ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రోజ్ గార్ మేళా కింద 51,000 పైగా నియామక పత్రాల పంపిణీ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 26 APR 2025 1:08PM by PIB Hyderabad

నమస్కారం!

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 51,000 మందికి పైగా యువతకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలను ఈరోజు జారీ చేశాం. కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖల్లో మీ యువతకు బాధ్యతల కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. దేశ అంతర్గత భద్రతను బలోపేతం చేయడం మీ కర్తవ్యం. దేశంలో ఆధునిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం మీ కర్తవ్యం.  కార్మికుల జీవితాల్లో మెరుగైన మార్పులు తేవడం మీ కర్తవ్యం. మీరు మీ విధులను ఎంత చిత్తశుద్ధితో, నిజాయితీగా నిర్వహిస్తే, అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగే దిశగా భారత్ ప్రయాణంపై దాని ప్రభావం మరింత గణనీయంగా, సానుకూలంగా ఉంటుంది. మీరు మీ బాధ్యతలను అత్యంత అంకితభావంతో నిర్వహిస్తారని నేను విశ్వసిస్తున్నాను.

మిత్రులారా,

ఏ దేశ పురోగతికైనా, విజయానికైనా పునాది ఆ దేశ యువతలోనే ఉంటుంది. దేశ నిర్మాణంలో యువత చురుగ్గా పాల్గొంటే దేశం వేగంగా పురోగమించి ప్రపంచ వేదికపై తన ఉనికిని చాటుకుంటుంది. ఈ రోజు, భారతదేశ యువత తమ కృషి, ఆవిష్కరణల ద్వారా, మన దేశంలో ఉన్న అపారమైన సామర్థ్యాన్ని ప్రపంచానికి ప్రదర్శిస్తున్నారు. మా ప్రభుత్వం ప్రతి దశలో దేశ యువతకు ఉద్యోగావకాశాలు, స్వయం ఉపాధి అవకాశాలు పెరిగేలా చర్యలు తీసుకుంటోంది. స్కిల్ ఇండియా, స్టార్ట్అప్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి విభిన్న కార్యక్రమాలు ఈ దిశగా యువత కోసం కొత్త అవకాశాల ద్వారాలను తెరవడంలో సహాయపడుతున్నాయి. ఈ కార్యక్రమాల ద్వారా భారత యువత తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఒక బహిరంగ వేదికను కల్పిస్తున్నాం. తత్ఫలితంగా, ఈ దశాబ్దంలో, మన యువత సాంకేతికత, డేటా, ఆవిష్కరణ వంటి రంగాలలో భారతదేశాన్ని ప్రపంచంలోనే ముందంజలో ఉంచింది.

మిత్రులారా,

యూపీఐ, ఓఎన్డీసీ, ప్రభుత్వ ఈ-మార్కెట్‌ప్లేస్ (జీఈఎమ్) వంటి డిజిటల్ ప్లాట్‌ఫారాల విజయాలు నేడు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో మార్పునకు మన యువత ఎలా నాయకత్వం వహిస్తుందో సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం, ప్రపంచంలోనే అత్యధిక రియల్ టైమ్ డిజిటల్ లావాదేవీలు భారత్‌లోనే నమోదవుతున్నాయి,ఈ గొప్ప విజయానికి ఘనత మన యువతకే చెందుతుంది.

మిత్రులారా,

ఈ ఏడాది బడ్జెట్ లో ప్రభుత్వం మాన్యుఫ్యాక్చరింగ్ మిషన్ ను ప్రకటించింది. 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమాన్ని ప్రోత్సహించడం, అంతర్జాతీయ ప్రమాణాల ఉత్పత్తులను తయారు చేయడానికి భారతీయ యువతకు అవకాశాలను కల్పించడం దీని లక్ష్యం. ఈ మిషన్ లక్షలాది ఎంఎస్ఎంఈలు, చిన్న పారిశ్రామికవేత్తలకు గణనీయమైన ప్రోత్సాహాన్ని ఇవ్వడమే కాకుండా, దేశవ్యాప్తంగా కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నాయి. ఈరోజు, భారతదేశ యువతకు అపూర్వమైన అవకాశాలను మనం చూస్తున్నాం. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ పురోగమిస్తోందని ఇటీవల అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ స్పష్టం చేసింది. ఈ విశ్వాసం,  వృద్ధి అనేక కోణాలను కలిగి ఉంది. వాటిలో ముఖ్యమైనది వచ్చే రోజుల్లో ప్రతి రంగంలో ఉద్యోగ అవకాశాల పెరుగుదలగా భావించాలి.  ఇటీవలి కాలంలో మన ఉత్పత్తి,  ఎగుమతులు కొత్త మైలురాళ్లను అధిగమించాయి, ముఖ్యంగా ఆటోమొబైల్ పాదరక్షల పరిశ్రమల్లో- ఇవి యువతకు విశేషంగా ఉపాధి కల్పిస్తున్న రంగాలు. తొలిసారిగా  ఖాదీ,గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తులు రూ. 1.70 లక్షల కోట్ల టర్నోవర్‌ను అధిగమించి దాదాపు రూ. 1.75 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో లక్షలాది కొత్త ఉద్యోగాలను సృష్టించడంలో దోహదపడ్డాయి. కొద్ది రోజుల క్రితం ఇన్ లాండ్ వాటర్ ట్రాన్స్ పోర్ట్ రంగంలో దేశం సాధించిన మరో అద్భుత విజయం వెలుగులోకి వచ్చింది. 2014కు ముందు మన దేశంలో ఇన్ లాండ్ వాటర్ ట్రాన్స్ పోర్ట్ ద్వారా సరుకు రవాణా ఏడాదికి 18 మిలియన్ టన్నులు మాత్రమే. అయితే, ఈ సంవత్సరం, ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ ద్వారా సరుకు రవాణా అనూహ్యంగా పెరిగింది, ఇది 145 మిలియన్ టన్నులను దాటింది. నిరంతరం విధానాలను రూపొందించడం, ప్రగతికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం వల్లే భారత్ ఈ విజయాన్ని సాధించింది. గతంలో దేశంలో కేవలం ఐదు జాతీయ జలమార్గాలు మాత్రమే ఉండేవి. నేడు ఈ సంఖ్య 110కి పెరిగింది. ఇంతకు ముందు, ఈ జలమార్గాల నిర్వహణ పొడవు సుమారు 2,700 కిలోమీటర్లు - 2500 కిలోమీటర్ల కంటే కొంచెం ఎక్కువ. ఇప్పుడు ఇది దాదాపు 5,000 కిలోమీటర్లకు విస్తరించింది. ఇన్ని విజయాల ఫలితంగా దేశవ్యాప్తంగా యువతకు ఎన్నో కొత్త అవకాశాలు లభిస్తున్నాయి.

మిత్రులారా,

వరల్డ్ ఆడియో విజువల్,  ఎంటర్టైన్మెంట్ సమ్మిట్-వేవ్స్ 2025 రాబోయే రోజుల్లో ముంబయిలో జరగనుంది. దేశ యువతే ఈ కార్యక్రమానికి కేంద్ర బిందువుగా నిలుస్తున్నారు. భారతదేశం అంతటా ఉన్న యువ సృష్టికర్తలకు ఇటువంటి ప్రతిష్టాత్మక వేదిక అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి. మీడియా, గేమింగ్, వినోద రంగాల్లోని ఆవిష్కర్తలు తమ ప్రతిభను ప్రదర్శించడానికి ఇది అపూర్వ అవకాశాన్ని అందిస్తుంది. వినోద రంగంలోని స్టార్టప్ లు ఇన్వెస్టర్లు, పరిశ్రమల నేతలతో అనుసంధానం అయ్యే వేదికగా ఇది ఉపయోగపడుతుంది. తమ ఆలోచనలను ప్రపంచ ప్రేక్షకులకు అందించడానికి ఇది అతిపెద్ద వేదిక అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎక్స్ఆర్, ఇమ్మర్సివ్ మీడియా వంటి అత్యాధునిక టెక్నాలజీలను అన్వేషించడానికి, అర్థం చేసుకోవడానికి యువతకు అవకాశం ఉంటుంది. ఇందుకోసం వివిధ రకాల వర్క్ షాప్ లు నిర్వహించనున్నారు. భారత్ లో డిజిటల్ కంటెంట్ భవిష్యత్తులోకి కొత్త శక్తిని జొప్పించేందుకు వేవ్స్ సిద్ధంగా ఉంది.

మిత్రులారా,

ఈరోజు భారత యువత సాధిస్తున్న విజయాల్లో అత్యంత అభినందనీయం అయిన అంశం దాని సమగ్రత. భారత్ నెలకొల్పుతున్న రికార్డులు సమాజంలోని అన్ని వర్గాల ప్రజల పెరుగుతున్న భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి ఇంకా, మన అమ్మాయిలు  ఇప్పుడు ముందుండి నాయకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన యూపీఎస్సీ  ఫలితాలు దీనికి ఉదాహరణ. మొదటి రెండు స్థానాలు అమ్మాయిలే సాధించగా, మొదటి ఐదుగురిలో ముగ్గురు మహిళలు ఉన్నారు.

బ్యూరోక్రసీ, అంతరిక్ష పరిశోధన, శాస్త్ర సాంకేతిక రంగాల్లో మన మహిళలు కొత్త శిఖరాలకు చేరుతున్నారు. గ్రామీణ మహిళలకు సాధికారత కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. స్వయం సహాయక బృందాలు, బీమా సఖి, బ్యాంక్ సఖి, కృషి సఖి వంటి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాలలో మహిళలకు కొత్త అవకాశాలను కల్పిస్తున్నాయి. నేడు, దేశవ్యాప్తంగా వేలాది మంది మహిళలు డ్రోన్ దీదీలుగా మారడం ద్వారా తమ కుటుంబాల,  గ్రామాల అభివృద్ధికి దోహదపడుతున్నారు. ప్రస్తుతం దేశంలో 90 లక్షలకు పైగా స్వయం సహాయక సంఘాలు ఉండగా, ఇందులో 10 కోట్ల మంది మహిళలు ఉన్నారు. వారి సామర్థ్యాన్ని పెంచడానికి మా ప్రభుత్వం బడ్జెట్ ను ఐదు రెట్లు పెంచింది. ఈ గ్రూపులకు ఎలాంటి పూచీకత్తు అవసరం లేకుండా రూ.20 లక్షల వరకు రుణాలు అందించేలా ఏర్పాట్లు జరిగాయి. ముద్రా పథకంలో కూడా లబ్ధిదారుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. ప్రస్తుతం భారత్ లో 50 వేలకు పైగా స్టార్టప్ లకు మహిళలు డైరెక్టర్లుగా పనిచేస్తున్నారు. అన్ని రంగాలలో ఇటువంటి మార్పులు వికసిత భారత్ దార్శనికతను బలోపేతం చేస్తున్నాయి. ఇదే సమయంలో ఉపాధి,  స్వయం ఉపాధి అవకాశాలను గణనీయంగా విస్తరిస్తున్నాయి.

మిత్రులారా,

మీరంతా మీ అంకితభావం, కృషితో ఈ స్థానానికి చేరుకున్నారు. మీ జీవితంలో రాబోయే దశలను మీ వ్యక్తిగత ఎదుగుదలకు మాత్రమే కాకుండా దేశ సేవకు కూడా అంకితం చేయాల్సిన సమయం ఇది. ప్రజాసేవ భావన ఎల్లప్పుడూ ముందుండాలి. మీరు మీ కర్తవ్యాన్ని అత్యున్నత సేవగా భావించినప్పుడు, మీ చర్యలకు దేశాన్ని కొత్త దిశగా నడిపించే శక్తి కలుగుతుంది. మీ కర్తవ్య భావన, మీ ఆవిష్కరణలు, మీ అచంచలమైన నిబద్ధత ద్వారా భారత్‌లో ప్రతి పౌరుడి జీవితం మెరుగుపడుతుంది.

మిత్రులారా,

మీరు బాధ్యతాయుతమైన స్థానాన్ని చేపట్టినప్పుడు, పౌరుడిగా మీ విధులు, పాత్ర కూడా మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. మీలో ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.  పౌరులుగా మన బాధ్యతలను నెరవేర్చడంలో కూడా మనం వెనుకబడకూడదు. ఒక ఉదాహరణ చెబుతాను. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 'ఏక్ పేడ్ మా కే నామ్' పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ రోజు మీరు ఉన్న స్థానానికి చేరుకోవడంలో, జీవితంలో ఈ కొత్త దశను ప్రారంభించడంలో, మీ మాతృమూర్తులు నిస్సందేహంగా అత్యంత కీలకమైన పాత్రను పోషించారు. మీరు కూడా మీ తల్లి పేరు మీద ఒక చెట్టును నాటి ప్రకృతికి సేవ చేస్తూ కృతజ్ఞత తెలియజేయాలి. మీరు పనిచేసే కార్యాలయంలో కూడా సాధ్యమైనంత ఎక్కువ మందిని ఈ ప్రచారంలో పాల్గొనేలా ప్రోత్సహించండి.

మీరు మీ వృత్తిపరమైన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నప్పుడు, జూన్ నెల అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కూడా తీసుకువస్తుందని గమనించాలి. ఇది ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది. ఇలాంటి ముఖ్యమైన సందర్భంలో, విజయవంతమైన వృత్తి ప్రయాణాన్ని ప్రారంభించడంతో పాటు, మీరు యోగా ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని కూడా స్వీకరించాలి. మీ వ్యక్తిగత ఆరోగ్యం మీకు మాత్రమే కాదు, మీ పని సామర్థ్యానికి,  దేశం మొత్తం ఉత్పాదకతకు కూడా చాలా అవసరం.

మీ సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి  మిషన్ కర్మయోగిని పూర్తిగా ఉపయోగించుకోండి. మీ పని ఉద్దేశం కేవలం ఒక హోదాను సాధించడానికి మాత్రమే పరిమితం కాకూడదు. భారతదేశంలోని ప్రతి పౌరుడికి సేవ చేయడం, దేశ పురోగతికి అర్థవంతంగా తోడ్పడటం మీ పాత్ర. కొద్దిరోజుల క్రితం, సివిల్ సర్వీసెస్ దినోత్సవం సందర్భంగా నేను ఒక మార్గదర్శక మంత్రాన్ని పంచుకున్నాను. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఒక ముఖ్యమైన సూత్రాన్ని అత్యంత ప్రాధాన్యంగా పరిగణించాలి అని నేను చెప్పాను, ఆ మంత్రం- నాగరిక్ దేవో భవ — పౌరుడు దేవుడితో సమానం. పౌరులకు సేవ చేయడం అనేది మీకు, మనందరికీ భగవంతుని ఆరాధించడంతో సమానం. ఈ మంత్రాన్ని ఎప్పుడూ మీ హృదయంలో నిలిపించుకోండి. మన సామర్థ్యం,  నిజాయితీతో కలిసి, భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మాత్రమే కాకుండా, సుసంపన్నమైన భారత్‌ను నిర్మిస్తామని నేను పూర్తి విశ్వాసంతో ఉన్నాను.

మీకు, మీ కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీకు కలలు ఉన్నట్లే, 140 కోట్ల మంది తోటి భారతీయులు కూడా కలలు కంటున్నారు. మీ కలలను సాకారం చేసుకోవడానికి మీకు అవకాశం లభించినట్లే, 140 కోట్ల మంది పౌరుల కలలను సాకారం చేయడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడం ఇప్పుడు మీ కర్తవ్యం. మీరు చేపట్టిన పదవికి గౌరవం తెస్తారని, మీ జీవితాన్ని అర్థవంతంగా, అదృష్టంగా మలచుకోవడానికి మీ సమయాన్ని, శక్తిని అంకితం చేస్తారని నేను విశ్వసిస్తున్నాను.

సాదర శుభాకాంక్షలతో, మీ ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.

గమనిక: ఇది ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి సుమారు అనువాదం.  

 

***


(Release ID: 2124776)