ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

హర్యానాలోని యమునా నగర్‌లో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం/శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 14 APR 2025 4:17PM by PIB Hyderabad

ప్రజాదరణ చూరగొన్న హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నాయబ్‌ సింగ్‌ సైనీ, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ మనోహరల్‌ లాల్‌, ఇందర్‌జీత్‌ సింగ్‌, శ్రీ క్రిషన్‌పాల్‌, రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు-శాసనసభ సభ్యులు సహా నా ప్రియ సోదరీసోదరులారా... హర్యానాలోని సహోదరులారా... మీకందరికీ ఇవే మోదీ శుభాకాంక్షలు!

మిత్రులారా!

సరస్వతీ మాత ఉద్భవించిన నేల, మంత్ర దేవత ఆవాస భూమి, పంచముఖ ఆంజనేయుడు వెలసిన గడ్డ, కపాల మోచనుడి ఆశీస్సులుగల స్థావరం, సంస్కృతి-విశ్వాసం-భక్తి వెల్లువెత్తే ఈ పావన భూమికి శిరసాభివందనం చేస్తున్నాను. ఈ రోజు బాబాసాహెబ్ అంబేడ్కర్ జీ 135వ జయంతి కూడా. ఈ సందర్భంగా దేశ పౌరులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆ మహనీయుడి దార్శనికత, స్ఫూర్తి ‘వికసిత భారత్’ వైపు మన పయనానికి సదా పథనిర్దేశం చేస్తూనే ఉంటాయి.

మిత్రులారా!

యమునానగర్ కేవలం ఓ నగరం కాదు... ఇది భారత పారిశ్రామిక పటంలో ఒక కీలక అంతర్భాగం. ప్లైవుడ్ నుంచి ఇత్తడి/ఉక్కుదాకా ఈ ప్రాంతం మన ఆర్థిక వ్యవస్థ మొత్తాన్నీ బలోపేతం చేస్తుంది. ఇది కపాల మోచన ఉత్సవానికి ప్రసిద్ధి చెందిన ప్రదేశం. ఇది వేదవ్యాస మహర్షి తపమాచరించిన భూమి. అంతేకాదు... ఒక విధంగా ఇది గురు గోవింద్ సింగ్ ఆయుధాగారం.

మిత్రులారా!

ఇది మనందరికీ ఎంతో గర్వకారణం. శ్రీ మనోహర్ లాల్, శ్రీ సైనీ ఇంతకుముందే ఉటంకించినట్లు యమునానగర్‌తో ముడిపడిన నా జ్ఞాపకాలెన్నో గుర్తుకొస్తున్నాయి. నేను హర్యానా రాష్ట్ర బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో పంచకుల-యమునా నగర్‌ మధ్య తరచూ ప్రయాణించే వాడిని. ఇక్కడ అంకితభావంగల అనేకమంది పాతకాలపు పార్టీ కార్యకర్తలతో కలిసి పనిచేసే అవకాశం నాకు లభించింది. అలాంటి కఠోర శ్రమకు వెరవని కార్యకర్తల సంప్రదాయం నేటికీ ఇక్కడ కొనసాగుతోంది.

మిత్రులారా!

హర్యానా వరుసగా మూడోసారి ద్వంద్వ సారథ్య ప్రభుత్వ నేతృత్వాన ద్విగుణీకృత ప్రగతి వేగాన్ని ప్రత్యక్షంగా చూస్తోంది. శ్రీ సైనీ ఇప్పుడు చెప్పినట్లుగా- ఇది ఒక విధంగా త్రిగుణ శక్తీశీల ప్రభుత్వం లాంటిది. ఎందుకంటే ‘వికసిత భారత్‌’ సంకల్ప సాధన కోసం ‘వికసిత హర్యానా’ అన్నది మా లక్ష్యం. ఈ స్వప్న సాకారంలో భాగంగా ఈ రాష్ట్ర ప్రజలకు సేవ చేయడంతోపాటు యువత ఆకాంక్షలు నెరవేర్చడానికి మేం మరింత వేగంతో, భారీ స్థాయిలో కృషి చేస్తున్నాం. ఈ రోజు ఇక్కడ శ్రీకారం చుట్టిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులే ఇందుకు సజీవ నిదర్శనాలు. ఈ అభివృద్ధి కార్యక్రమాల నేపథ్యంలో హర్యానా ప్రజలను హృదయపూర్వకంగా  అభినందిస్తున్నాను.

మిత్రులారా!

మా ప్రభుత్వం బాబాసాహెబ్ ఆలోచనలను ఆచరణలో పెడుతూ ముందుకు సాగడం నాకెంతో గర్వకారణం. ఆ మహనీయుడు సామాజిక న్యాయ దృక్కోణంతో పారిశ్రామిక ప్రగతిని ఆకాంక్షించాడు. దేశంలోని చిన్న భూకమతాలుగల రైతుల సమస్యలను ఆయన చక్కగా గుర్తించారు. దళితులకు వ్యవసాయం చేయడానికి తగినంత భూమి లేదు కాబట్టి,  పరిశ్రమలతోనే వారు మరింత ప్రయోజనం పొందగలరని ఆయన భావించారు. పరిశ్రమల ద్వారా దళితులకు మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయని, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడగలవని ఆలోచించారు. తదనుగుణంగా దేశంలో పారిశ్రామికీకరణ కోసం కేంద్రంలో తొలి పరిశ్రమల మంత్రి డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీతో కలిసి బాబా సాహెబ్‌ పనిచేశారు.

మిత్రులారా!

దీనబంధు చౌదరి ఛోటూరామ్ పారిశ్రామికీకరణ, తయారీ రంగాల మధ్య సమన్వయాన్ని గ్రామీణ సౌభాగ్యానికి పునాదిగా భావించారు. రైతులు వ్యవసాయం ద్వారానేగాక చిన్నతరహా పరిశ్రమలతోనూ తమ ఆదాయాన్ని పెంచుకున్నప్పుడే గ్రామీణ శ్రేయస్సు వాస్తవ రూపం దాల్చగలదని ఆయన చెప్పేవారు. అలాగే గ్రామాలు-రైతుల సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన శ్రీ చౌదరి చరణ్ సింగ్ దార్శనికత కూడా దీనికి భిన్నమైనదేమీ కాదు. పారిశ్రామికాభివృద్ధి వ్యవసాయానికి పరిపూరకంగా ఉండాలని, ఇవి రెండూ మన ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభాలని చౌదరి సాహెబ్ అంటుండేవారు.

మిత్రులారా!

‘మేక్ ఇన్ ఇండియా’, ‘స్వయం సమృద్ధ భారత్‌’ కార్యక్రమాలకు ఈ ఆలోచన.. ప్రేరణ.. ఆలోచనలే కేంద్రకాలు. కాబట్టే, మా ప్రభుత్వం ‘భారత్‌లో తయారీ’కి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ఈసారి బడ్జెట్‌లో ‘మిషన్ మాన్యుఫ్యాక్చరింగ్‌’ను మేం ప్రకటించాం. దళిత, వెనుకబడిన, దుర్బల, అణగారిన వర్గాల యువతకు గరిష్ఠ ఉపాధి కల్పన, యువతకు సముచిత శిక్షణ, వ్యాపార వ్యయాల తగ్గింపు, ‘ఎంఎస్‌ఎంఇ’ రంగం బలోపేతం, పరిశ్రమలకు  సాంకేతిక పరిజ్ఞాన లబ్ధి సహా మన ఉత్పత్తులను ప్రపంచంలోనే అత్యుత్తమైనవిగా రూపొందించడమే దీని లక్ష్యాలు. వీటన్నింటినీ సాధించాలంటే దేశానికి విద్యుత్ కొరత లేకుండా చూడటం అవశ్యం. ఆ మేరకు మనం ఇంధన రంగంలోనూ స్వావలంబన సాధించాలి. ఆ దిశగా నేటి కార్యక్రమానికి చాలా ప్రాధాన్యం ఉంది. తదనుగుణంగా ఇవాళ దీన్‌బంధు చౌదరి ఛోటూరామ్ థర్మల్ పవర్ ప్లాంట్ మూడో యూనిట్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ఇది యమునానగర్తోపాటు ఇక్కడి పరిశ్రమలకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఇక జాతీయంగా ప్లైవుడ్ ఉత్పత్తిలో సగం ఇక్కడే తయారవుతుంది. అల్యూమినియం, రాగి, ఇత్తడి పాత్రల తయారీ కూడా భారీ ఎత్తున సాగుతూంటుంది. ఇక్కడి పెట్రోకెమికల్ ప్లాంట్ల పరికరాలు ప్రపంచంలో అనేక దేశాలకు ఎగుమతి అవుతాయి. విద్యుదుత్పాదన పెరిగితే ఈ రంగాలన్నీ ప్రయోజనం పొందడమేగాక ‘మిషన్ మాన్యుఫ్యాక్చరింగ్‌’కు మరింత ప్రోత్సాహం లభిస్తుంది.

మిత్రులారా!

‘వికసిత భారత్’కు రూపమివ్వడంలో ప్రధాన పాత్ర విద్యుత్తు రంగానిదే. అందువల్ల విద్యుత్ లభ్యతను పెంచే లక్ష్యంతో మా ప్రభుత్వం అన్నివిధాలా కృషి చేస్తోంది. ఆ మేరకు ‘ఒకే దేశం-ఒకే గ్రిడ్’ కార్యక్రమమైనా, కొత్త థర్మల్‌ విద్యుత్ కేంద్రాలైనా, సౌరవిద్యుత్‌ లేదా అణు రంగ విస్తరణ అయినా- అన్ని మార్గాల్లోనూ విద్యుదుత్పాదన పెంచడానికే మేం ప్రయత్నిస్తున్నాం. కాబట్టి, విద్యుత్ కొరతతో దేశ దేశ పురోగమనానికి ఆటంకమన్నది ఉండదు.

అయితే... మిత్రులారా!

కాంగ్రెస్ పాలన నాటి రోజులను మనం మరువలేం... 2014కు ముందు ఆ పార్టీ అధికారంలో ఉండగా దేశం నలుమూలలా విద్యుత్తుకు అంతరాయం లేని రోజంటూ ఉండేది కాదు. కొన్ని ప్రాంతాల్లోనైతే అంధకారం రాజ్యమేలేది. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం నేటికీ కొనసాగి ఉంటే యావద్దేశం విద్యుత్‌ కొరతతో చీకట్లో మగ్గుతూండేది. ఫ్యాక్టరీలు నడవవు.. రైళ్లు తిరగవు.. పొలాలకు నీరందదు.. ఒక్కమాటలో చెబితే- కాంగ్రెస్ అధికారంలో ఉండి ఉంటే, ఇలాంటి సంక్షోభాలెన్నో తలెత్తి దేశం ముక్కచెక్కలై స్తంభించిపోయేది. కానీ, ఇప్పుడు కొన్నేళ్ల నిర్విరామ కృషి ఫలితంగా పరిస్థితులు మారుతున్నాయి. ఈ మేరకు గడచిన పదేళ్లలో భారత్ తన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని దాదాపు రెట్టింపు చేసింది. సొంత అవసరాలు తీర్చుకోవడంతోపాటు పొరుగు దేశాలకూ విద్యుత్‌ సరఫరా చేస్తోంది. బీజేపీ ప్రభుత్వం విద్యుదుత్పాదనపై నిశితంగా దృష్టి సారించడం వల్ల హర్యానా కూడా లబ్ధి పొందింది. రాష్ట్రంలో ఇవాళ 16,000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుండగా త్వరలోనే ఈ సామర్థ్యాన్ని 24,000 మెగావాట్లకు పెంచాలని లక్ష్యనిర్దేశం చేసుకున్నాం.

మిత్రులారా!

ఒకవైపు ప్రభుత్వం థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాల నిర్మాణం చేపడుతుండగా, మరోవైపు దేశ ప్రజలను విద్యుదుత్పాదకులుగా మారుస్తున్నాం. ఇందుకోసమే ‘ప్రధానమంత్రి సూర్య గృహ ఉచిత విద్యుత్‌ పథకం’ ప్రారంభించాం. పౌరులు తమ ఇళ్ల పైకప్పుపై సౌర ఫలకాల ఏర్పాటు ద్వారా తమ విద్యుత్ బిల్లును సున్నా స్థాయికి తగ్గించుకోవచ్చు. దీంతోపాటు వారు అదనంగా ఉత్పత్తి చేసే విద్యుత్తును విక్రయించడం ద్వారా ఆదాయం కూడా పొందవచ్చు. ఈ పథకం కింద దేశంలో ఇప్పటిదాకా 1.25 కోట్ల మందికిపైగా ప్రజలు పేరు నమోదు చేసుకున్నారు. వీరిలో హర్యానా వాసులు లక్షల సంఖ్యలో ఉన్నారని చెప్పటానికి నేనెంతో సంతోషిస్తున్నాను. అంతేకాదు... ఈ పథకం నిరంతర విస్తరణ ఫలితంగా సంబంధిత సేవా ప్రదాన వ్యవస్థ కూడా విస్తరిస్తోంది. సౌర రంగంలో కొత్త తరహా నైపుణ్యం రూపొందడంతోపాటు ‘ఎంఎస్‌ఎంఇ’లకు కొత్త మార్గాలు ఏర్పడుతూ యువతకు అపార ఉపాధి అవకాశాలు అందివస్తున్నాయి.

మిత్రులారా!

మన చిన్న పట్టణాల్లోగల చిన్నతరహా పరిశ్రమల అవసరాలకు సరిపడా విద్యుత్ లభ్యత సహా తగిన స్థాయిలో ఆర్థిక వనరుల సౌలభ్య కల్పనపైనా ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. కోవిడ్‌ సమయంలో ‘ఎంఎస్‌ఎంఇ’ల రక్షణ దిశగా ప్రభుత్వం రూ.లక్షల కోట్ల మేర ఆర్థికంగా చేయూతనిచ్చింది. అలాగే చిన్న వ్యాపారాల విస్తరణకు భరోసా ఇస్తూ ‘ఎంఎస్‌ఎంఇ’ నిర్వచనాన్ని సవరించడంతో స్థాయి పెరిగితే ప్రభుత్వ మద్దతు కోల్పోతామనే భయం వాటికి తొలగిపోయింది. దీనికితోడు చిన్న పరిశ్రమల కోసం ప్రభుత్వం ప్రత్యేక క్రెడిట్‌ కార్డులను ప్రవేశపెట్టింది. అలాగే రుణ హామీ పథకం కూడా విస్తరిస్తున్న నేపథ్యంలో ఇటీవలే ముద్ర యోజనకు పదేళ్లు పూర్తయ్యాయి. దీనికింద ఈ 10 సంవత్సరాల్లో తొలిసారి వ్యాపార, పరిశ్రమ రంగాల్లో ప్రవేశించిన సామాన్య పౌరులకు రూ.33 లక్షల కోట్ల దాకా హామీరహిత రుణాలు లభించాయి. ఈ సమాచారం మీకు సంతోషం కలిగించిందా... లేదా? మీలో ఆశ్చర్యానందాలు పెల్లుబికాయా... లేదా? పూచీకత్తు లేకుండా రూ.33 లక్షల కోట్ల సాయం! ఒక్కసారి దీన్ని  ఊహించుకోండి. ఇక ఈ పథకం లబ్ధిదారులలో 50శాతానికిపైగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల వారే. మన యువతరం భారీ కలలను సాకారం చేసేదిశగా చిన్న వ్యాపార సంస్థలకు సాధికారత కల్పించడమే ఈ పథకం లక్ష్యం.

మిత్రులారా!

అలుపెరుగని హర్యానా అన్నదాతల నిరంతర శ్రమ కృషి ప్రతి భారతీయుడి ఆహార పళ్లెంలో ప్రతిబింబిస్తుంది. మన రైతు సోదరీసోదరుల సుఖదుఃఖాల్లో బీజేపీ ద్వంద్వ సారథ్య ప్రభుత్వం సన్నిహిత మిత్రుడుగా నిలుస్తుంది. హర్యానా రైతుల శక్తిసామర్థ్యాలను ఇనుమడింజేయడమే మా ధ్యేయం. ఈ మేరకు రాష్ట్రంలోని మా ప్రభుత్వం కనీస మద్దతు ధరతో 24 రకాల పంటలను కొనుగోలు చేస్తోంది. అలాగే ప్రధానమంత్రి పంటల బీమా పథకం ద్వారా లక్షలాదిగా రైతులు లబ్ధి పొందారు. ఈ పథకం కింద ఇప్పటిదాకా రూ.9,000 కోట్లకుపైగా పరిహారం ఇక్కడి అన్నదాతలకు లభించింది. అంతేగాక ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ కింద మరో రూ.6,500 కోట్లు హర్యానా రైతుల ఖాతాల్లో నేరుగా జమయ్యాయి.

మిత్రులారా!

బ్రిటిష్ పాలన కాలం నుంచి కొనసాగుతున్న నీటి తీరువాను కూడా హర్యానా ప్రభుత్వం రద్దు చేసింది. ఇకపై కాలువల ద్వారా సాగునీటి సరఫరాపై మీరు పన్ను చెల్లించే అవసరం ఉండదు. అంతేకాదు... రూ.130 కోట్లకుపైగా నీటి తీరువా బకాయిలను కూడా ప్రభుత్వం మాఫీ చేసింది.

మిత్రులారా!

రాష్ట్రంలోని రైతులకు, పశుపోషకులకు కొత్త ఆదాయ వనరుల సృష్టిలో ద్వంద్వ సారథ్య ప్రభుత్వ కృషి ప్రశంసనీయం. ముఖ్యంగా వ్యర్థాల నిర్వహణతోపాటు ఆదాయార్జన అవకాశాల సృష్టిలో ‘గోబర్‌ధన్‌’ యోజన ఎనలేని తోడ్పాటునిస్తోంది. ఈ పథకం కింద ఆవు పేడ, పంట అవశేషాలు, ఇతర సేంద్రియ వ్యర్థాల వినియోగం ద్వారా బయోగ్యాస్ ఉత్పత్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 500 ‘గోబర్‌ధన్‌’ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్ర బడ్జెట్‌లో ఒక ప్రణాళికను ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా యమునానగర్‌లో నేడు కొత్త గోబర్‌ధన్‌ ప్లాంటుకు శ్రీకారం చుట్టాం. దీనిద్వారా నగరపాలక సంస్థకు ఏటా దాదాపు రూ.3 కోట్లదాకా ఆదా అవుతుంది. మరోవైపు ఈ పథకం స్వచ్ఛ భారత్ మిషన్‌కు తనవంతు సహకారం అందిస్తుంది.

మిత్రులారా!

హర్యానా నేడు ప్రగతి పథంలో శరవేగంగా దూసుకెళ్తోంది. నేనిక్కడికి వచ్చేముందు హిసార్‌లో ప్రజలను కలిసే అవకాశం నాకు లభించింది. ఆ నగరం నుంచి అయోధ్య క్షేత్రానికి నేరుగా విమాన సేవ ఇవాళ్టినుంచే ప్రారంభమైంది. అలాగే రేవారి ప్రజలకు 4 వరుసల కొత్త బైపాస్‌ రహదారి కానుక లభించింది. దీంతో మార్కెట్లు, వివిధ కూడళ్లు, రైల్వే క్రాసింగ్‌ల దగ్గర వాహన రద్దీ చిక్కుల నుంచి వారు విముక్తులవుతారు. నగరం నలుచెరగులా వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకాలూ ఉండవు. అలాగే ఢిల్లీ-నార్నౌల్ మధ్య గంట వరకూ ప్రయాణ సమయం తగ్గుతుంది. ఈ ప్రగతిశీల పరిణామాలన్నింటిపైనా మీకందరికీ నా అభినందనలు.

మిత్రులారా!

రాజకీయాలను మేమెన్నడూ అధికార ఆస్వాదన ఉపకరణంగా పరిగణించలేదు. దేశానికి, ప్రజలకు సేవ చేయడంలో అదొక మార్గం మాత్రమేనన్నది మా భావన. కాబట్టే, బీజేపీ ఏం చెబుతుందో అదే చేసి తీరుతుంది. హర్యానాలో మూడోదఫా ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఎన్నికల సమయంలో మీకిచ్చిన హామీలన్నిటినీ వరుసగా నెరవేరుస్తున్నాం. కానీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల మాటేమిటి? ప్రజల విశ్వాసాన్ని ఆ పార్టీ ప్రభుత్వాలు పూర్తిగా వమ్ము చేశాయి. మన పొరుగు రాష్ట్రం హిమాచల్‌ను చూడండి- అక్కడి ప్రజలు ఎంతో బాధపడుతున్నారు. అన్ని అభివృద్ధి-సంక్షేమ పథకాలు స్తంభించాయి. కర్ణాటకలో విద్యుత్ నుంచి పాల సరఫరాదాకా, బస్సు ఛార్జీల నుంచి విత్తనాల వరకూ- ప్రతి ఒక్కటీ భారంగా మారుతోంది. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ రకాల పన్నులతో ధరలు పెంచిన తీరును సామాజిక మాధ్యమాల ద్వారా నేను గమనించాను. ఈ మేరకు అనేకమంది వివరణాత్మక జాబితా రూపంలో సృజనాత్మకంగా ఈ వాస్తవాన్ని వెల్లడించారు. వారి వ్యాఖ్యల్లోని ప్రతి అక్షరం ఏదో ఒక రకమైన పన్ను పెంపును సూచిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలలోని వాస్తవికతను బట్టబయలు చేస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ కర్ణాటకను అవినీతిలో అగ్రస్థానానికి చేర్చిందని సాక్షాత్తూ ముఖ్యమంత్రి సన్నిహితులే అంగీకరిస్తున్నారు.

మిత్రులారా!

ఇదే తరహాలో తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన వాగ్దానాలను విస్మరించింది. అక్కడ అటవీ నాశనంలో నిమగ్నమైంది... ప్రకృతి విధ్వంసం, వన్యప్రాణులకు ముప్పు- ఇదే కాంగ్రెస్ పాలనా శైలి! గోబర్‌ధన్‌ పథకంతో వ్యర్థాన్ని అర్థంగా మార్చడానికి మేమిక్కడ కృషి చేస్తుంటే- వారక్కడ పచ్చని అడవులకు చిచ్చు పెడుతున్నారు. దీన్నిబట్టి మీ ముందు రెండు విస్పష్ట పాలన నమూనాలు ఆవిష్కృతమవుతున్నాయి. ఇందులో ఒకటి కాంగ్రెస్‌ నమూనా- అది పూర్తిగా తప్పుదోవ అన్నది ఇప్పటికే రుజువైంది. ఆ నమూనా కింద కాంగ్రెస్‌ పార్టీ కేవలం అధికారం, పదవులపైన మాత్రమే దృష్టి పెట్టింది. మరోవైపు బీజేపీ నమూనా సత్యం ప్రాతిపదికగా, బాబాసాహెబ్ అంబేడ్కర్‌ చూపిన మార్గంలో, రాజ్యాంగంపై సంపూర్ణ గౌరవాన్ని ప్రతిబింబిస్తుంది. ‘వికసిత భారత్’ స్వప్న సాకారమే మా మహా సంకల్పం. ఆ దిశగా మన కృషి ముందుకు సాగడం నేడు యమునానగర్‌లో ప్రస్ఫుటమవుతోంది.

మిత్రులారా!

నేనిప్పుడు మరో ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించదలిచాను. నిన్న దేశమంతా బైశాఖి వేడుకలు చేసుకుంది. అయితే, నిన్నటితో జలియన్ వాలాబాగ్ ఊచకోత ఉదంతానికి 106 ఏళ్లు పూర్తయ్యాయి. ఆనాటి విషాద స్మృతులు నేటికీ మన కళ్లముందు కదలాడుతున్నాయి. బ్రిటిష్ పాలకుల క్రూరత్వం, నాటి ఊచకోతలో అమరులైన దేశభక్తుల త్యాగం మనకు తెలిసినవే. కానీ, చాలా కాలం నుంచీ మరుగునపడిన వాస్తవం ఒకటుంది. ఇది మానవత్వానికి, దేశానికి అండగా నిలిచే స్ఫూర్తికి ప్రతిబింబం. ఈ స్ఫూర్తితో ముడిపడిన పేరు శంకరన్ నాయర్. మీలో చాలామందికి ఈ పేరు సుపరితం కాకపోవచ్చుగానీ, ఆయన గురించి చాలామంది నేడు మాట్లాడుకుంటున్నారు. శ్రీ శంకరన్ నాయర్ ప్రసిద్ధ న్యాయవాది... అప్పట్లో అంటే 100 సంవత్సరాల కిందట ఆయన బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్నత పదవిలో ఉన్నారు. అధికారానికి సన్నిహితులైన నేపథ్యంలో విలాసవంతంగా జీవించే అవకాశాలు ఆయనకున్నాయి. కానీ, విదేశీ పాలన క్రూరత్వంతోపాటు జలియన్ వాలాబాగ్ ఉదంతం ఆయన విచలితుణ్ని చేశాయి. దాంతో బ్రిటిష్ పాలనపై నిరసన గళమెత్తారు. తన ఉన్నతోద్యోగానికి రాజీనామా చేసి, దేశానికి అండగా నిలవాలని సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ఆయన కేరళ వాస్తవ్యుడైనప్పటికీ ఊచకోత సంఘటన పంజాబ్‌లో చోటుచేసుకున్నదైనా ఆ కేసులో ప్రజల తరఫున వాదించాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు.. ఆ క్రమంలో బ్రిటిష్ సామ్రాజ్య పునాదులనే కదిలించారు. ‘సూర్యుడు అస్తమించని’ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని జలియన్‌ వాలాబాగ్ ఊచకోతపై కోర్టు ముందు దోషిగా నిలబెట్టారు.

మిత్రులారా!

ఇది కేవలం మానవత్వానికి నిదర్శనం మాత్రమే కాదు... ‘ఒకే భారత్‌-శ్రేష్ఠ భారత్’కు ఉజ్వల ఉదాహరణ. పంజాబ్‌ ఊచకోతపై ఎక్కడో కేరళ నుంచి వచ్చిన వ్యక్తి బ్రిటిష్ పాలకులకు ఎలా ఎదురునిలిచారు- ఇది మన స్వాతంత్ర్య పోరాటానికి ప్రేరణనిచ్చిన నిజమైన స్ఫూర్తి. ‘వికసిత భారత్’ దిశగా మన పయనంలో ఈ స్ఫూర్తే మనకు తిరుగులేని శక్తి. ఆనాడు కేరళవారైన శ్రీ శంకరన్ నాయర్ పోషించిన పాత్రను మనం అర్థం చేసుకోవాలి. పంజాబ్, హర్యానా, హిమాచల్‌ రాష్ట్రాల్లోని ప్రతి బిడ్డ ఆయన గురించి తెలుసుకోవాలి.

మిత్రులారా!

దేశానికి నాలుగు కీలక స్తంభాలైన పేదలు, రైతులు, యువత, మహిళల సాధికారత కోసం ద్వంద్వ సారథ్య ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోంది. మన సమష్టి కృషితో హర్యానా నిస్సందేహంగా పురోగమిస్తుంది. అది ఇప్పటికిప్పుడే నా కళ్లముందు సాక్షాత్కరిస్తోంది. హర్యానా ప్రగతి పథంలో పరుగులు తీస్తుంది... అభివృద్ధి సాధిస్తుంది... దేశానికి యశస్సునార్జించి పెడుతుంది. ఈ క్రమంలో నేడు అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడంపై మీకందరికీ అనేకానేక అభినందనలు. పిడికిళ్లు రెండూ బిగించి, దిక్కులు పిక్కటిల్లేలా నాతో గళం కలపండి:

భారత్ మాతా కీ జై!

భారత్ మాతా కీ జై!

భారత్ మాతా కీ జై!

అనేకానేక ధన్యవాదాలు!

గమనిక: ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి ఇది స్వేచ్ఛానువాదం మాత్రమే.

****


(Release ID: 2121721) Visitor Counter : 12