ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి అధ్యక్షతన 46వ ‘ప్రగతి’ సమావేశం
· రూ.90,000 కోట్లకుపైగా విలువైన 8 కీలక ప్రాజెక్టులపై సమీక్ష · లబ్ధిదారుల గుర్తింపులో బయోమెట్రిక్స్ ఆధారిత ఆధార్ ప్రామాణీకరణ లేదా ధ్రువీకరణను కచ్చితంగా పాటించాలని అన్ని మంత్రిత్వ శాఖలు-విభాగాలకు ఆదేశం · విస్తృత పట్టణ ప్రణాళికల రూపకల్పనలో నగర వృద్ధి పయనానికి తగినట్లు రింగ్ రోడ్‌ను కీలక భాగంగా అనుసంధానించాలని సూచన · జల పర్యాటకం విస్తరణకు ఉత్తేజిమిచ్చేలా బలమైన సామాజిక సంధానం దిశగా కృషి చేయాలని జలమార్గాల అభివృద్ధి ప్రాజెక్టుపై సమీక్ష సందర్భంగా ఆదేశం · దూరదృష్టితో కూడిన.. సమగ్ర ప్రణాళికల రూపకల్పనకు వీలుగా ‘పిఎం గతిశక్తి’ సహా ఇతర సమీకృత వేదికల వంటి ఉపకరణాల వినియోగ ప్రాధాన్యాన్ని పునరుద్ఘాటించిన ప్రధాని
Posted On:
30 APR 2025 8:41PM by PIB Hyderabad
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో చురుకైన పాలన, సకాలంలో ప్రాజెక్టుల అమలుకు ఉద్దేశించిన ‘ఐసిటి’ ఆధారిత బహుళ రంగ వేదిక ‘ప్రగతి’ 46వ సమావేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా దేశంలోని వివిధ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో కొనసాగుతున్న దాదాపు రూ.90,000 కోట్ల విలువైన 8 కీలక ప్రాజెక్టులను ఆయన సమీక్షించారు. వీటిలో 3 రహదారి ప్రాజెక్టులు కాగా- రైల్వేలు, ఓడరేవులకు సంబంధించి రెండేసి, నౌకాయానం-జలమార్గాల ప్రాజెక్టు ఒకటి ఉన్నాయి.
ప్రధానమంత్రి మాతృ వందన యోజన (పిఎంఎంవివై) సంబంధిత ఫిర్యాదుల పరిష్కారంపై సమీక్ష సందర్భంగా- లబ్ధిదారుల గుర్తింపులో బయోమెట్రిక్స్ ఆధారిత ఆధార్ ప్రామాణీకరణ లేదా ధ్రువీకరణను కచ్చితంగా పాటించాలని అన్ని మంత్రిత్వ శాఖలు-విభాగాలను ఆయన ఆదేశించారు. ఈ పథకం పరిధిలోకి మరిన్ని కార్యక్రమాలను చేర్చేందుకు గల అవకాశాలను పరిశీలించాల్సిందిగా ప్రధానమంత్రి సూచించారు. ముఖ్యంగా- బాలల సంరక్షణకు ప్రోత్సాహం, ఆరోగ్యం-పరిశుభ్రత పద్ధతుల మెరుగుదల, పరిశుభ్రతకు భరోసా, బాలింతలు-నవజాత శిశువుల సమగ్ర శ్రేయస్సుకు దోహదపడే ఇతరత్రా అంశాల పరిష్కారం వగైరాలపై దృష్టి సారించాలని ఆదేశించారు.
రింగ్ రోడ్డు నిర్మాణ సంబంధిత మౌలిక సదుపాయాల ప్రాజెక్టుపై సమీక్ష సందర్భంగా- విస్తృత పట్టణ ప్రణాళికల రూపకల్పనలో నగర వృద్ధి పయనానికి తగినట్లు రింగ్ రోడ్‌ను కీలక భాగంగా అనుసంధానించాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ అభివృద్ధి యావత్తూ రాబోయే 25-30 ఏళ్లలో నగర వృద్ధి పథానికి అనుగుణంగా, దానికి మద్దతిచ్చేదిగా సమగ్ర రీతిలో సాగాలని ఆయన వివరించారు. ముఖ్యంగా- స్వీయ సుస్థిరతకు దోహదం చేసే అంశాలపై నిశిత దృష్టితో వివిధ ప్రణాళిక నమూనాలను అధ్యయనం చేయాలని కోరారు. రింగ్ రోడ్డు సమర్థ నిర్వహణ, దీర్ఘకాలిక ఆచరణ సాధ్యత నేపథ్యంలో ఇదెంతో కీలకమని పేర్కొన్నారు. ప్రజా రవాణా అనుబంధితం, సుస్థిర ప్రత్యామ్నాయంగా నగర రవాణా మౌలిక సదుపాయాలలో సర్క్యులర్ రైల్ నెట్‌వర్క్‌ను ఏకీకృతం చేసే అవకాశాలను పరిశీలించాలని కూడా కోరారు.
జలమార్గ అభివృద్ధి ప్రాజెక్టుపై సమీక్ష సందర్భంగా- జల పర్యాటకం విస్తరణకు ఉత్తేజమిచ్చేలా బలమైన సామాజిక సంధానానికి కృషి చేయాలని ప్రధానమంత్రి ఆదేశించారు. వ్యాపారాభివృద్ధికి... ప్రత్యేకించి ‘ఒక జిల్లా-ఒక ఉత్పత్తి’ (ఒడిఒపి) కార్యక్రమం సంబంధిత చేతివృత్తులవారికి, వ్యాపార-వాణిజ్య స్థాపకులకు అవకాశాల సృష్టి ద్వారా బలమైన స్థానికావరణ వ్యవస్థ వికాసానికి ఇది దోహదం చేస్తుందని చెప్పారు. సామాజిక భాగస్వామ్యం పెంపు లక్ష్యంగాగల ఈ విధానం దాంతోపాటు జలమార్గాల వెంబడిగల ప్రాంతాల్లో జీవనోపాధి కల్పన సహా ఆర్థిక కార్యకలాపాలకు ఉత్తేజమివ్వగలదని వివరించారు. ఇటువంటి దేశీయ జలమార్గాలు పర్యాటక ప్రగతికీ సారథ్యం వహించగలవని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
దూరదృష్టితో కూడిన, సమగ్ర ప్రణాళికల రూపకల్పనకు వీలుగా ‘పిఎం గతిశక్తి’ సహా ఇతర సమీకృత వేదికల వంటి ఉపకరణాల వినియోగ ప్రాధాన్యాన్ని ఈ సమీక్ష సందర్భంగా ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. వివిధ రంగాల మధ్య సమన్వయ సాధనతోపాటు సమర్థ మౌలిక సదుపాయాల కల్పనకు ఈ ఉపకరణాల వినియోగం ఎంతో కీలకమని ఆయన వివరించారు.
సమాచార సహిత నిర్ణయాలు, సమర్థ ప్రణాళికల కోసం విశ్వసనీయ, వర్తమాన సమాచారం ఎంతో అవసరం. కాబట్టి, భాగస్వామ్య వ్యవస్థలన్నీ తమ సంబంధిత సమాచార భాండాగారాలను క్రమం తప్పకుండా నవీకరిస్తూ, కచ్చితంగా నిర్వహించాలని ప్రధానమంత్రి ఆదేశించారు.
‘ప్రగతి’ వేదికపై ప్రస్తుత 46వ సమావేశాల వరకూ మొత్తం రూ.20 లక్షల కోట్లకుపైగా విలువైన 370 ప్రాజెక్టుల మీద సమీక్ష పూర్తయింది.
***
(Release ID: 2125677)
|