ప్రధాన మంత్రి కార్యాలయం
హర్యానాలో హిసార్ విమానాశ్రయం నూతన టెర్మినల్ భవనం శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
Posted On:
14 APR 2025 12:58PM by PIB Hyderabad
నేను బాబాసాహెబ్ అంబేద్కర్ అంటాను, మీరంతా రెండుసార్లు చెప్పండి - అమర్ రహే! అమర్ రహే! (దీర్ఘాయుష్షు! దీర్ఘాయుష్షు!)
బాబాసాహెబ్ అంబేద్కర్, అమర్ రహే! అమర్ రహే!
బాబాసాహెబ్ అంబేద్కర్, అమర్ రహే! అమర్ రహే!
బాబాసాహెబ్ అంబేద్కర్, అమర్ రహే! అమర్ రహే!
హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నయాబ్ సింగ్ సైనీ, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరుడు శ్రీ మురళీధర్ మొహోల్, హర్యానా ప్రభుత్వంలోని మంత్రులూ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నా ప్రియమైన సోదరసోదరీమణులారా
ధైర్యవంతులైన మన హర్యానా ప్రజలకు రామ్ రామ్!
దృఢమైన సైనికులు, దృఢమైన ఆటగాళ్ళు, గొప్ప సోదరభావం, ఇదే హర్యానా గుర్తింపు!
హడావిడిగా ఉండే ఈ లావణి పండుగ సమయంలో మీరు ఇంత భారీ సంఖ్యలో వచ్చి మాకు ఆశీర్వాదం ఇచ్చినందుకు మీ అందరికి నా హృదయపూర్వక అభినందనలు. అలాగే గురు జంభేశ్వర్, మహారాజా అగ్రసేన్, అగ్రోహా ధామ్‌లకు కూడా నా నివాళులు అర్పిస్తున్నాను.
మిత్రులారా,
హర్యానాలోని హిసార్ నుంచి నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ నాకు హర్యానా బాధ్యతలు అప్పగించినప్పుడు, నేను ఇక్కడ చాలా మంది సహచరులతో కలిసి చాలా కాలం పనిచేశాను. ఈ సహచరులందరి కృషి హర్యానాలో భారతీయ జనతా పార్టీ పునాదిని బలోపేతం చేసింది. అభివృద్ధి చెందిన హర్యానా, అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యంగా బిజెపి పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తుండటాన్ని చూసి నేను గర్వపడుతున్నాను.
మిత్రులారా,
మనందరికీ, యావత్ దేశానికి, ముఖ్యంగా దళితులకు, అణగారిన వర్గాలకు, అవకాశాలకు దూరమైపోయిన వారికి, దోపిడీకి గురైన వారికి ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. వారి జీవితంలో ఇది రెండో దీపావళి. నేడు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి. ఆయన జీవితం, ఆయన పోరాటం, జీవిత సందేశం - ఇవన్నీ మా ప్రభుత్వ పదకొండేళ్ల ప్రయాణానికి స్ఫూర్తిగా మారాయి. ప్రతిరోజూ, ప్రతి నిర్ణయం, ప్రతి విధానం బాబాసాహెబ్ అంబేద్కర్ కే అంకితం. అణగారిన, అణచివేతకు గురైన, దోపిడీకి గురైన, పేద, గిరిజన, మహిళల జీవితాల్లో మార్పు తీసుకువచ్చి వారి కలలను నెరవేర్చడమే మా లక్ష్యం. ఇందుకోసం నిరంతర అభివృద్ధి, వేగవంతమైన అభివృద్ధి అనేది బిజెపి ప్రభుత్వ మంత్రం.
మిత్రులారా,
ఈ మంత్రాన్ని అనుసరించి నేడు హర్యానా నుంచి అయోధ్య ధామ్ కు విమానం బయలుదేరింది. అంటే ఇప్పుడు శ్రీకృష్ణుని పవిత్ర భూమి నేరుగా శ్రీరాముడి నగరంతో ముడిపడింది. అగ్రసేన్ విమానాశ్రయం నుంచి వాల్మీకి విమానాశ్రయానికి ఇప్పుడు నేరుగా విమానాలు నడుపుతున్నారు. త్వరలో ఇతర నగరాలకు కూడా ఇక్కడి నుంచి విమాన సర్వీసులు ప్రారంభం అవుతాయి. ఈ రోజు హిసార్ విమానాశ్రయం కొత్త టెర్మినల్ భవనానికి శంకుస్థాపన కూడా జరిగింది. హర్యానా ఆకాంక్షలను కొత్త ఎత్తుకు తీసుకెళ్లడానికి ఇది నాంది. ఈ కొత్త ప్రారంభానికి గానూ హర్యానా ప్రజలను నేను అభినందిస్తున్నాను.
మిత్రులారా,
సాధారణ పాదరక్షలు ధరించేవారు కూడా విమానంలో ప్రయాణం చేస్తారని నేను మీకు వాగ్దానం చేశాను. ఈ హామీ దేశవ్యాప్తంగా నెరవేరుతున్నట్టు మనం చూస్తున్నాం. గత పదేళ్లలో కోట్లాది మంది భారతీయులు తమ జీవితంలో తొలిసారిగా విమాన ప్రయాణం చేశారు. మంచి రైల్వేస్టేషన్లు లేని చోట్ల కూడా కొత్త విమానాశ్రయాలు నిర్మించాం. 2014కు ముందు దేశంలో 74 విమానాశ్రయాలు ఉండేవి. ఒక్కసారి ఊహించుకోండి, 70 ఏళ్లలో 74 విమానాశ్రయాలు ఉంటే నేడు దేశంలో విమానాశ్రయాల సంఖ్య 150 దాటింది. దేశంలోని దాదాపు 90 విమానాశ్రయాలను ఉడాన్ యోజనతో అనుసంధానం చేశారు. ఉడాన్ యోజన కింద 600కు పైగా రూట్లలో విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ప్రజలు చాలా తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణం చేస్తున్నారు, విమాన ప్రయాణికుల సంఖ్యలో ప్రతి సంవత్సరం కొత్త రికార్డు నమోదవుతోంది. మన విమానయాన సంస్థలు కూడా రికార్డు స్థాయిలో రెండు వేల కొత్త విమానాలకు ఆర్డర్ ఇచ్చాయి. కొత్త విమానాలు ఎంత ఎక్కువ వస్తే పైలట్లు, ఎయిర్ హోస్టెస్ ఉద్యోగాలు అంత ఎక్కువగా వస్తాయి. వందలాది కొత్త సర్వీసులు కూడా ప్రారంభం అయ్యాయి. ఒక విమానం ఎగిరితే గ్రౌండ్ స్టాఫ్ తో పాటు ఎన్నో ఉద్యోగాలు ఉంటాయి. ఇలాంటి అనేక సేవలతో యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అంతే కాదు - విమానాల నిర్వహణకు సంబంధించిన పెద్ద రంగం కూడా లెక్కలేనన్ని ఉద్యోగాలను సృష్టిస్తుంది. హిసార్ లోని ఈ విమానాశ్రయం హర్యానా యువత కలలకు కొత్త రెక్కలు ఇస్తుంది.
మిత్రులారా,
మా ప్రభుత్వం ఒకవైపు కనెక్టివిటీకి పెద్దపీట వేస్తూనే మరోవైపు పేదల సంక్షేమం, సామాజిక న్యాయానికి కూడా అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ కల. ఇది మన రాజ్యాంగ నిర్మాతల ఆకాంక్ష. ఇది దేశం కోసం ప్రాణత్యాగానికి సైతం సిద్ధపడిన వారి కల కూడా. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల కాంగ్రెస్ వ్యవహరించిన తీరును మనం ఎప్పటికీ మరచిపోకూడదు. బాబాసాహెబ్ బతికున్నంత కాలం కాంగ్రెస్ పార్టీ ఆయనను అవమానించింది. ఆయనను రెండుసార్లు ఎన్నికల్లో ఓడిపోయేలా చేశారు. మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను గద్దె దించే పనిలో నిమగ్నమైంది. ఆయనను వ్యవస్థకు దూరంగా ఉంచేందుకు కుట్ర పన్నారు. బాబాసాహెబ్ మన మధ్య లేనప్పుడు ఆయన జ్ఞాపకాలను కూడా చెరిపేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నించింది. బాబాసాహెబ్ ఆలోచనలను శాశ్వతంగా నాశనం చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నించింది. అంబేద్కర్ రాజ్యాంగ పరిరక్షకుడు అయితే కాంగ్రెస్ ఆ రాజ్యాంగ వినాశకారిగా మారింది. డాక్టర్ అంబేద్కర్ సమానత్వాన్ని తీసుకురావాలనుకున్నారు. కానీ కాంగ్రెస్ దేశంలో ఓటు బ్యాంకుల వైరస్ ను వ్యాప్తి చేసింది.
మిత్రులారా,
ప్రతి పేదవాడు, అణగారిన వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరూ గౌరవంగా జీవించగలగాలని, తల పైకెత్తి జీవించాలని, వారు కూడా కలలు కనాలని, ఆ కలలను నెరవేర్చుకోవాలని బాబాసాహెబ్ కోరుకున్నారు. కానీ కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చింది. కాంగ్రెస్ సుదీర్ఘ పాలనలో ఆ పార్టీ నాయకుల స్విమ్మింగ్ పూల్స్ లోకి నీరు చేరేది తప్ప గ్రామాల్లో కుళాయి నీళ్లు ఉండేవికావు. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లకు కూడా గ్రామాల్లో కేవలం 16 శాతం ఇళ్లకు మాత్రమే కుళాయి నీరు ఉంది. అంటే, 100 ఇళ్లలో 16 - ఊహించండి! దీని వల్ల ఎవరు ఎక్కువగా ఇబ్బందులు పడ్డారు? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలే ఎక్కువగా ప్రభావితమయ్యారు. ఈ రోజు వీధి నుంచి వీధికి వెళ్లి ఉపన్యాసాలు ఇస్తున్న వారు కనీసం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సోదరుల ఇళ్లకు నీళ్లు అందించి ఉండాల్సింది. మా ప్రభుత్వం 6-7 ఏళ్లలో 12 కోట్లకు పైగా గ్రామీణ గృహాలకు కుళాయి కనెక్షన్లు ఇచ్చింది. నేడు గ్రామంలోని 80 శాతం ఇళ్లలో, అంటే గతంలో 100కు 16 ఇళ్లలో అయితే, నేడు 100 ఇళ్లలో 80 ఇళ్లకు కుళాయి నీరు ఉంది. బాబాసాహెబ్ ఆశీస్సులతో ఇంటింటికీ కుళాయి నీటిని అందిస్తాం. మరుగుదొడ్ల విషయంలో కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల పరిస్థితి దయనీయంగా ఉండేది. మా ప్రభుత్వం 11 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించి నిరుపేదలకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించింది.
మిత్రులారా,
కాంగ్రెస్ హయాంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు బ్యాంకులు తలుపులు కూడా తెరిచేవి కావు. బీమా, రుణాలు, ఆర్థిక సహాయం ఇలా అన్నీ ఒక కలగాఉండేవి. కానీ, ఇప్పుడు జన్ ధన్ ఖాతాల ద్వారా ఎక్కువగా లబ్దిపొందుతున్నది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సోదరసోదరీమణులే. నేడు మన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సోదరసోదరీమణులు సగర్వంగా తమ రూపే కార్డులను జేబులోంచి తీసి చూపిస్తున్నారు. ఒకప్పుడు ధనవంతుల జేబుల్లో ఉండే రూపే కార్డులను ఇప్పుడు మన పేదలు చూపిస్తున్నారు.
మిత్రులారా,
అధికారం కోసం పవిత్రమైన రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అస్త్రంగా మార్చుకుంది. కాంగ్రెస్ అధికార సంక్షోభాన్ని చూసినప్పుడల్లా రాజ్యాంగాన్ని అణచివేసింది. ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ తన అధికారాన్ని నిలుపుకోవడానికి రాజ్యాంగ స్ఫూర్తిని పూర్తిగా తుంగలో తొక్కింది. ప్రతి ఒక్కరికీ ఒకే రకమైన పౌర స్మృతి ఉండాలనేది రాజ్యాంగ స్ఫూర్తి, దీనిని నేను సెక్యులర్ సివిల్ కోడ్ అని పిలుస్తాను, కానీ కాంగ్రెస్ దానిని ఎప్పుడూ అమలు చేయలేదు. ఉత్తరాఖండ్ లో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెక్యులర్ సివిల్ కోడ్, యూనిఫాం సివిల్ కోడ్ ను అమలు చేసిన ఘనత సాధించింది. కానీ ఈ దేశం దురదృష్టం ఏమిటంటే — జేబులో రాజ్యాంగాన్ని పెట్టుకుని తిరిగే వారు, రాజ్యాంగంపై కూర్చున్నవారు, అంటే ఈ కాంగ్రెస్ నాయకులు — దానికి కూడా వ్యతిరేకించారు.
మిత్రులారా,
మన రాజ్యాంగం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించింది. కానీ కాంగ్రెస్ వారికి రిజర్వేషన్లు కల్పించారో లేదో, వారి పిల్లలకు విద్యావకాశాలు లభిస్తున్నాయో లేదో, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు ఎవరైనా తమ హక్కులను కోల్పోయారో లేదో ఎన్నడూ పట్టించుకోలేదు. కానీ రాజకీయ క్రీడలు ఆడేందుకు కాంగ్రెస్ బాబా సాహెబ్ అంబేద్కర్ కలను, సామాజిక న్యాయం కోసం రాజ్యాంగంలో చేసిన నిబంధనను వెన్నుపోటు పొడిచి, ఆ రాజ్యాంగాన్ని బుజ్జగింపు రాజకీయానికి ఒక సాధనంగా మార్చింది. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కులను కాలరాసింది. టెండర్లలో మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించిందని మీరు ఇటీవల వార్తల్లో వినే ఉంటారు. అయితే బాబా సాహెబ్ రాజ్యాంగంలో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించబోమని, మన రాజ్యాంగం మతం ఆధారంగా రిజర్వేషన్లను నిషేధించిందని స్పష్టంగా చెప్పారు.
మిత్రులారా,
కాంగ్రెస్ ఈ బుజ్జగింపు విధానం వల్ల ముస్లిం సమాజం కూడా తీవ్రంగా నష్టపోయింది. కాంగ్రెస్ కొద్దిమంది ఛాందసవాదులను మాత్రమే సంతోషపెట్టింది. సమాజంలో మిగిలినవారు నిస్సహాయులుగా, నిరక్షరాస్యులుగా, నిరుపేదలుగా మిగిలిపోయారు. కాంగ్రెస్ దుర్మార్గపు విధానానికి అతిపెద్ద నిదర్శనం వక్ఫ్ చట్టమే. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 2013 వరకు వక్ఫ్ చట్టం అమల్లో ఉన్నా ఎన్నికల్లో గెలవడానికి, బుజ్జగింపు రాజకీయాలకు, ఓటు బ్యాంకు రాజకీయాలకు వీలుగా 2013 చివరిలో, పార్లమెంట్ చివరి సెషన్లో, ఎన్నికలలో ఓట్లు పొందడానికి కాంగ్రెస్ చాలా హడావుడిగా ఎంతోకాలంగా అమల్లో ఉన్న వక్ఫ్ చట్టాన్ని సవరించింది. ఓటు బ్యాంకును ప్రసన్నం చేసుకునేందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని నాశనం చేసే విధంగా, రాజ్యాంగానికి అతీతంగా ఈ చట్టాన్ని రూపొందించారు. ఇది బాబాసాహెబ్ కు జరిగిన అతి పెద్ద అవమానం.
మిత్రులారా,
ముస్లింల ప్రయోజనాల కోసమే తాము ఈ పని చేశామని వారు చెబుతున్నారు. వారందరినీ నేను అడగాలనుకుంటున్నాను, ఈ ఓటు బ్యాంకు దాహం ఉన్న రాజకీయ నాయకులకు నేను చెప్పాలనుకుంటున్నాను, మీ హృదయంలో నిజంగా ముస్లింల పట్ల చిన్న సానుభూతి ఉంటే, కాంగ్రెస్ పార్టీ ఒక ముస్లింను ఎందుకు అధ్యక్షుడిని చేయదు? వారు పార్లమెంటు టిక్కెట్లు ఇచ్చి, అందులో 50% ముస్లింలకి కేటాయిస్తారు. గెలిస్తే తమ మాట నెగ్గించుకోవాలని చూస్తారు. కానీ వారికి అలా చేయాలని లేదు, వారికి దేశం నుంచి ప్రజల నుంచి హక్కులు లాక్కోవడం, పంచడం తప్ప ఎవరికీ మంచి చేసే ఆలోచన లేదు. కనీసం ముస్లింలకైనా సరే. కాంగ్రెస్ గురించి ఇదే అసలైన నిజం.
మిత్రులారా,
దేశమంతటా లక్షల హెక్టార్ల భూమి వక్ఫ్ పేరిట ఉంది. ఈ భూమి, ఈ ఆస్తి పేదలు, అసహాయ మహిళలు, పిల్లలకు ఉపయోగపడాల్సింది. దీనిని నిజాయితీగా వినియోగించి ఉంటే, ఈరోజు నా ముస్లిం యువత పంచర్లు పడిన సైకిళ్లకు మరమ్మతు చేస్తూ జీవితం గడపాల్సిన పరిస్థితి ఉండేది కాదు. కానీ ఈ ఆస్తుల వల్ల కొద్ది మంది భూ మాఫియాలకు మాత్రమే లాభం కలిగింది. పస్మండ ముస్లిం సామాజిక వర్గానికి ఎలాంటి ఉపయోగమూ కలగలేదు. ఇంకా ఈ భూ మాఫియాలు ఎవరిని దోచుకుంటున్నాయి? వారు దళితుల భూమిని, వెనుకబడినవారి భూమిని, గిరిజనుల భూమిని, వితంతువుల ఆస్తిని దోచుకుంటున్నారు. వందలాది మంది ముస్లిం వితంతువులు భారత ప్రభుత్వానికి లేఖలు రాశారు, అప్పుడే ఈ చట్టం చర్చకు వచ్చింది. వక్ఫ్ చట్టం లో చేసిన మార్పుల తర్వాత పేదల పై జరుగుతున్న ఈ దోపిడీకి అడ్డుకట్ట పడనుంది. ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, మేము ఒక బాధ్యతాయుతమైన, ముఖ్యమైన పని చేశాం. వక్ఫ్ చట్టంలో మేం మరో ఏర్పాటు కూడా చేశాం. ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం, వక్ఫ్ బోర్డు దేశంలోని ఏ మూలలోనైనా గిరిజనుల భూమిని, ఇంటిని, ఆస్తిని తాకే అవకాశం లేదు. రాజ్యాంగ పరిమితులను పాటిస్తూ గిరిజనుల ప్రయోజనాలను పరిరక్షించడంలో మేం గొప్ప పని చేశాం. ఈ నిబంధనలు వక్ఫ్ పవిత్ర స్ఫూర్తిని గౌరవిస్తాయని నేను ఆశిస్తున్నాను. ముస్లిం సమాజంలోని పేద, పస్మాండ కుటుంబాలు, ముస్లిం మహిళలు, ముఖ్యంగా ముస్లిం వితంతువులు, ముస్లిం పిల్లలు తమ హక్కులను పొందుతారు. భవిష్యత్తులో కూడా వారి హక్కులకు రక్షణ ఉంటుంది. రాజ్యాంగ స్ఫూర్తితో బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు అప్పగించిన కర్తవ్యం ఇది. ఇదే అసలైన స్ఫూర్తి, ఇదే నిజమైన సామాజిక న్యాయం.
మిత్రులారా,
దేశంలోనే కాదు, ప్రపంచంలోనూ బాబాసాహెబ్ నివసించిన ప్రదేశాలన్నీ నిర్లక్ష్యానికి గురయ్యాయి. రాజకీయం కోసం రాజ్యాంగం పేరుతో ప్రయోజనాలు పొందాలనుకునే వారు, బాబాసాహెబ్‌కు సంబంధించిన ప్రతి స్థలాన్నీ అవమానించారు, ఆయనను చరిత్రనుంచి తొలగించడానికి ప్రయత్నించారు. ముంబయిలోని ఇండూ మిల్‌లో బాబాసాహెబ్ అంబేద్కర్ స్మారకం నిర్మించడానికి దేశవ్యాప్తంగా ప్రజలు ఉద్యమించాల్సి వచ్చింది. కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రభావాన్ని రాబోయే తరాలకు చాటేందుకు 2014 తర్వాత, మా ప్రభుత్వం ఎన్నో ముఖ్యమైన చర్యలు తీసుకుంది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, ఇండూ మిల్‌తో పాటు బాబాసాహెబ్ అంబేద్కర్‌కు సంబంధించిన ప్రతి స్థలాన్ని అభివృద్ధి చేశాం. ఆయన జన్మస్థలం మౌహ్ అయినా, లండన్‌లోని ఆయన విద్యాభ్యాస స్థలం అయినా, ఢిల్లీలోని మహాపరినిర్వాణ స్థలం అయినా, లేక నాగ్‌పూర్‌లోని దీక్షాభూమి అయినా ప్రతి స్థలాన్ని అభివృద్ధి చేశాం. వీటన్నింటినీ పంచతీర్థంగా అభివృద్ధి చేశాం. కొన్ని రోజుల కిందట దీక్షాభూమి, నాగ్‌పూర్‌కు వెళ్లి బాబాసాహెబ్‌కు నివాళులర్పించే అవకాశం నాకు లభించటం నా అదృష్టంగా భావిస్తున్నాను.
మిత్రులారా,
కాంగ్రెస్ వారు సామాజిక న్యాయం గురించి గొప్పగా మాట్లాడతారు, కానీ భరతమాత ఇద్దరు గొప్ప బిడ్డలయిన బాబాసాహెబ్ అంబేద్కర్, చౌదరి చరణ్ సింగ్ లకు కాంగ్రెస్ భారతరత్న కూడా ఇవ్వలేదని మనం గుర్తుంచుకోవాలి. కేంద్రంలో బీజేపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పడినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్‌కి భారత రత్న లభించింది. అదే సమయంలో, చౌధరి చరణ్ సింగ్ కు కూడా భారతరత్నను బీజేపీ ప్రభుత్వం ప్రదానం చేసినందుకు మేం గర్వపడుతున్నాం.
మిత్రులారా,
హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం కూడా సామాజిక న్యాయం, పేదల సంక్షేమం దిశగా నిరంతరం శక్తినిచ్చే విధంగా పనిచేస్తోంది. మీ అందరికీ తెలిసిన విషయమే అప్పట్లో పరిస్థితి ఎలా ఉండేదో మీకు తెలుసు — ఉద్యోగం కావాలంటే లేదా ఏదైనా పని చేయించుకోవాలంటే, ఎవరైనా ఒక నాయకుడి చుట్టూ తిరగాలి లేదా డబ్బు ఇవ్వాలి. తండ్రి భూమి అమ్మాల్సి వచ్చేది, తల్లి గాజులు కూడా విక్రయించాల్సి వచ్చేది. కాని నాయబ్ సింగ్ సైనీ ప్రభుత్వం, కాంగ్రెస్ అంటించిన ఆ వ్యాధిని పూర్తిగా నయం చేసింది అనే విషయాన్ని చెప్పడం నాకు ఆనందంగా ఉంది. ఎలాంటి ఖర్చు లేకుండా, ఎలాంటి సిఫార్సు లేఖలు లేకుండా ఉద్యోగాలు ఇచ్చిన హర్యానా ఘనత అద్భుతం. నాకు అలాంటి స్నేహితులు, అలాంటి భాగస్వామ్య ప్రభుత్వం లభించినందుకు గర్వపడుతున్నాను. ఇక్కడి 25 వేల మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు రాకుండా చూసేందుకు కాంగ్రెస్ శాయశక్తులా ప్రయత్నించింది. కానీ ఒకవైపు ముఖ్యమంత్రి నాయబ్ సైనీ ప్రమాణస్వీకారం చేయగా, మరోవైపు వేలాది మంది యువతకు నియామక పత్రాలు అందాయి! ఇదీ బీజేపీ ప్రభుత్వ సుపరిపాలన. మంచి విషయం ఏమిటంటే, రాబోయే సంవత్సరాల్లో వేలాది కొత్త ఉద్యోగాలకు రోడ్ మ్యాప్ రూపొందించడం ద్వారా నాయబ్ సింగ్ సైనీ ప్రభుత్వం పనిచేస్తోంది.
మిత్రులారా,
హర్యానా ఎంతోమంది యువత సైన్యంలో చేరి దేశానికి సేవ చేస్తున్న రాష్ట్రం. ఒకే ర్యాంకు- ఒకే పెన్షన్ విషయంలో దశాబ్దాల పాటు కాంగ్రెస్ మోసం చేసింది. కానీ అదే స్కీమ్‌ను అమలు చేసింది మా ప్రభుత్వమే. ఇప్పటివరకు హర్యానాలోని మాజీ సైనికులకు ఒకే ర్యాంకు - ఒకే పెన్షన్ (ఓఆర్ఓపీ) కింద రూ.13,500 కోట్లు అందించారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే పథకం గురించి అబద్ధాలు చెబుతూ, మొత్తం దేశ సైనికులకోసం కేవలం రూ.500 కోట్లే ఖర్చు చేసిన విషయం మీకు గుర్తుండి ఉంటుంది. ఇప్పుడు మొత్తం హర్యానాలో 13 వేల 500 కోట్లు, 500 కోట్లు ఎక్కడ ఉన్నాయి, ఇది ఎలాంటి కంటితుడుపు చర్య అని మీరు అనుకుంటున్నారు. కాంగ్రెస్ కు ఎవరితోనూ సంబంధం లేదన్నారు.
ఇప్పుడు మీరు ఆలోచించండి, మొత్తం హర్యానాలో 13,500 కోట్లు ఎక్కడ? దేశం మొత్తానికి కేవలం 500 కోట్లు ఎక్కడ? ఇది ఎలాంటి కంటితుడుపు? కాంగ్రెస్‌కు ఎవరితోనూ సంబంధం లేదు, దాని సంబంధం కేవలం అధికారంతో మాత్రమే. దళితులతో గానీ, వెనుకబడిన వర్గాలతో గానీ, దేశంలోని తల్లులు, అక్కచెల్లెళ్ళు, కూతుళ్లతో గానీ, ఆఖరుకి మన సైనికులతో గానీ ఆ పార్టీకి సంబంధం లేదు.
మిత్రులారా,
అభివృద్ధి చెందిన భారతదేశం సంకల్పాన్ని హర్యానా మరింత బలోపేతం చేస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది. క్రీడలైనా, వ్యవసాయమైనా హర్యానా నేల ప్రపంచవ్యాప్తంగా తన పరిమళాన్ని వెదజల్లుతూనే ఉంటుంది. హర్యానాకు చెందిన నా కుమారులు, కుమార్తెలపై నాకు చాలా నమ్మకం ఉంది. ఈ కొత్త విమానాశ్రయం, ఈ కొత్త విమానం హర్యానాను సాకారం చేయడానికి మరియు హర్యానా కలలను నెరవేర్చడానికి ప్రేరణగా మారుతుంది మరియు మీ ఆశీర్వాదాలు ఇవ్వడానికి మీరు ఇంత పెద్ద సంఖ్యలో రావడం నా అదృష్టం.హర్యానా కుమారులు, కుమార్తెలపై నాకు ఎంతో విశ్వాసం ఉంది. ఈ కొత్త విమానాశ్రయం, ఈ కొత్త విమాన సర్వీసు — ఇవి హర్యానా ఆశయాలను సాకారం చేయడంలో ప్రేరణగా మారతాయి. హర్యానా ప్రజల కలలు నెరవేర్చే దిశగా ఇది ముందడుగు అవుతుంది. మీరంతా సమూహంగా తరలివచ్చి ఆశీర్వాదాలు ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను మీ ముందు శిరస్సు వందనం చేస్తున్నాను. మీ అందరికీ ఎన్నో విజయాలు కలగాలని కోరుకుంటూ, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను!
నాతో పాటు కలిసి నినదించండి:
భారత్ మాతా కి… జై! భారత్ మాతా కి… జై! భారత్ మాతా కి… జై!
చాలా చాలా ధన్యవాదాలు!
గమనిక: ఇది ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి సుమారు తెలుగు అనువాదం.
***
(Release ID: 2121724)
Visitor Counter : 13