సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
గౌరవ ప్రధానమంత్రి దార్శనికతలో భాగమైన వేవ్స్…. వినోద రంగానికి ముఖ్యమైన వేదిక: షారుఖ్ ఖాన్
ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు చౌక ధరలకే సినిమాలు ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది: షారూఖ్ ఖాన్
సరైన సమయంలో అన్ని మీడియా వేదికలను ఐక్యం చేసిన వేవ్స్: దీపికా పదుకొనే
రాబోయే కాలంలో వేవ్స్ స్ఫూర్తిగా భారత సాఫ్ట్ పవర్ ముందడుగు వేసేందుకు సిద్ధమైంది: కరణ్ జోహార్
प्रविष्टि तिथि:
01 MAY 2025 6:50PM
|
Location:
PIB Hyderabad
వినోద రంగాన్ని మరింత బలోపేతం చేసే సామర్థ్యంతో వేవ్ సమ్మిట్‌ను రూపొందించి, ఈ రంగంలోని అన్ని విభాగాలను ఒకచోట చేర్చిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ప్రముఖ నటుడు, చిత్రనిర్మాత షారుఖ్ ఖాన్ చిత్ర పరిశ్రమ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేదిక వినోద రంగానికి ఎంతో సందర్భోచితమైనదనీ, అలాగే ఇది వివిధ రంగాల్లో ప్రభుత్వం నుంచి అత్యంత అవసరమైనఅనుసంధానతనీ, మద్దతును అందిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఫిల్మ్-షూటింగ్ గమ్యస్థానంగా భారత్ కలిగి ఉన్న అపారమైన అవకాశాల గురించిఆయన మాట్లాడారు. ‘భారతదేశంలో అంతర్జాతీయ చిత్ర నిర్మాతలు సినిమా చేయడానికి తదుపరి గమ్యస్థానంగా భారత్‌కున్న అర్హతలను షారూఖ్ ఖాన్ పంచుకున్నారు. భారత వినోద రంగ రూపకల్పనలో, దానిని బలోపేతం చేయడంలో అంతర్జాతీయ చలనచిత్ర సంస్థలు, పరిశ్రమలతో చేసుకున్న వివిధ రకాల ఒప్పందాల ఫలితాలను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు.
ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల ప్రేక్షకులకు భారతీయ సినిమాను మరింతచౌకగా అందించాల్సిన అవసరముందని షారూఖ్ ఖాన్ పేర్కొన్నారు. ఈ నగరాలకు సింగిల్-స్క్రీన్ సినిమా అనుభవాన్ని తీసుకురావాలని అభిప్రాయపడిన ఆయన, దానివల్ల సినిమాలు ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ కాగలవని తెలిపారు.
నటి దీపికా పదుకొనే మాట్లాడుతూ…. వేవ్స్ ప్రాముఖ్యత గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. మీడియా-వినోద రంగాల్లోని వివిధ మాధ్యమాలను సరైన సమయంలో వేవ్స్ ఏకం చేసిందన్నారు. ఈ రంగంలోని వివిధ విభాగాలు కలిసి పనిచేయడం అరుదనీ, అయితే వేవ్స్ విస్తృత పరిధిని కలిగి ఉన్నందున సినిమాలు, ఓటీటీ, యానిమేషన్, ఏఐ, ఇతర ఆసక్తికరమైన సాంకేతికతలను సమష్టిగా రూపొందించే అవకాశం లభిస్తుందన్నారు.
వేవ్ సమ్మిట్ మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ‘ది జర్నీ: ఫ్రమ్ అవుట్ సైడర్ టు రూలర్’ కార్యక్రమంలో చిత్ర నిర్మాత కరణ్ జోహార్‌తో నటులు షారూఖ్ ఖాన్, దీపికా పదుకొనేలు ఆసక్తికరమైనచర్చ నిర్వహించారు. చిత్ర పరిశ్రమలో వారి ప్రయాణం గురించీ, అలాగే వారు తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న విధానం గురించి తమ భావాలను పంచుకున్నారు. ‘ఔట్‌సైడర్-ఇన్‌సైడర్’ ట్యాగ్‌లపై తన అభిప్రాయాలను పంచుకున్న షారుఖ్ ఖాన్, కష్టపడి పనిచేయడం, పట్టుదలకు ప్రత్యామ్నాయం లేని రంగంగా సినిమా పరిశ్రమను పరిగణించాలని యువతకు పిలుపునిచ్చారు.
నేటి సోషల్ మీడియా, ఇమేజ్ మేనేజ్‌మెంట్ యుగంలో వినోద రంగంలో వస్తున్న మార్పులను గురించి మాట్లాడుతూ, ఈ రంగంలోకి కొత్తగా వచ్చే వారు... ఇమేజ్ కంటే వారి నైపుణ్యాలపైనే దృష్టి పెట్టాలని షారూఖ్ ఖాన్ సూచించారు. ప్రతి ఒక్కరూ వారి ప్రత్యేక బలాలు, సామర్థ్యాల ద్వారా స్వయంగా తమకంటూ ఒక గుర్తింపును తెచ్చుకునే సమయం ఆసన్నమైందని పదుకొనే అన్నారు.
కార్యక్రమం ముగింపు సందర్భంగా ప్రముఖ చిత్ర నిర్మాత కరణ్ జోహార్ మాట్లాడుతూ భారత్‌ను సాఫ్ట్ పవర్‌గా అభివర్ణించారు.వేవ్స్ కారణంగా రాబోయే కాలంలో ఈ సాఫ్ట్ పవర్ మరింత ముందడుగు వేసేందుకు సిద్ధమైందన్నారు.
***
रिलीज़ आईडी:
2126001
| Visitor Counter:
43