సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
భారతీయ చలనచిత్రాల జాతీయ మ్యూజియాన్ని సందర్శించిన అధికార భాషా పార్లమెంటరీ సంఘం
Posted On:
23 APR 2025 11:27AM by PIB Hyderabad
అధికార భాషపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ సంఘం సభ్యులు మంగళవారం ముంబయిలో జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్ఎఫ్‌డీసీ)తో పాటు భారతీయ చలనచిత్రాల జాతీయ మ్యూజియాన్ని కూడా సందర్శించారు.
ప్రతినిధి వర్గంలో పార్లమెంట్ సభ్యులు శ్రీ శంకర్ లాల్‌వానీ (ఇండోర్), శ్రీ హరిభాయి పటేల్ (మెహ్‌సాణా), శ్రీ కుల్‌దీప్ ఇందౌరా (గంగానగర్), డాక్టర్ సుమేర్ సింగ్ సోలంకీ (రాజ్యసభ), శ్రీ జియా వుర్ రహమాన్ (సంభల్)లతోపాటు సంఘం కార్యదర్శి శ్రీ ప్రేం నారాయణ్ కూడా ఉన్నారు.
పార్లమెంటరీ సంఘ సభ్యులకు ఎన్ఎఫ్‌డీసీ జనరల్ మేనేజర్ శ్రీ డి. రామకృష్ణన్, ఇతర సీనియర్ అధికారులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ ఆర్థిక సలహాదారు శ్రీ రవీంద్ర కుమార్ జైన్ కూడా పాల్గొన్నారు.
కమిటీ సభ్యులకు మ్యూజియంను చూపించే బాధ్యతను ఎన్ఎంఐసీ మార్కెటింగ్, ప్రజా సంబంధాల మేనేజరు జయితా ఘోష్‌తోపాటు డిప్యూటీ జనరల్ మేనేజర్, క్యూరేటర్ శ్రీ సత్యజిత్ మాండలే తీసుకున్నారు. అధికార భాషా సంఘం సభ్యులు భారతీయ చలనచిత్ర చరిత్ర, చలనచిత్ర రంగం సాధించిన సాంకేతిక ప్రగతి, అపురూప పోస్టర్లు, అమిత శ్రద్ధాసక్తులతో సేకరించి పదిలపరచిన వస్తువులు... వీటిని గురించి అనేక విషయాలను తెలుసుకోగలిగారు.
ప్రదర్శనలో చూసిన వస్తువులు సభ్యులకు ఎంతో నచ్చాయి. వారు భారతీయ చలనచిత్ర సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షిస్తున్న, చూపరులకు ప్రదర్శిస్తున్న మ్యూజియం నిర్వహకులను ప్రశంసించారు. మ్యూజియానికి రావడం వల్ల తాము కొత్త అవగాహనను ఏర్పరచుకోవడంతోపాటు ఎంతో విశిష్టమైన సమాచారాన్ని తెలుసుకోగలిగామనీ, భారతీయ చలనచిత్రాల సార సంగ్రహంతో విశిష్ట అనుబంధాన్ని ఏర్పరుచుకొన్న వేళ ఒకింత ఉద్విగ్నతకు సైతం లోనయ్యామనీ వారు అభిప్రాయపడ్డారు. రాబోయే కాలంలో ఈ మ్యూజియానికి మళ్లీ ఓసారి రావాలని తమకనిపిస్తోందన్నారు.
భారత చలనచిత్ర రంగ సుదీర్ఘ వారసత్వాన్ని ప్రముఖ విధాన రూపకర్తలు తెలుసుకోవడమే కాక ఆ వారసత్వాన్ని మెచ్చుకొన్న ఈ కార్యక్రమం ఇటు ఎన్ఎఫ్డీసీకీ, అటు ఎన్ఎంఐసీకీ గౌరవాన్విత ఘట్టమని చెప్పవచ్చు.
***
(Release ID: 2123807)
Visitor Counter : 18