ కంటెంట్ క్రియేటర్లు, విధాన రూపకర్తలు, నటులు, రచయితలు, నిర్మాతలు, దృశ్య కళాకారులను ఒక ఉమ్మడి వేదికపైకి తీసుకువచ్చిందన్నారు.
తన ప్రసంగంలో డాక్టర్ జైశంకర్ గ్లోబల్ మీడియా డైలాగ్ 2025లో చర్చించే వివిధ అంశాలను గురించి ప్రస్తావించారు. బలమైన సాంస్కృతిక కోణాన్ని కలిగి ఉన్న ప్రపంచ క్రమం నేడు పరివర్తన దశలో ఉందని పేర్కొన్నారు. "మన సంప్రదాయాలు, వారసత్వం, ఆలోచనలు, అభ్యాసాలు, సృజనాత్మకతల గురించి మనం గళం వినిపించాల్సిన అవసరం ఎంతగానో ఉంది" అని ఆయన పిలుపునిచ్చారు.
విదేశీ వ్యవహారాల మంత్రి మాట్లాడుతూ... సాంకేతికత మన విస్తారమైన వారసత్వం గురించిన అవగాహనను బలోపేతం చేయగలదు. దాని గురించి స్పృహను పెంచుతుంది. ముఖ్యంగా యువతరాల కోసం ఇది చాలా ముఖ్యం. “సంబంధిత నైపుణ్యాభివృద్ధి ద్వారా సృజనాత్మక సహకారాల యుగానికి యువ ప్రతిభను సిద్ధం చేయడం చాలా ముఖ్యం. వికసిత్ భారత్ సాకారం దిశగా ముందడుగు వేయడంలో ఆవిష్కరణలు కీలకం” అని ఆయన స్పష్టం చేశారు.
ఏఐ అభివృద్ధి చెందుతున్న నేటి యుగంలో, ఊహించనన్ని అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని అయితే పక్షపాతాన్ని తగ్గించి, కంటెంట్‌ను ప్రజాస్వామ్యీకరిస్తూ, విలువలకు ప్రాధాన్యమిస్తూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి జై శంకర్ సూచించారు. "గ్లోబల్ కార్యాలయం, గ్లోబల్ సిబ్బంది కోసం, మనస్తత్వాలు, ఫ్రేమ్‌వర్క్స్, విధానాలు, అభ్యాసాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది" అని పేర్కొన్న ఆయన ప్రపంచ మీడియా-వినోద రంగం ముందున్న కీలక సమస్యలపై చర్చించే చక్కని వేదికగా వేవ్స్ పట్ల తన విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.
కేంద్ర సమాచార, ప్రసార మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ తన ప్రారంభోపన్యాసంలో ఈ చర్చలను స్వాగతించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్కృతి సృజనాత్మకతను ప్రేరేపిస్తుందనీ, ఇది సరిహద్దులతో సంబంధం లేకుండా ప్రజలందరినీ ఏకం చేస్తుందన్నారు. సాంకేతికత మనం కథలను చెప్పే విధానాన్ని పునర్నిర్మిస్తున్నందున కంటెంట్ క్రియేషన్, వినియోగం వేగంగా మారుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. స్థానిక కంటెంట్ క్రియేషన్‌ను ప్రోత్సహించాల్సిన దశలో మనం ఉన్నామని ఆయన పేర్కొన్నారు.
కలల నగరమైన ముంబయికి 77 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులను స్వాగతించిన శ్రీ వైష్ణవ్, సహకారం పోషించే కీలక పాత్రను ప్రధానంగా ప్రస్తావించారు. ఉమ్మడి విజయం కోసం డిజిటల్ అంతరాన్ని తగ్గించడం, సోదరభావం, ప్రపంచ శాంతి, సామరస్యాలను పెంపొందించడంలో సహాయపడే సహ-నిర్మాణ ఒప్పందాలు, ఉమ్మడి నిధులు, డిక్లరేషన్లపై దృష్టి సారించాలని సూచించారు. ఈ విధంగా మనం ప్రపంచ సృజనాత్మక వారధిని ఆలోచనల ఎక్స్‌ప్రెస్‌వేగా విస్తరించాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
చర్చల సందర్భంగా, అత్యంత అనుభవం గల మంత్రుల స్థాయి ప్రతినిధులు వారి అభిప్రాయాలను వ్యక్తం చేసిన అనంతరం... వేవ్స్ మొదటి సీజన్ ద్వారా 32 క్రియేట్ ఇన్ ఇండియా పోటీల్లో పాల్గొని ప్రపంచవ్యాప్తంగా 700ల మంది ప్రముఖ క్రియేటర్లు వారి ప్రతిభకు తగిన గుర్తింపును పొందినట్లు సభ్య దేశాలకు భారత్ తెలియజేసింది. తదుపరి ఎడిషన్ నుంచి, ఈ పోటీలను 25 ప్రపంచ భాషల్లో నిర్వహిస్తామని తెలిపిన భారత్.. తద్వారా ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో సృజనాత్మక ప్రతిభను వెలికితీసే అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. వేవ్స్ వేదికగా వారి సృజనాత్మక కంటెంట్‌ను ప్రదర్శించేందుకు ఇది వారికి ఎంతగానో సహాయపడుతుంది.
ఈ కార్యక్రమానికి హాజరైన ఇతర ప్రముఖుల్లో భారత ప్రభుత్వ సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్, కార్యదర్శి (ఐ&బి) శ్రీ సంజయ్ జాజు, భారత ప్రభుత్వ సీనియర్ అధికారులు ఉన్నారు.
***
Release ID:
(Release ID: 2126315)
| Visitor Counter:
26
Read this release in:
English
,
Khasi
,
Urdu
,
Marathi
,
Nepali
,
Hindi
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam