ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అమెరికా ఉపాధ్యక్షుడు, ఆయన కుటుంబ సభ్యులకు ఆతిథ్యమిచ్చిన ప్రధానమంత్రి


గత జనవరిలో తన వాషింగ్ట‌న్ పర్యటనను, అధ్య‌క్షుడు ట్రంప్‌తో జరిగిన చ‌ర్చ‌ల‌ను గుర్తు చేసుకున్న ప్రధాని

ఈ ఏడాది పారిస్‌లో జరిగిన ఇరువురి నేతల సమావేశానికి అనుసరణగా ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని సమీక్షించిన ప్రధాని, అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్

భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం.. ఇంధనం, రక్షణ, వ్యూహాత్మక సాంకేతికతలలో సహకారాన్ని పెంపొందించే దిశగా జరుగుతున్న పురోగతిని స్వాగతించిన ఇరువురు నేతలు

పరస్పర ప్రయోజనాలు కలిగిన వివిధ ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలను పంచుకున్న ఇరువురు నేతలు

ఉపాధ్యక్షుడు, ఆయన కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి మోదీ

ట్రంప్‌కు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధాని మోదీ.. ఈ ఏడాది చివర్లో ట్రంప్ భారత్‌ ప‌ర్య‌ట‌న కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నట్లు ప్రకటన.

Posted On: 21 APR 2025 8:50PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అమెరికా ఉపాధ్యక్షుడు గౌరవనీయ జే.డి. వాన్స్‌, రెండో మహిళ శ్రీమతి ఉషా వాన్స్, వారి పిల్లలు, అమెరికా పరిపాలన యంత్రానికి చెందిన సీనియర్ అధికారులతో స‌మావేశ‌మ‌య్యారు.

జనవరిలో తన వాషింగ్టన్ పర్యటనను ఈ సందర్భంగా ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. అమెరికాను మరోసారి గొప్పదిగా చేద్దాం(మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్‌-మాగా), వికసిత్ భారత్ 2047 బలాలను ఉపయోగించుకుంటూ భారత్, అమెరికా మధ్య సన్నిహిత సహకారానికి రోడ్ మ్యాప్‌ను నిర్దేశించేలా ఆ పర్యటనలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన సమావేశాన్ని కూడా ప్రస్తావించారు.

ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన వివిధ రంగాలపై ప్రధాన మంత్రి, ఉపాధ్యక్షుడు వాన్స్ సమీక్షించారు. ఆయా అంశాల్లో జరుగుతోన్న పురోగతిపై సానుకూలంగా స్పందించారు.

ఇరు దేశాలకు పరస్పర ప్రయోజనకరమైన అంశాలకు సంబంధించిన చర్చల్లో నమోదైన గణనీయమైన పురోగతిని వారు స్వాగతించారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఇరు దేశాల ప్రజలపై సంక్షేమంపై దృష్టి పెట్టనుంది.  అదేవిధంగా ఇంధనం, రక్షణ, వ్యూహాత్మక సాంకేతిక పరిజ్ఞానం, ఇతర రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకునే దిశగా నిరంతరం కృషి చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

పరస్పర ప్రయోజనాలున్న వివిధ ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ విషయాల్లో చర్చలు, దౌత్యమే మార్గమని పేర్కొన్నారు.

ఉపాధ్యక్షుడు, ద్వితీయ మహిళ, వారి పిల్లల‌కు భారత పర్యటన ఆహ్లాదకరంగా,  ఫలప్రదంగా ఉండాల‌ని కోరుకుంటున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.

అధ్యక్షుడు ట్రంప్‌నకు ప్రధాని తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంవత్సరం చివర్లో ఆయన చేపట్టనున్న భారత పర్యటన కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.

 

***


(Release ID: 2123391) Visitor Counter : 5